Sunday, November 26, 2006

కొరియా కబుర్లు: -- కొంచెం -- ఘనం

ఈపళంగా మనదేశం (ఏదేశంపోయినా ఓ.కే.) పోయి ఒక సర్వే చేసి ఈ క్రింది ప్రశ్నలడగండి.
౧. మీరు వాడే టీ.వీ. ఏ కంపెనీది?
౨. మీరు వాడే కంప్యూటర్ మానిటర్ ఏ కంపెనీది?
౩. మీ కారు ఏ మోడలండీ?
౪. మీ సెల్ ఫోను ఏ కంపెనీది?
౫. ప్రపంచంలో నాణ్యమైన ఉక్కు తయారీలో ఘనత వహించిన సంస్థల్లో 3వ స్థానం లో ఉన్నది ఏది?
౬. మీ మైక్రోవేవ్ ఏ కంపెనీది?

వీటికి సమాధానం మీకు LG, Samsung, Hundai (Santro, Sonata), POSCO చాలా ఎక్కువ సార్లు వస్తాయి. ఈ కంపెనీలన్నీ కొరియావి. మన దేశంలో చాలామందికి కొరియా అంటే పెద్దగా తెలియదు. ఆ మాటకొస్తే నాక్కూడా ఇక్కడకొచ్చాకా బాగా తెలిసింది. మునుపు Economics పుస్తకాల్లో కొరియా అభివృద్ధి గురించి కొద్దిగా చదివా, అంతే. ఈదేశం గురించి తెలియక పోవడంవల్ల, మనకి తరతరాలుగా ఎలెక్ట్రానిక్స్ అంటే జపాన్ అని మాత్రమే భావం ఉండడంవల్ల కొరియా ఉత్పత్తులని కూడా చాలామంది జపానువే అనుకొంటున్నారు. నేను కొరియాలో ఉన్నానని చెపితే అది ఎక్కడుందని అడగడం సాధారణమైపోయింది. కాని చాలా మందికి రెండు కొరియాలున్నాయని తెలుసు. తమ ఉత్పత్తులతో జనబాహుళ్యానికి ఇంతదగ్గరైన కొరియా దక్షిణ కొరియా. ఈ మధ్య అణుపరీక్షతో అందరినీ అదిరించిన కొరియా ఉత్తర కొరియా. దక్షిణకొరియా ని సాధరణంగా కొరియా అని పిలుస్తారు. వాళ్ళ సంవిధానం ప్రకారం దీని పేరు 'రెపబ్లిక్ ఆఫ్ కొరియా'. వాళ్ళ భాషలో ' దేహన్ మిన్గుక్'. ఉత్తర కొరియా పేరు 'డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా' అంటారు. ఆ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం కన్నా మన నేతి బీరకాయలోనే నెయ్యి ఎక్కువుంటుంది.


ఒక్కటిగా ఉన్న కొరియాని 1945 లో రెండుగా చీల్చారు. వాటి మధ్యలో ఉన్న సరిహద్దుని 38th parallel అని అంటారు. భారతదేశం, పాకిస్తాన్ లు చీలిపోవడానికి రెండుమతాల మధ్య సమస్య కారణం. కాని కొరియా రెండుగా చీలిపోవటానికి జపాను రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోవడం కారణం. ఆ సమయంలో కొరియా జపాను వలస పాలనలో ఉంది. జపాను కొరియాని 1910-45 మధ్య తన పాలనలో ఉంచుకొంది. యుద్ధంలో ఓడిపోకపోతే అది ఇంకా కొనసాగేదేమో? ఏమైతేనే 1945 లో స్వాతంత్ర్యం పొందిందీదేశం. అత్త సొమ్ము అల్లుడు ధారబోసినట్లు, జపాను ఓడిపోయి కొరియాని శత్రుపక్షానికి ధారాదత్తం చేసింది. శత్రుపక్షంలో అమెరికా, దాని మిత్రపక్షాలూ ఇంకా రష్యా, దాని మిత్ర పక్షాలూ దొంగలూ, దొంగలూ ఊళ్ళు పంచుకొన్నట్లుగా కొరియాని రెండుముక్కలుగా చేసి దక్షిణకొరియాని అమెరికా, ఉత్తర కొరియాని రష్యా తమ తమ వర్గాల్లో చేర్చుకొన్నాయి. అప్పటినుండీ (దక్షిణ) కొరియాలో పెట్టుబడిదారీ విధానం, ఉత్తర కొరియాలో కమ్యూనిజం అమలులోకి వచ్చాయి. అలా విడిపోయిన వీళ్ళు, ఎలాగైనా, ఎప్పుడైనా తిరిగి కలుసుకోవాలనీ, కలిసిపోవాలనీ తెగ ఆరాటపడ్తారు. దాని కోసం కొరియా ప్రభుత్వంలో Unification Ministry ఒకటి ఉంది. వీళ్ళ సాహిత్యంలో కూడా దీనిమీద చాలా కథలూ, కవితలూ వచ్చాయి. ఈ రెండుదేశాలమధ్య DMZ (De-militarized Zone) ఉంది. ఇది సుమారు 3 కిలోమీటర్ల వెడల్పున్న నిర్జన సరిహద్దు ప్రదేశం. జర్మనీ గోడ కూలిపోవడం ఇక్కడ కూడా చాలా ఆశలు రేకెత్తించింది.

అసలే అర్భకం అందులో వేవిళ్ళన్నట్లు, జపాను పాలన, రెండో ప్రపంచయుద్ధాలతో అంతంతమాత్రంగా ఉన్న దేశపరిస్థితి, 1950-53 మధ్య ఉత్తరకొరియాదాడితో మరీ అధ్వానమైపోయింది. అప్పుడు ఎక్కడచూసినా దారిద్ర్యం, ఆకలి. అప్పుడు వాళ్ళ తలసరి ఆదాయం సుమారు 50 డాలర్లు. అప్పటి మనదేశపు ఆదాయం కంటే తక్కువ! వ్యవసాయం ప్రధాన వృత్తి. వ్యవసాయ భూమి కేవలం కొద్దిమంది భూస్వాములచేతిలోనే ఉంది. పరిశ్రమలేమీ లేవు. ఉన్నవన్నీ ఉత్తర కొరియాకి పోయాయి. అల్లాంటి పరిస్థితినుండి అతి త్వరగా అభివృద్ధి చెంది 1995 నాటికి, అంటే స్వాతంత్ర్యం వచ్చిన 50 సంవత్సరాలలో, OECD లో సభ్యత్వం పొందగలిగిందీ దేశం.

ప్రణాళికాబద్ధంగా, ఒక నిబద్ధతతో ప్రగతిని సాధించి, సంకల్పం గట్టిగా ఉంటే ఏమైనా సాధించవచ్చని కొరియన్లు నిరూపించారు. మొదటగా, భూసంస్కరణలని అమలుపరచారు. ఎవరికీ 3 హెక్టారుల కన్న ఎక్కువ భూమిలేకుండా చట్టం చేసి, మిగులు భూమిని పంచేసారు. అదీ ఉత్తినే కాకుండా, రైతులకి అమ్మారు. ఆభూమి ధర వాయిదాలలో పంటద్వారా చెల్లించగల్గే ఏర్పాటు చేసారు. దీంతో 76 శాతం రైతులకు లాభం కలిగింది.
మిగిలిన అభివృద్ధిచెందిన దేశాల లాగే కొరియాకూడా పరిశ్రమాభివృద్ధి ద్వారానే ఆర్ధికాభివృద్ధి సాధించింది. ఈ దేశానికి వనరులు అతి తక్కువ. ఖనిజాలు శూన్యం. సాగు చేయగల వీలైన భూమి, కేవలం 20 శాతం. ఎక్కువ భూభాగం కొండలూ, గుట్టలే. కాని, ప్రభుత్వం ధీమాగా ఎగుమతులపై దృష్టి పెట్టి, రాయితీలు కల్పించింది. మొదట దిగుమతి చేసుకోంటున్న వస్తువులని స్వంతంగా ఉత్పత్తి చేయడానికి ప్రొత్సాహం ఇచ్చిన ప్రభుత్వం, అది లాభంలేదని ఒక దశాబ్దంలోపే గ్రహించి, ఎగుమతులనే ప్రోత్సహించింది. ఆతర్వాత దశాబ్దాలలో అధిక పెట్టుబడీ, సాంకేతిక పరిజ్ఞానం కావాల్సిన పరిశ్రమలని ప్రొత్సహించి, తమకంటూ ఒక ప్రత్యేకగుర్తింపుండేలా కృషి చేసింది. 1980వ దశకానికే అధిక తలసరి ఆదాయం కల్గిన దేశంగా తన స్థానాన్ని నమోదు చేసుకొన్న ఘనత ఈదేశానిది.
కొరియాతో పాటు తైవాన్, సింగపూరు, హాంగ్‍కాంగ్‍ లు కూడా అతి త్వరలో అభివృద్ధి చెందిన దేశాలే. ఇక జపాను సంగతి వేరే చెప్పఖ్ఖర్లేదు. వీటన్నిటికీ తలమానికం. ఈ ఐదు దేశాలు తమదైన శైలిలో అతి త్వరలో, అంటే ఒక 30 - 40 ఏళ్ళలో, అభివృద్ధి చెంది ప్రపంచానికి ఒక అద్భుతాన్ని చూపించాయి. అమెరికా, యూరోప్‍ దేశాలు కూడా అభివృద్ధి చెందాయి. కాని వాటి అభివృద్ధి ప్రయాణం 200 ఏళ్ళ పాటు సాగింది. అందులోనూ ఎన్నో దేశాలని కొల్లగొట్టడం ద్వారా సాధించారు. అంతే కాక, వారివారి దేశాల్లో పారిశ్రామిక అభివృద్ధివల్ల గ్రామీణప్రాంతాలలో త్తీవ్ర అశాంతి చెలరేగడం ఒక విషాద పరిణామంగా మిగిలిపోయింది. కాని తూర్పు ఆసియా దేశాల్లో (సింగపూరు, హాంగ్‍కాంగ్‍లలో గ్రామీణప్రాంతాలే లేవు) గ్రామీణాభివృద్ధిని కూడా తగు విధంగా సమతుల్యతతో సాధించడంవల్ల, వాటి అభివృద్ధి పధం ఆదర్శ్హవంతంగా మిగిలిపోయింది.

ఇదీ కొరియా అభివృద్ధి కథ. ఇంతా చేస్తే ఈ దేశం ఎంతుంటుందో తెలుసా? మనదేశంలో 33వ వంతు. వైశాల్యం గీచి, గీచి లెఖ్ఖపెట్టినా 98480 చదరపు కిలోమీటర్లు. మన తెలంగాణా మైనస్ ఒక రెండు పెద్ద జిల్లాలు. మరి జనాలో పట్టుమని 5 కోట్లు కూడా లేరు.
ఇప్పుడు ఈబ్లాగు శీర్షిక ఈరకంగా చదివితే బాగుండదూ? పిట్ట కొంచెం, కూత ఘనం
అసలు కిటుకు ఏంటంటే, కొరియా మ్యాప్ చూస్తే పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్న కుందేలులా అన్పిస్తుంది. అందుకే అనుకొంటా, వీళ్ళు ఇంత త్వరగా అభివృద్ధి సాధించారు. వీళ్ళ కరెన్సీని WON అంటారు. ఆంగ్లంలో దాని అర్ధం గెలుపు. ఇక్కడి కొరియన్ స్నేహితుడు ఎప్పుడూ ఈవిషయం సరదాగా చెబుతూంటాడు. అవునేమో.
తర్వాతి వారాల్లో, ఈ దేశపు చరిత్ర, మనుష్యులు, మమతలూ, ఇంకా సరదా విషయాలూ.....

Monday, November 20, 2006

'గుండె పగిలేంత.... ' హరికథ

పాత కాలంలో హరికథలుండేవి. ఇప్పుడు అంతగా ఉన్నట్లులేవు. హరికథ అనగానే నాకు గుర్తుకొచ్చేవారు మునికుట్ల సదాశివశాస్త్రి గారు. ఆయన చెప్పిన త్యాగరాజు హరికథ గ్రామఫోను రికార్డుగా వచ్చింది. హరికథ లో అసలుకథ మెల్లగా నడుస్తోంటుంది. కాని పిట్టకథలు కోకొల్లలుగా వస్తోఉంటాయి. ఒక్కోసారి అసలు హరిదాసుగారి అసలు కథ ఏమిటో అంతుచిక్కడం కష్టమే, ఈబ్లాగులో ఏమి వ్రాస్తున్నానో మీకు అంతుచిక్కనట్లే.

అసలుకథ:

నేను బ్లాగులు చూడడం మొదలుపెట్టి కొద్దికాలమే అయింది. నాకు కొన్ని బ్లాగులు చాల నచ్చాయి. నాగరాజా, చదువరి,రాధిక, సుధాకర్, కొండూరి, రెనారె, కామేష్.......... ఇల్లా చాలామందివి. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో శైలి, ఒక్కో వస్తువు. కొన్నికొన్ని బ్లాగుల్లోని తపాలు, కొన్ని కొన్ని జ్ఞాపకాలు బయటికి తీస్తూంటాయి. ఉదాహరణకి, రెనారె గారి బ్లాగ్ చదివినప్పుడు, నాకు శ్రీ నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గుర్తొచ్చారు.

పిట్టకథ 1:

శ్రీ నామిని సుబ్రహ్మణ్యం నాయుడు రాయలసీమ మాండలికంలో (చిత్తూరు జిల్లా) వ్రాసారు. వ్రాయడానికి పెద్దపెద్ద విషయాలే అవసరం లేదు, మనకి తెలిసిన ఏవిషయంపైనైనా వ్రాయవచ్చని తన 'పచ్చనా సాక్షిగా' (ఉదయంలో వచ్చాయి) శీర్షికతో, 'సినబ్బ కతల' (ఆంధ్రజ్యోతిలో వచ్చాయనుకొంటా) లో తనకు అనుభవమైన విషయాలే వ్రాసారు. అందరికీ తెలిసిన విషయం 'అమ్మ' కాబట్టి, దాని గురించే వ్రాస్తే పోలే అని తను వ్రాయడమే కాకుండా, బాపు, రమణ ల తోటే కాకుండా, చంద్రబాబు నాయుడు లాంటి 'రాయని భాస్కరుల' చేత కూడా వారి వారి అమ్మల గురించి రాపించి ప్రచురించిన ఘనుడూ, ధన్యుడూ, శ్రీ నామిని. తర్వాత, చిత్తూరు జిల్లాలోని ఒక రైతు ఆశ, అడియాసల కథ 'మునికన్నడి సేద్యం' నవల లో వ్రాసారు. ఆ నవల నాకు బాగా నచ్చింది. నేను వ్యవసాయ శాస్త్రంలో (బాపట్ల కాలేజీ లో M.Sc(Ag), తర్వాత, ఢిల్లీ I.A.R.I. లో ఆర్ధిక శాస్త్రంలో Ph.D.) పట్టభద్రుడ్ని. నా థీసిస్ కోసం వ్యవసాయ బావులు, చెరువుల మీద సర్వే కోసం రాయలసీమ (అనంతపురం జిల్లా) గ్రామాల్లో పర్యటించా. రైతులు నీటికోసం పడే పాట్లు, వాళ్ళ అగచాట్లు, గ్రామాల్లో ఉండే అసమానతలూ, నీళ్ళ రాజకీయాలూ/మార్కెట్లు, ఇత్యాది విషయాలపై అయనా వ్రాసారు, నేను, నాబోంట్లూ వ్రాసాము. మేము వ్రాసింది భద్రంగా బీర్వాల్లోనూ, ఆంగ్ల జర్నళ్ళలోనూ ఉంది. ఆయన వ్రాసినది జనాల గుండెల్లోకి పోయింది. విధాననిర్ణయాలు చేసేవారి చెవుల్లోకైనా పోయిందో లేదో? అదృష్టవశాత్తు, నేను ఆనవలని చదవడం నా అవగాహనికీ, వ్రాతకోతల్లోనూ చాలా ఉపయోగపడింది. ఇది పిట్టకథలో పిట్టకథ.

పిట్ట కథ 2:

నేను బ్లాగుల గురించి తెలుసుకొన్నదే ఈమధ్యనని చెప్పాను కదా. అంటే వ్రాయడం మొదలుపెట్టి ఇంకా తక్కువ రోజులే అయివుంటుంది కదా. కాని, బ్లాగ్సోదరుల ప్రోత్సాహం వల్ల నామీద నాకు నమ్మకం కలగడం మొదలుపెట్టింది. ఈ నమ్మకం అన్నది ఒక పెట్టుబడి. అది లేకుంటే ఎవరూ ఏదీ సాధించలేరు. 'నాక్కొంచెం నమ్మకమివ్వు, కొండల్ని పిండిచేస్తా' అన్న కవివాక్యం అక్షరసత్యం. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు రెండింటినించీ పెట్టుబడులొస్తే కాని అభివృద్ధి కలగనట్లే, తనమీద తనకీ, తన చుట్టూఉన్నవారికీ కూడా నమ్మకం కలిగితే కానీ ఏ వ్యక్తీ ఏమీ సాధించలేడు.


పిట్ట కథ ౩:

నామిని సిన్నబ్బ కతలు ప్రింటు చేసినప్పుడు, బాపూని ఒక్కముఖచిత్రం వేయమని కోరాడు. బాపూనే ఎందుకంటే, నామిని బాపూ అభిమానికాబట్టి. అసలు ఆయనకి అభిమాని కానివాడెవ్వడు? వేస్తాడో, వేయడో అని అనుకొంటూండగా, బాపూగారు, ముఖచిత్రమే కాకుండా, కథలకి కూడా విడివిడిగా బొమ్మలు వేసి పంపించాడు. అంతే అయితే, ఓకే. ఉత్తరంలో మీ 'వీరాభిమాని బాపు' అని సంతకం చేసాడట. అది చూసి నామిని పడిన సంబరం ఆయనే ఒక వ్యాసంలో ఆయన శైలిలోనే వ్రాసుకొన్నాడు.

అసలైన కథ:

మళ్ళీ అసలుకథకొస్తే, చాలామంది ప్రోత్సహిస్తున్నారని చెప్పా కదా. అందరికీ బ్లాగ్ముఖంగా కృతజ్ఞతలు. నేను ఈమధ్య వ్రాసిన ' బోరట్' పార్వతీశం చదివి రెనారెగారు స్పందిస్తూ, 'మీ బ్లాగునింక వదలన'న్నారు. 'ముక్కు పగిలేదాకా ముక్కుసూటిగా' చెప్పడం ఆయన పద్ధతే, కాని ఇక్కడ, ఆయన అభిమానానికి ఆనందంతో గుండె పగిలినంత పనయ్యిందని తెలుసుకోవద్దా? అప్పటి నామిని పరిస్తితే ఇప్పటి నాదీని. అయితే అక్కడ ఒక్కడే బాపు, ఇక్కడ చాలామంది.

Monday, November 13, 2006

కొరియా కబుర్లు: 'బోరట్' పార్వతీశం

కొరియా విశేషాలు వ్రాయమని నాగరాజాగారు సలహా ఇచ్చారు. నా నాలిక మీద ఆడుతూన్న ఐడియాని నా బ్రెయిన్‍లోకి ఎక్కించినందుకు ఆయనకి కృతజ్ఞతలు. ఇక్కడ వ్రాసినది అచ్చం కొరియా కబుర్లు కాక పోయినా, కొంత లంకె ఉంది కాబట్టి కొరియా కబుర్ల కిందే చలమణీ చేస్తున్నా. జర పెద్ద మనసు చేసుకోని చదవండి.
పరీక్షల్లో గాంధీని గురించి వ్రాయమన్నా, చదివింది ఒక్క ఆవు వ్యాసమే కాబట్టి , ' గాంధీ గొప్పవాడు. ఆయనకి ఒక ఆవు ఉండేది. ఆవు సాధు జంతువు.........' అని అక్కడి నుంచి ఆవు గురించి వ్రాసిపాడేసాడట వెనకటికి, నాలాటి వాడే. వచ్చేవారానికి బాగా బట్టీ పట్టి కొరియా వ్యాసం వ్రాస్తా. అప్పటిదాకా ఇది చదివండి.

కొరియా ఒక దేశము. అక్కడ టీవీలుండును. అందులో చాలా ఛానెళ్ళు వచ్చును. అందులో AFN ఒకటి..........

క్రితం వారం AFN Korea ఛానెల్లో Tonight Show with Mr.Jay తో కోహెన్ (Cohen) తో ఇంటర్వ్యూ చూసాను. ఈ ఛానెల్ కొరియా లో ఉన్న అమెరికా మిలిటరీ వాళ్ళకోసం రక రకాల టీ.వీ. ఛానెళ్ళలోనుండి ప్రాచుర్యం పొందిన కార్యక్రమాలు ప్రసారం చేస్తారు. రాత్రి మాకు Tonight show, Late show, Late Late night show లు వస్తూంటాయి. విషయానికి వస్తే, కోహెన్ 'Borat: Cultural Learnings of America for Make Benefit Glorious Nation of Kazakhstan' సినిమా లో హీరోగా వేసాడు. ఆయన చేసిన డా ఆలీ జీ షో బ్రిటన్ లో విజయవంతమయిందని విన్నాను. బోరాట్ సినిమా విజయం తథ్యమని చాలా మంది ఊహాగానాలు చేస్తున్నరని వార్త.

ఆ ప్రోగ్రాం లో ఆ సినిమా ల్ని ఒక సన్నివేశాన్ని చూపించారు. ఆ సన్నివేశంలో హీరో ఒక హోటలు కెళ్తాడు. హోటలు అటెండెంట్ బొరాట్‍ని రూమ్‍కి తీసుకు పోవటానికి లిఫ్ట్ లోకి తీసుకెళ్తాడు. మన హీరో అదే రూమనుకొని బ్యాగ్ తెరచి బట్టలు సర్దటం మొదలెడ్తాడు. అటెండెంట్ ఇది కాదు నీ రూమని చెబుతోంటే, బోరట్, ' ఈ రూమ్ చాలా బాగుంది. ఇంత కన్నా చిన్న రూమైతే నేనొప్పుకో'నంటాడు. ఈ సన్నివేశం లో హాస్యం బాగా పండింది. సరిగ్గా ఇలాంటి సీనే 'బారిష్టరు పార్వతీశం' లో కన్పిస్తుంది.

ఈ నవల 1925 ప్రాంతంలో ఆంధ్రదేశంలో హాస్యపువెల్లువల్లేపిందని విన్నాం. ఇప్పుడు చదివినా కూడా గిలిగింతలు పెట్టడం ఆ నవల గొప్పదనం. ఆ రోజుల్లో తెలుగు హాస్య సాహిత్యాన్నేలిన మూడు 'సింహా'ల్లో ఒకరైన మొక్కపాటి నరసింహంగారి నవల ఇది. మిగిలిన ఇద్దరు సింహాలు మీకు తెలుసనుకొంటా. పానుగంటి మరియు చిలకమర్తి నరసింహం గార్లు. వాళ్ళ గురించి ఇంకోసారి సందర్భమొచ్చినప్పుడు మాట్లాడుకొందాం.
పార్వతీశం ఉన్నతవిద్య కోసం ఇంగ్లాండ్ వెళ్తూ మధ్య లో పారిస్‍లో ఒక హోటల్లోబస చేస్తాడు. అతనికి ఏమీ తెలియదు పాపం. హోటలు కుర్రాడు రూముకి తీసుకెళ్తూ ఉంటే, లిఫ్టే తనకిచ్చిన రూమని భ్రమపడి, 'అన్నిడబ్బులు పోస్తే ఇంత చిన్న రూమిస్తారా?' అని లిఫ్ట్ లోకెళ్ళనని మొరాయిస్తాడు. హోటలు కుర్రాడు పార్వతీశాన్ని బలవంతంగా లోపలికి లాగి బటను నొక్క గానే 'ఆ గది' పైకి కదులుతుంది. అంతా ఆశ్చర్యం. చివరికి తన గదిలోకి చేర్చాక కాస్తకాస్త అర్ధమవుతుంది. ఆ సన్నివేశం చదువుతోంటే మనకు టీ.వీ. లేని లోటు తెలియదు. మనకు కళ్ళకి కట్టినట్లే ఆయన వ్రాసారు.

ఈ సీను గుర్తుకు రాగానే చాలా సంబరపడిపోయి, బోరట్ గురించి గూగ్లింగ్ మొదలెట్టా. ఏతావాతా, ఈ ఒక్క సీను తప్పించి భూతద్దంలో వెదకినా పార్వతీశానికీ, బోరట్‍కీ లంకే లేదని తేలింది. బోరట్ విడియోలు చిన్నా, చితకా అన్నీ చూసి పాడేసా. చూసినవి బోరట్ వీడియోలే కాని, పడేసినవి మాత్రం నేను వాంతులు చేసుకొన్న బ్యాగ్‍లు. ఛీ... థూ.. ఇది హాస్యమా? కానే కాదు. 1000......000% అపహాస్యం. అంత అసభ్యకరమైన, అసంగతమైన హాస్యాన్ని ఈ మధ్య ఒచ్చిన తెలుగు సినిమాల్లో కూడా చూడలేదు. హాస్యం చూడలంటే ఒక రేలంగి సినిమాయో, ఒక రమణారెడ్డి సినిమాయో చూడండి. ఒక శాయి నవల చదవండి, లేకపోతే ఒక ఆదివిష్ణుని చదవండి, ఒక బాపూ గీతని గుర్తు తెచ్చుకోండి. అంతే కాని బోరట్ సీను ఒక్కటికూడా చూడసాహసించకండి.

ఉదాహరణకి ఒక సీను కనండి. బోరట్ తనవాళ్ళని పరిచయం చేస్తూ, తన పెళ్ళాలని మామూలుగా పరిచయం చేస్తాడు. తర్వత, ఒకామెని చూసి గాఠ్ఠిగా ఎంగిలి ముద్దెట్టుకొంటాడు - ఒక నిమిషంపాటు. ఆనక, 'ఈమె నా సోదరి-కజగస్తాన్‍లోని అగ్రగామి వేశ్యల్లో ఈమెది 4 వ స్థానం' అని చాల గర్వంగా పరిచయం చేస్తాడు. నేను చూసిన ఒక వీడియోలో చివర్లో బై బై చెబుతూ 'I like sex' అని ముగిస్తాడు. ఇంకా ఘోరం. ఆయన తండ్రి, ఆయనకి తాత - అందులోనూ అమ్మతండ్రి - అవుతాడట!?,>౨౩౦+. ఇది చదివి మీరు కూడా ఈమాత్రం గందరగోళం పడిఉండాలే! ఇలాంటి ఛండాలాన్ని కామెడీ అని ముద్ర వేయడాన్ని బట్టి కామెడీ స్థాయి వోఢ్ హౌస్ దేశంలో ఏ స్థాయికి పడిపోయిందో చూడండి.

బొరాట్ కజఖ్‍స్తాన్ కి చెందిన జర్నలిస్టు. ఆయన బయటిదేశాలు పర్యటించి తయారుచేసిన రిపోర్టులు ఈ వీడియోలూ, సినిమాలూ. కజఖ్‍స్తాన్ ను ఒక అనాగరిక దేశంలాగా, పేద దేశంలాగా చిత్రీకరించారు, ఈ వీడియోల్లో. నిజానికి కజఖ్‍స్తాన్ రష్యా నుండి విడిపోయిన ఒక దేశం. ఇప్పుడు వైశాల్యంలో ప్రపంచంలో ఆరవది. చమురు నిల్వలు పుష్కలంగా ఉండి అమెరికా వాళ్ళచే వాణిజ్యానికి అనువైన దేశంగా కొనియాడబడింది. అంతేకాదు, చమురు వర్తకంవల్ల ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడుతున్న విదేశీమారకద్రవ్యాన్ని అతిసమర్ధవంతంగా ఉపయోగించుకొంటున్న దేశంగా ఉదహరణీయంగా నిలిచింది. ఏదైనా దేశానికి ఒక రంగం వల్ల (ఇప్పుడు కజఖ్‍స్తాన్‍కి చమురు రంగంలాగ) విపరీతమైన విదేశీమారకద్రవ్యం వచ్చిపడితే, దేశీయ ద్రవ్యం విలువ పెరుగుతుంది (దీన్నే ఆంగ్లంలో appreciation of currency అంటాం). ఇందువల్ల, దేశంలోని మిగతా రంగాల ఉత్పాదనలు బయటిదేశాలవారికి ప్రియమవుతాయి (ఖరీదనిపిస్తాయి). అందువల్ల దేశ ఎగుమతులు తగ్గిపోతాయి. ఇది ఇలాగే కొనసాగితే ఆయా రంగాలు దెబ్బతింటాయి. ఈరకమైన సంఘటనలూ, ఫలితాలూ మొదట 1950ల్లో హాలెండ్లో గమనించారు. అందుకే దీన్ని Dutch disease అంటారు. ఇటువంటి పరిస్థితి రాకుండా కజఖ్‍స్తాన్ ప్రభుత్వం, వస్తూన్న మారకద్రవ్యాన్ని కొనేసి బయటి దేశాల్లో దీర్ఘకాలికనిధులలో పెట్టుబడి పెడుతోంది. ఇలాటి దేశం పేరును ఇంత చెత్త కామెడీకి వాడుకోవడం చాలా హీనమైన చర్య అంటాను. ఏదైనా ఊహాత్మకమైన దేశం పేరు వాడొచ్చుగా?

ఒకసారి మన పార్వతీశాన్ని గుర్తు చేసుకొందాం. ఆ పాత్ర చిరంజీవి. అప్పుడూ, ఇప్పుడూ కూడా మనమందరం ఏదో ఒక సందర్భంలో పార్వతీశంలాగా ప్రవర్తించే ఉంటాం. కొత్త ప్రదేశం, కొత్త వాతావరణం ఎదురైనప్పుడు మనకున్న పరిజ్ఞానం సరిపోక గందరగోళం పడడం సహజం. నేను మొదటిసారి, కోయంబత్తోర్లో ఒక హోటల్లో తాళం వేయలేక పోతోంటే, రూమ్‍బాయ్ వచ్చి ఒక సెకన్లో వేసాడు. తర్వాత పదిహేనేళ్ళకి బాంగ్లాదేశ్‍లో ఒక హోటెల్లో మాఫ్రెండు అదే పరిస్థితిలో ఉంటే నేను నేర్పించాను. ఇంకో స్నేహితుడు, టెలిఫోను ఆపరేటరు ట్రంకుకాల్ బుక్‍చేసిన తర్వాత మీ క్యూ నంబరు 234 అని చెబితే, టెన్షన్ పడిపోయి, 'మేడం. ఇక్కడ Q ఎలా డయల్ చేస్తాము. ఒట్టి అంకెలేఉన్నాయి కదా' అని అడిగాడు. అలాగని అతన్ని తక్కువ అంచనా వేయకండి. అతను తర్వాత అమెరికాలో పి.హెచ్.డి. చేసి Nature, Science లాంటి top jaournals లో పేపర్లు ప్రకటించాడు. ఇలా ఎన్నైనా మనకి అనుభవాలెదురౌతాయి. వాటినుండే మనం ఎదుగుతాము. ఈరకంగా పార్వతీశం మనందరిద్వారా జీవించే ఉంటాడు. ఎవరూ పార్వతీశాన్ని తెరకెక్కించలేదేంటో?

చివర్లో ముగించే ముందు ఒక చిన్న వార్త మీతో పంచుకొంటే బలే మజా వస్తుంది. బోరట్ పదిరోజుల క్రిందట NBC ఛానెల్లో Saturday Live కార్యక్రమంలో పాల్గొని సాటి నటి తో వెడుతూ ఒక అమెరికన్‍ను కెలికాడట. 'నీ బట్టలు బాగున్నాయి. నేను కొంటాను. వాటితో రమించాలని ఉంది' అని. అంతే. మొహం ఫట్.. ఫట్... ఫటాఫట్..ఫట్‍ఫటా.. అయ్యింది. ఈ కింద ఆ వార్తని పొందు పరుస్తున్నాను. నా ఆనందాన్ని పంచుకోండి.

Baron Cohen Attacked
Comedian Sacha Baron Cohen was attacked in New York City last week after playing a prank on a passerby while in character as Kazakh journalist Borat.
The star was on his way to a dinner date with his actor friend Hugh Laurie, after they had both appeared on NBC's "Saturday Night Live."
Cohen approached the man and asked, "I like your clothings. Are nice. Please may I buying? I want have sex with it."
The man responded by punching Cohen in the face repeatedly.
Laurie was forced to step in and push the man away, so Cohen could escape.
A source tells British newspaper The Sun, "Sacha is very lucky he didn't get a much worse beating."

Link: http://www.sfgate.com/cgi-bin/blogs/sfgate/detail?blogid=7&entry_id=10918

ఈ లంకె చూస్తే ఎంతమంది ఈసంఘటనకి సంతోషించారో అర్ధమవుతుంది.

ఈ బ్లాగులో బొరట్ కి, పార్వతీశానికీ లంకెపెట్టి పాపం చేసాను. ఎంత ఎక్కువ మంది దీన్ని చదివి పార్వతీశాన్నిగుర్తుకు చేసుకొంటే, అంత మేరకు నాపాపం ప్రక్షాళనమౌతుందని మనవి.

Friday, November 10, 2006

గుర్తింపు -కథ కాని వ్యధ

మనిషికి గుర్తింపు అనేది తిండి, బట్టల్లాగే ఒక కనీసావసరం. అది మన మానసికావసరమే కాకుండా, ఒక సామాజికావసరం కూడా. అందుకే మనకి గుర్తింపుకార్దులిచ్చేది. ఆ మధ్య జరిగిన ఒక పరిశోధన సారంశమేమంటే, కొన్ని కుటుంబాలని ఒకళ్ళకొకళ్ళకి సంబంధంలేకుండా వేర్వేరు ద్వీపాల్లో రాజభోగాల్లో ఉంచితే, అన్నికుటుంబాలూ కూడా ఆ జీవితం దుర్భరమన్నాయిట. ముఖ్యంగా వాళ్ళకి, వారివారి ప్రతిభనీ, వారి పిల్లల ప్రతిభనీ గుర్తించేవాళ్ళ లోటు కొట్టొచ్చినట్లు కనిపించిందట. అదీ గుర్తింపు మహిమ.


ఒక సారి, నేను ఒక లాడ్జ్ లో నా 'స్వంత' (అనుమానం లేదు) భార్యతో ఉండగా, అర్ధరాత్రి పోలీసులు సోదాకొచ్చారు. అప్పుడు నేను ఉద్యోగంలో చేరిన కొత్త రోజులు. అప్పటికి పెళ్ళాం దగ్గరే ఇంకా గుర్తింపు రాలేదు (ఆ మధ్యనే పెళ్ళి అయింది లెండి). ఆఫీస్ వాళ్ళు కూడా అప్పటికి నాకు గుర్తింపు కార్డ్ కానీ, దర్శింపు (visiting) కార్డ్ కానీ ఇవ్వలేదు. పోలీస్ వాళ్ళ తత్వం ఏదేశకాలాల్లోనైనా ఒకటే. అది - in God we trust, all others we suspect. నా అప్పటి పరిస్థితి - గుర్తింపోపద్రవం (ఐడెంటిటీ క్రైసిస్). ఇదీ గుర్తింపు మహిమే!ఇదిలా ఉంచితే, మనందరికీ కొన్ని గుర్తింపు కార్డ్ లు త(అ)ప్పనిసరిగా ఉంటాయి. అవేంటంటే, ఆఫీస్ వాళ్ళిచ్చిన గుర్తింపు కార్డ్, బ్యాంక్ ATM card, ఏదైనా హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంటే వాళ్ళ కార్డ్, లైబ్రరీ కార్డ్(1 లేక అనేకం), మాన్య ప్రభుత్వం వారిచ్చిన ఎలెక్షన్ ఓటర్ కార్డ్ (దాంట్లోవివరాలు, ఫొటో లు పోల్చగలిగితే ఒట్టు). గ్యాస్ డీలర్ ఇచ్చిన కార్డ్ (కనెక్షన్ కి ఒకటి చొప్పున), ఒకటో, పదో క్రెడిట్ కార్డ్ లు (ఫోటో సహిత లేదా రహిత) ....... ఇలా అంతులేనన్ని. ఇవి కాకుండా, PIN లూ (గుర్తింపు నంబర్లు), పాస్‍వర్డు‍లూ కూడా గుర్తింపు కొరకు ఉద్దేశించినవే. వీటిలో ఏఒక్కటి లేకపోయినా జీవితం దుర్భరమైపోతుంది.ఇండియా లో ఉన్నప్పుడే గుర్తింపు కార్డులు చాలా అయిపోయాయనుకొంటే, కొరియా రావల్సివచ్చింది. ఇక్కడ మనుషులు తక్కువా, ఆర్భాటాలెక్కువ. నేనుండే సతిలేని వసతి గృహం (హాస్టల్ కి ఎమ్వీయెల్ ఇచ్చిన తెలుగు పదం) లోనికి రాత్రి 11 గం. ల తర్వాత కోడ్‍నంబర్ నొక్కితేనే వెళ్ళగలం. మొదటివారంలోనే నాకు ఆ అవసరం వచ్చింది. నంబరు తెలుసు కాని నాకంగారుకి దాని నిదానం మొగుడయింది. తెరుచుకోవటంలేదు. అసలే చలికాలం, తొందరగా రూమ్ లో పడదామంటే, ఈ ద్వారపు రక్షణ ప్యానెల్ నన్ను గుర్తించటం లేదే! ఎదురుగా విద్యార్ధి హాస్టల్స్ ఉంటే వాళ్ళ సహాయం అడుగుదామంటే, వాళ్ళు హాస్టల్ తలుపులు మూసుక్కూర్చున్నారు. అదీకాక వాళ్ళెవరూ నన్ను గుర్తించలేరు. వాళ్ళభాష వాళ్ళదే కాని, ఇంగ్లీష్ రాదు. నా గోల నాదే. మొత్తానికి నామేథోబలమంతా ఉపయోగించి, కొద్దిగా దేవుణ్ణి తలచుకొని లోపలపడ్డా. బ్రతుకు జీవుడా అనుకొంటూంటే, కొద్దికాలంలోనే ఆఫీసులోనూ, హాస్టల్లోనూ రక్షణ వ్యవస్థ మార్చేసి, కార్డ్ సిస్టం పెట్టేరు. దాంతో నాకు లిమ్కా బుక్కులోకి ఎక్కగలిగినన్ని కార్డులొచ్చాయి. పర్సులోనూ, జేబుల్లోనూ పెడితే ఉబ్బెత్తుగావచ్చి చూచేవాళ్ళకి ఎలాఅన్పిస్తున్దో అని భయమేసి, ఒక విజిటింగుకార్డులు పెట్టుకొనే పర్సు (holder) కొనుక్కున్నా. త్వరలోనే రెండవ సంపుటి (volume) కొనాలేమో!ఇప్పుడు అసలైన ఇబ్బందేమిటంటే, ఎక్కడేకార్డు వాడాలో చూసుకోవాలి. లేకపోతే ఆమెషిన్ మొఖంవాచేలా చివాట్లు పెడ్తుంది. అల్లాగే, కార్డు వాడినతర్వాత, తిరిగితీసుకొని భద్రపరుచుకోవడం తీవ్రసమస్య. లేకపోతే ఐడెన్టిటీ క్రైసిస్ తప్పదు. అందులోనూ ఈమధ్య తెలివైనవాళ్ళకి తెలివెక్కువై, మనబదులు మన గుర్తింపుని వాళ్ళు వాడేసుకొంటున్నారు.


నాకు తెలుసు ఇది చదువుతూ మీలో కొందరు ఏమనుకొంటున్నారో. 'ఓ పదో, ముఫ్ఫైయో కార్డులు, ఓ నలభై నంబర్లు/పాస్‍వర్డ్‍లు రాగానే ఇంత బాధ పడాలా, మేమందరం సమర్ధించుకురావటంలేదూ, బడాయికాకపోతేనూ' అని. అంతేకదా! ఇన్ని కార్డులూ, రహస్య సంకేతాలూ సమర్ధించుకు రావటం ఒక సమస్య అయితే, ఇన్ని ఉన్నా నాకు సమయానికి ఇవేమీ అక్కరకు రాకపోవడమనేది అసలైన బాధా, వ్యధా.నేను ఒకసారి అఫీసులో గొడుగు మర్చిపోయాను. సగం దూరం వెళ్ళాక, గుర్తొచ్చి, ఆఫీసుకి ఫోనుచేసి, వాచ్‍మేన్‍కి చెప్పా. మీరెవరు మాట్లాడుతున్నారని అడిగాడు. నేను నాపేరు, తండ్రి పేరు, PAN నంబరు, రకరకాల గుర్తులుచెప్పా. ఆఫీసులో నేను కూర్చొనే ప్లేస్ అక్షాంశ, రేఖాంశాలన్నీ చెప్పా. నేనెవరి తో తిరుగుతోంటానో, నా బాసెవరోలాంటి విషయాలు కూడా చెప్పా. అయినా ఆ వాచ్‍మేన్‍ ప్రోసెసర్ 'ID, password do not match' అనే మెస్సేజిస్తోంది. ... .... ..... చివరకి, బాగా ఆలోచించి, ఒక మాట (పాస్‍వర్డు)చెప్పా. వెంటనే, ఆవాచ్‍మేన్‍, 'సార్, మీరా? అల్లాగే సార్, మీగొడుగు జాగ్రత్త చేస్తా, సార్, రేపు తీసుకోండి సార్' అని సగౌరవంగా చెప్పాడు.


ఇంతకీ ఆ పాస్‍వర్డు ఏమిటో తెలుసా? 'ఏమయ్యా, వాచ్‍మేన్‍. నేనయ్యా. గెడ్డపాయన్ని'


ఇది మాఅబ్బాయి వేసిన నాబొమ్మ. నిజానికి, నేనింత అందంగా ఉండననుకోండి.Sunday, November 05, 2006

నా మొదటి బ్లాగు

ఈ మధ్యన ఇంటెర్నెట్ లో ఎక్కడ చూసినా ఈ బ్లాగుల సందడే. దాంతో నాక్కూడా చాలా ఊత్సాహం వచ్చేసింది. ఆంధ్రుడ్ని కదా. ఆరంభశూరత్వం ఉంటుంది కదా. మొదలు పెట్టా కాని ఏమి రాయాలో ఎంత రాయాలో ఏమి తెలియట్లే. కాని ఏదొ రాయాలి అని తపన. ఎందరో తెలుగు 'భావు 'లు అందరికీ వందనాలు(భావు అంటే మరాఠీ లొ సొదరుడు అని). అనేక మంది తెలుగు వారి బ్లాగుల్లోని విషయ సంపత్తి, వారి రచనా సామర్ధ్యం, శైలి చూసి చాలానే నిరుత్సాహ పడ్డా. కాని ఇంత తెలుగు బ్లాగ్సంపద చూసాక, ఇంతమంది అండగా ఉండగా నాకెందుకు భయం అని పెనుధైర్యం ఆ వెనుకనే. మీ అందర్నీ చూసుకొని దిగుతున్నాను. మీ సలహాలు, సహకరాలు నాకిమ్మని మీ అందరికి నా విన్నపం.
సత్యసాయి కొవ్వలి