Tuesday, December 08, 2009

త్యాగరాజు తెలంగాణా ద్రోహా?

ఆదివారం డిసెంబరు 6 న త్యాగరాజగానసభకి వెళ్ళాం. కిన్నెర ఆర్ట్స్ ధియేటర్ వాళ్ళు నిర్వహిస్తున్న నెలవారీ బాలల సాంస్కృతికోత్సవంలో మా అమ్మాయి చి.శ్రావ్యవరాళి (బ్లాగు: వరాళి వీచికలు) కర్నాటక సంగీత కచేరీ ఆరోజు 6 గంటలకి పెట్టిన సందర్భంగా అక్కడికి వెళ్ళాం.  ముందురోజు తెరాస కార్యకర్తలు త్యాగరాజ గాన సభ బోర్డుమీద తెలంగాణా వాగ్గేయకారుడు సుద్దాల హనుమంతు గానసభ అని, కళా సుబ్బారావు కళావేదిక (మినీ హాలు) బోర్డు మీద కాళోజీ కళావేదిక అని   ఎర్ర స్టిక్కర్లంటించారు. నిర్వాహకులు ఆరోజు, ఆతర్వాతి రోజు కార్యక్రమాలు రద్దు చేసారు. ముంబై నుండి వచ్చామని కనికరం తో మా అమ్మాయి కచేరీ జరిగింది. చాలామంది రావలసిన వాళ్ళు ఊర్లో పరిస్థితికి భయపడి రాలేదు.  చివరిదాకా ఉండిన అనిశ్చిత పరిస్థితివల్ల మేం కూడా ఎవరికీ ధైర్యంగా చెప్పనుకూడా లేదు. అయినా దేఁవుడి దయవల్ల హాలు సగం వరకూ నిండింది. కార్యక్రమం సవ్యంగా జరిగింది. ఆతాలూకు వార్తావిశేషం కింద చూడండి.   చి.శ్రావ్యకి మీ అందరి ఆశీస్సులు అందజేయమని ప్రార్ధిస్తున్నా. 

saakshi_cover

 

eenadu coverage

 

ఇదిలా ఉంచితే అసలు త్యాగరాజుకి తెలంగాణాకి సంబంధం ఏంటో నాకర్థంకాని విషయం.  ఆయనపేరుని ఈసభకి పెట్టడం కోస్తా ఆంధ్ర వాడని పెట్టారా? అలాగే కళాసుబ్బారావుకి త్యాగరాజగానసభకీ ఉన్న అనుబంధాన్ని పక్కకి తోసేసి కేవలం తెలంగాణా వాడని కాళోజీ పేరు పెట్టడంలో ఔచిత్యం ఏంటో?  పొట్టి శ్రీరాముల విగ్రహం, తెలుగు తల్లి విగ్రహం బద్దలు కొట్టడం తాలిబాను చేష్టలకి తీసిపోలేదు.  తెలంగాణాలో మాట్లాడేది తెలుగు కాదా?

Saturday, October 03, 2009

సత్యశోధన అవసరమా?

(ఈటపా ఎప్పుడో రాసినది .. అయినా సత్యశోధనకి సమయం మించిపోవడం ఉండదుకదా అని పోస్ఠ్ చేస్తున్నా.)

ఈమధ్యలోఎదుటి మనిషిచేత నిజం చెప్పించాలని ఓ టీవీ కార్యక్రమం కంకణం కట్టుకొంది.  స్టార్ ప్లస్ లో వస్తున్న సచ్ కా సామనా చూసే ఉంటారు.  మా పిల్లలు చెప్తే ఒక ఎపిసోడ్ చూసా.  తర్వాత మరొకటి. ఇందులో 21 ప్రశ్నలకి నిజం చెప్పగలిగితే కోటి రూపాయలు వస్తాయి.

మొదట చూసిన ఎపిసోడ్ లో ఒకావిడని (స్మిత అనుకుంటా) రాజీవ్ ఖండేల్వాలా (పృచ్ఛకుడు) ప్రశ్నలడుగుతూ పోయాడు.  ఆవిడ ఒక స్థాయికి వచ్చేసరికి, ఇబ్బందికరమైన ప్రశ్నలడగడం మొదలెట్టాడు. ఇది ఆయన స్ట్రాటజీ. ఒకస్థాయినుండి ఇంకో దానికి వెళ్ళేముందు షోనుండి వెళ్ళిపోవడానికి అవకాశం ఇస్తారు.  ఇంకా ముందుకెళ్తుందనుకున్నఆవిడని అడిగిన ప్రశ్న.. మీపతికి ఎప్పటికీ తెలియదని మీకు నమ్మకంగా తెలిస్తే మీరు వేరేమగవాడితో పడుకుంటారా? ఆడమగ సంబంధాలలో ఎన్ని రకాల శృతులూ, అపశృతులూ ఉంటాయో అవగాహన ఉన్నా, ఈప్రశ్న అడగడం ఎబ్బెట్టుగా అనిపించింది. దీనికి ఆవిడ నో అన్నా, పోలీగ్రాఫ్ ఒప్పుకోలేదు. అప్పటి ఆవిడ పరిస్థితి ఎంత దుర్భరమో ఊహించండి. అందులోనూ ఆవిడమొగుడు అక్కడే ఉన్నాడు.  

నే చూసిన రెండో ఎపిసోడ్లో పాల్గొన్నాయన చాలా  ఓపెన్గా ఉన్నాడు. తీరా ముందుకు వెళ్తున్న సమయంలో, మీరు విదేశం వెళ్ళినప్పుడు అక్కడ వేశ్య…  అని ప్రశ్న మొదలెట్టగానే వాళ్ళావిడ బజ్జర్ నొక్కి ఆప్రశ్నపట్ల తన వ్యతిరేకత తెలియచెప్పింది (షోలో కూడా వచ్చిన వారికి తమ అభ్యంతరం షోలో ఒక్కసారి చెప్పే అవకాశం ఇస్తారు).   వెంటనే పృచ్ఛకుడు ప్రశ్నమార్చి మీరెప్పుడైనా మీభార్యని మోసం (పరాయసంబంధాలు పెట్టుకోవడం ద్వారా) చేసారా అని  ప్రశ్నించాడు.  దీనికి ఆయన పెళ్ళాం ఎదురుగా  ఏంచెప్పాలో తికమక పడి లేదన్నాడు. పోలీగ్రాఫ్ పరీక్షప్పుడు ఎస్సని ఇప్పుడు నో అనేసరికి ఆమానవుడు షోనుండి వెనుదిరగాల్సొచ్చింది.  తర్వాత అక్కడికక్కడే తన భార్యముందు చాలా ఇబ్బంది పడ్డాడు.

అసలు ఈపోలీగ్రాఫ్ ఏంటయ్యా అంటే మనం సమాధానాలు చెప్పినప్పుడు మన శరీరంలో జరిగే మార్పులని, రక్తపీడనాన్ని బట్టి మనం చెప్తున్నది నిజమా, అబద్ధమా అన్నది నిర్ధారిస్తుంది. అది ఎంత ఖచ్చితంగా నిర్ధారించగలదూ అన్న విషయం పక్కనపెడితే, అసలు ఇంత కష్టపడీ, పెట్టీ  నిజం చెప్పించడం, షోకోసమైనా సరే, అవసరమా? 

అవసరమైనప్పుడు అంటే ప్రాణమానవిత్తభంగములందు అబద్ధమాడచ్చునన్నది ఆర్యవాక్యం. ఇవన్నీ భంగమైనా సరే నిజం చెప్పించడం మాత్రమే మన టీఆర్పీ రేటింగ్‌కి అవసరం అన్నది వ్యాపార సూత్రం అనుకుంటా.

ఎంత అబద్ధాల కోరైనా ఆవిషయం ఒప్పుకోడు. తనంత సత్యసంధుడు ఎవరూ లేరనే అనుకుంటాడు.  సత్యం శివం సుందరం అన్న భావనలో ఇది ఒక కోణం అని ఒకాయన సెలవిచ్చాడు. అలాగే ఎవరినైనా నిజం చెప్పు… నిజం చెప్పని రాపాడిస్తే వచ్చే ఇబ్బంది అంతా ఇంతా కాదు.  ఇంకా ఘోరం ఏంటంటే నిజంగా నిజం చెప్తున్న వ్యక్తిని నిజం చెప్పు అని నిలదీస్తూ పోవడం. అప్పుడావ్యక్తికి కలిగే మానసిక వేదన అంతా ఇంతా కాదు.   ఇలాంటి సందర్భం మొగుడూ పెళ్ళాల మధ్య వస్తే ఇంక చెప్పక్కరలేదు.

సాధ్యమైనంత వరకూ నిజాయితీగా, సత్యవాదిగా ఉండడం ఆదర్శప్రాయంగానూ, అత్యుత్తమ జీవన విధానంగానూ ఒప్పినా చాలాసందర్భాల్లో, అబద్ధం చెప్తున్నారని తెలిసినా కూడా ఎదుటివారికి ఎంతో కొంత వెసులుబాటు వదలడం విజ్ఞత.

Monday, September 28, 2009

విజయదశమి శుభాకాంక్షలు

 

అందరికీ నా విజయదశమి శుభాకాంక్షలు.  మీరు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవాలని కోరుకుంటున్నా. ఈరోజు శిరిడీ సాయిబాబా గారు సమాధి చెందిన రోజు. ఆసందర్భంగా మాఇంటనున్న బాబాకి అభిషేకం చేసి నూతనవస్త్రం సమర్పించాం.  ఆయన చిత్రం ఇదిగో ఇక్కడ. 

 wmcellphotos 023

ఆయన బోధించిన కొన్ని సూక్తులు ఇక్కడ వ్రాస్తున్నా (ఎక్కిరాల భరద్వాజ గారి శ్రీసాయి లీలామృతము నుండి).  అవి కొంతవరకైనా పాటించగలిగితే మనమూ, పక్కవాళ్ళు కూడా ఆనందంగా, సుఖంగా ఉండచ్చు.

 • నాపై పూర్తి విశ్వాసముంచు, నీకోరికనెరవేరుతుంది.
 • నాపైనీ దృష్టినిలుపు, నేనూ నీపై దృష్టినిలుపుతాను. నిన్నుచివరికంటా గమ్యం చేరుస్తాను. నన్నునమ్మినవారినెప్పుడూ పతనం కానివ్వను.
 • నాసమాధినుండి కూడా నేను నాకర్తవ్యంనిర్వర్తిస్తాను. నానామం పలుకుతుంది. నామట్టి సమాధానం చెబుతుంది.
 • నీవు చూసేదంతాకలిసి నేను. సాయి శిరిడీ లోనే ఉన్నారనుకునేవారు నన్నుఅసలు చూడనట్లే.
 • రోపొకనాటికి చావబోయేవారు కూడా ఇతరులను చంపడానికి పన్నాగాలు చేస్తుంటారు. వారు నాకంతో బాధకలిగిస్తారు.
 • ఎవరికెవరు శత్రువులు? అంతా ఒక్కటే.
 • నాభక్తుని ఇంట్లో అన్నవస్త్రాల లేమి ఉండదు.
 • ఇచ్చిన మాట తప్పక నెరవేర్చు.
 • పోటీలు, కీచలాటలు మానితే దేవుడు కాపాడుతాడు.
 • నీవేమి చేసినా క్షుణ్ణంగా చేయి. లేదా చేస్తానని ఒప్పుకోకు.
 • ఎవరిసేవని ఉచితంగా తీసుకోవద్దు. ఉదారంగా ప్రతిఫలమివ్వు.
 • నిన్నెవరైనా ఏమైనా అడిగితే సాధ్యమైనంతవరకూ యివ్వు. లేకపోతే యిప్పించు. ఇచ్చేందుకు ఏమీ లేకపోతే మర్యాదగా చెప్పు. చులకన చేయడం, కోపగించుకోవడం తగదు.
 • నీదగ్గరున్నా ఇవ్వాలనిపించకపోతే లేదని అబద్ధం చెప్పకు.  ఇవ్వలేనని మర్యాదగా చెప్పు.
 • ఎవడు ధైర్యంగా నిందని దూషణని స్వీకరిస్తాడో వాడు నాకెంతో ఇష్ఠుడు.
 • నిన్నెవరైనా బాధించినా పోట్లాడవద్దు. సహించలేకపోతే ఒకటిరెండు మాటలలో ఓర్పుగా సమాధానం చెప్పు. లేకుంటే నా నామం స్మరించి అక్కడి నుండి వెళ్ళిపో.
 • నీవెవరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది.
 • ఎవ్వరిగురించీ తప్పుగా మాట్లాడకు. నీగురించి ఎవరైనా మాట్లాడినా చలించకు.
 • ఇతరులు చేసే పనులకు ఫలితం వారే అనుభవిస్తారు. నీవు చేసినపనులకి ఫలితమే నీకుంటుంది.
 • అసూయ వద్దు. అవతల వారికి మేలు జరిగితే మనకే జరిగినట్లు భావిద్దాం. లేదా మనం కూడా ఆమేలు పొందే యత్నం చేద్దాం. ఎవరి కర్మననుసరించి వారు ఫలితాన్ని పొందుతారు.
 • దైవమిచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలువదు.
 • దుఃఖం లేకపోవడమే ముక్తి.
 • మనను భగవంతుడెలా సృష్ఠించాడో అలాగే తృప్తిగా ఉండాలి.

శిరిడీని దర్శించే వారి సంఖ్య నిమిషనిమిషానికీ ఎక్కువైపోవడం చూస్తూనే ఉన్నాం. ఆయనని ఆశ్రయించి ఆయన సహాయం అనుభవించిన వారెందరో.  ప్రస్తుతం మనచుట్టూఉన్న సమస్యలు, అనిశ్చిత పరిస్థితులలో  మానసిక స్థైర్యం పొందడంకోసం ఏదో దైవాన్ని ఆశ్రయించడం, చాలామంది శిరిడీ సాయినాశ్రయించడం  మనకి కనిపిస్తోంది. నమ్మిన వారిని పతనం కానివ్వనని చెప్పిన మాటని తూచా తప్పక పాటించే కామధేనువు బాబా.  కానీ చాలామందిమి బాబా భక్తులమవుతున్నామే కానీ మోసాలు, కుళ్ళు వదలలేక పోతున్నాం. మనని బట్టి బాబాకే చెడ్డపేరు వచ్చేంత చెత్తగా ప్రవర్తిస్తున్నాం.  ఇవే కాస్త తగ్గించు కోడానికి ప్రయత్నించడమే నిజమైన సాయిదీక్ష.   

పై బోధలను మననం చేసుకుంటూ పాటించడానికి ప్రయత్నం చేయడమే మనం ఆయనకివ్వగల గురుదక్షిణ.

సమర్ధ సద్గురు శ్రీ సాయి నాధాయ నమః

నేనీమధ్య కొన్న విండేసు మొబైలు కోసం తయారు చేసుకున్న థీం నా చిరుకానుక ఇక్కడి నుండి దింపుకోవచ్చు.

Tuesday, June 30, 2009

పోతీ డాట్ కం లో నా చిన్న పుస్తకం

 

ఆమధ్య నేను కవిత్వం డిసైడ్ చేసా.

ఈ మధ్య చావా కిరణ్ పుస్తకం పోతీ లో చూసి నేను కూడా స్పూర్తి పొంది ఓచిన్న పుస్తకం  పెట్టా.  ఇదిగో ఇక్కడ చూడండి.

saikruthulu

భవదీయుడు

సత్యసాయి కొవ్వలి

Wednesday, April 22, 2009

తిరగబడిన మర్ఫీ సూత్రం

మర్ఫీ సూత్రం (Murphy's Law) మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అనుభవమూ అయ్యే ఉంటుంది. మనం ఎంత బాగా అన్ని అంశాలూ ఆలోచించి పధ్ధతిగా ప్రణాళిక ప్రకారం పని చేస్తున్నా కూడా అనుకోని అవాంతరం వచ్చే అవకాశం ఉంటుందని ఈ సూత్రం సారాంశం. కానీ ఈమధ్య జరిగిన ఒక సంఘటనతో దీన్ని తిరగరాయాల్సి వచ్చింది.

శ్రావ్యంగా తెలుగులో ఇక్కడ -అమ్మో ఎన్నాళ్ళయ్యింది -3 మాత్రం కాదు

అది నా మాటలలో ఇక్కడ - Reverse Murphy Law & Long blog(hol)iday

త్వరలోనే మళ్ళీ ఇవే బ్లాగ్వరుసలపై కలుద్దాం.

సత్యసాయి

Tuesday, April 14, 2009

ముంబై ముచ్చట్లు – సింగపూరిండియా, జ్ఞానశూన్యత, పిండొడియాలు

ముచ్చట్లంటే ఒకదానికీ మరోదానికీ సంబంధం ఉండాలని రూలులేదుగా.  అలాగే  టైటిల్ లో కూడా. 

సింగపూరిండియా

నాక్రిందటి టపాకి  స్పందిస్తూ నాగన్న గారు సింగపూర్ వాళ్ళ ఫైన్లేసే విధానాన్ని కొనియాడారు.  మేం ఒకమూడు రోజులు అక్కడ తిరిగాం. మేం విన్నది, అక్కడి మా స్నేహితుడు చెప్పినదీ నా ఒత్తిడిని పెంచేయగా, నేను మా పిల్లలమీద ఒత్తిడి పెంచేసా. ఒకసారి మా అబ్బాయి అతి చిన్న చాక్లేట్ కాగితం ముక్క పడేయగానే చాలా టెన్షన్ పడిపోయా. అలా టెన్షన్ పడుతూ కాస్త దూరం నడవగానే స్వర్గంలో అడుగు పెట్టిన అనుభూతి.  హఠాత్తుగా కిందా మీదా కుడీ ఎడమా అంతా చెత్తే చెత్త.  ఒకరికొకరు  రాసుకుంటూ పూసుకుంటూ జనాలే జనాలు.  అటు చూస్తే రోడ్డుమీద అటూనిటూ అడ్డంగా పరిగెడుతూ మనలా కనిపించే మనుషులు.  మొత్తం మీద అంతా అలవాటైన వాతావరణం.   హాయిగా ఉంది. అకస్మాత్తుగా ఇండియాలో ఉన్న అనుభూతి. చిన్న చాక్లేట్ కాయితం పడేసినందుకు ఇంత జబర్దస్తీగా ఇండియాకి డిపోర్టు చేసేసారా అన్నంత సంభ్రమంలో ఉన్న సమయంలోనే దీన్నే మినీఇండియా అని అంటారు అని మా ఫ్రెండు చెప్పాడు. ఓహొ మేమింతే  ఇలాగే ఉంటాం అన్న తత్వం.  సింగపూర్ వాళ్ళే చేతులెత్తేసారు మనవాళ్ళ ధాటికి.

లాలూతో ఒక జపానీ మీ బీహారివ్వండి 10 ఏళ్ళలో జపాన్ చేస్తాం అన్నాడట. దానికి లాలూ మీ జపానివ్వండి 10 నిమిషాలలో బీహార్ గా చేసేస్తా అని ఠపీమని సమాధానం చెప్పాడట.  

జ్ఞానశూన్యత

ఒకసారి మాసహోద్యాగి ఒకావిడతో అన్ని బాధలకన్నా పన్ను బాధ భరింపలేనిదన్నా.  ఆవిడ ఒప్పుకోలేదు.  నాల్గురోజులతర్వాత ఆవిడకి పన్ను నెప్పి వచ్చి బాధపడగానే నాదగ్గరకి వచ్చి మీరన్నది పచ్చినిజం అని చెప్పి పోయింది.  నోట్లో పన్నైనా, నోట్లు లాక్కునే పన్నైనా ఆబాధ  పడ్డవాళ్ళకే ఎరుక. ఇంటర్మీడియట్ ఆప్రాంతంలో వచ్చిన జ్ఞానదంతాలు అడపా దడపా ఇబ్బంది పెడుతూ ఉండేవి.  ఐదు సంవత్సరాల క్రితం ఒకటి పీకించుకోవాల్సి వచ్చింది. మళ్ళీ నిన్న ఒకటి పీకించుకున్నా.   జ్ఞానం రావడం ఎంత బాధాకరమో చూపించిన నాజ్ఞానదంతాలు, జ్ఞానశూన్యత ఎంత హాయో తెలిపాయి. అసలుకి నా జ్ఞానదంతాల్లో ఏసమస్యా లేదని డాక్టరు చెప్పాడు. ఇంతకుముందు పీకబడిన దంతం వంకరగా పెరిగి ముందుపన్నుమీద ఒత్తిడి కలగచేయడంవల్ల ఇబ్బంది కలిగించిందట. నిన్న పీకిన దంతం ముందున్న దంతాన్ని అంటుకుని ఉందట. ముందు పంటిమీద ఏర్పడిన కేవిటీ (క్షయం) వల్ల నెప్పికలిగిందట. కానీ ఆపన్నుని బాగుచేయాలంటే జ్ఞానదంతాన్ని తీసేయాల్సిందే అని పీకిపారేసారు.  మన జ్ఞానం ఎవరికైనా అంటించదలుచుకుంటే మనకే నష్టం అన్న మాట.  ఏమైతేనేం ప్రస్తుతానికి నేను జ్ఞాన(దంత) శూన్యుడినయ్యా. Ignorance is bliss అన్నాడు కదా తెల్లవాడు. Let me be blissful.

పిండొడియాలు

ఈవేళ మా అమ్మ పిండొడియాలు పెట్టింది.  అదేం గొప్ప అంటారా. స్వగృహా లలో కొనుక్కోవడం తప్ప ఈమధ్య ఎవరైనా ఇలాంటవి ఇంట్లో తయారు చేస్తున్నారా.  ఒక గంటపైగా పిండి, సగ్గుబియ్యం కలుపుతూ ఉడకబెట్టి డాబామీదకి తీసుకెళ్ళి వడియాలుగా వేసి ఎండబెట్టాలి. పిండి ఉడకబెడుతూంటే నేనెళ్ళి కాస్త గంజి ఒక గిన్నెలో పోయించుకున్నా. ఆనిమిషం పాటు కలపక పోవడంవల్ల అడుగంటేసి మాడు వాసనే సేసిందని నామీద అభయోగం వేసింది మా అమ్మ.  తర్వాత అమ్మ, నేను, శ్రావ్య (తనకి ఇలాంటి ఫేమిలీ ఏక్టివిటీసంటే ఇంటరెస్టు) డాబామీదకి వెళ్ళి గుడ్డలు పరిచి గంజిని వడియాలుగా మార్చేం. 

మాచిన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వంతులవారీగా వడియాలు, అప్పడాలు, ఊరగాయలూ పెట్టుకునే వారు. మాయింట్లో అప్పడాలు చేసుకుంటే పక్కవాళ్ళు వచ్చి వత్తేవారు.  అలాగే వాళ్ళెవరింట్లోనైనా అప్పడాల ప్రోగ్రాం ఉంటే అప్పడాలకర్రా, పీటా తీసుకుని మా అమ్మ తయారు. ఎవరింట్లో పదార్ధాలు బాగున్నాయోనన్న అంశంమీద తెలియని పోటీ, గుసగుసలు, చెవులుకొరుక్కోవడాలు మామూలే.

ఒక్కసారిగా మా చిన్నప్పటి జ్ఞాపకాలు నన్నూ, మాఅమ్మనీ చుట్టుముట్టాయి.  వాటితో పాటు కాకులు కూడా.  ముందోకాకి వచ్చింది.  దానికీ ఇదో వింటేజెఫైరని అనిపించిందనుకుంటా కావుకావని ఫ్రెండ్సుని పిలిచేసింది. నిమిషాల్లో చుట్టూ కావులే కావులు. వాటి ఆనందం చూసి మాకానందం వేసింది.  సాయంత్రం వెళ్ళి చూడాలి ఏమైనా మాకోసం వడియాలు మిగిల్చోయో లేక అన్నీ తినేసాయో.

Saturday, April 11, 2009

ముంబై ముచ్చట్లు – పాన్ చిరాక్

పాన్

తాంబూలసేవనం మనదేశంలో కొత్త కాదు. అలాగే పెళ్ళాం మొగుడికి చిలకలు చుట్టి నోట్లో పెట్టడం చాలా రోమాంటిక్ సన్నివేశమని చాలా సినిమాలద్వారా డోకొచ్చేంతగా తెలిపారు.  ఇదే సర్వవ్యాపకమైన పాన్. హైదరాబాదులో ఉన్న ఒక పాన్ దుకాణంలో అతి ఖరీదైన పాన్లు (వయాగ్రా పాన్లతో సహా) దొరుకుతాయని ఆమధ్య పేపర్లో పెద్దగా చదివా.  దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ పాన్ (తిన్నా) దొరికినా తూర్పు రాష్ట్రాలలో తిన్నంత ఇంకెక్కడా తినరేమో. పాన్ తినడం పెద్ద సమస్య కాదు కానీ దాన్ని నమిలి ఉమ్ములేసే వాళ్ళతోనే పేద్ద తలనెప్పి. మేం ఇఛ్ఛాపురంలో ఉన్న రోజుల్లో స్కూలు దారిలో రోడ్డుమీదే బస్సులాగేవి. వాటిల్లోనుంచి చూడకుండా ఉమ్ములేసే ప్రయాణీకులవల్ల వాటి పక్కనుండి వెళ్లడం దిన దిన గండంగా ఉండేది. ఆతర్వాత ఒకసారి విజయనగరం రైల్వే స్టేషనులో కిళ్ళీ ఉమ్ములతో ఎర్రబారిన ఒకప్లాట్ ఫాం చూడగానే ఒరిస్సా వెళ్ళే రైళ్ళక్కడనుండే వెళ్తాయని చెప్పగలిగా. అలాగే అదే జనరల్ నాలెడ్జ్ తో భుభనేశ్వర్ లో ఆర్బీఐ బిల్డింగుకి కిళ్ళీ రంగెందుకేసారో కూడా తెలిసేసుకున్నా. నిన్న ఇక్కడి పేపరులో కిళ్ళీనమిక్స్ చదివి కిళ్ళీ గొప్ప తెలుసుకుని హాశ్చర్యపోయానని తెలుసుకున్నా. కొన్ని వివరాలు మీకు కూడా చిలకలు చుట్టి యిస్తా.

ముంబై లోకల్ రైళ్ళమీద పడిన కిళ్ళీమరకలని శుభ్ర పరచడానికి మధ్య రైల్వేవాళ్ళు రూ87 లక్షలు, పశ్చిమరైల్వే వాళ్ళు 57 లక్షలు ఏటా ఖర్చుపెడుతున్నారట. దానికోసం 63000 పని గంటలు వినియోగిస్తున్నారట.  తాగడానికి నీళ్ళులేక కోట్లాది ప్రజలు ఇక్కట్లు పడుతోంటే ఇక్కడ ఎన్ని నీళ్ళు  వృధా అవుతున్నాయో మీరే ఆలోచించండి.  పాన్ తినద్దని అనడంలేదు కానీ నమిలి ఎక్కడపడితే అక్కడ ఉమ్మడం హీరోయిజం కాదని తెలుసుకుంటే ఎంత బాగుంటుందో కదా.  పాన్ బనారస్ వాలా అమితాబ్ చేత చెప్పిస్తే!  ఇది ఇలాఉంటే, ముంబై మునిసిపల్ కార్పొరేషన్ వాళ్ళు యధేచ్ఛగా ఉమ్ములూ, ఉచ్చలూ పోసేవాళ్ళ నుండి 2007 నుండి సుమారు లక్ష మంది నుండి జుర్మానా గా వసూలు చేసినది 4.27 కోట్లు.

ఈఉమ్ముల బాధకి తట్టుకోలేక ఈమధ్య చాలా భవనాలలో మూలల్లో త్రిమతాల దేవుళ్ళు, మత చిహ్నాలూ ఉన్న టైల్సు పెడుతున్నారు.

చిరాక్

ఒత్తిడీ , దాని వల్ల వచ్చే చిరాకులలో మనుషులు ఎలాంటి అకృత్యమైనా చేసేస్తారని ముంబైలో నిన్న జరిగిన సంఘటన పై స్పందిస్తూ ఒక మానసికనిపుణుడు సెలవిచ్చారు. ఒక తండ్రీకొడుకులు కారులో వెళ్తూ బెస్టు బస్సు సైడివ్వలేదని అలిగి ఆబస్సాపి డ్రైవరుమీద తిరగబడ్డారట. విడతీద్దామని దిగిన ప్రయాణీకులని తమవద్దనున్న గన్నుతో బెదిరించి, జనం మరీ  తిరగబడగలరేమోనన్న అనుమానంతో గాలిలో పేల్చి ఆనక పరారైపోయారట.  కండక్టర్ కారు నంబరు పోలీసులకి చెప్పగా, వాళ్ళు నేరస్థులని పట్టుకుని జైల్లో పెట్టారు. ఎంత చిరాకైనా మరీ ఇంత అకృత్యమా.  పెంపకలోపం ఒకకారణమని నిపుణుడు చెప్పాడు. నాఉద్దేశ్యంలో కష్టపడకుండా డబ్బులూ, సుఖాలూ వస్తే పిల్లలు ఇలా తయారవుతారేమో ననిపిస్తోంది.   డబ్బు విలువ తెలియని వాడికిమనుషుల విలువ మాత్రం తెలుస్తుందా.

కొసరు

జ్యూసులు తాగేవాళ్ళు, ఘన పదార్ధాలు తినేవాళ్ళకన్నా ఎక్కువగా లావెక్కుతారని ఇటీవలి పరిశోధన సారాంశం.   అలాగే మధ్యాహ్నం లంచి కాకుండా లైట్ గా జ్యూసో గీసో తాగేస్తే బాగా పని చేసుకోవచ్చుగా అని ఒక అమ్మడడిగితే, మా ముంబై తిండి నిపుణురాలు ససేమిరా అలా చేయద్దని లైట్ గా పప్పూ అన్నమో, కూరా రొట్టో తినమని సలహా చెప్పింది.  వేసవి కదా అని ఊరికే రసాలు తాగకుండా తినండి- నేను హార్లిక్స్ తాగను తింటాను స్టైలులో.  మీకు తెలిసే ఉంటుంది – బెంగాలీలు వాళ్ళ భాషలో ద్రవాలని (ఉదా. చాయ్) కూడా తినడం అనే అంటారు.

ఇంకోసారి ఇంకొన్ని ముచ్చట్లతో …

Saturday, March 14, 2009

ముంబై ముచ్చట్లు – పరీక్షలు, కాపీలు

ప్రస్తుతం పరీక్షల సీజన్ నడుస్తోంది. పరీక్షలకీ, కాపీలకీ ఉన్న అవినాభావ సంబంధం అంతా ఇంతా కాదు. ఎవరో మహాత్మాగాంధీ లాంటి వాళ్ళు తప్ప – లాంటి వాళ్ళు కాదు, ఆయనొక్కడేనేమో- వేరే ఎవరూ ఆప్రలోభాన్ని ఆపుకోలేరేమో.

నేను అయిదో క్లాసులో ఉండగా జరిగిందిది. సోషల్ బొత్తిగా ఎక్కేది కాదు. చదువుతోంటే చాలా బాగుండేది.  పరీక్షలో రాయాలంటే ఒక్కముక్క వచ్చేదికాదు.  అప్పుడే కాదు, ఆతర్వాత తరగతులలో కూడా అదే పరిస్థితి.  పదో తరగతిలో అయితే అన్ని సబ్జెక్టుల్లోనూ 80 - 90 దాటి, సోషల్ 56 శాతం.  పరీక్ష ముందు ఓరెండురోజులపాటు కూర్చుని చిన్న చీటీలమీద సమాధానాలు రాయడం మొదలెట్టా. ఇంట్లోవాళ్ళందరూ అటూ ఇటూ వస్తూ పోతూ చూసి ‘ఏరా కాపీకొట్టడానికా’ అని పలకరించారు.  లోపల ఉద్దేశ్యం అదే అయినా పైకి బింకంగా అబ్బే లేదు. చదవడానికి ఈజీగా ఉంటుందని ఇలా రాసుకుంటున్నా అని చెప్పి నా పని కొనసాగించా. రోజు గడిచేసరికి ఓపది మంది ఇలా అడిగేసరికి, పది సార్లు ఇదే సమాధానం చెప్పా.  పదిసార్లు అలా అంతరాత్మని వంచించాక లోపల ఆలోచన మెదలయ్యింది. చివరికి నేను చేయబోతున్న పని నాకే నచ్చక రాసిన చీటీలన్నీఅవతల పడేసా. మరుసటి రోజు   పరీక్ష యధాప్రకారం గ్రీకండ్లాటిన్. మా క్లాసుమేటు వాళ్ళన్నయ్య వాళ్ళ తమ్ముడి కోసమో, పక్కనున్న పాలకేంద్రానికొచ్చో మా స్కూలుకొచ్చి నేనేమీ రాయకపోవడం చూసి బోలెడు జాలిపడి వాళ్ళతమ్ముడు రాసేసి అవతల పడేసిన స్లిప్పులు ఏరుకొచ్చి నాకు ఓనాలుగు సమాధానాలు డిక్టేషనిచ్చాడు, మాటీచరు వారిస్తోన్నా వినకుండా. ఆకుర్రాడు మాస్కూలు పూర్వవిద్యార్ధి.  ఆతర్వాతి సంవత్సరాలలో ఎలాస్ఠిక్  బాండుల పుణ్యమా అని (చీటీలు కాళ్ళకి  కట్టుకున్నది వీటితోనే కదా) టెన్తులో జామ్మని మొదటి ఛాన్సులోనే పాసయిపోయాడు.

కాపీలంటే ఇలా చీటీలే అక్కర్లేదు, వేరేరకంగా కూడా చేయచ్చని నాలుగోక్లాసులోనే తెలుసుకున్నా. మాసారు 1 నుండి 20 వరకు అంకెలకి ఇంగ్లీషు స్పెల్లింగులు బోర్డుమీద రాసి తర్వాతి రోజు అప్పచెప్పమన్నారు. మేం అందరం చదువుకుని వెళ్ళాం.  బోర్డుమీద ముందురోజు రాసినవి చెరిపేసాకకూడా లీలగా కనిపిస్తున్నాయి. నావంతు వచ్చినప్పుడు నేను బోర్డు చూసి చెప్పడం మొదలెట్టా. స్పష్టంగా లేకపోవడంతో నట్టుతూ చెప్పా.  మాస్టారు నాలాంటి వాళ్లనెంత మందిని  చూసుంటారో కదా.  నా అతితెలివిని కనిపెట్టి చేతికొచ్చిన డస్టరుతో నన్ను ఓరెండేసి బోర్డుకేసి చూడకుండా చెప్పమన్నారు. ఆదెబ్బలకి కళ్ళల్లో నీళ్ళుతిరిగాయి.  బోర్డుకేసి చూడకుండా గడగడా అన్నీ కరెక్టుగా అప్పచెప్పేసా. అప్పుడు మాస్టారు, అన్నీ తెలిసీ కూడా బోర్డుమీద చూసి ఛీటింగు చేయడం ఎందుకూ అని  కాస్త గడ్డిపెట్టారు.  నాకు కూడా చాలా అవమానంగా అనిపించింది. కరెక్టేకదా, చదవగలిగీ కూడా షార్టుకట్ ఎందుకు అవలంబించాను అని సిగ్గుపడి, శోధించుకుని ఇప్పటివరకూ ఇలాంటి షార్టుకట్ల జోలికి పోలేదు.  షార్టుకట్లదారి దూరంగా ఉంటుందని తెలియచెప్పిన ఆమాస్టారికి ఇప్పటికీ,  ఎప్పటికీ  కృతజ్ఞతలు చెప్పుకుంటా.  కాపీ అన్నది పరీక్షలలో ఐనా, జీవితంలోనైనా మన అభివృద్ధికి ప్రతిబంధకం.  కాపీ మాస్ఠర్లు కొంతకాలం ఎలాగో కాస్త పేరు తెచ్చుకుంటారేమోకానీ కాపీ ఎప్పుడైనా కాపీయే. 

ఆతర్వాత రోజుల్లో నాకు గుర్తున్నంతవరకూ నానుంచి కాపీ కొట్టిన సంఘటనలే కాని నేను కాపీ చేసిన (పరీక్షలలోనే కాక ఇతర విషయాల్లో కూడా) సంఘటనలు లేవు. 

ఇంతకీ ఇదంతా ఎందుకు గుర్తొచ్చిందంటే, దహనూలో చించనే ఎడ్యుకేషనల్ సంస్థనడుపుతున్న 75 ఏళ్ళ రజనీకాంత్ ష్రాఫ్ అనే ఆయన ఈమధ్య కాపీలు తగ్గించడానికి ఓకొత్త పధ్ధతి ప్రవేశ పెట్టాడు. ఆయన ఏకంగా పిల్లల తల్లిదండ్రులనే పర్యవేక్షకులుగా నియమించాడు. తల్లిదండ్రులముందు కాపీ చేయడానికి సిగ్గుపడతారన్న  సిధ్ధాంతం మేరకు ఆయన ఈ పద్ధతి ప్రవేశపెట్టి  మంచిఫలితాలని సాధించాడు. దీనిలో పాల్గొన్న తల్లిదండ్రులు తమ సంతృప్తిని వ్యక్తపరిచారు.   ఈపెద్దాయన 2001లో అంత్యపరీక్షలకి 4 రకాల పరీక్షా పత్రాలు తయారు చేసి ఎవరికి ఏపేపరొస్తుందో తెలియకుండా చేసాడట.  దీనితో కోచింగు సెంటరు వాళ్ళు తయారు చేసే ఎక్స్పెక్టెడ్ (లీక్ డ్ అని చదువుకోండి) పరీక్షాపత్రాల తయారీని ఆపచ్చని ఆయన వాదన. ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కన్విన్స్ చేసి,  ఈపద్దతి రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టేలా చేసాడు.  

ఈవార్తతోపాటే చదివిన ఇంకోవార్తకూడా పరీక్షలకి సంబంధించినదే. ఒకబ్బాయికి ప్రత్యేకంగా ఏసీ రూములో పరీక్షరాసే సదుపాయం కల్పించారు.  ఆఅబ్బాయికి ఉన్న ఒక అరుదైన చర్మవ్యాధివల్ల అతనికి చెమటగ్రంధులు లేవుట.  అందుకని చెమట పట్టదుట.  చెమట పట్టక పోతే మన శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధమవదట.  జ్వరం వస్తే అంతే సంగతులు.  మనం ఛీ వెధవ చెమట అని మనం విసుక్కు పోయే చెమట మన శరీరానికి ఎంత అవసరమో కదా.   ఈవ్యాధి జన్యుపరంగా వచ్చే Anhidrotic Ectodermal Dysplasia. ఆస్కూలువాళ్ళు చూపించిన ప్రత్యేకశ్రద్ధని  నేను మెచ్చుకుంటున్నా. 

పరీక్షలు రాస్తున్న, రాయబోతున్న విద్యార్ధినీ, విద్యార్ధులకి నా ప్రత్యేక ఆశీస్సులు. 

సత్యసాయి కొవ్వలి

 

Wednesday, March 11, 2009

నే సెలవిచ్చేదేమిటంటే...

తెలుగు బ్లాగరులందరికీ హోలీ శుభాకాంక్షలు.
తెబ్లాలందరూ హోలీ ఉత్సాహంగా జరుపుకుని ఉంటారని ఆశిస్తున్నా. ఉత్సాహం ఏంటీ ఆఫీసుకెళ్ళాల్సి వచ్చింది అంటారా. కొన్ని పండగలకి సెలవుంటే బాగుంటుందనిపిస్తుంది. అలాంటివాటిల్లో హోలీ ఒకటి. అదృష్టం కొద్దీ మహారాష్ట్రీయుల గుడిపడ్వా (కొత్త సంవత్సరం) మన ఉగాదీ ఒకే రోజు కాబట్టి సెలవుంటుంది కానీ, ఢిల్లీలో ఉండగా సెలవే ఉండేది కాదు. మన సంక్రాంతికి కూడా అంతే. తర్వాత కాలంలో జ్ఞానం కలిగిందేమిటంటే మనరాష్ట్రంలో కూడా మిషనరీ స్కూళ్ళ ప్రభావం వల్ల స్కూళ్ళకి సెలవలకీ, మన పండగలకీ లంకె లేకుండా పోయిందని. కానీ మళ్ళీ గాలి మారి కొన్ని స్కూళ్ళు తమ పద్ధతి మార్చాయి. కొన్ని స్కూళ్ళయితే మా స్కూల్లో బొట్టుపెట్టుకుని రావచ్చని, శ్లోకాలు నేర్పుతామని ప్రచారం చేసుకోవడం కూడా నేనెరుగుదును. ఏమైతేనేం, సెలవలు కావలిసినప్పుడు కాకుండా అనవసర రోజుల్లో వస్తున్నాయి. కొన్ని అన్యమత పండగలైతే ఎందుకు జరుపుకుంటారో కూడా చాలామందికి తెలియదు. అయినా ఇంట్లో కూచోక తప్పదు. వీటికి తోడు వర్ధంతులూ, జయంతులూ వస్తే వరుసగా 3-4 రోజులు బేంకులూ, ఆఫీసులూ బందయిపోయి చాలా ఇబ్బందులు. ప్రజల బాధనర్ధం చేసుకుని బాంకులకి వరుసగా 2 రోజులకన్నా సెలవు రాకుండా నిబంధనలు పెట్టారు. లేక పోతే ఎంత ఇబ్బందో కదా.
అవసరం లేనప్పుడు అందుబాటులో ఉండి, తీరా అవసరం అయినప్పుడు లేకుండా పోవడాన్ని అర్థశాస్త్రంలో డిమాండ్ - సప్లై మిస్ మేచ్ అంటాం. ఇలా అసమతుల్యత ఉన్నప్పుడే మార్కెట్లు పుడతాయి. కానీ ఈసెలవలన్నవి ఎవరివి వారికే. నాన్నెగోషియబుల్. నాన్ట్రాన్సరబుల్. దీనిమీద ఒక జోకుంది. ఒక ఉద్యోగి బాస్ దగ్గరకి వెళ్ళి సెలవడుగుతే, బాసు కదా నో అంటాడు. సరే ఏం చేస్తామని ఆఉద్యోగి 'I will take leave of you, sir' అని వచ్చేస్తాడు. ఓమాదిరి ఇంగ్లీషొచ్చిన సారువారు అదెలా కుదురుతుంది, నా సెలవాయనెలా తీసుకోగలడు అని ఉన్న జుట్టునే తెగ పీక్కున్నాడట. నా దృష్టిలో అలా ఒకళ్ళ సెలవలు వేరే వాళ్ళు కొనుక్కోగలిగితే బలే ఉంటుందనిపిస్తుంది. పిదపకాలంలో ఈసెలవలని స్టాకు మార్కెట్ లో కూడా క్రయవిక్రయాలు జరిపే అవకాశం కూడా రావచ్చు. ఇప్పటికే చాలా సంస్థలలో ఎర్న్డు లీవులుంటాయి. కొంత పరిమితికి, నియమాలకీ లోబడి సంస్థకి అమ్ముకోవచ్చు. ఈపధ్ధతిని అన్ని రకాల సెలవలకీ (పండగ సెలవలకి కూడా) అన్వయిస్తే సంవత్సరంలో పని దినాలు పెరుగుతాయి. కావలసినవాళ్లు కావలసినప్పడు సెలవపెట్టుకుంటారు. సెలవలకీ, డబ్బులకీ లంకె ఉంది కాబట్టి (సెలవు వాడుకోక పోతే డబ్బులకింద మార్చుకోవచ్చు కదా) అనవసరంగా సెలవలు వాడరు.
ప్రస్తుతానికి సెలవు

Sunday, March 08, 2009

ముంబై ముచ్చట్లు – గాంధీగారి వస్తువులు

దేశాభిమానం

మన స్వాతంత్ర్యసమరం అన గానే గుర్తుకొచ్చేది  బోసినవ్వుల గాంధీ.  కేవలం మన రూపాయి నోట్లమీద మాత్రమే మిగిలిపోయిన మహాత్ముడు.  ఆయన మీద చాలామంది బురద జల్లి మన సంస్కృతి మీద మనకే రోత కల్పించే కార్యక్రమం చేసారు, చేస్తున్నారు.  ఎవరెన్ని చెప్పినా గాంధీ గాంధీయే.  ఆయన రచనలు పుంఖాను పుంఖలు.  వాటిలో ఆయన స్పృశించని విషయాలు లేవు. 

జెజూ ద్వీపం (కొరియా) లో టెడ్డీ బేర్ మ్యూజియం లో గాంధీ బొమ్మ వాళ్ళ చారిత్రక పురుషుల సరసన పెట్టడం చూసి చాలా గర్వంగా అనిపించింది (క్రింది ఫోటో చూడండి). ఇండియా అనగానే అక్కడి వాళ్ళు  గాంధీ గురించి చదువుకున్నాం అని చెప్తారు.

IMG_0699

 

గాంధీగారు వాడిన 5 వస్తువులని (కంచం, కప్పు, కళ్ళద్దాలు, వాచీ, చెప్పులు) వాటి హక్కుదారుడు జేమ్స్ ఓటిస్ ఈమధ్య వేలం వేసాడు.   అవి ఎవరో కొనేస్తే మన సంస్కృతిని ఎలా కాపాడుకోవాలోనని ఏలినవారితో సహా చాలామంది ఆదుర్దా చెందారు.  వాటిని మన విజయ మాల్యా గారు 1.8 మిలియన్ డాలర్లు పెట్టి వేలంలో కొని కథ సుఖాంతం చేసారు.  నాకైతే ఈవస్తువులు ఓటిస్ చేతికెలా వెళ్ళాయో, ఇన్నాళ్ళూ ఎవరూ వెనక్కి తేవాలని ఎందుకు పూనుకోలేదో తెలియదు.  ఈవిషయం గురించి తెబ్లాలెవరూ స్పందించినట్లు లేదు.  ఎందుకో మరి.

మన సంస్కృతి శాఖ మంత్రి అంబికా సోనీ ప్రకారం ఏలినవారే  మాల్యా ద్వారా కొనిపించాం అని చెప్పారు.  దానికోసం డబ్బులు అమెరికాలో ఉన్న భారతరాయబారి కార్యాలయం ద్వారా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  తనంతట తానుగా కొన్నానని, ఎవరి పనుపునా కాదని, రాయబారి కార్యాలయం నుండి డబ్బుల గురించి సమాచారమేమీ రాలేదని విజయ మాల్యా నొక్కి మరీ చెప్పారు (ఇంకెవరైనా ఇంకేమైనా నొక్కాసారేమో తెలియదు. పాపం శమించు గాక).  ఇంతకు ముందు కూడా టిప్పు సుల్తాను కత్తిని వేలంలో కొని మన దేశానికి తిరిగి తీసుకొచ్చానని కూడా ఆయన గుర్తు చేసారు.  మన ప్రభుత్వం ఓటిస్ తో మంతనాలు జరిపిన  మాట నిజమే.  కానీ ఓటిస్ కొన్ని షరతులు విధించాడు.  అవేమిటంటే- మన ప్రభుత్వం ఆరోగ్యానికి కోటాయింపులు పెంచాలి లేదా గాంధేయ విలువలని ప్రపంచానికి మన రాయబారి కార్యాలయాల ద్వారా వ్యాప్తి చేయాలి. ఇవి మన దేశ సార్వభౌమాధికారానికి దెబ్బ అని ఒప్పుకోలేమని విదేశాంగ మంత్రి ఆనంద శర్మ అన్నారు.  మనం గాంధీని మరిచి పోవడం అనే మన సార్వభౌమాధికారాన్ని  బయటి వాళ్ళు గుర్తు చేయడం తప్పనా.   మొదటి షరతు ఓకే కానీ రెండోది ఏరకంగా దెబ్బో నాకు తెలియలేదు.  అయినా షరతులు పెట్టిన వాడు ఒప్పుదలయ్యే షరతులు, ఉదా. గాంధీ అని ఇంటి పేరున్న వాళ్ళే ప్రధాన పదవులు చేపట్టాలనో లాంటివి, ప్రజా నాయకులకి గాంధీ అలవెన్సివ్వాలనో పెట్టాలి కానీ పేచీకోరు షరతులేంటి.

ఇదిలా ఉండగా, ఓటిస్ దగ్గర గాంధీగారి చితాభస్మం, కాల్చబడిన చోటునుండి తీసిన రక్తం ఉన్నాయిట. అవి కూడా త్వరలో అమ్మచ్చుట.  ఇంతేకాదు, ఇలాంటి జ్ఞాపకాలు, వేరే నాయకులవీ, మన ఇటీవలి చరిత్రకి సంబంధించినవి చాలా ఉండచ్చు.  వీటన్నిటినీ సేకరించి, భద్ర పరచి భావితరానికి అందించేందుకు చేయాల్సిన కృషిని ఈ గాంధీ గారి వస్తువుల వేలం మనకి గుర్తుకు చేస్తోంది.    

పుల్లలు, చెక్కగోళీ తో నేను చేసిన 8 అంగుళాల గాంధీ తాత – మూడు పార్శ్వాలు.

gandhi gandhi profile gandhi side

ముంబై ముచ్చట్లు – భాషాభిమానం

మన జనాలకి అభిమానాలు బాగానే ఉన్నాయి. అందులో భాషాభిమానం, దేశాభిమానం, మతాభిమానం ఈమధ్య బాగానే కనిపిస్తున్నాయి. ఇందులో మొదటి దానికి ఉదాహరణ ఈమధ్య జరిగిన సంఘటనలు.

మొన్న ముంబై మిర్రర్ లో మహీంద్రా అండ్ మహీంద్రా కంపనీ CEO  ఆనంద్ మహీంద్రా మీద ముంబై మునిసిపాలిటీ తరఫున ఓ గుమాస్తా క్రిమినల్ కేసు పెట్టారని చదివాం. కారణం ఆయన తన కంపెనీ బోర్డుమీద మరాఠీలో రాయకపోవడం. ఎప్పుడో 1948 లో చేసిన ఒక చట్టం ప్రకారం ఆయన నేరస్థుడయ్యాడు. ఆ చట్టం ప్రకారం 50 – 500 రూపాయలు జరిమానా వేయచ్చు. అదీకాక, ఆకంపనీలో ఈబోర్డులూ, గీర్డులూ బాధ్యత ఏ డైరెక్టరుదో నిర్ధారించుకుని వారినే బాధ్యులని చేయాలిట.  వీళ్ళ వెర్రి కాని, భాషాభిమానం ముందు ఈఅడ్డంకులేమిటీ.  ఆమధ్య నవనిర్మాణ సమితి కార్యకర్తలు గూండాగిరీ చేసి మరాఠీలో బోర్డులు లేని షాపులని ధ్వంసం చేసారు.  అదీ ఉత్సాహం అంటే.  భాషాభిమానం చూపించుకునే పధ్దతిదీ.  అన్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్టు రాజ్ ధాకరేని మీరు  మరాఠీ, మరాఠీ అంటూ మీ పిల్లలని ఇంగ్లీషు మీడియంలో ఎందుకు చదివిస్తున్నారని అడిగాడు.  దానికి ఆయన నేను చెప్పేది నాన్-మరాఠీయుల కోసం, మరాఠీయులకి పర్వాలేదని వాక్రుచ్చారు.

మాయల మరాఠీ అన్న ప్రయోగం ఎప్పుడైనా విన్నారా?

Saturday, February 21, 2009

సంగీతవైభవం

జనవరి లో ఇంటికి (హైదరాబాదు) వెళ్ళినపుడు మాఆనందనగర్ కాలనీలో త్యాగరాజస్వామివారి ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. ఒకరోజు ఉదయం జరిగిన ఉపన్యాసం, బహుమతి ప్రదానం కార్యక్రమాలకి హాజరయ్యా. అంతకు కొన్నిరోజులముందు జరిగిన పంచరత్నకీర్తనల కార్యక్రమం రోజున త్యాగయ్య సినిమా ముహూర్తకార్యక్రమం జరిగిందట. ఇది త్యాగరాజస్వామి మీద తెలుగులో వస్తున్న 3వ సినిమా. మాకాలనీలోనే ప్రతిసంవత్సరం జరిగే ఆరాధనోత్సవాలలో త్యాగయ్య వేషంలో ఊంఛ వృత్తి చేసే శ్రీ ఈశ్వరప్రసాదు ఇందులో ప్రధానపాత్రధారిట. అంతాబాగుంది కానీ ఆఉత్సవం రోజున సినిమావారి కార్యక్రమంతో ప్ంచరత్నకీర్తనలు ఆలస్యంగా ముగించాల్సిన సమయానికి కొద్దిగా ముందుగా మెదలెట్టాల్సి రావడం బాధాకరం అని హాజరైనవాళ్ళు చెప్పారు. సాంప్రదాయాన్ని, సమయాన్ని గౌరవించలేకపోవడం మన దౌర్భాగ్యం.

అది అలా ఉంచితే, ఈ ఆరాధనోత్సవాలు కాలనీ కమ్యూనిటీ హాలులో విజ్ఞానసమితి అనే సంస్థ ఆధ్వర్యంలో దశాబ్దాలుగా జరుగుతున్నాయి. జంటనగరాల్లో జరిగే ఆరాధనోత్సవాలలో వీరు చేసే ఉత్సవాలకి మంచి గుర్తింపు ఉంది. సందర్భంలో కర్ణాటక సంగీతం పోటీలు జరుగుతాయి. ఈపోటీలలో అబ్బాయిలకి బహుమతులు రావడం ముదావహమని టీఆరెస్ బహుమతులిచ్చే సందర్భంలో చెప్పారు. అందరూ టీఆరెస్ అని పిలిచే ఈయన పూర్తి పేరు T.R.Subrahmanyam. (ఈలంకెని అనుసరించి ఆయన గురించి పెద్దగా చదవచ్చు). క్లుప్తంగా - ఈయన ముసిరి సుబ్రమణ్య అయ్యర్ గారి శిష్యుడు, ఢిల్లీ విశ్వవిద్యాలయం లో మ్యూజిక్ ప్రొఫెసర్ గా చేసి రిటైరయ్యారు. పల్లవి పాడడం, సోదాహరణ ప్రసంగాలివ్వడాల్లో సుప్రసిధ్దులు. ఈయన తండ్రిగారు విజయవాడలో పనిచేసినపుడు తెలుగు నేర్చుకునే అవకాశం వచ్చిందిట. మన రాష్ట్రంలో ఉన్న 12 ఏళ్ళూ స్వర్ణకాలంగా భావిస్తానని చెప్పారు. తమిళులు శాస్త్రీయ సంగీతం తో పాటు తెలుగు కూడా నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. మనం కనీసం తెలుగు నేర్వడానికి కూడా ఇష్టపడకపోవడం బాధాకరం. కాస్తాకూస్తో ఉడతాభక్తిగా పాటుపడేవాళ్ళమీద బురద జల్లడానికైతే చాలామంది రెడీ. ప్రస్తుతం జరుగుతున్న భాషావారోత్సవాలలో రానాలందరూ అది చేస్తాం, ఇది చేస్తామని తెగ ప్రగల్భాలు పలుకుతున్నారు. ఎవరోవస్తారని ఎదురుచూడకుండా మనకి తోచింది చేయడం వల్లే తెలుగుబ్లాగులు, అంతర్జాలంలో తెలుగు వెలుగూ ఈస్థాయికి వచ్చాయి.

ఆరోజున టీఆరెస్ ఇచ్చిన సోదాహరణ ఉపన్యాసం (Lecdem)లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఆఉపన్యాసంలో ముఖ్యంగా 3 విషయాలు ప్రస్తావించారు. అవి నా మాటల్లో ..

1. తెలుగు అందమైన భాష. త్యాగరాజాదులు తెలుగులోనే రాయడం వల్ల శాస్త్రీయ సంగీతానికి తెలుగు అధికార భాషలా అమరింది. (http://samkeertana.blogspot.com/2009/02/blog-post_22.html) త్యాగరాజు గారి తమిళ్ శిష్యులు కూడా తెలుగులోనే రాసారట. త్యాగరాజుగారు తెలుగాయన, శిష్యులు తమిళులు, ఆయన ఉన్నది తమిళ్ నాడు, దేశానికి రాజు శర్భోజీ మహరాష్ట్రుడు. టీఆరెస్ గారు సుమారు 15 ని ల పాటు తెలుగు గొప్పగురించి రకరకాలుగా చెప్పారు. టీఆరెస్ కొన్నాళ్ళు సంగీతజ్ఞుడు శ్రీ సాంబమూర్తి గారిదగ్గర పనిచేసారట. ఆకాలంలో తంజావూరు మ్యూజియంలో త్యాగరాజు గారి కీర్తనల వ్రాతప్రతులని పరిశీలించే అవకాశం వచ్చిందట. అంతకు ముందే టీఆరెస్ ఆప్రతులని చూసినా కూడా తెలుగురాకపోవడం వల్ల కేవలం చూడగలిగారట. కానీ ఈసారి చదవగలిగారట. వాటిలో ఒక కీర్తన కి మనం ప్రస్తుతం పాడే రాగంకాకుండా వేరే రాగం రాసి ఉందట. ఈవిషయం గురించి, అలాగే మనం వినే కీర్తనల్లో పాఠ్యాంతరాలుండడం గురించి సాంబమూర్తి గారినడిగారట. త్యాగరాజుగారు తన ధోరణిలో, భక్త్యావేశాలతో పాడుకుంటూంటే శిష్యులు విని రాసుకుని భద్రపరిచేవారట. అలారాసిన వాటి రాగాలని శిష్యులు తమతమ అవగాహనని బట్టి రాసి పెట్టేవారు కాబట్టి, అందులో కొన్ని పొరపాట్లు దొర్లి ఉండచ్చు. ఆరోజుల్లో గురువుని అడిగి తెలుసుకునే ప్రయత్నం దుస్సాహసమట. అదీగాక చాలా రాగాల పేర్లు, శ్రుతులు కాలక్రమేణా మార్పులూ, చేర్పులూ చెందడం మనకి తెలిసినదే.

2. త్యాగరాజస్వామి వారు తాము సమాధిచెందిన 60 సంవత్సరాల తర్వాతే తమ రచనలు వెలుగులోకొస్తాయని చెప్పారట. ఆవిధంగానే ఆయన ఆరాధనోత్సవాలు ఆయన సమాధిచెందిన 60 సంవత్సరాలకే మొదలయ్యాయి. మొదట్లో ఎవరికి తోచిన కీర్తనలని వారు పాడి వెళ్ళిపోయారట. తర్వాతి రోజుల్లో అందరూ కలిసి పాడుదామనుకునే సరికి ఒకే మాదిరి పాడుకోగలిగిన పాటల కోసం వెతగ్గా స్వరసహితంగా స్వామివారు రాసిన ఓఐదు కీర్తనలని ఎన్నుకున్నారట. అవే పంచరత్న కీర్తనలు. ఆరోజుల్లో ఐదు కీర్తనలనీ పాడగల వాళ్ళు ఎవరూ లేరట. మహారాజపురం విశ్వనాధ అయ్యరు గారికి నాలుగొచ్చట. అందుకే ఆయన తిరువయ్యారు వెళితే అక్కడందరూ నాలుగు పాటలొచ్చినాయన వస్తున్నారని గొప్పగా చెప్పుకునే వారట. ఇప్పుడు అమెరికాలో పంచరత్నా క్లాసులు పెట్టి మరీ తర్ఫీదిస్తున్నారుట.

పంచరత్నాల్లో కనకనరుచిరా వరాళి రాగంలో ఉంది (మా అమ్మాయి పేరు ఈరాగాన్ననుసరించే పెట్టాం). వరాళి రాగం నేర్పితే గురుశిష్యులమధ్య గొడవలొస్తాయని ఒక నమ్మకం. అందుకే చాలాతక్కువమందికి ఐదు కీర్తనలూ వస్తాయి. ఈవిషయం మీద సంగీతం డాట్ కం లో చర్చ జరిగింది. దీనికి టీఆరెస్ వివరణ వేరుగా ఉంది. ఆయన ప్రకారం సంగీతం నేర్పే చిన్నమాస్టారెవరో తనకి రాదని చెప్పలేక ఈసెంటిమెంటు సృష్ఠించి తప్పించుకుని ఉంటాడు.

3. శాస్త్రీయ (కర్ణాటక) సంగీతం పాశ్చాత్య పెనుతుఫానుకి రెపరెపలాడటం లేదు. పైగా పాశ్చాత్య సాంకేతిక సదుపాయాలవల్ల సంగీతప్రియులకీ, విద్యార్ధులకీ చాలా లాభం కలిగింది. టెలీటీచింగు పద్ధతిలో చాలామంది విదేశాల్లో ఉంటూ కూడా చక్కగా శాస్త్రీయ సంగీతం నేర్చుకుని కచేరీలిస్తున్నారట. టీఆరెస్ గారి దగ్గరకూడా ఒకరిద్దరు ఈపద్ధతిలో కొన్ని పాటలు నేర్చుకున్నారట.

గమనించాల్సిన విషయం సంగీతాన్నిపట్టుదలగా నేర్చుకునే వాళ్ళలో తమిళులే ఎక్కువుండడం. శంకరాభరణం సినిమా తర్వాత చాలామందికి శాస్త్రీయ సంగీతం మీద మక్కువ కలిగింది. కానీ టీవీ ఛానెళ్ళ వల్ల పిల్లలకీ, పెద్దలకీ కూడా జిడ్డు సీరియళ్ళూ, సినిమా పాటల, డాన్సుల పోటీలూ తప్ప ఒక్క సంస్కృతీ, సాంప్రదాయాలకి సంబంధించిన ఒక్క చిన్న కార్యక్రమం కూడా ఉంచక పోవడం శోచనీయం.

Wednesday, January 14, 2009

సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు బ్లాగ్జనులకీ, వారి కుటుంబాలకీ నా సంక్రాంతి శుభాకాంక్షలు
సత్యసాయి కొవ్వలి

Friday, January 09, 2009

ముంబై ముచ్చట్లు (ఇక్కట్లు) - హమ్మయ్య ... టెర్రరిస్టులు సమ్మె విరమించారు

నవంబరులో (26/11) టెర్రరిస్టుల దాడికి బలయిన వాళ్ళు అతికొద్ది మంది. కానీ స్పందించినవాళ్ళు మొత్తం దేశప్రజలందరూ. ఇప్పుడు 3 రోజుల నుండి దేశం మొత్తం ఆయిల్ కంపెనీ సిబ్బంది సమ్మె ధాటికి అతలాకుతలం అయిపోతే బ్లాగ్లోకం లో కానీఇతరత్రా కానీ కనీస స్పందన లేదు. బహుశః టెర్రరిజం అంటే తుపాకులూ, బాంబులూ అని మనకున్న అవగాహన వల్ల అయుండచ్చు. నా దృష్ఠిలో బాంబులూ తుపాకుల వల్ల కొద్దిమంది, కొన్ని ప్రాంతాల్లో బాధ పడతారు. కానీ ఈ ఆయిల్ సిబ్బంది సమ్మె వల్ల ఈవేళ ఎంత మంది కష్టపడ్డారో ఎవరికీ అంత తెలియదు. అనుభవిస్తున్న వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే రక్తాలూ, గాయాలూ, ఓవర్ టు తాజ్ బ్లడీ కవరేజ్ లూ ఉండవు కదా. ఆటోలు లేవు, టాక్సీలు లేవు, కాంట్రాక్టు బస్సులు లేవు. చివరికి పబ్లిక్ రవాణా ఎన్ని రోజులు నడవగలదో తెలియదు. పెట్రోలు లేక పోతే పోనీ, సెలవు పెట్టుకుని ఇంట్లో కూచోవచ్చనుకుంటే (రోజు కూలీలకి ఆసౌకర్యం కూడా లేదు) , కొన్ని ప్రాంతాల్లో కనీసం వంటగ్యాసు (పైప్ డ్) రాలేదుట. 3 రోజులు ఇలాంటి పరిస్తితి ఉంటే ఎంత ఆర్ధిక నష్టం, అసౌకర్యం కలిగుంటుందో మీ అవగాహనకి అందని విషయం కాదు. టెర్రరిష్టుల అటాకే బెటరు, అదృష్టం బాగుంటే తప్పించుకునే అవకాశం ఉంది. ఇలాంటి సమ్మెలలో ఆఛాన్సే లేదు.
ఈవిషయం చర్చిస్తుంటే ఒకాయన వాళ్ళు అలా చేయకపోతే వాళ్ళ మాటఎవరూ వినరు కాబట్టి సమ్మె ఓకే. ఏసీ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళం ఇంతకన్నా దూరాలోచన చేయలేమేమో!