Thursday, December 06, 2007

కేవలం యాదృచ్ఛికం అనలేని ఘటనలు

నా కూతురి (బ్లాగు) మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆశీస్సులు అందించిన వారందరికీ నాకృతజ్ఞతలు - జ్యోతక్క 'దీవెన'లకి ప్రత్యేకంగా. అవడానికి 54 టపాలున్నా 10 ముసాయిదాలుగానే ఉండిపోయాయి. ఇక్కడో గమ్మత్తు జరిగింది. నవంబరు 2006 (20 కి నాకు 44 నిండాయి- ఈరోజుల్లో మగాడి వయస్సు, ఆడవాళ్ళ జీతం అడగ కూడదని శాస్త్రం- అయినా నా వయస్సు చెప్పేసా) లో మొదలెట్టిన బ్లాగు లో నవంబరు 2007 నాటికి అనుకోకుండా, నాప్రమేయం లేకుండా నావయసుకి సమానంగా టపాలు వచ్చాయి.


ఇలా అప్పుడప్పుడు తేదీలకి మన జీవితంలో కొన్ని ఘటనలకి అనుకోకుండా లంకె కుదరడం కేవలం యాదృచ్ఛికం అనుకోలేం. అలాంటి ఒక లంకె మానాన్నగారి జీవితంలోని ముఖ్య తేదీలకి మాముగ్గురి అన్నదమ్ముల జన్మదినాలకీ ఉండడం నాకెప్పుడూ విచిత్రంగా తోస్తుంది. మానాన్నగారి పుట్టిన రోజునాడే ఆయన పెద్దకొడుకు (అంటే మా అన్నయ్య) పుట్టాడు. మా తమ్ముడి పుట్టిన రోజునాడు ఆయన పోవడం, నా పుట్టిన రోజు నాడే ఆయనకి కొద్ది రోజులే మిగిలున్నాయని వైద్యులు ధృవీకరించడం ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఇదిలా ఉంచితే, ఓ వారం క్రితం ఓకలొచ్చింది. అందులో ఒక సాధువు నన్ను ప్రవచనం ఇవ్వమన్నాడు. నేను శక్తి అన్నవిషయం మీద మాట్లాడా. అంతా అయిపోయాక అయ్యో .. శక్తి నిత్యత్వ సూత్రం (శక్తి సృష్టించబడదు, నశించదు, కేవలం ఒక రూపం నుండి వేరొక రూపం లోకి మారగలదు) గురించి చెప్పడం మరచానే అనుకుంటుంటే మా ఆవిడ లేపడం వల్లననుకుంటా కల చెదిరిపోయింది. మర్నాడు ఆఫీసులో హలో మాత్రపు పరిచయం ఉన్నాయన లంచి టైం లోకలిసాడు. ఆ వేళ పొద్దున్నే మా స్నేహితులిద్దరు ఆయన సదా ఆనందంగా ఉండగలడని చెప్పిన విషయం ఆయనకి చెప్పా. ఆమీదట ఆయన ఆవిషయం మీద ఏదో చెబుతూ అలా అలా మాట్లాడుతూ చివరికి శక్తి నిత్యత్వ సూత్రం గురించి చెప్పాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈలోగా మా లంచిమితృడొచ్చి నన్నక్కడినుంచి లాక్కు పోయాడు (కలలో మాఆవిడ అంతరాయం కలిగించినట్లే). మరుసటి రోజు వెళ్ళి ఆయనకి నాకల గురించి చెప్పా.

ఆయన తో నాకు కలిగిన ఇలాంటిదే ఇంకో అనుభవం కూడా చెప్పా. అది నేను ఢిల్లీలోని AIIMS కి మా నాన్న గారి మెడికల్ బిల్ ( ఆయన అక్క డ కొన్నాళ్ళు వైద్యం చేయించుకున్నారు) మీద సంతకం కోసం వెళ్ళినప్పుడు జరిగింది. ఆఫీసులో బిల్లిస్తే ఓగంట కూర్చోపెట్టి ప్రతి బిల్లుమీదా సూపర్నెంటు సంతకాలు పెట్టించి ఇచ్చారు. తీరా ఇంటికొచ్చాకా చూస్తే కూడిక తప్పైందని తెలిసింది. వామ్మో అని ఓరెండుమూడు రోజులు కూడిక తప్పు కాకుంటే బాగుండునన్న అత్యాశతో మళ్ళీ మళ్లీ కూడి ఒకరిద్దరితో కూడించి ఇంక లాభంలేదని చెప్పి మళ్ళీ వెళ్ళక తప్పదన్న నిర్ణయానికి వచ్చా. మళ్ళీ ఇంకెంత ప్రొసీజరో ఏంటోనని కొన్ని రోజులు మధనపడడం ఇంకా గుర్తుంది. అక్కడికి వెళ్దామనుకున్న ముందు రోజు ఓకల. అందులో నేను సూపర్నెంటు ఆఫీసుకు పోయా. అక్కడున్న పంజాబీ ఆంటీ తో నా ముచ్చట ఇలా సాగింది.

నేను - చిరునవ్వు - కీ హాల్ హై (ఎలా ఉన్నారు)
ఆంటీ - ప్రతినవ్వు - క్యా బాత్ హై( విషయం ఏమిటి)

నేను - some problem
ఆంటీ - totalling error

నేను - yes (కాయితాలిచ్చా)
ఆంటీ - తన రిజిస్టర్ లో మొత్తాన్ని సరిచేసి -అక్కడో పొట్టి సంతకం చేసి కాయితాలు వెనక్కిచ్చింది.

నేను - వెయిట్ కరూ (వేచి ఉండనా)
ఆంటీ - నా.. హో గయా ( అక్కర్లేదు .. పని అయిపోయింది)

పని అతి సులభంగా పని అయిపోయింది అని సంతోష పడేలోగా కల కరిగి పోయి ఇంకా వాళ్ళ ఆఫీసుకి వెళ్ళలేదన్న నిజం సాక్షిగా కళ్ళు తెరిచి తయారై AIIMS కెళ్ళా. నమ్మండి ... నమ్మకపోండి మా సంభాషణ ఆసాంతం పై మాదిరిగానే జరిగింది. నా సంభాషణలు నాకు తెలుసు. కానీ ఆంటీ కి తన పోర్షనెలా లీకయిందో తెలియదు.

ఈ అనుభవాలు రెండూ విని ఆయన మన ఆలోచనలు, వాటి తీవ్రతని బట్టి, వేరేవాళ్ళలో సారూప్య ఆలోచనలను కలిగించచ్చని విశ్లేషించాడు. మరి మీరేమంటారో?

Saturday, November 24, 2007

సత్యశోధన - వార్షికోత్సవ టపా

సత్యశోధనకి ఏడాది నిండి రెండో ఏడొచ్చింది. తేదీ గుర్తు లేదు కానీ, నవంబరు 20 ప్రాంతంలో నా బ్లాగు మొదలు పెట్టా. బ్లాగ్సోదరులిచ్చిన ప్రోత్సాహంతో ఇప్పటికి 44 టపాలు అయ్యాయి. మీఅందరికీ ఈ సందర్భంగా నా నెనర్లు. నాబ్లాగులో నెలకి సరాసరి 3.67 టపాలు వచ్చాయి. అంటే నేను పెట్టుకున్న లక్ష్యం 4 కన్నావెనకపడ్డా. ఈమధ్యలో చాలా అంతరం రావడం దీనికి కారణం.

నా గ్రహబలాన్ని ప్రతీఏటా పంచాంగం రాగానే చూసుకోవడం నా అలవాటు. ఇది మా నాన్నగారు స్వర్గీయ రమేష్ చంద్రబాబు గారి నుండి వచ్చినది. ఎటొచ్చీ ఆయన కొంచెం గంభీరంగానే తీసుకొనేవారు. నేను ఆసందర్భాన ఆయనని తలుచుకోవడం ప్రధానాశయంగా చూస్తోంటాను. అదేంటో ఆయనకాలంలోకానీ, ఆతర్వాతకానీ రాజపూజ్యంకన్నా అవమానమే ఎక్కువ ఉంటూ వస్తోంది. ఒకసారి రా.పూ. 1, అ.మా.5 అయితే, ఇంకోసారి 5, 10. ఎప్పుడైనా పొరపాటున రా.పూ., అ.మా.కన్నా ఒకటెక్కువున్నా అలవాటు కొద్దీ ఆసంవత్సర ఫలితం కూడా మిగిలిన వత్సరాల ప్రతిధ్వనిలాగే ఉండేది. కానీ బ్లాగ్లోకంలో అడుగు పెట్టిన తర్వాత నా బ్లాగ్రహబలం మహర్దశనందుకొందని తెలిసింది. ఈ ఏడాదంతా అర్హత 6, అభినందనలు 66 లా గడిచింది. నామొదటి టపానుండి నన్ను వెన్ను దట్టి, కళ్ళు నెత్తికెక్కించిన వారు చాలామంది ఉన్నారు. ఒకటి, రెండు టపాలు వ్రాయగానే మంచిముత్యంలాంటి బ్లాగని ఒకటి,ప్రముఖబ్లాగరని మరొకటి విశేషణాలు తగిలించి బ్లాగ్సురాపానోన్మత్తుడిని చేసిన చదువరి, త్రివిక్రమాదులకి ప్రత్యేక నెనర్లు.

ఎంతమంది పిల్లలని కన్నా ప్రథమ సంతానం మీదే మక్కువెక్కువున్నట్లు, అధికోత్సాహపడి వేరే బ్లాగులు మొదలెట్టినా ఏమాత్రం సమయం చిక్కినా సత్యశోధన లోనే టపాలు వ్రాయబుద్ధి వేయడంతో ఆయా బ్లాగులలో టపాలు పెరగనేలేదు.


ఈయేడాదిలో నేను (నాబ్లాగు) కొంతమంది అభిమానులని సంపాదించుకున్నా. చాలా మందికి అభిమానినయ్యా. ఈయేడాది నా జీవితంలో ఇంత ఆలస్యంగా వచ్చిందే అని అనిపించేంత గొప్పఅనుభవాలనీ, అనుభూతులని మిగిల్చిన బ్లాగ్సంవత్సరమిది. ఇక ముందు వచ్చేవన్నీ ఇలాంటి సంవత్సరాలే అవ్వాలని బోలెడు అత్యాశ పడిపోతూ

భవదీయుడు
సత్యసాయి కొవ్వలి

Sunday, September 16, 2007

వినాయక చవితి జ్ఞాపకాలు(ఇది ఈనాడు సుధాకర్ గారి విచిత్రం)

పైనున్న రేఖాచిత్రం సుధాకర్ గారు SMS ద్వారా పంపారు. వారికి సభాముఖంగా కూడా ధన్యవాదాలు. అందరికీ వినాయక చవితి, రంజాను శుభాకాంక్షలు.

ఈటపా మీరు చదివే సమయానికి అందరూ వినాయకచవితి చేసేసుకునీ, ఉండ్రాళ్ళు గట్రా తినేసి ఉంటారు. మా ఇంటి చుట్టుపక్కల పెద్దపెద్ద వినాయక విగ్రహాలు పెట్టి ఉత్సాహంగా పండగ చేసారు. ఇదే సమయంలో పవిత్ర రంజాన్ మాసం ఆరంభమవడంవల్ల ఇంటిపక్కనున్న మసీదు దగ్గర కూడా చాలా హడావిడి గా ఉండి పండగవాతావరణం నెలకొంది. చవితి ముందురోజైతే బజారులో హలీం అమ్మే దుకాణాలు, చవితి సామగ్రి అమ్మేదుకాణాలతో చాలా రద్దీగా ఉండింది. ట్రాఫిక్ జామయిందని ప్రత్యేకంగా చెప్పడం వ్యర్ధోక్తి .

ఇంటి పొద్దున భారీ వినాయకుని విగ్రహం ట్రక్కునుంచి దించడానికి మా బస్తీజనాలు కలిసికట్టుగా, ఉల్లాసంగా పనిచేయడం చూసాకా మన పెద్దవాళ్ళు పండగలెందుకు ఏర్పాటు చేసి ఉంటారో అర్ధమై, వాళ్ళ దార్శనికతకి జోహారన్నా. రోజూవారీ ఉదరపోషణకోసం చేసే కసరత్తులతో విసిగి వేసారి పోయే జనాలలో పేరుకుపోయిన వత్తిడిని తొలగించి ఉత్సాహం నింపడానికి, కలిసికట్టుగా ఉండగలగడానికీ అడపాదడపా పెట్టిన (వచ్చే) పండగలు బలే ఉపయోగ పడతాయి. అలాంటి పండగల్లో వినాయక చవితికి తెలుగునాట ప్రత్యేకత ఉంది. ఎవరింట్లోవాళ్ళు చేసుకోవడమేకాక, సామూహికంగా కూడా జరుపుకునే పండగ. తొమ్మిది రోజులు గణపతిని కొలువుంచి అనంతచతుర్ధినాడు నిమజ్జనం చేస్తారు. మహారాష్ట్రలో కూడా ఈపండగ చాలా ఘనంగా జేస్తారు. రకరకాల నేపధ్యాలలో గణపతిని కొలువుంచి పోటాపోటీగా పందిర్లు అలంకరించి, ప్రజలకి కనువిందు చేస్తారు. ఉదా. కార్గిల్ యుద్ధంరోజుల్లో కొండలెగబ్రాకుతున్న మన సైనికుల ప్రతిమలు, మధ్య మధ్య కాల్పుల ధ్వనులతో గణపతి పందిరిని చాలాచోట్ల పెట్టారు. ప్రతి వత్సరం రకరకాల సన్నివేశాల నేపధ్యాలతో అలంకరించడం, వాటిలో ఉత్తమమైన వాటికి బహుమతులివ్వడం ఆచారంగా వస్తోంది. అక్కడ మేమున్న పదేళ్ళూ వినాయక చవితి సంబరాలు బాగా ఆస్వాదించాం. మన రాష్ట్రంలో లేని లోటు తెలియలేదు. అక్కడ మాకాలనీలో జరిగిన ఉత్సవాల్లో మా పిల్లలుకూడా ఫేన్సీ డ్రెస్స్ వేసారు. మాఅమ్మాయి పార్వతి వేషం, మాఅబ్బాయి వినాయకుడి వేషం వేసారు.అప్పుడు తీసిన ఛాయాచిత్రం.


నిన్న పాతఫోటోలు, కాయితాలు సర్దుతోంటే ఈఫోటో బయటపడ్డంతో ఆరోజులు ఒక్కసారి గుర్తుకొచ్చాయి. దానికి మాస్కు, త్రిశూలం వగైరాలన్నీ మేమే తయారుచేసాం. వాళ్ళని తయారు చేయడం ఒక ఎత్తైతే, వాళ్ళు సభలోకి వెళ్ళి నలుగురిముందూ నిల్చోవడం మరో ఎత్తు. అంతకు ముందు కృష్ణుడి వేషం వేస్తే మాఅబ్బాయైతే వేదికపైకి పోనేలేదు.
వినాయక చవితి చిన్నపిల్లల పండగ. అసలు ఏపండగైనా అంతేననుకోండి. దీపావళికి బాణాసంచా కాల్చాలి, అంటే డబ్బులుకాల్చాలి. దసరా కి నాల్గిళ్ళు తిరిగితేకానీ పప్పు బెల్లాలు రావు- ఇప్పుడైతే 'దసరా' అంటే ఓరెండు రోజుల సెలవు మాత్రమే. దానిలోని 'సరదా' ఎప్పుడో ఆవిరైపోయింది. కాని వినాయక చవితి అస్సలు ఖర్చులేకుండా ఘనంగా జరుపుకోవచ్చు. మనం పెట్టే పెట్టుబడి పూలు,పత్రి . ఇవైనా కేవలం పిచ్చిగా పెరిగే ఉమ్మెత్త, జిల్లేడు లాంటి మొక్కల ఆకులూ, పూవులూ మాత్రమే. దీనిలోని సూక్ష్మం ఏమిటంటే , పత్రి ,పూవుల కోసం తిరగడం ద్వారా పిల్లలు తమ పరిసరాల్లో పెరిగే మొక్కల గురించి తెలుసుకోగలరు. అంతేకాక, ఆయన పూజకి ఉపయోగించే పూలకీ, ఆకులకీ ఔషధ గుణాలున్నాయి. అంటే, పిల్లలకి వైద్యానికి పనికొచ్చే ప్రకృతి వనరుల పట్ల అవగాహన పెరుగుతుంది. అదీ, సామూహిక ప్రయత్నం ద్వారా - స్నేహితులు కలిసి చేస్తారు కాబట్టి. పత్రి ,పూలకోసం కలిసి వెళ్ళి పోటీగా సేకరించే వాళ్ళం. నైవేద్యానికి మామూలు ఉండ్రాళ్ళు చాలు, చక్కెర పంగలీ, నేతి మిఠాయిలక్కర్లేదు. గడ్డి కోసుకుని బతికేవాళ్లూ, గడ్డి తిని కులికే వాళ్ళూ కూడా దిగులు పడకుండా తనని పూజించు కోనిచ్చే సిసలైన సోషలిష్టు దేవుడీ వినాయకుడు. బంగారు విగ్రహం పెట్టి పూజించే వాళ్లనీ, మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన వాళ్ళనీ ఏకరీతిని బ్రోచే ఏకదంతుడీయన.
పోటీగా పెద్ద, పెద్ద విగ్రహాలు పెట్టి తమ భక్తిని జైంటు సైజులో ప్రకటించుకునే బడానాయకుల భక్తి ని నిస్సహాయంగా చూస్తూండిపోయిన వినాయకుడీయనే. జనాలు కాస్త కనికరిస్తే తొలగగలగీ, ప్రతీ ఏటా తనని నీటిలో ముంచడానికి వస్తున్న విఘ్నాలని చూస్తూ ఉండిపోయిన విఘ్నహరుడూ ఈయనే. ప్రమాదకర రంగులూ, హంగులతో, ప్లాస్టరాఫ్ పారిస్ తో చేసిన బొమ్మలు పెట్టి పూజించే వాళ్ళని ఆయన శిక్షించగలిగితే ఎంతబాగుండునో? చెప్పొచ్చేదేమిటంటే, ఆధునిక పద్ధతిలో , BPO/VR మాధ్యమంద్వారా, వాణిజ్య ధోరణితో పూజలు చేయడం ద్వారా పండగల పరమార్ధం గాల్లో కలిసిపోవడంతో పాటు, జన, జల కాలుష్యాలు పెరిగిపోతున్నాయి.


నేనేకనక నిజమైన పతివ్రతనైతే...ఇలాఅవు గాక, అలా అవు గాక అని పాతకాలం సినిమా పతివ్రతలాగా ... "నేనే కనక అసలైన తెలుగు బ్లాగర్నైతే, ప్రమాదకర రసాయనవర్ణాలుపయోగించి చేసిన ప్రతిమలుపయోగించేవాళ్ళ బుద్ధిమారిపోయి, మట్టి విగ్రహాలుపయోగింతురు గాక" అని జ(శ)పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.

Monday, August 20, 2007

త్రివిక్రం జీవితం లో పొద్దు

ఈ మాసాంతంలో మన పొద్దు సంపాదకుడు త్రివిక్రం పెళ్ళి . తాళపత్రనమూనాలో ఉన్న పెళ్ళిపత్రిక బాగుంది.

త్రివిక్రముడికి శ్రీదేవి పొందు కలగబోవడం -

 1. సహజం - - విష్ణుమూర్తికి లక్ష్మి దొరికినంత
 2. అపురూపం కోడలు (సరస్వతి), అత్త (లక్ష్మి)ని చేపట్టినంత

వారిద్దరికీ ముందుగానే బ్లాగ్ముఖంగా అందిస్తున్న ఆశీస్సులు, అభినందనలు.Saturday, August 18, 2007

అష్టాదశ బ్లాగు రత్నాలు


This post was published to 'సత్య'శోధన at 5:37:09 PM 8/18/2007
అష్టాదశ బ్లాగు రత్నాలు


ఓ పది బ్లాగుల ను ఎన్నుకోమంటే చాలాకష్టమని ఈపని మొదలెట్టేముందే తెలుసు. వీవెనుడికి కూడా తెలుసుకాబట్టే కేవలం పది మాత్రమే సూచించమని నిర్బంధించలేదు. సహృదయుడు. కానీ ఒక పరిమితి లేక పోతే ఓ 60 – 70 బ్లాగులైనా కనీసం ఎన్నదగినవిగా ఉండచ్చు. అంత పెద్ద జాబితా ఇవ్వడం అసంబద్ధంగా ఉండచ్చు కాబట్టి 18 బ్లాగుల మాత్రం ఇక్కడ ఇస్తున్నాను. మన పురాణాదుల్లో 18 కి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా 18 ఇచ్చా. ఇక్కడ ఇవ్వని బ్లాగుల్లో ముత్యాలున్నా పరిమితికి లోబడి ఇవ్వలేదు. అలాగే ఇక్కడి వరుస క్రమానికి ఏమాత్రం విశిష్టత లేదు.

1. చావా కిరణ్ http://oremuna.com/blog
2. 24ఫ్రేములు, 64కళలు http://www.24fps.co.in
3. ashok's conversations http://askashok.blogspot.com/
4. అంతరంగం http://www.charasala.com/blog
5. అనిల్ చీమలమఱ్ఱి http://aceanil.blogspot.com/
6. అమెరికానుండి ఒక ఉత్తరం ముక్క http://saintpal.awardspace.com
7. ఋ ౠ ఌ ౡ http://andam.blogspot.com/
8. కలగూరగంప http://kalagooragampa.blogspot.com/
9. గుండె చప్పుడు... http://hridayam.wordpress.com
10. చదువరి http://chaduvari.blogspot.com/
11. తెలుగు జోక్స్ (Jokes in Telugu) http://telugu-jokes.blogspot.com/
12. దీప్తి ధార http://deeptidhaara.blogspot.com/
13. పడమటి గోదావరి రాగం. http://nivasindukuri.blogspot.com/
14. మనిషి http://mynoice.blogspot.com/
15. రెండు రెళ్ళు ఆరు http://thotaramudu.blogspot.com/
16.శోధన http://sodhana.blogspot.com/
17. సంగతులూ,సందర్భాలూ…. http://sreekaaram.wordpress.com
18. సాలభంజికలు http://canopusconsulting.com/salabanjhikalu

Tuesday, August 14, 2007

డామిట్ ...నేర్చుకోవడమా? బార్బేరియస్!

నేర్చుకోగలగడం వరం
నేర్చుకోలేకపోవడం శాపం
నేర్చుకోదలుచుకోపోవడం దరిద్రం

మనిషి జీవితం సుఖమయం కావాలంటే నిరంతరం నేర్చుకునే తీరు, ఉద్దేశ్యం ఉండాలని నా అభిప్రాయం. కానీ ఆమధ్య సుఖబోధానంద ప్రవచనాల్లో delearning అన్న మాట విన్నాకా, నేర్చుకోవడం కన్నా, నేర్చుకున్నది వదలగల్గడం ఇంకా ముఖ్యమని, కష్టమని అర్ధమైంది.
తాను నేర్చినదే ఘనమని విర్రవీగి నాలుగో కాలు (కుందేలుది) చూడలేకపోగా, కనీసం ఉందేమోనని అనుమానం కూడా తెచ్చుకోవడానికి ఇష్టపడని వాళ్ళే (మయా సార్థం) ఎక్కువగా కనిపిస్తున్నారు.
నాల్గో లైను....నేర్చినదే చాలు, సర్వమనడం మూర్ఖత్వం

నేర్చుకున్నది ఇతరులకి పంచకపోవడం? మరణం

Thursday, August 09, 2007

ఈమతం సమ్మతమేనా?

ఈవేళ తస్లిమా నజ్రిన్ తన పుస్తకానికి తెలుగు అనువాదం 'చెల్లుకు చెల్లు' ఆవిష్కరణ సభకి హైదరాబాదు ప్రెస్ క్లబ్ కొచ్చింది. ఆసభని ముగ్గురు మజ్లిస్ ఎమ్మెల్యేలు ఓనలభై మంది అనుచరులతో భంగంచేసి, అక్కడివారిపై, తస్లిమా పై దాడి చేసారు. లజ్జ నవలతో సంచలనాన్ని సృష్టించి తన మనుగడకే ముప్పు తెచ్చుకున్న ధీరవనిత తస్లిమా పై దాడి మన రాష్ట్రానికి మచ్చగామిగలడంఖాయం. ఆఎమ్మెల్యేల వీరంగం, దుర్భాషలు, అసహ్య(భ్య) ప్రవర్తన చూసాక వీళ్ళు మనుషులేనా అన్న అనుమానం రాకమానదు. ఈసందర్భంగా ఇన్నయ్యగారు కూడా ఈదాడిలో గాయపడడం బాధకలిగించింది. వాళ్ళమీద చర్య తీసుకుంటాం అని 'రాజ'కీయులు చెప్పారు, అన్ని వర్గాల వారూ చెప్పారు. సంతోషం. రేపటికల్లా ఈవిషయం అందరూ మరవకపోతే ఒట్టు. వింతేమిటంటే పశ్చిమబెంగాల్ కమ్యూనిష్ట్ ప్రభుత్వం ఆవిడ వ్రాసిన 'ద్విఖండిత' (మన టీవీ9 వారు ఈపేరు వ్రాయడానికి కష్టపడి 'ద్విక్ హంది' అని వ్రాసారు:)) ) పుస్తకాన్ని నిషేధించింది. హైదరాబాదులో తస్లిమా పై దాడిని కమ్యూనిష్టులు ఖడించారు. ఇలాంటి ద్వంద్వవైఖరి గురించి శ్రీ నంది వ్రాసిన వ్యాసం, తస్లిమా స్వంత పుటలో చదవండి.


ఆవిడని చంపితే రూ.5 లక్షల బహుమతి ఇచ్చేంతగా ముస్లింల పట్ల ఆమె చేసిన ద్రోహమేమిటో?
'If any religion allows the persecution of the people of different faiths, if any religion keeps women in slavery, if any religion keeps people in ignorance, then I can't accept that religion'

అని చెప్పడమా?
"Nature says women are human beings, men have made religions to deny it. Nature says women are human beings, men cry out NO"
అని వ్రాయడం వల్లా?

"I don't believe in God, ... The religion mongers segregate women from the human race, I too am divided, I too am defrauded of my human rights..."
అని నిరసించడమా?

మతంకన్నా మానవత్వం గొప్పదని నమ్మడం నేరమైపోయిందా ఈకాలంలో.

సాటి మనిషి అభిప్రాయాలని గౌరవించలేని జనాల అభి'మతం నాకు సమ్మ(న్మ)తం కాదు. మరి మీకో'

Monday, July 30, 2007

ఏనుగులు ప్రేమించుకున్నా, దెబ్బలాడుకున్నా.....

Monday, July 30, 2007

గుండెచప్పుడు లో వచ్చిన టపా ఈ మారణా హోమానికి స్క్రిప్ట్ రాసిందెవరు? చూడండి. ఏదో గూడుపుఠానీ వ్యవహారంలాగే ఉంది. ఈవ్యవహారంలో ''ఈనాడు'' యాజమాన్యానికి లింకు కాకతాళీయంలా లేదు. ప్రజల శ్రేయస్సుకోరి, నిజాలను (అంటే కొండొకచో వాళ్ళ స్వంత అభిప్రాయాలన్న మాట) నిర్భయంగా బయటపెట్టే ఈప్రచార సంస్థవారి న్యూస్ ఛానెల్ ఈటీవీ2 లో ముదిగొండ కాల్పులపై చర్చ ప్రతిధ్వని కార్యక్రమంలో కాసేపు చూసా. కాంగ్రేసు కామన్ శత్రువు కాబట్టి వారి ప్రతినిధి గొంతు, వాదన పెద్దగా వినిపించకుండా మోడరేటర్ తగుజాగ్రత్త తీసుకున్నారనిపించింది. ఒకాయన వాదం ఇలా సాగింది- ప్రజలు రాళ్ళు రువ్వారే అనుకోండి అంటూ పోలీసులమీద రాళ్ళురువ్వడం ఒక కల్పన అన్నట్లు మొదలెట్టాడు. తర్వాత 'అది నిజమే అనుకోండి, ఎందుకంటే మనం ఇక్కడ (వీడియో క్లిప్పింగ్) చూస్తున్నాం కదా' అని కొనసాగించాడు. తర్వాత అందరూ పోలీసుల రాక్షసత్వాన్ని దుయ్యబట్టారు. కాంగ్రేస్ వాళ్ళ పాలన దుష్టపాలన అని దుయ్యబట్టారని, ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని కోరారని వేరే చెప్పక్కర్లేదనుకొంటా.

ఏనుగులు ప్రేమించుకున్నా, దెబ్బలాడుకున్నా నలిగేది గడ్డిపరకలే. ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ఉద్యమాలు నడిపినా, నేలకొరిగేది సామాన్య జనాలే. చావా గారి స్మృతులు చూడండి.Posted by సత్యసాయి కొవ్వలి at Monday, July 30, 2007

Labels: మనుషులు, లోకంతీరు

Rate this:Avg:4.7/5 (3 votes)discover more!
tags

2 comments:
oremuna said...
ఈటీవీ అక్కడ ఉండటము అంత కాకతాళీయము కాదు
ఉదయం నుండి పరిస్తితి ఉద్రిక్తంగా ఉన్నది
అసలే ఆ మండలము ఎర్ర ఝండాలకు పట్టు ఉన్నది
ఇంతకుముందు కూడా చెదురు మదరు సంఘటనలు చాలా జరిగినాయి
మన ఘనత వహించిన తొమ్మిదివారికి పల్లెల్లో ఎంత నెట్వర్కు ఉన్నదో బహిరంగ రహస్యమే కదా
వార్తా విలేకరి కూడా ఉన్నాడు, చెట్టు వెనక ఉండి కాల్పుల నుండి తప్పించుకున్నట్టు అదే పత్రికలో వచ్చినది (ఎందుకు ఉన్నారని అడగలేదు కదా?)
రామోజీ అలా చేస్తున్నాడని మనము కూడా చిలువలు వలువలు చెయ్యకూడదు కదా
కొద్దిగా వృత్తము బయటకు వచ్చి ఆలోచిద్దాం

నేను ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను :(

7/31/2007 3:55 AM
సత్యసాయి కొవ్వలి said...
మీరు చెప్పినది సబబుగా ఉంది. నేను వ్రాసినది మన నాయకుల చిత్తవృత్తిని గురించి. వారికి చనిపోయిన వారి మీద సానుభూతి లేదు. ప్రభుత్వం పడిపోవడానికి ఈసంఘటన ఎలా ఉపయోగిస్తుందా అన్న ఆలోచనే.

Thursday, July 26, 2007

నేనే పొరబడ్డానా?

పాపని పాతిపెట్టడం = మనుషులుగా చావడం టపాలో అదే అబ్బాయైతే అలా చేసేవారా అని వ్రాసా. ఆతర్వాత ఓనమాలు టపాలో అదే వాదనని బలపరుస్తూ ఒక వ్యాఖ్య వ్రాసా. తర్వాత కొన్ని రోజుల పాటు చిన్ని పాపల్ని, బాబుల్ని చెత్తకుండీలలో పాడేసిన కథనాలు వరుసగా పేపర్లలో వచ్చాయి. ఈ అకృత్యాలకి లింగ, మత భేదాలు లేవని చాటిచెప్పాయి. ముంబాయి లో లోఖండ్వాలా కాంప్లెక్స్ (కాందివిలీలో) అయితే రెండురోజుల చిన్ని బాబు 26 కత్తిపోట్లతో దొరికాడట. హతవిధీ! చిన్నారుల మీద ఇన్ని అకృత్యాలు చేయడానికి చేతులెలా వస్తున్నాయో. మనదృష్టికి రాని ఘోరాలెన్నో.

ఆడశిశువుల మీదే అకృత్యాలు జరుగుతున్నవన్న విషయంలో నేను పొరబడ్డా.
కానీ మనుషులుగా చచ్చిపోయామన్న విషయంలో మాత్రం కాదు.

Thursday, July 05, 2007

పాపని పాతిపెట్టడం = మనుషులుగా చావడం

మహబూబ్ నగర్ జిల్లాలో అప్పుడే పుట్టిన ఒక పాపని సజీవంగా పాతిపెట్టారట - ఈవేళ ఈ వార్త విని, చదివి, చూసే ఉంటారు. మనం ఇలా ఎందుకు దిగజారిపోతున్నాం? వార్తాకథనంలో, ఈ జిల్లాలో ఇలాంటి సంఘటనలు ఇదివరలో కూడా జరిగాయని, కాని ప్రస్తుతపు పాప బతికి ఉండడంవల్ల ఈసంఘటనకి ప్రాముఖ్యత వచ్చిందని అర్ధమైంది. దీనికి బాధ్యులైన ఒక వ్యక్తి పేదరికం, అధికసంతానం వల్ల ఈపని చేసినట్లు తెలిపాడు. అదే మగపిల్లాడైతే ఇలా చేసేవారు కాదేమో. కేతికంగా ఎంతో అభివృద్ధిని సాధించిన మనం ఇంత చిన్న సమస్యని అధిగమించలేమా? అవాంఛితగర్భాలని నిరోధించడానికి అనేకమార్గాలున్నాయి. కాని, అని పాటించడానికి మతం అడ్డొస్తుంది. పసికందుపట్ల ఇంత ఘోరం చేయడానికి మతం అడ్డురాదా? ఎవరు చేసినా, ఏకారణంగా చేసినా మనం మనుషులం అని చెప్పుకోవడానికి సిగ్గు పడాల్సిన అమానుషమైన సంఘటన.

Monday, June 25, 2007

మనుషులూ - మతాలూ

ఈమధ్య ఇన్నయ్యగారి ఒక టపాలో తాను అనువదించిన వివేకానందుడికి వ్యతిరేకంగా వ్రాయబడిన పుస్తకంగురించి ప్రస్తావించారు. ఆసందర్భంలో మన్యవగారు, నేను వ్రాసిన వ్యాఖ్యలు, దానికి వచ్చిన సమాధానం ఈక్రింది విధంగా ఉన్నాయి.


 • సత్యసాయి కొవ్వలి said...
  హేతువాదం అంటే హిందూ వ్యతిరేకతా అనిపిస్తుంది. ఏవివేకానందనో, పరమహంసనో విమర్శించడం లాంటివల్ల జనాలకి ఏంప్రయోజనం. అంతకన్నా ప్రజలకి పనికివచ్చే రచనలు చేయచ్చుగా. ప్రజలని ఎడ్యుకేట్ చేయడానికి అధికశాతం అభిమానించే వాళ్ళ ఐకన్స్ ని చెడ్డవాళ్ళని ప్రూవ్ చేయక్కర్లేదేమో. నమ్మేవాళ్ళని రెచ్చగొట్టడం, వాళ్ళు రెచ్చితే చాందసు లనడం - అంత అవసరంకాదేమో. ఉన్న సమస్యలు చాలవా?
  June 16, 2007 8:58 PM
  మన్యవ said...
  అదీ నిజమే!!...ఇట్లాగే జన విజ్ఞాన వేదిక వాళ్ళు దేవుడు దేవుడు లేడు అని దండోరా వేస్తుంటారు. మరి వాళ్ళకి పాత బస్తీకి వెళ్ళి "అల్లా లేడు " అనే ధైర్యం ఉందో లేదో!!
  June 18, 2007 12:45 AM
  cbrao said...
  సత్యశాయి,మన్యవ -‘నేనెందుకు ముస్లిం ను కాను? ‘‘Why I am not a Muslim?’అని ఇబ్బన్ వారక్ రాసిన ఆంగ్ల రచనకు, తెలుగు అనువాదం,మదర్ థెరిసా పై నిశిత పరిశీలన, శాస్త్రీయ దృక్పధం అంటే ఏమిటి? అనే A.B.Shaw రచనకు తెలుగు అకాడమీ ద్వారా ప్రచురించిన, ఇన్నయ్య గారి తెలుగు సేత, తస్లిమా నస్రీన్ పై సమర్ధిస్తూ చేసిన రచనలు మీ సందేహాలకు, అనుమానాలకు తావులేకుండా చేస్తాయి.అన్ని మతాలను శాస్త్రీయ దృక్పధం తో పరిశీలించటం హేతువాద దృష్టి.కనుక కెవలం హిందూ మతాన్ని విమర్శిస్తున్నారనే ధొరణి సరైనది కాదని గ్రహించగలరు.


ఈసందర్భంగా స్పష్ఠం చేయాల్సినదేమిటంటే, నా వ్యాఖ్య ఇన్నయ్యగారి మీదకాని, నిక్కమైన హేతువాదుల మీద కాని కాదు. కానీ, ఏకపక్షంగా వాదించే వారిగురించి మాత్రమే.


ఇటీవలి ముంబై బాంబుపేలుళ్ళతర్వాత 'Economic and Political Weekly' లో కొన్ని వ్యాసాలొచ్చాయి. వాటిలో ముస్లింలు వ్యతిరేకతకి, వివక్షకి గురౌతున్నారని, పోలీసులు కూడా వివక్ష చూపిస్తున్నారని వ్రాసారు. ఆవ్యాసాలలోని తర్కంలో లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆవ్యాసాలపై వ్యాఖ్యాత్మక వ్యాసపు ముఖ్యవాదం (summary?)I have been searching, in vain, for at least a single tiny drop of tear for the hapless human beings killed or injured in the Mumbai blasts in all the pro-Muslim write-ups that came after that incident. Not even a single word of sympathy can be found therein and worse still, the incident was even taken as a legitimate outcome of Muslim frustration. Are we dead as human beings and living only as Hindus or Muslims and pro-this and anti-that? If these writings are championing the Muslim rights, what about the human rights of the victims and millions of those who are living with fear psychosis? With every incident of terror, the life of an average citizen, who is remotely connected with all these things, is becoming increasingly and irrevocably tension-ridden and difficult. It is very unfortunate that we take a stand in favour of any particular religion or community and ignore that human beings are living on both sides. It is high time we stop taking this type of unreasonable positions and uphold the human spirit, instead. Human beings were the first to come and then only came the religion. This clearly tells us what should be our priority. In this article, I discuss what should be our perspective in dealing with Muslim alienation problemవివరంగా చదవాలంటే ఇక్కడ నుండి దిగుమతి చేసుకోండి.ఎదుటి వ్యక్తిలో ఒక ప్రాంతంవాడినో, ఒక మతంవాడినో, ఒక కులంవాడినో, ఒక ఇజానికి చెందినవాడినో, పురుషుడినో, స్త్రీనో తప్పించి ఒక మనిషిని ఎందుకు చూడలేకపోతున్నాం?

Sunday, June 17, 2007

ఇలా అయితే బ్లాగడం కష్టం...

చావా కిరణ్ తన ఇటీవలి వుయ్ వాంట్ బ్లాగ్ హాలిడే ఫ్రం యువర్ బ్లాగ్ :) లో కూడలి బ్లాగువ్రాసే సమయాన్ని మింగేస్తోందని తెలుగులో తెగ బాధ పడిపోయాడు. అయ్యలారా! నాసమస్యలు, దీంతోపాటు, ఇంకా ఉన్నాయి.
రాద్దామని వచ్చి జస్ట్ ఫర్ ఫైవ్ మినిట్స్ అని కూడలి చదవడం మొదలెడతానా? అలా, అలా సెకన్లు, నిమిషాలు, గంటలు, జాములు... గడిచిపోతాయి. ఆనక కర్తవ్యం గుర్తొచ్చి వ్రాయడం మొదలెడ్తా. అప్పుడు సినిమాలోలాగా నాలోంచి ఒక సత్యసాయొస్తాడు. తెలుగు సినిమా పరిజ్ఞానం ఉందికాబట్టి ఎవరు నువ్వు అని అడగి టైం వేస్టు చేయకుండా, వాడికి హుహుహా ....అని వికటాట్టహాసాలు చేసే ఛాన్సివ్వకుండా - కం టు ది పాయింటనేస్తా. అసలు వాడి పాయింటేమిటో తెలియకపోతే కదా! అయినా అంతరాత్మ ముఖతః ప్రబోధం అన్నారు కదా అని వింటా. వాడు, వాడి డ్యూటీ ప్రకారం, ఇప్పటికే చాలా టైం వేస్టుచేసేసావు, రోజూ ఇదేతంతు. ఇలాఅయితే ఎలా అని గదమాయిస్తాడు. చేయాల్సిన పనులు అలా వెనక బడిపోతోంటే, పన్లు లూజింగు టైం లూజ్ ప్రయారిటీ అని సర్దేసుకుని, అయినా కలికాలం కాకపోతే, ఈఅంతరాత్మలు సినిమాలలోంచి నిజజీవితాలలోకి వచ్చి ఇలా ఇబ్బంది పెట్టడం ఏమిటని కాస్త బాధపడి, అలాగే ఇంకాపేస్తాలే అంటూనే బ్లాగు వ్రాయడం కంటిన్యూ చేస్తా. వ్యసనం అలాంటిది మరి.

అలా వ్రాసి పబ్లిష్ చేసి, ఒకటికి రెండుసార్లు వీపు చరుచుకుంటూ చదువుకుని, తర్వాతి ఐదు నిమిషాల్లో కూడలిలో కనిపిస్తోందో లేదోనని పదిసార్లు, ఆతర్వాతి ఇరవై నిమిషాల్లో ఎవరైనా వ్యాఖ్యలు రాసారేమో చూద్దామని ముప్పైసార్లు బ్లాగ్జంక్షన్ చుట్టూ చక్కర్లు కొడుతూంటే ఓ గంట గడిచిపోతుంది. ఇలా అయితే అంతరాత్మ క్షోభపడకుండా ఎలా ఉంటుంది?

ఇంత కష్టపడి వ్రాసి కూడలిలో పెట్టేసరికి ఎక్కడినుండి వస్తాయో టపాలు టపటపా వచ్చేస్తున్నాయి, నాటపాని కిందకెక్కడికో పాతాళానికి తొక్కేస్తూ. ఒక్కోసారి, ఒకేరోజులో పేజీలోంచే గల్లంతయ్యే అవకాశం కూడా ఉంది. వీవెన్ జాలిపడి 75 టపాలు చూపెట్టబట్టి గుడ్డిలో మెల్లగా ఉంది పరిస్థితి.

ఇంకో సమస్యేమిటంటే, ఒక విషయం మీద వ్రాద్దామని కూర్చుంటా కదా, కూడలిలో టపాలు చదివే సరికి ఎవరో వ్రాసిన టపా నచ్చడమో, నచ్చక పోవడమో జరుగుతుంది. అక్కడితో వ్రాద్దామనుకున్న విషయం మరుగున పడి ఏదో కొత్త విషయంమీద టపా తయారవుతుంది. పైన ఉటంకించిన కిరణ్ టపా చదివి అనుకున్న విషయం పక్కన పెట్టి ప్రస్తుతటపా మొదలెట్టా. ఆనక లలితగారి టపా చదివాక, ఈటపాని డ్రాఫ్టులో పెట్టి, వేరే టపా వ్రాసా. ఇలాంటి సందర్భాల్లో కూడలి జాం అవడం కూడా మనమంచికేనని గ్రహించి, అది జాం అయితే బాగుండునని విఘ్నేశ్వరుడిని ప్రార్ధించి టపాలు వ్రాస్తూంటా. బాధే సౌఖ్యమని భావన రానివ్వడమంటే ఇదేనేమో!

ఇదివరకు వ్రాసేవాళ్ళు తక్కువగా ఉండడంతో మనబ్లాగులుచదివే వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. నాలాంటి ఆముదపు వృక్షాలకి కూడా కాస్త పాఠకులుండేవాళ్ళు. ఇప్పుడు బ్లాగర్లెక్కువయిపోవడమూ, లబ్ధప్రతిష్ఠులూ, హేమాహేమీలూ బ్లాగర్లయిపోవడమూతో తలసరి చదువరుల సంఖ్య తగ్గి పోయింది.

ఇలా చెప్పుకుంటూ పోతే బ్లాగేవాళ్ళకి ఎన్నో సమస్యలు. వీటికి ఒక పరిష్కారం- రేషనింగు. ఇంకేమైనా తడితే చెప్పండి. బ్లాగేజనా రేషనోభవన్తు.

Saturday, June 16, 2007

తనువిచ్చు తండ్రికిదె తొలి వందనం

లలిత గారి 'ఓనమాల' స్పూర్తిగా ఈ టపా. ఆవిడలాగా కవిత్వం చెప్పడంలో ఒరిజినాలిటీ లేదుకాబట్టి, శృతిలయలు సినిమాలో చివరి పాటకి ముందు పాడే ఒక చిన్న పద్యంతో నా జీవితానికి శృతి,లయలను సమకూర్చిన నా తల్లిదండ్రులకు నా వందనం తెల్పుకొంటున్నా.

వింటూ చదవాలంటే ఇక్కడ నొక్కండి.

తనదు వరసత్వమును
వారసత్వముగనిడి
తనువిచ్చు తండ్రికిదె తొలి వందనం

మమతానురాగాల కల్పతరువై
మంచిచెడు నేర్పించు మొదటి గురువై
ముక్కోటి వేల్పులను ఒక్క రూపున జూపు
మాతృపద పద్మములకిదె వందనం


సినిమాలో ఈపాట వచ్చే ఘట్టం చాలా రసవత్తరమైనది. విడిపోయిన చాలాకాలానికి రాజశేఖర్, సుమలతలు కలుసుకొన్న సందర్భం. ఈ సీను చూసిన ప్రతీ సారీ ఒక రకమైన ఉద్వేకం కలుగుతుంది. ఈసినిమా హీరో నాకు చాలా నచ్చింది. హీరోగా సుమలతని కాక ఇంకెవరిని పెట్టినా అంతబాగోదేమో అనిపించేంత బాగ నప్పింది. అసలు ఈ సినిమానే ఎన్నిసార్లు చూసానో తెలియదు. డౌన్లోడు చేసుకొని తెగచూసా. ఎన్నిసార్లు చూసినా నాకు చాలా మంచి అనుభూతిని కలుగచేస్తూనే ఉంది- శ్రీనివాసు ఓవరేక్షను ఎంత చిరాకు తెప్పించినా కూడా. అందులో ఒకచోట ఆమహానుభావులను వెలుగులోకి తీసుకొద్దామన్న వంకాయల ప్రతిపాదనని సత్యనారాయణ తిరస్కరిస్తూ సత్యనారాయణ వాళ్లని మనం వెలుగులోకి తిసుకురావడమేమిటని ఘాటుగా ప్రశ్నించడం నాకు చాలానచ్చింది. మనచుట్టూ వంకాయల లాంటి అజ్ఞానులు, పాంచాలమ్మ లాంటి కళా వ్యాపారులు చాలామందే కనిపిస్తారు.

సినిమా చివరలో....

త్రివర్గ ఫలదాసర్వే దాన యజ్ఞ జపాదయా
ఏకం సంగీతవిజ్ఞానం చతుర్వర్గ ఫలప్రదమ్


ఇదే శృతిలయల సారాంశం

అని వస్తుంది. దయచేసి ఎవరైనా (బాసు గారు వింటున్నారా)దీని అర్ధం వ్రాయండి.

Friday, June 15, 2007

యాహూ మెసెంజర్లో తెలుగు ఆడిబుల్స్

యాహూ మెసెంజరులో చాటింగు చేసే వాళ్ళకి ఆడిబుల్స్ గురించి చెప్పక్కర్లేదు. ఇవి కొన్నైతే చాలా సరదాగా ఉంటాయి. ఈమధ్య కొన్ని భారతీయ భాషల్లో కూడా వచ్చాయి. కానీ తెలుగులో ఇంకా రాలేదు. మన పొరుగు వాడు తమిళ్ వాళ్ళవి కూడా వచ్చాయి. ఎవరైనా నడుం బిగించి దీనికి పూనుకొంటే బాగుంటుంది. పూనుకోమని భావము.

నేను ప్రతిపాదిస్తున్న కొన్ని మెస్సేజ్ లు -


ఏమండీ కుశలమా?
ఏం మాస్టారూ బాగున్నారా?
ప్రియతమా పరాకా? నేనంటే చిరాకా?
ఛీ .. పోదురూ?
నీకంత సీనులేదులే
నే తొడ కొడితే నువ్వు ఆన్లైన్లోకొచ్చేస్తావు, జాగ్రత్త (బాలకృష్ణ తరహాలో)
అర్ధం చేసుకోరూ
ఎంద చేట
అమ్మతోడు. నేను నిజంగా ఆఫ్ లైన్లో ఉన్నా
తమ్ముడూ .. తమ్ముడూ ..ఈ తికమక దిగులే ప్రేమంటే
మౌనమేలనోయీ....
మనసు నిలుపుకోలేక ఎదో ఎదో అడిగాను... అంతే ... అంతే.. అంతే... కుశలమా...
వల్లభా.... ప్రియ వల్లభా...
వద్దు బావా తప్పు
ఏదో శాస్త్రం చెప్పినట్లుంది
తాంబూలాలిచ్చేసా తన్నుకు చావు
ఓ ... డేమిట్ .. కథ అడ్డం తిరిగింది...
పాలు గారు బుగ్గల పైనా... పాపాయికిఒకటి.. తేనెలూరు పెదవులపైన దేవిగారికొకటి...
అంతేనా ... మనసింతేనా...
ఏంటి చెప్పేది... కేబేజీ ...
తొక్కలో మెస్సేజి ఇంత సేపు టైపుచేయాలా?
మావా.. నే మునుపటి వలెనే లేనా?
గుండె గొంతులోన కొట్టడుతాది.. కూర్చుండనీదే కూసింత సేపు..
అలా అయితే ఓకే !
ఏంటీ గొంతులేస్తాంది?
సుత్తి ఆపవయ్యా,మహాప్రభో
ఏందిరా మావా నీ సుత్తి
రాసాను ప్రేమలేఖలెన్నో

నాకైతే ఇప్పటికివి చాలు ...

Wednesday, May 30, 2007

పుచ్చి ఇచ్చుకోండి!

ఈ టైటిల్ ఎలా ఉంది? బాగా కుదరలేదు అని అనిపిస్తోందా? అదే నేను చెప్పబోయేది. 'ఇచ్చిపుచ్చుకోండి' అంటే ఉన్న సొగసు 'పుచ్చి ఇచ్చుకోండి' అనడంలో లేదు. అవ్వడానికి రెండూ ఒకే నిర్మాణం కలిగి ఉన్నాయి. పదమే కాక దాని అర్ధంలో కూడా, పుచ్చుకోవడం కన్నా ముందు ఇవ్వడమే సొగసైన, సబబైన పని అని అవగతం అవుతుంది. ఉదాహరణకు, అప్పే తీసుకోండి. మనం ఎవరికీ అప్పు ఇవ్వకుండా వెళ్ళి వసూలు చేయగలమా? కొండొకచో ఇచ్చిన అప్పు చచ్చినా వసూలుచేయలేకపోవడం జరుగుతుంది. మర్యాదైనా, ప్రేమైనా, మరేదైనా సరే, ఇదే సూత్రం. తిట్లూ, విమర్శలూ, లెంపకాయల్లాంటివైతే ఈసూత్రాన్ని అతిగా పాటిస్తాయి. ఇవి ఇచ్చిచూడండి, చక్రవడ్డితో సహా వెనక్కొస్తాయి. మనం ఇవ్వకపోయినా మనకి దొరుకుతున్నాయి ఈరోజుల్లో. అలాంటిది, ఇస్తే తప్పించుకోగలమా?

'తాతకి పోసిన బోలె తరతరాలా' అన్న సామెత కూడా ఈభావననే సూచిస్తుంది. మనం మన తాతకి చేసిన మర్యాద, మన మనవడు మనకి చేస్తాడని సామెతకి అర్ధం. ఇది inter-generation plane లో పనిచేసే give and take సూత్రం. గమనించండి, ఇంగ్లీషువాడు కూడా ముందు గివ్వమనే అన్నాడు. టేకండ్ గివ్వనలేదు.

ఇవ్వడం పొందడంకన్నా ఆనందమిస్తుందన్న విషయాన్ని మీద యండమూరి హోం పేజీలో సంకల్పం అనే కథ చాలా హృద్యంగా చెప్తుంది. ఈకథలో ఒక పాప (అమూల్య) వాళ్ళ స్కూలులో టీచరు 'తీసుకోవడం కన్నా ఇవ్వడంలో ఆనందం ఉంది' అని చెప్పిన విషయం మనసుకు పట్టించుకుని డబ్బులు దాచి అవసరమున్న వేరే వాళ్ళకి ఏదైనా కొనిస్తోంటుంది. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు టీచరు చెప్పింది పూర్తిగా అర్ధచేసుకుంటుంది. ఇంతలో అమూల్య అన్నయ్యకి మెదడులో కంతి వస్తుంది. నిస్సహాయ పరిస్థితుల్లో వా ళ్ళ నాన్న, 'ఆ లోక జన రక్షకుడి సంకల్పమే వీడ్ని రక్షించగలద'ని అంటాడు. అదివిని తను దాచుకున్న చిల్లర డబ్బులు తీసుకుని 12 రూపాయలకి సంకల్పం కొందామని రకరకాల షాపులు తిరిగి చివరికి ఒకచోట ప్రముఖన్యూరోసర్జన్ దృష్టిలో పడుతుంది. ఆయన అమూల్య అన్నయ్యకి వైద్యం చేసి, ఆమె 12 రూపాయలివ్వబోతే వద్దని, ఇవ్వడంలోని ఆనందాన్ని గ్రహించానని చెప్తాడు. (ఇది మూలకథకి నికృష్ఠ, నీరస సంగ్రహకథనమని గ్రహించగలరు).

మన పూర్వీకులకి ఇవ్వడంలోని ఆనందం తెలుసు అనుకొంటా. దానాలు, ధర్మాలు అని అందుకే పెట్టినట్లున్నారు. మామూలుగా అయితే చెయ్యరని పాపం, పుణ్యం, స్వర్గం, నరకం అని 'రంభా- సలసల కాగే నూనె' పథకాన్ని(ఇంగ్లీషు వాడి కేరెట్టూ-కర్రా పద్ధతి) ప్రవేశపెట్టారు. పైగా తీసుకునే వాడి చెయ్యెప్పుడూ కిందే ఉంటుంది (ఒక్ఖ ముక్కుపొడుం విషయంలో తప్ప) అని తీసుకోవడంలో మర్యాద తక్కువని సూచించారు.

మాచిన్నప్పుడు రోజూ పొద్దున్నా, సాయంత్రం భోజనాల వేళ దాటాకా ఇళ్ళకి బిచ్చగాళ్ళు వస్తోండేవారు. తినగా మిగిలిన పదార్ధాలు తిసుకెళ్తోండెవారు. పనిమనిషులకి కూడా మిగిలిన అన్నం కూరలు ఇస్తోండే వారు. ఫ్రిడ్జులొచ్చాకా జనాలు మురగబెట్టుకుని తింటున్నారే తప్ప, ఎవరికీ పెట్టలేకపోతున్నారు. పెట్టడానికి చేతులు రావట్లేదు. అటు బిచ్చగాళ్ళు, పనిమనుషులు కూడా అన్నాలు తీసుకెళ్ళడానికి సుముఖత చూపడంలేదు. అందుకు ఒక కారణం ఎప్పుడో ఒక బిచ్చగాడో, పనిమనిషో చెప్పారట, ఫ్రిడ్జుల్లో ఒకటి రెండు రోజులు పెట్టి తర్వాత ఇస్తోంటే తొందరగా పాడయిపోతున్నాయి, తినలేకపోతున్నాం అని. అదీ కాక పాతకాలంలో తిండితప్ప వేరే అవసరాలు తక్కువ. ఇప్పుడు, వేరే అవసరాలు ఊరిస్తున్నాయి. ఇప్పుడు చిల్లర కోసం ఎక్కువ అడుక్కొంటున్నారు. అన్నట్లు అడుక్కోవడం అంటే గుర్తొచ్చింది, ఆమధ్య ఒకావిడ అడుక్కోగా వచ్చిన డబ్బులతో అదేదో ఊళ్ళో గుడిలో కావల్సిన సౌకర్యాలు కల్పించిందట. అసలు మనమే వెళ్ళి ఆవిడ దగ్గర కొంత దానగుణం అడుక్కోవాలి.

ఇవ్వగలగడం, ఇవ్వడం అంత సులభం కాదు. ఎపుడైనా, ఇవ్వాలనిపించింతర్వాత కొంత సేపు ఆగి ఛూసారా? మీరు మొదట రూ.1000 ఇవ్వదలుచుకుంటే, ఇచ్చే సమయానికి, అసలు ఇస్తామో లేదో కూడా డౌటే. అందుకే ఇంద్రుడు మారువేషంలో వచ్చి కర్ణుడిని దానమడిగితే, ఆయన, కూడదని తెలిసినా, ఎడంచేత్తోటే ఇచ్చేసాడట - మళ్ళీ కుడి చేతిలోకి మార్చుకొనే లోపల మనసు మారిపోతుందేమోనని.

ఇచ్చి పుచ్చుకోవడం విషయంలో, చిన్నప్పుడు చదువుకున్న తిక్కన భారతం పద్యం ఒకటి నాకెప్పుడూ గుర్తుకొస్తుంది.

ఒరులేయవియొనరించిన
నరవర! అప్రియము తన మనంబునకగు, తా
నొరులకవి సేయకునికియె
పరాయణము పరమధర్మపథములకెల్లన్


(ద్వానా శాస్త్రి గారు, ఆయన సంకలనం చేసిన, 'మంచి పద్యాలు' (విశాలాంధ్ర 1998 ప్రచురణ) పుస్తకంలో వ్రాసిన వ్యాఖ్యానం: ఇతరులు మనని అవమానిస్తే మనకి కోపం వస్తుంది. కానీ మనం ఇతరుల్ని అవమానిస్తాం. ఇతరులు మనకి అన్యాయం చేస్తే నిందిస్తాం. కానీ మనం మాత్రం ఇతరులకి అన్యాయం చేస్తాం. ఈ పద్ధతి కూడదని తిక్కన మహాభారతంలో చెప్పిన పద్యం ఇది)

ఈ పద్యంలో చెప్పిన నియమాన్ని సాధ్యమైనంత వరకూ పాటించడం వల్ల మన దైనందిన జీవితం సాఫీగా గడిచిపోతుందని నా అనుభవం. కొన్ని సందర్భాల్లో ఈ సూత్రం పనిచెయ్యదు సరి కదా మనం ఉల్టా చేయ్యడానికి సిద్ధపడిపోతాం. ఉదాహరణకి, మేం డిగ్రీలో జేరిన కొత్తలో మా సహాధ్యాయి మంచి చురుకుగా ఉంటూ అందరినీ ఒరేయ్, అరేయ్ అనేసి మాట్లాడుతూండే వాడు, అప్పుడే పరిచయమైన వాళ్ళని కూడా, మేం ఏవండీ అని సంబోధిస్తూన్నప్పటికీ. అప్పుడు మేం టేకండు గివ్వు పద్ధతి అవలంబించాలని అర్ధమైంది. అలాగే మెతగ్గా ఉంటూంటే, చాలామంది నెత్తికెక్కుతోండేవాళ్ళు. అప్పుడు బురద పామైనా బుస్సుమంటూంటేనే దానికి గౌరవం అని విని కొద్దిగా నోరుచేసుకోవడం నేర్చుకున్నాం. అదీ ఆత్మరక్షణకే, దాడికి కాదు.

ఇచ్చిపుచ్చుకోవడం, ఇంకా తిక్కన గారు చెప్పిన పరమధర్మాలనూ కొద్దిగా విశ్లేషిస్తే, మనం ఎదుటివారినించి ఆశించేది మనం పాటించాలన్న నియమం కనిపిస్తుంది. కానీ నిజజీవితంలో ఈ నియమానికి తిలోదకాలు ఇచ్చేవాళ్ళని తరచూ చూస్తాం (మనం కూడా అడపా దడపా చేసే ఉంటాం). వాళ్ళు తామనితామే ప్రత్యేకమైన వాళ్ళుగా భావించుకోవడం వల్ల ఇది జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఎవరైనా క్యూని పాటించకుండా తమని దాటుకెళ్టే తెగ బాధ పడిపోతారు. కానీ వాళ్ళే చెల్లుబడైన చోట ఎంతమందినైనా దాటుకుంటూ వెళ్ళిపోగలరు.

కొన్ని ప్రత్యేక సందర్భాలలో తప్ప, ఇతరత్రా ఇచ్చిపుచ్చుకొనే (తిరిగి పుచ్చుకోలేని సందర్భంలో కూడా ఇవ్వడం) పద్ధతి సరైనదని, ఈ ప్రపంచం మొత్తం గివె అండ్ టేకె (నటురె, పుటురె గుర్తొచ్చిందా?)పద్ధతిమీద నడుస్తుందని, అందరూ ఆ పద్ధతి పాటిస్తే చాలా సమస్యలు రానే రావని నానమ్మకం.

మనం మారడానికి సమయం కావాలి కాని, ఈవ్యాసం శీర్షిక మార్చడానికి అవసరం లేదుగా. కాబట్టి, ఇక పై ఈవ్యాసం పేరు- 'ఇచ్చి పుచ్చుకోండి'.

Tuesday, May 22, 2007

నాది జ్ఞానమే

మన ప్రధానమంత్రి ఎవరో వెంటనే గుర్తుకు రాకపోవడం గురించి నాది జ్ఞానమా? అజ్ఞానమా? అన్న టపా వ్రాసాను. యూపియే ప్రభుత్వం మూడేళ్ళ పాలన ముగిసిన సందర్భంగా నీరజా చౌదరి వ్రాసిన వ్యాసం ఈనాడులో చదివాక నాది జ్ఞానమేనని తేలింది. అందులో ఒకచోట
"....మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఆ వర్గాలు ఏకంగా ఆయన హోదానే మార్చేశాయి. 'ఆయన ఓ మంచి మనిషి. కానీ ఉన్నతుడైన కేబినెట్‌ కార్యదర్శిగా మిగిలిపోతున్నారు' అని అవి అభివర్ణిస్తున్నాయి" అని వ్రాసారు.


ఈభావాన్నే నాబ్లాగులో (వ్యాఖ్యలో) "అసలు సమస్య, ఘనమైన దేశానికి ప్రధాన మంత్రి ఒక ఆఫీసర్ మాదిరి పనిచేయడం. అలవాటు పడిన ప్రాణం మరి. బహుశ: జ్యోతి వానికి కూడా సందేహమొచ్చుంటుంది- అందుకే 'భారత' అని గాని, 'మన' అని గాని ప్రధాన మంత్రి అన్న పదం ముందు తగిలించలేదు." అని వ్రాసా.

ఏతావాతా తేలిందేమిటంటే, పెద్దాయనకి కూడా డౌటేనని (డౌటులేదని). కావాలంటే అదే వ్యాసంలోని ఈ క్రింది వాక్యాలు చూడండి.
"మరోవైపు మన్మోహన్‌.... 'కోటరీ ఆధిపత్యం'పై విమర్శలు చేస్తున్నారు. ఇది ఒకరకమైన నిరాశా నిస్పృహల నుంచి వచ్చిన వ్యక్తీకరణ. 'అధికారం నావద్ద కాదు, ఇతరులు... అంటే మిత్రపక్షాలు, కాంగ్రెస్‌ అధ్యక్షురాలి వద్ద ఉంది' అనే ఒప్పుకోలు ప్రకటన...."

Monday, May 14, 2007

మంచివాడు మాబాబాయీ..

మాబాబయ్య క్రిందటేడు దేవుడి దయవల్ల మృత్యుముఖంలోంచి బయటపడి, రేపు తన 60 వ జన్మదినోత్సవం (షష్ఠి పూర్తి) జరుపుకొంటున్నాడు. ఆ సందర్భంగా నేను తవ్వుకున్న కొన్ని జ్ఞాపకాలివి.
ఒకరు లేక ఇద్దరు స్కీం వల్ల, అమెరికా వలసల వల్ల, ఇంగ్లీషు వాడకం వల్ల బాబాయి, పిన్ని, మామయ్య, అత్త (I mean uncle and aunty) లాంటి పదాలర్ధం కాకపోయే ప్రమాదం ఉంది. నిఘంటువు చూస్తే పద అర్ధం తెలియచ్చు కాని, తత్వం బోధపడదు. ఇవే కాదు, ఇలాంటి బంధుత్వాలన్నీ కేవలం నిఘంటువుల్లోని పదాలుగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఈవ్యాసం వల్ల వేరేవాళ్ళుకూడా uncle, aunty :-)) ల జ్ఞాపకాలు నెమరువేసుకుంటారని ఆశ.

నాకు 5-6 ఏళ్ళ వయస్సున్నప్పుడు మేం ఇరగవరంలో ఉండేవాళ్ళం. మాఊరి పాలేశ్వరస్వామి గుళ్ళో ఏదైనా పండగ పబ్బాలొస్తే గ్రామఫోను రికార్డులు పెట్టేవారు. అప్పట్లో అది పెద్ద క్రేజ్. ఆరోజుల్లో ఈ పాట (మంచివాడు మాబాబాయి- మామాటే వింటాడోయి) తెగ వినిపించేది. అప్పట్లో నాకు తెలిసినంత వరకు బాబాయంటే మా రాజా బాబాయే. ఈపాట వింటోంటే ఆయనే సీన్లో కనిపించేవాడు. అప్పట్లో మాబాబాయి చదువుకునే వాడో, ఆపేసాడో గుర్తులేదు. మాఊరికి తరచూ వస్తోండేవాడు. ఆయనొస్తే మాపిల్లకాయలకి బోల్డంత సంబరంగా ఉండేది. శని, ఆదివారావారాలయితే మరీని. సరదాగా నవ్వుతూ, నవ్విస్తూ గలగలలాడుతోండేవాడు. మాకన్నిటికన్నా బాగానచ్చే అంశం పొద్దున్నే లేచేవాడుకాదు. మేంఅందరం తన పక్కలోదూరేవాళ్ళం కాబట్టి మేంకూడా ఆలస్యంగా లేవచ్చని మాఆశ. అయితే మాఅమ్మ ఊరుకునేదా. లేవండి, లేవండంటూ ఆసుఖం తనివితీరా అనుభవించనిచ్చేదికాదు. మేం బాబయ్య లేస్తేలేస్తాం లాంటి మెలికలు పెట్టడానికి ప్రయత్నించేవాళ్ళం. అప్పుడు మాఅమ్మ బాబయ్యని లెమ్మని చెప్పేది. మాఅమ్మ కాపురానికి వచ్చినప్పుడు మాబాబయ్య మట్టలాగులేసుకునేంత చిన్నపిల్లాడట. వెనకాలే తిరుగుతూ, మాలిమిగా ఉండేవాడట. అందుకే తనంటే చాలా యిష్టం అని మాఅమ్మ ఎప్పుడూ చెప్తుంది. చెప్పగానే లేచేస్తే మాబాబయ్యెందుకౌతాడు? లేవకపోగా, రోజూలేచేదేకదా ఒకరోజులేటుగా లేస్తారులే అని మాకు మోరల్ సపోర్టిచ్చేవాడు. అవును మరి, స్కూలున్నప్పుడు ఎలాగూ తప్పదు అని మాకు అనిపించేది. పైగా చదువెందుకు చంకనాకు, గురువెందుకు గుండుగోకు, పదియావులు కాచుకొనిన పాయసమొచ్చున్ అని పద్యం చెప్పేవాడు. మేం దాన్ని కంఠతా పట్టి చెప్తోండేవాళ్ళం. అయినా అమ్మ వదిలేది కాదు. ఉన్నవాళ్ళలో తొందరగా మెత్తబడేది నేనే. అందుకని, ఉబ్బోపాయాలతో మా అమ్మ నన్ను ఎలాగో మంచం దింపేది. తర్వాత, చూడరా నీకన్న చిన్నవాడు లేచేసాడు, అని అన్నయ్యని, ఇద్దరూ లేచేసారు చూడు, నువ్వొక్కడివే ఉండిపోయావని తమ్ముడిని భేదోపాయంతో లేపేసేది. నాకన్న వాళ్ళెక్కువ అనుభవించేస్తున్నారన్న దుగ్ద వాళ్ళు లేవడంతో తగ్గేది.

బాబయ్య మాఊరు తరచూ రావడానికి బలమైన కారణం నాకు మాబాబయ్య వయస్సొచ్చాక అర్ధమైంది. మా పిన్నిది (అప్పటికి కాబోయే) ఆఊరే. మేనమామ కూతురే. టీవీలు, సినిమాలు లేకపోవడంవల్ల మాకు అప్పుడర్ధం కాలేదు కాని, తర్వాతి కాలంలో వచ్చిన పరిజ్ఞానంతో చూసినప్పుడు, వాళ్ళు ప్రేమికులని అర్ధమయ్యింది. తొందరలోనే వాళ్ళకి పెళ్ళయింది. మాబాబయ్య పెళ్ళప్పుడు కనీవినీ ఎరుగనంత వాన. వాయుగుండం. తర్వాతి రోజుల్లో ఎప్పడు పెద్దవర్షం కురిసినా అప్పుడుకురిసిన వర్షాన్ని ప్రమాణంగా చేసి పోల్చేవాళ్ళు.

ఉద్యోగరీత్యా, మార్కెటింగ్, సేల్స్ లలో చాలాకాలం పనిచేసేవాడు. ఊళ్ళు తిరిగి, తిరిగి వస్తోండడం వల్ల ఎక్కడెక్కడి బంధువులనో కలిసి, వార్తలు తెల్పేవాడు. మేం ఇచ్చాపురంలో ఉన్నప్పుడు మాయింటికి వచ్చి మాకు దూరంలో ఉన్నామన్న భావన తొలగించిన అతికొద్ది బంధువుల్లో అతిముఖ్యుడు మా బాబయ్యే. మా అందరికీ నచ్చిన మాబాబయ్య, లైవ్ మెస్సెంజర్. రియల్ టైం సెర్చింజన్. ఇప్పటికీ ఎవరి పేరైనా చెప్తే గూగుల్ బాబాయికన్నా వేగంగా వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు తవ్వగలడు. మా నాన్నగారి తరానికి కొవ్వలి వంశపు లివింగ్ ఫాజిల్.

మా పెద్దనాన్నగారు పోయినప్పుడు, వాళ్ళ పిల్లలని తీసుకువచ్చి తణుకులో ఉమ్మడి కుటుంబం పెట్టారు, మానాన్నగారు,బాబయ్య కలిసి. మా పిన్ని, బాబయ్యలిద్దరూ వాళ్ళవంతు సహకారం అందించడం వల్ల ఉమ్మడి కాపురం ఉద్దేశ్యం సఫలీకృతమైందని నాఅవగాహన. నాకు అప్పటికి కొద్దిగా ఊహ వచ్చింది. మాబాబయ్య ఊళ్ళుతిరగి తిరిగి వచ్చేవాడు. ఉమ్మడిలో సరియైన ప్రైవసీ కూడా ఉండేదికాదు. అయ్యో స్వేచ్ఛ లేదో, సుఖంలేదో అని అరిచి గీపెట్టేంత సావకాశం, సందర్భం ఉండేవి కావో, లేక మన అన్నయ్య పిల్లలకి మనంకాకపోతే ఇంకెవరున్నారన్న బాధ్యత వల్లో బయటికి ధ్వని కాలుష్యం ఎప్పుడూ రాలేదు. ఆఖరికోడలిగా కష్టాలే పడిందో, నిష్ఠూరాలే ఎదుర్కొందో కాని, మా పిన్ని ఈరోజుకి కూడా బాధ్యతల్లో మాబాబయ్య వెంటే. ఇంకా ఆడపడుచులని, పెళ్ళిళ్ళని, పేరంటాలని పూచీపడుతూనే ఉంది. మాచిన్నప్పుడు ఇంటిచాకిరీ ఎలా చేసేదో, ఈరోజుకీ అదే చాకిరీ, మెప్పూ మెహర్బానీల ధ్యాస లేకుండా.

సమస్యలు రాలేదా అంటే, బోలెడన్ని వచ్చాయి. ఉమ్మడిలో సమస్యలు, అపార్ధాలు, అవమానాలు, ఆర్ధిక సమస్యలు, సూటిపోటు మాటలు, ఇలా ఎన్నిటినో మా నాన్న తరంవాళ్ళు ఎదుర్కొన్నారు. డబ్బులు లేకపోవడమే వాళ్ళకి వరమయిందా అనిపించేంత సంతుష్టిగా బతికారనిపిస్తుంది.


తనకి, పిన్నికీ ఆయురారోగ్యాలిమ్మని భగవంతుని ప్రార్ధిస్తూ ...

Monday, May 07, 2007

ప్లాటో, స్పినోజా, ఆవెనక నేనే

ప్లాటో, స్పినోజాలు పేరొందిన తత్వవేత్తలని మీకందరికీ తెలిసిందే. వాళ్ళకీ సత్యసాయికీ లంకేమిటని అనుకోవద్దు. వాళ్ళలాగే నేను కూడా ఆలోచిస్తాను(ట), వాళ్ళకున్న నైపుణ్యత నాలో కూడా ఉంది(ట). నాకాలర్ కొద్దిగా పైకెళ్ళడం గమనించగలరు. ఇదేమిటి, నిన్న గోడల్లోంచి దూరడం చదివినప్పటి తలతిరుగుడు ఇంకా తగ్గలేదనుకుంటోంటే, వీడేంటీ, సత్యసాయి = ప్లాటో = స్పినోజా అని కొత్త సమీకరణం ప్రతిపాదిస్తున్నాడేంటి అని కలవరపడుతున్నారా? ఇంకా ఏమనిపిస్తోందీ అని యమలీలసినిమాలో సైకాలజిస్ట్ నగల వ్యాపారినడిగినట్లు అడగాలనిపిస్తోందా?

అంత ఖంగారు పడకండి. ఈకింద నేను చేసిన classic IQ test విశ్లేషణ లో రెండు వాక్యాలు చూడండి.

"..... The timelessness of your vision and the balance between your various skills are what make you a Visionary Philosopher. ............Two philosophers who share the same combination of skills you possess are Plato and Benedict Spinoza."

ఈ టెస్ట్ టికిల్ దాట్ కాం (Tickle) లో ఉంది. చాలా నెలల (సంవత్సరాలేమో కూడా) కింద యాహూ మెయిల్ ఇంటి పుటలో ఒక ప్రకటన చూసా. అందులో ఒక తెలివితేటలకి సంబంధించిన బహుసమాధానపు (multiple choice)ప్రశ్న కన్పించింది. నాకున్న ఆసక్తివల్ల దాన్ని నొక్కి చూస్తే, ఈ పుట తెరుచుకొంది. అప్పటి నుండి ఆ సైట్ లో నున్న రకరకాల టెస్టులు ఓ 35 దాకా చేసాను. నా ఫ్రెండయితే (మా అమ్మాయి) ఒక 100 దా కా చేసింది. ఈ టెస్టులు శరీరం, మనస్సు, ఉద్యోగపర్వం, అభిరుచులు, అతీంద్రియ శక్తుల (ESP) అంచనా, ఇలా అనేక విషయాలలో మన సత్తా, మనకున్న మొగ్గు తేల్చి చెప్తాయి. నేను తీసుకొన్న టెస్టులన్నిటిలోనూ వచ్చిన ఫలితాలు, నాగురించిన నాకున్న అంచనాలతోనే కాక, నాగురించిన నన్నెరిగిన వారి అంచనాలతో కూడా సరిపోలడంబట్టి ఈ టెస్టులు కాస్త సాంకేతికంగా ఉన్నతస్తాయిలోనే ఉన్నాయనిపించింది. మన గురించి మనకే సంపూర్ణంగా అంచనా అందడం కష్టం. అలాంటిది కొన్ని ప్రశ్నలకి మనమిచ్చే సమాధానాలని బట్టి 100% సరియైన అంచనాలు రావడం కష్టం. కాని వీటిలో వచ్చే విశ్లేషణ వల్ల మనకి కొంత ఉపయోగం ఉండచ్చు, మన గురించి మనకి కొంత అవగాహన పెరగచ్చు అని నా కనిపించింది. వీటి ఉపయోగం కాసేపు పక్కన పెడ్తే, టెస్టులు చేయడంలో భలే మజా వస్తుంది. పని వత్తిళ్ల మధ్య కాస్త సేదతీర్చగలిగే గుణం వీటికుంది.

అసలు ఈ పుట గురించి బ్లాగర్లకి (తెలియని వాళ్లకి) పరిచయం చేద్దామని మన త్రివిక్రముడి 'బొట్టు-జ్ఞానం ' టపా చదివినప్పుడు అనిపించింది. దేనికైనా కాలం, ఖర్మం (ఎవరిది?)కలిసిరావాలంటారు కదా. ఇదిగో ఇప్పటికయ్యింది. ఆ టపాలో, రాధిక గారి ప్రశ్న (బొట్టెందుకు పెట్టుకొంటాం?)కి సమాధానం రాస్తూ, మన శరీరంలోని చక్రాలని పరిచయం చేశారు. టికిల్ లో మనలో ఏచక్రం ఉద్దీప్తమై ఉందో చక్రా టెస్టులో కొన్ని ప్రశ్నలకి మనమిచ్చే సమాధానాలద్వారా విశ్లేషించి చెప్తారు. అతి సులభంగా నమోదు చేసుకోవచ్చు. ఇప్పటిదాకా నాకు స్పాములు, ప్రొమోల బెడద రాలేదు.

టికిల్ అంటే కితకిత, చక్కిలిగింత. అది మీకు కూడా కలగుతుందని ఆశిస్తూ సెలవు తీసుకొంటున్నాను. శుభస్యశీఘ్రం.

తోక చుక్క:
రాధికగారిని ఆమెరికాలో అడిగినట్లే ఇక్కడ కూడా మనదేశంవాళ్ళని అడుగుతారు. ఒకాయన ఒక సరదా సమాధానం చెప్పాడు. పూర్వం ధనుర్విద్య అభ్యసించేవాళ్ళు బొట్టుని గురి కోసమని (bull's eye) వాడేవాళ్ళట! అది ఇప్పుడు ఆచారంగా అయిపోయిందట.
బొట్టుగురించి అడిగితే పర్వాలేదు కాని, మనవాళ్ళు పెట్టే నామాల గురించి అడిగితే సమాధానం చెప్పడం కష్టం.

Wednesday, May 02, 2007

బామ్మసూక్ష్మం - 55 మాటల్లో కథ

కొత్తపాళీగారి కొత్తసూచన, ప్రవీణ్ ప్రధమవిన్యాసం, రానారె 'వీర'కృత్యాల స్ఫూర్తిగా నా కథాకృత్యం (థా ని సంధిగా విడదీయద్దు). గమనిక - మీకు ఎక్కువ శ్రమ లేకుండా ఈ పక్కన బ్రాకెట్లో వ్యాఖ్యమూస పెట్టా. కాపీ చేసి వ్యాఖ్యలో అతికించేయండి.:-) (బాగుంది)

బామ్మసూక్ష్మం - 55 మాటల్లో(అక్షరాలా) కథ


స్వామీ, నామనవడికి ఉద్యోగం వస్తే నడిచికొండెక్కి గుండు కొట్టించుకొంటాడు.
***
స్వామీ, నామేనకోడలి తోటికోడలు రోగం తగ్గితే పదితులాల గొలుసు హుండీలో వేస్తుంది.
***
స్వామీ, -------------- స్వామీ ------------
***
ఒరేయ్. కళ్ళుపోతాయిరా. అయినా నీకోసమే కదా మొక్కెట్టా.
***
ఏదో నాతాపత్రయంకొద్దీ మొక్కెట్టా. మీయిష్టం. దేఁవుడితో వ్యవహారం.

" " "

" " "

" " "

***
ఏమిటో ఈముసలావిడ ???????....?????
***
ఒరేయ్, నీకడుపుచల్లగా తిరుపతి తీసుకొచ్చావు, పైకెళ్ళే బస్సెప్పుడో చూడు.
నీకొంట్లో బాలేనప్పుడు నడిచి కొండెక్కుతావని మొక్కానే. దేఁవుడితో వ్యవహారం.
పిచ్చివాడా. 80ఏళ్ళదానిమీద కోప్పడేవాడు దేఁవుడా? టాక్సీపిలు. నన్నెంత సుఖపెడ్తే నీకంత పుణ్యం.
!!!!! ????? !!!!!! ?????? !!!!!!! ?????

Monday, April 23, 2007

నాది జ్ఞానమా? అజ్ఞానమా?

కొన్నిరోజులక్రితం ఆంధ్రజ్యోతిలో ఒక ఫోటో, దానిక్రింద దాని వివరం చూసా. ఆవివరం లో నాగార్జునకొండకెళ్ళడానికి లాంచి ఎక్కుతున్న ప్రధాని కుమార్తె ఉపేంద్ర సింగు అని రాసి ఉంది. ఇది మీరూ చదివి ఉంటారు. దీంట్లో విశేషం ఏముందీ పెద్ద, బ్లాగులో వ్రాయడానికి, అదీ 'ఆర్నెల్ల' తర్వాత అంటారా? మామూలుగా చూస్తే అంతే. కానీ ఆవార్త చదివాకా నాలో కల్గిన భావపరంపరనుబట్టి చూస్తే విశేషం ఉందని మీరుకూడా ఒప్పుకోవచ్చు.
ఒకసారి ఫోటోచూసి వివరం చదివాను. ఆవ్యక్తి ఎవరో ఆవార్త ఎందుకు వేసారో అర్ధం కాక మరొక్కసారి చదివా. ప్రధాని కూతురట, ఏదేశ ప్రధాని కూతురయ్యుండొచ్చు? సింగు అని ఉందికాబట్టి నేపాలు ప్రధానేమో. అయినా ఈ పత్రికల వాళ్ళ బుర్రలిట్టా ఏడిసాయి. సరిగ్గా వివరాలు వ్రాసి తగలడచ్చు కదా. ఇలా బ్రెయిన్ టీజర్లిచ్చి అఘోరించకపోతే. బ్రౌజర్ మూసేసా. మర్నాడెప్పుడో అకస్మాత్తుగా బల్బు వెలిగింది. అవునూ, మన ప్రధాని మన్మోహన్ సింగు కదా, ఆయన కూతురన్న మాట ఈవిడ అని.
జనరల్ నాలెడ్జిలో ఉద్దండ పిండాన్ని కాను కాని, మరీ మన ప్రధాని ఎవరూ అని అంత మీమాంసలో ఎలా పడిపోయానో కదా.
ఇంతకీ నాది జ్ఞానమా? అజ్ఞానమా?

Tuesday, April 17, 2007

పొద్దులో బ్లాగులపై పేరడీ - నేడే చదవండి

ఈవేళ బ్లాగులు చూస్తోంటే, పొద్దులో బ్లాగులపైన పేరడీ కనబడింది. మొదలెట్టగానే చివరివరకూ చదివించింది. పేరడీ అంటే ఇలా ఉండాలి. చదువుతోంటే, ఆయా బ్లాగర్లే వ్రాసారా అన్న అనుమానం వచ్చింది. మంచి ప్రయోగం. మిగిలిన బ్లాగర్లకి కూడా తొందరగా చీమలు కుట్టేస్టే బాగుండును. కానీ పేరడీ ఎవరు వ్రాసారో వ్రాయలేదు.
ఈ అజ్ఞాత వాసులతో చాలా సమస్యగా ఉందండీ బాబోయ్. ఈవేళ కొన్ని బ్లాగులు చూస్తోంటే, అది వ్రాసిన వాళ్ళను తెలుసుకోవాలని కుతూహలం కలిగింది- చాలామంది అజ్ఞాతవాసులే. ఇక్కడికొస్తే పేరడీ కర్త అజ్ఞాత వ్యక్తి. ఈమధ్య బ్లాగులు చదువుతోంటే, పత్రికల్లో వార్తలు వ్రాసే విధానం గుర్తుకొచ్చింది. ఎవరింటిలోనో దొంగతనం జరుగుతుంది. ఆ వార్తని ఇలా వ్రాస్తారు.

"ఈవేళ తెల్లవారుజామున సుమారు మూడు గంటలకి నగర శివార్లలో ఒక యింట్లో గుర్తుతెలియని అజ్ఞాత వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డట్టు తెలిసింది. ఆయింటి యజమాని, తాము మంచినిద్రలో ఉండడంవల్ల దొంగలను చూడలేదని చెప్పారు. ఈసంఘటనపై స్పందిస్తూ, స్తానిక ఎస్.ఐ. (తమ పేరు బయట పెట్టద్దని కోరారు) వెంటనే దొంగలని పట్టుకోంటామని హామీ ఇచ్చారు. సంఘటన జరిగిన ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు"

ఎంత విషయ సంపత్తి?

చావాకిరణ్ గారైతే ఇలా కూడా వ్రాసేవారేమో?

'అనుకున్నంతా అయిపోయింది. దద్దురే మిగిలింది. ఇక గోలపెట్టడమే మనం చేయగలిగింది'

ఆతర్వాత మనమంతా అడుగుతాం- వ్యాఖ్యలద్వారా- దీనిభావమేమి తిరుమలేశా అని. ఆనక ఆయన చిద్విలాసంగా మరి కాస్త వివరిస్తారు. :)

ఆయన స్టైలే వేరు. బ్లాగ్మూల పురుషుడు కదా!

Friday, April 13, 2007

అంతా వేదాల్లో ఉందష...

ఈ వాక్యం చాలా వ్యంగ్యాత్మకం. వేదం అంటే ఒకటో రెండో పుస్తకాలనుకోవడం వల్లా, మన పెద్దలకు తెలిసిన విజ్ఞానం పనికిమాలినదన్న మిడిమిడి జ్ఞానపు (పాశ్చాత్య) ప్రచారం వల్లా, అన్నిటికన్నా ముఖ్యంగా వేదాలు బ్రాహ్మల సృష్ఠి అన్న దురూహ, తద్వారా వచ్చిన వైముఖ్యత, వల్ల ఈ వాక్యానికి చాలా ప్రాచుర్యం వచ్చింది. వేదమంటే సమాజంలో పోగుపడిన జ్ఞానం. మనకున్న జ్ఞానసంపద మనకు గర్వకారణం కాదగినది. ఈవాక్యం వ్యంగ్యంగా అన్నా ....


......నిజమే అంటోంది ఈ దృశ్యమాల.

A vast number of statements and materials presented in the ancient Vedic literatures can be shown to agree with modern scientific findings ... all » and they also reveal a highly developed scientific content in these literatures. The great cultural wealth of this knowledge is highly relevant in the modern world. Techniques used to show this agreement include: - Marine Archaeology of underwater sites (such as Dvaraka) - Satellite imagery of the Indus-Sarasvata River system - Carbon and Thermoluminiscence Dating of archaeological artifacts - Scientific Verification of Scriptural statements - Linguistic analysis of scripts found on archaeological artifacts - A Study of cultural continuity in all these categories.

Wednesday, April 04, 2007

మత్తు వదలనూ - నిద్దుర మత్తు వదలనూ..ఎందుకొదలాలిబే?

మీలో చాలామంది 'మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా' అన్న పాటని వినీ, చూసీ ఉంటారు. పాండవులు లక్క ఇంట్లో ఉన్నప్పుడు, కాపలాగా, అప్రమత్తంగా ఉండాల్సిన భీముడు మత్తుగా నిద్ర పోతోంటే కృష్ణుడు ముసలి వాని రూపంలో వచ్చి కర్తవ్యం బోధిస్తాడు. భీముడు - అంత లావుండీ కూడా- ఒక ముసలివాడు చెప్పిన మాట విని బంగారం లాంటి నిద్ర పాడుచేసుకొన్నాడు. అయినా అన్నదమ్ములందరూ హాయిగా ముసుగెట్టి బజ్జుంటే నాకేంటీ ఈ కాపలా అని కాని, నీకేంటీ దురద అని గాని నిలదీయలేకపోయాడు. మరి శేషశాయని పేరొందిన వాడు వేరేవాళ్లని పడుకోవద్దంటే రోషం రావద్దూ? మరి ఒక వేళ నిలదీసినా న్యూస్ కవర్ చేసిన రిపోర్టర్ (వ్యాస్, వేద)మనకి అలా అచ్చెయ్యలేదేమో? అదే ఈ నాటి రిపోర్టర్లైతే, అప్పట్లో మన ప్రధానైన శ్రీమాన్ దేవగౌడ గారి కునుకుపాట్లను సచిత్రంగా అచ్చేసేసారు. ఆయన తెగ ఉడుక్కున్నాడు కూడా. ఇంకో ప్రధాని కీ.శే.పి.వి. గారు ఎప్పుడూ పడుకొన్నట్లే ఉండేవారు, కాని నిత్య జాగృతులని తర్వాత తేలింది. ఒక విషయం నాకర్ధమైందేమిటంటే, ముఖ్య, ప్రధాన మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు వాళ్లు పొద్దున్నే 'బ్రహ్మ' లేదా 'జెహోవా(?)' ముహోర్తంలో లేచేస్తామని, దేశం లేదా రాష్ట్రాన్ని దొబ్బడం (సారీ తప్పుగా అనుకోకండి, దొబ్బడం అంటే తొయ్యడం, ముందుకి తోయడం) గురించి తెగ ఆలోచిస్తామని తప్పనిసరిగా రాయించుకొంటారు. కాని, కీ.శే.అంజయ్య లాంటి అమాయకులు (నిజంగా)ఈ విషయం తెలుసుకోక తాము లేటుగా లేస్తామన్న సంగతి కూడా దాచుకోకుండా పోయిన దశాబ్దాల తర్వాత కూడా చంద్రబాబు లాంటి 'కృష్ణుల' చేత చెప్పించుకొంటారు. అయినా ఒక రకంగా చూస్తే అంజయ్య గారు చాలా అదృష్టవంతులు. ఆయన మీద వాలే ఈగల్ని తోలడానికి తెలంగాణా అ(ఉ)గ్ర నాయకత్వం సిద్ధంగా ఉంది (నాయకుడుంటే మిగిలిన వాళ్ళున్నట్లేకదా?). పి.జె.ఆర్. స్పందించాడు కానీ, అంత గొప్పగాలేదు. ఆయనేమన్నడు- తెలంగాణా ప్రజల్ని ....... అనడంభాభవ్యంకాదు, నిన్ను పైకి తీసుకొచ్చిన అంజయ్యనే విమర్సిస్తావా, ... ఇల్లాంటిఏమిటేమిటో చెప్పాడు. కేసీఆర్ అన్న మాత్రం బలే రిటార్టిచ్చాడు. 'మాయిష్టం పడుకొమ్టే పడుకొంటాం. అసలు లేవనే లేవం. ఏంటంటా? ఆయినా నీలా పొద్దుగాక ముందే లేచి గోతులు తవ్వం' అని మళ్ళీ ఎవరూ నోరెత్తకుండా చేశాడు. నాకైతే కేసీఆర్ పిచ్చపిచ్చగా నచ్చేసాడు. ఇప్పుడు హాయిగా మనం ఎంత సేపు పడుకొన్నాఅడిగేవాడు లేడు. అయినా తెలంగాణా ప్రజలు పడుకోబట్టే కదా నాయకులు ఇంతకాలం హ్యాపీగా పండుగ చేసుకొన్నారు. వాళ్లు నిద్ర మత్తులో ఉంటేనే కదా ఎవరేం చెప్పినా చెల్లేది. ఇపుడు వాళ్లు లేస్తే ఎన్ని సమస్యలు?

Friday, March 30, 2007

శ్రీరాముని దయచేతను......

మొన్న రామనవమికి మా ఊళ్ళో (సోల్‍లో) మనవాళ్ళు ఒక సత్సంగం ఏర్పాటు చేసారు. ఆ సందర్భంగా విష్ణుసహస్రనామస్తోత్రం చదివాం. అంటే, సుబ్బులక్ష్మి గారితో కాస్తంత గొంతూ, పెదాలూ కలిపాం. ఆవిడతో గొంతుకలపడం కూడా అదృష్టమేనంటాను. ఎందుకంటే, ఆవిడ గొంతు వింటేకానీ ఆశ్రీనివాసుడు నిద్ర కూడా లేవడు. ఇతర కార్యక్రమాలు కూడా అయిపోయాక ముగ్గురు చెప్పిన మూడు ముక్కలుః
1.విష్ణుసహస్రనామస్తోత్రం (వేయి నామాలు) చదవడం వల్ల వచ్చే ఫలితం ఒక్క రామనామంతో వస్తుంది.
2.రామనామస్మరణకి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ పధకం ఉంది. దాని ప్రకారం రామభక్తులకి ఆంజనేయుడు కూడా వశమైఉంటాడు.
3.రాముడికీ తెలుగువాళ్ళకీ తరతరాల ప్రత్యేక అనుబంధం ఉందీ అనిపిస్తుంది. ఆయన పుట్టిందీ,పెరిగిందీ ఉత్తరాదిలోనైనా, ఆయనని కీర్తించి, స్తుతించి, ఆయన నామాన్నీ, ఖ్యాతినీ చిరస్థాయిగావించిన ముఖ్య కవులూ,గాయకులూ, వాగ్గేయకారులూ తెలుగు వారే. కృష్ణుడనగానే మనకి సూరదాసు, మీరాబాయ్ లాంటి తెలుగేతరులు గుర్తొస్తారు కానీ, రాముడనగానే రామదాసు, త్యాగయ్య, మైసూరు వాసుదేవాచార్యులు, మొల్ల, విశ్వనాథ లాంటి తెలుగు వాళ్ళే ఎక్కువ గుర్తుకు రావడం విశేషం. ఈమధ్యన ఎవరో అన్నట్లు, రాముడ్ని నమ్మి చెడిపోయిన వాళ్ళు లేరు, చివరకి ముప్పాళ్ళ రంగనాయకమ్మతో సహా.
ఆ సందర్భంలో గుర్తుకు తెచ్చుకొన్న కీ.శే.దేవులపల్లి వారి పాట ఈక్రింద ఇస్తున్నా. దీన్ని పాలగుమ్మి విశ్వనాథంగారు స్వరపరచారు. ఆవరుస ఎలా ఉంటుందో వినాలని ఉంటే ఈ లంకెని నొక్కండి.
ఎన్నిసారులు అన్ననూ...

పల్లవి
ఎన్నిసారులు అన్ననూ ఎన్నెన్ని తీరులు విన్ననూ
అన్నకొలదీ విన్నకొలదీ అమృతభరితము రామచరితము ..ఎన్ని..

చ1
కలముపట్టి కవివరేణ్యులు - గళమువిప్పి గాయకులు
నీమధురగానము కొలువగా - మైమరచి నిను ధ్యానించగా
వెలసెనెన్నో పాటలు -నిను చేరుటకు విరిబాటలు ..ఎన్ని..

చ2
బ్రతుకు బరువై సుఖము కరువై
అలసిసొలసిన వేళలా
ఏదారి లేని ఎడారిలో....ఏదారి లేని ఎడారిలో
ఆధారమైనది నీదు నామము ..ఎన్ని..

Thursday, March 15, 2007

కొరియా కబుర్లు: తిండీ, తిప్పలు – 2

మనకి కొరియన్లు, చైనావాళ్ళు, జపాను వాళ్ళు, ఇతర తూర్పు ఆసియా దేశస్థులు ఒక్కలాగే అనిపిస్తారు. మనకి చైనా వాళ్ళనగానే వానపాములు, పాములతో సహా ఏజీవినైనా తినేసేవాళ్ళే కనిపిస్తారు. అలాగే మిగిలిన దేశాలవాళ్ళు కూడా. కానీ, కొరియన్ల ఆహారపుటలవాట్లు చూడసొంపుగానే ఉంటాయి, ఒక్క బ్రతికి ఉన్న ఆక్టోపస్ ని తినడం తప్పించి. మానవ పిండాల్నీ, అప్పుడే కొబ్బరి బొండాం చెక్కినట్లు చెక్కిన కోతి తలలోంచి మెదడునీ పచ్చిగా జుర్రే చైనావాళ్ళ తోటి, ఇంకో రెండు రోజుల్లో పిల్లవచ్చే అవకాశం ఉన్నకోడి గుడ్డుని వేడి పెనంమీద పగలగొట్టి, ఆ పిల్ల ప్రాణంకోసం పరిగెడుతూ,పరిగెడుతూ ఆమ్లెట్టయిపోతే, ఆపరుగులాటవల్లే అంతటేస్టనుకంటూ, లొట్టలేసుకంటూ తినే కాంబోడియన్లతోనూ అయితే వీళ్ళకి పోలికే లేదు.
వీళ్ళు సాథారణంగా ఎక్కువ సార్లు హోటలులోనే తినేస్తారు. ఇంట్లో చేసుకుని తినడం ఒకరకంగా శ్రమతో కూడిన వ్యవహారం. వీళ్ళు తినే ముఖ్య పదార్ధం (మెయిన్ డిష్) కన్నా ఇతర పదార్దాలు లెఖ్ఖకు మించి ఉంటాయి. మరి ఇంట్లో ఇన్ని ఏర్పాట్లు చేసి ఆనక అన్ని చిప్పలూ కడుక్కోవాలంటే ఒళ్ళు హూనమౌతుంది. వీళ్ళు పార్టీ చేసుకొన్నప్పుడు చూడాలి, కనీసం 50 రకాల పదార్ధాలు బల్ల మీదకొస్తాయి. వీళ్ళు పార్టీ ప్రియులు. రోజూ మందు (సోజూ) ఉండాల్సిందే.

వీళ్ళ సైడ్ డిష్ లలో అతి ముఖ్యమయినది కిమ్చీ. ఇది మన ఊరగాయ లాంటిది. ఎటొచ్చీ వాళ్ళు దానిలో వెనిగర్ వేసి పులియబెడ్తారు. కిమ్చీ వాళ్ళ సంస్కృతిలో ఒక భాగం. చలికాలం ముందు దీన్ని తయారుచేసుకొంటారు. దీనికోసం పెద్ద జాడీలు ఉంటాయి. ప్రపంచంలో 10 ఉత్తమ ఆరోగ్యకరమైన ఆహారాల్లో కిమ్చీది 5వ స్థానం. మన దేశంనుండి అపరాలు (పప్పుధాన్యాలు) ఈ పదిలో ఉన్నాయి. కిమ్చీని కేబేజ్,ముల్లంగి, కీరా కాయలు, కొన్ని ఆకుకూరలతోటి చేస్తారు. ఎండు మిర్చి కారం ముఖ్యపదార్ధం. కారం ఎక్కువగానే వాడతారు. కిమ్చీకోసం ఒక పరిశోధనా సంస్థ కూడా ఉంది. దాని వల్ల వచ్చే ప్రయోజనాలగురించి టీవీ కార్యక్రమాల్లో కూడాతెగ చెప్తోంటారు. ఫోటో తీసేవాళ్ళు say cheese అన్నట్లు, వీళ్ళు 'కిమ్చీ' అంటారు.

కిమ్చీకి వీళ్ళిచ్చే ప్రాముఖ్యత చూస్తే, నాకైతే మన ఊరగాయలు గుర్తొచ్చి చాలా బాధవేస్తుంది. ఊరగాయలు మన తెలుగు సంస్కృతికి చిహ్నాలు. మా చిన్నప్పుడు ఊరగాయల కాలం ఒక పండగలాగా ఉండేది. అది ఒక సశాస్త్రీయ ప్రక్రియ. కారం, ఆవుపిండి కొట్టించడం, మాగాయ ముక్కలు ఎండబెట్టడం, ఒకటేమిటి, ఎన్నెన్నో పనులు-పిల్లలకీ, పెద్దలకీ కూడా- ఉంటోండేవి. మనకే కాకుండా చుట్టాలకీ, పక్కాలకీ కూడా పెట్టాల్సి వచ్చేది. మాయింట్లో కనీసం 400 కాయల ఆవకాయ పెట్టేవాళ్ళం. మాగాయ, తొక్కుడుపచ్చడి లాంటివి సరే సరి. అలాంటిది, క్రిందటేడు నాభార్య ఈఏడాది మనింట్లో ఊరగాయలు పెట్టలేదు అని చెప్పగానే నాకు కల్గిన కల్చురల్ షాక్ అంతా ఇంతా కాదు. అసలు మన ఊరగాయ సంస్కృతి అధోపాతాళానికి జేరుకోవడానికి కారణం విదేశీయులు చెప్పినదే వేదమని మనమీదరుద్దే మన డాక్టర్లు (ఇస్మైల్ గారూ, కాసేపు ఫేసు అటు టర్నింగవ్వండి). ఈవిదేశీయులకి మన ఊరగాయ సొగసేమి తెలుస్తుంది చెప్పండి. వాళ్ళు తింటే అంతే సంగతులు. కానీ మనం తినక పోతే 'కన్నతల్లిని దూషించినంత పాపం, ద్వేషించినంత నేరం' కాదా? కొరివి కారం తినలేని గుంటూరు వాడ్ని, ఆంధ్రమాత అంటే తెలియని తెలుగు వాడ్ని మనం కనీసం ఊహించగలమా? డాక్టరు దగ్గరకి ఏసమస్యతో వెళ్ళినా సరే మొదట చెప్పేది ఊరగాయలు మానెయ్యమనే. వాళ్ళిచ్చే మందులవల్ల చెడు ఫలితాలంటాయని తెలసీ టన్నులకొద్దీ మనచేత మింగిస్తూ, ఎటువంటి శాస్త్రీయాధారమూ లేకపోయినా అభం శుభం తెలియని మన వారసత్వాన్ని అన్ని ఆరోగ్యసమస్యలకీ మూలమనడం వింటే కడుపు మంట రాదా? ఇది ఎవరైనా డాక్టరు వింటే ఊరగాయలవల్లే ఈ మంట అనగలడు.

వీళ్ళ ఆహారపుటలవాట్లు చూస్తే, మనం వాడే చాలా దినుసులు వీళ్ళు కూడా వాడటం విశేషం. అల్లం, వెల్లుల్లి వాడకం విపరీతం. దాల్చినచెక్క, జాపత్రి, ఎండుకారం మామూలే. మనం గొప్పలకి పోయి హీనమనుకొనే రాగులు, జొన్నలు, ఇతర తృణధాన్యాలూ ఇక్కడ విలువైనవి, అన్ని కొట్లలోనూ దొరికేవీని. వింతేమిటంటే, ఇక్కడ దొరికే కూరల్లో మూడైతే, రూపలావణ్యాలకి కాక, రుచిలో మన
బీర, ఆనప, దోస కాయలని సరిపోలతాయి. గుమ్మడి కాయలు అచ్చం మనవైపు దొరికేవే. అన్నిటికన్నా చెప్పాల్సినది, వీళ్ళు కూడా మనలాగే బియ్యం తినడం. కాకపోతే, ఈబియ్యంతో వండితే అన్నం ముద్దగా అయ్యి, అంటుకొంటుంది (జపానికా రకాలు). పదునుగా వండితే బాగానే ఉంటుంది. కానీ, చాలా రుచిగా ఉంటుంది. నేనైతే పూర్తిగా ఇక్కడి బియ్యమే వాడతా. అన్నట్లు చెప్పడం మరచా, వీళ్ళ అంగళ్ళలో కూడా మిరపకాయ బజ్జీలు దొరుకుతాయి.

ఈపాటికి చాలామందికి అనపించి ఉండచ్చు, మన దేశం నుండి ఈదేశానికి చాలా తిండి పదార్ధాలు ఎగుమతి చేయవచ్చు కదా అని. అవును. చాలా వస్తువుల ధరలు మనదేశంకన్నా 6-10 రెట్లుండచ్చు. కానీ వీళ్ళకి నాణ్యత కావాలి. పాతకాలంలో ఒకసారి కిమ్చీ కోసం ఎండుమిర్చి, వేరే దిక్కులేక ఇండియానుంచి దిగుమతి చేసుకొన్నారట. దెబ్బతో మనసరుకంటే ఇప్పటికీ భయం పోలేదంటారు. మన దేశం వాళ్ళు చాలామందే ఉన్నా కూడా, మనం పాకిస్తాన్, బాంగ్లాదేశ్ ల పాటికూడా వ్యాపారం చేయలేకపోవడం శోచనీయం.

Thursday, March 08, 2007

తిండీ తిప్పలు -1: ప్రతిస్పందన


రాధిక, సుధాకర్(శోధన), నాగరాజు పప్పు, సిబీరావు, వల్లూరి, నాగరాజా, 'తెలుగోడు' గార్లు నా తిండీ తిప్పల మీద (బ్లాగు టపా మీద అని భావం) వ్యాఖ్యలు వ్రాసారు. మీ అందరి సుస్పందనకి కృతజ్ఞతలు. అక్కడే నా ప్రతిస్పందన ఇరికించి వ్రాయడం ఎందుకో ఇష్టంలేక పోయింది. అందుకే ఇక్కడ వ్రాస్తున్నాను.
చైనా, కొరియా లాంటి వాళ్ళ వంటల్లో వెనిగర్ బాగా వాడతారు. నువ్వుల నూనె అయితే సరేసరి. అందులోనూ ముడి నువ్వుల నూనె బాగా వాసన వస్తుంది. వీళ్ళకి నూపప్పు అంటే మనకి జీడి పప్పులా అన్న మాట. అపురూపం, మహా ప్రియం (ఖరీదు). వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతుల మీది ఆంక్షలు తొలగించక ముందు వీళ్లు చైనా నుండి నూపప్పుని దొంగ రవాణా చేసుకొనేవారట. వీళ్ళ అన్ని వంటకాల మీదా కొద్దిగా నూపప్పు జల్లడం సర్వసాధారణం.

నేను బరహా యూనికోడ్ వాడుతున్నాను. నా క్కూడా మం(గుం)టనక్క లో సమస్య వస్తోంది. ఎవరైనా 'స్వే' (SWE) లు సలహా చెప్పండి దయచేసి. ఇప్పుడు తెలుగు పెళ్ళి మార్కెట్లో SWE అనే గుజ్జునామం
software engineer కి చాలా సామాన్యంగా వాడుతున్నారు. ఈ అర్ధసంవత్సర సెలవల్లో నా మేనకోడలి కోసం సంబంధాలు వెతకడంలో నాకు పెళ్ళిసంతల పడికట్టు పదాలు, విఫణి (మార్కెట్) తీరుతెన్నులు, ధరవరలు బాగానే పట్టుబడ్డాయి. రోగి బతక్కపోయినా వైద్యుడికి అనుభవం వచ్చినట్లైంది.
రాధికగారూ. రాగిముద్ద మీద చిన్న నక్షత్రం గుర్తు చూసారా. నిబంధనలు వర్తిస్తాయి. హా హా హా...
అన్యోని ఘేసియో (గూడ్ బై)

Wednesday, March 07, 2007

కొరియా కబుర్లు: తిండీ తిప్పలు -1 (ఇది చదివిన వాళ్లకి రాగిముద్ద పూర్తిగా ఉచితం*)

ఈ మధ్య నేను తపాలేసి చాలా రోజులయ్యిందని గమనించాను. అర్ధ సంవత్సర సెలవలకి దేశంవెళ్ళడం, తిరిగి రావడంలో కొద్దిగా అంతరాయం కలిగినట్లుంది. అంతే కానీ టాపిక్లు అయిపోయి కాదని తెలిసింది. ఎందుకంటే ఈ మధ్య కొన్ని బ్లాగులు చదువుతోంటే నాకు తోచిన విషయాలు వ్రాయాలని చేతులు దురదపెట్టాయి. ఇవి కాక నేను దేశంలో గడిపిన రోజుల విశేషాలు చాలా ఉన్నాయి. కానీ ఈ మధ్య ఏమీ వ్రాయలేకపోయా. వెరసి poverty in plenty. ఈ వాక్యాన్ని తెలుగులో వ్రాద్దామనుకొంటే ఎలా వ్రాయొచ్చో? ఇక విషయానికొస్తే......

తిండీ తిప్పలు అని ద్వంద్వంగా వాడడంలో ఉద్దేశ్యం తిండికోసం తిప్పలు తప్పవనేమో. మమూలుగా తిండి కోసం తిప్పలు పడడం మాటేమో కానీ, భారతీయులు మాత్రం బయట దేశాల్లో ఆయా దేశాల వాళ్ళ తిండి తినలేక తిప్పలు పడడం సామాన్యమైన విషయం. ఇన్నాళ్ళూ మనం గల్ఫ్, యూరోప్, అమెరికాలే ఎక్కువ వెళ్ళడంతో ఆయా ప్రాంతాల్లో మనకు కావలసిన ఆహారపదార్ధాలు బాగానే దొరుకుతున్నాయి. కానీ, కొరియా, జపాను లాంటి దేశాలకు ఇద్దరూ లేక ముగ్గురు పద్ధతిలో జనాలు వెళ్ళడం వల్ల ఈ దేశాల్లో మన తిండి అవసరాలు తీర్చుకోవడం కొద్దిగా కష్టమే. మన దేశంలో మాంసాహారం తినేవాళ్ళు కూడా ఇక్కడి పదార్ధాలు తినలేరు. శాకాహారుల సమస్య ఇంక చెప్పేదేముంది. అసలు వీళ్ళకి శాకాహారం అంటే ఒక పట్టాన అర్ధంకాదు. వీళ్ళ బుద్ధ దేవాలయాల్లోని సన్యాసులు తీసుకొనే ఆహారం శాకాహారమే అయినా మన పద్ధతిలో ఉండదు కదా. మా సారు ఒకరు నేను వచ్చిన కొత్తల్లో నన్ను ఒక సారి రెస్టారెంటుకి లంచికి పిలిచాడు. రాననడం మర్యాద కాదు. అందులోనూ ఆయన కొరియాలో నా బాగోగులు కనిపెట్టుకొని ఉండే పెద్ద మనసున్న మనిషి. ఆయన పేరు కిమ్ యంగ్ చల్. కిమ్ ఇక్కడి సర్వసాధారణ మైన ఇంటిపేరు. సుమారు 50% కి ఉంటుంది. ఈయన మనదేశంలో సుమారు 6 యేళ్ళున్నాడు. ఈయన చాలా విలక్షణమైన మహామనీషి. ఈయన గురించి తర్వాత వేరే తపాలో. ఆయన రెస్టరెంటుకు వెళ్ళగానే కొరియన్ భాష(హంగుమల్ అంటారు)లో ఆర్డరిచ్చేసాడు. తీరా నాప్లేటు చూస్తే రొయ్యల ఫ్రైడ్ రైస్. సార్. నేను ఇది తినలేనంటే, రొయ్యలు వెజిటరియనే కదా అంటాడు. హోటలమ్మకేదో చెప్పాడు. ఆ అమ్మాయి ఏం చేసిందో తెలియదు, మళ్లీ ఒక ప్లేటులో ఫ్రైడ్ రైస్ పట్తుకొచ్చింది. బహుశ: రొయ్యలేరేసి పట్టుకొచ్చిందేమో. ఫ్రెష్ గా నాకోసం చేసుకొచ్చిందని నమ్మి తిన్నా. తింటున్నానే కానీ దాంట్లో ఏరుచీ లేదు. సారుతో చెప్పి మిరియాల పొడి తెప్పించుకొని మధ్య మధ్యలో కాస్త నాలిక కారం చేసుకొన్నా. తర్వాతెవరో చెప్పారు ఇది కొరియన్ల కనుగుణంగా చేసినదని. ఆతర్వాతి కాలంలో చైనీస్ రెస్టరెంటులోనే వాళ్ళ పద్ధతిలోనే చేసిన ఫ్రైడ్ రైస్ తిన్నా. ఇంతకు ముందుకన్నా నయం. కానీ నోరు చి (త్రివిక్రముడి బావా .. ఛీ లాగా). ఇదే చైనీస్ ఫ్రైడ్ రైస్ ఇండియాలో ఎంత రుచిగా చేస్తారో కదా! అసలు వాడికన్నా కాపీ చేసినవాడే బాగా చేయగలడన్నమాట.
కొరియా వాళ్ళు భోజనప్రియులు. ఎల్ల కాల సర్వావస్థలలోనూ తింటూనే కన్పిస్తారు. కానీ వాళ్ళ శరీరంలోఎక్కడా ఒక గ్రాము కొవ్వు గానీ, కండకానీ ఉండకూడని చోట కన్పించదు. అన్ని వయస్సుల వాళ్ళూ నడక, వ్యాయామం చేస్తూ కనిపిస్తారు, ఆందుకేనేమో బలే సన్నగా, ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఇప్పుడు హైస్కూల్ కెళ్ళే వయసు వాళ్ళల్లో మాత్రం చాలామందికి ' అన్నీ ఎక్కువే'. మరి పిజ్జాలూ, గిజ్జాలూ ఎక్కువ లాగిస్తోంటే లావవ్వరా? కొంత అదృష్టంకూడా అనుకొంటా. ఇక్కడ ఒక అగ్రగామి మోడల్ ఒక అమ్మాయి ఉంది. బకాసురుడి చెల్లెల్లా లాగిస్తుందట. పత్రికల వాళ్ళు ఆవిడ తిండి పుష్టిగురించి వ్రాస్తోనే ఉంటారట. కానీ తిన్న తిండి ఎక్కడికిపోతుందో తెలియదు, ఒంట్లో ఎక్కడా కాస్త కూడా కొవ్వు ఉండకూడని చోట ఉండదుట. ఈ జీన్సుని మన హీరోయిన్లకి అమ్మితే బలే వ్యాపారమవుతుంది. పాపం నయనతార, త్రిషల్లాంటి వాళ్ళు తెగ ఖర్చుపెట్టి విదేశాలకి పోయి లిపోసక్షన్ చేయించుకొని తెగ కష్టపడుతున్నారు.

వీళ్ళ దూరదర్శన్ సీరియళ్ళలో కూడా తిండి దృశ్యాలకి తెగ ప్రాధాన్యతనిస్తారు. ఎపిసోడుకి కనీసం ఒక తిండిసీను. ఇక్కడి బజార్లలో అయితే రెస్తారెంట్ల జోరు చెప్పనఖ్ఖర్లేదు. సాయంత్రం సమయంలో వెళ్తే రకరకాల లైటింగులూ, మ్యూజిక్కులూ, లోపలికి ఆహ్వానిస్తూ అరిచే అరుపులూ- ఆ హడావిడే వేరు. వీళ్ళు మధ్యాహ్నం 12, సాయంత్రం 6 గంటలకి తినేయకపొతే తల్లడిల్లిపోతారు. ఇంట్లో చేసుకోవడం కన్నా హోటల్నించి తెప్పించుకోవడమే ఎక్కువ చేస్తారు. మనం ఎదైనా ఆర్డరిస్తే ఒక 10-15 నిమిషాలలో వేడివేడిగా మనకి తిండి వచ్చేస్తుంది. విపరీతమైన పోటీ వల్ల మంచి సేవ, సరసమైన ధరలకి దొరుకుతుంది. తిండిని ఉష్ణవాహకంకాని పెద్ద బాక్సుల్లో మన బజాజ్ పాల బండ్లు (ఈ మోడల్ పూనాలో ఎక్కువ వాడేవారు కాబట్టి పూనా బళ్ళు అనేవారు) లాంటి స్కూటర్ల మీద రై.. రై.. మని తీసుకువచ్చి సప్లై చేస్తారు. బహుశ: వేడి తగ్గకుండా వేగంగా చేర్చడనికనుకొంటా, వీటిని చాలా వేగంగా నడుపుతోంటారు. చాలా సార్లు ఇవి నడుస్తోన్న మాపక్కనించే దూసుకుపోయి మా గుండెలదరగొట్టేయడంతో వీళ్ళని యమదూతలని వ్యవహరిస్తోంటాం. $4-5 లో లంచి, $10 లోపు 'సోజూ' సహిత డిన్నర్ దొరుకుతుంది. సోజూ (సుర నుండి వచ్చిందంటారా?) వీళ్ళ దేశీ మద్యం. చిన్నాపెద్దా, ఆడామగా, బీదాబిక్కీ తేడాల్లేకుండా తాగే పానీయం. ఒక బాటిల్ ఒక డాలరుంటుంది. మన ఊళ్ళల్లో మనకి కనిపించే దృశ్యాలు- తాగేసి తూలేవాళ్ళు, పడిపోయిన వాళ్ళు, వాళ్ళని లేపి తీసుకొని పోయే వాళ్ళూ, ఇత్యాదులు - ఇక్కడ ఇబ్బడి ముబ్బడిగా కనిపిస్తోంటాయి. అప్పుడప్పుడు అమ్మాయిల్ని వీపుమీద వేసుకొని మోసుకొని పోయే అబ్బాయిలు కన్పిస్తోనే ఉంటారు. మళ్ళీ తెల్లారేసరికి పన్లోకి ఠంచనుగా వచ్చేస్తారు. తాగితే తప్పేముంది, తాగని నాకొడుకెవ్వడు ఈలోకంలో.. అన్న మన తెలుగు పాటల పదాలు నాకైతే నోట్లో ఆడుతోంటాయి వీళ్ళని చూస్తోంటే.

వీళ్ళ తిండికి ఒక విలక్షణమైన వాసన ఉంటుంది. సముద్రంలో దొరికే పదార్ధాలు తినడం, నువ్వులనూనె వాడడంవల్ల అనుకొంటాను. నేనిక్కడకి వచ్చిన మొదటి వారంలో అయితే బజార్లలో వెళ్తోంటే వికారం వచ్చేది. ఆ తర్వాత ఆ వాసనే తెలియట్లేదు, అలవాటయిపోయి. ఇంకొన్నాళ్ళు పోతే ఆ వాసనలేకపోతే వికారం వస్తుందేమో. ఈ అలవాట్ల మీద ఒక చిన్న పిట్టకథ. ఎప్పుడో ఒక తెలుగు పత్రికలో చదివా. ఒక సినిమా హీరో ని ఒకామ్మాయి పెళ్ళిచేసుకొంటుంది. మొదటి రాత్రి ఆ హీరో ఉలకడూ, పలకడు. తెరమీద అంత శృంగారమొలకపోసే హీరో ఇలా జీరో అయిపొయ్యాడేంటా అని ఆహీరోయిన్ తల్లడిల్లిపోయింది. అసలు ఆహీరోగారి తెరమీది రసికత చూసేకదా నేను ముచ్చటపడి పెళ్ళిచేసుకొన్నది అని తెగ బెంగపడి ఒక డాక్టరుగారిని కలిసింది. ఆరోజు రాత్రి డాక్టర్ చెప్పినట్లే పడగ్గదిలో ఒక టేపురికార్డరు పెట్టి హీరోగారు ప్రవేశించగానే ఆన్ చేసింది. అంతే మన హీరోగారు తన శృంగారనైపుణ్యాన్నంతా రుచిచూపించేసారు. ఇంతకీ రహస్యం తెలిసిందా? ఏంలేదు. టేపురికార్డరు ఆన్ చేయగానే లైట్సాన్, కేమెరా, ఏక్షన్ అన్న మాటలు వచ్చాయి. అవి వినిపించగానే అలవాటుగా మన హీరోగారు తన కర్తవ్యం నిర్వహించేసారు.
మెల్లమెల్లగా నేను కొద్దిగా కాలూ ఏయీ కూడదీసుకొని, ఒక రైస్ కుక్కరు, తర్వాత ఒక మైక్రోవేవు కొనుక్కుని నా వంట నేను చేసుకొని తింటున్నా. నా తిప్పలు నేను పడుతున్నా. అన్నట్లు నాకు వంట చేయడం చాలా ఇష్టం, ఒక అభిరుచి. ఎటొచ్చీ షడ్రుచుల జ్యోతిగారిలాంటి పద్ధతిగా వండే విధానం చెప్పేవారు, అలా వండేవారు నేను వంట చేయడం చూస్తే ముక్కుమీద, తర్వాత తినగలమోలేదో అన్న భయంతో నోటిమీదా వేలేసుకొంటారు. కానీ ఎవరూ భయపడక్కర్లే. ఇక్కడ ఒక తెలుగు కుర్రాడు బయోటెక్నాలజీలో పరిశోధన చేస్తూ, నావంట గత రెండు సంవత్సరాలుగా తరచూ తింటూ కూడా ఈమధ్యనే పి.హెచ్.డి. పట్టా తెచ్చుకొన్నాడు. నేను వంట చేసే విధానం ఆర్ధికశాస్త్ర సుత్రాలని అనుసరించి ఉంటుంది. ఆర్ధిక శాస్త్రంలో ఒక సూత్రం ఉంది. మనం పెట్టే ఖర్చులో వృద్ధి (increment) కన్నా, మనకి వచ్చే ఆదాయంలో వృద్ధి ఎక్కువ లేదా కనీసం సమానంగా ఉంటేనే మనం ఖర్చుపెట్టాలి. ఇక్కడ వంటలో మనం వంటలో గడిపే సమయం విలువలో వృద్ధి, రుచిలో వచ్చే వృద్ధితో సరిచూసి, కొద్దిగా రుచి తగ్గినా బాగా తక్కువ సమయంలో వంట అయిపోతే ఆ పద్ధతిని అనుసరించమని నా సూత్రం. నేను పాటించే పద్ధతిని పైన చెప్పిన తెలుగు కుర్రాడు, 'single step protocol' వర్ణిస్తాడు. సైంటిస్టుకదా, వాళ్ళ భాషలో చెప్పాడు. ఏక మెట్టు పద్ధతి అని తెలుగులో అనొచ్చా?
(సశేషం)


*నిబంధనలు వర్తిస్తాయి

Friday, February 16, 2007

e-బ్లాగర్ 'సమ'ఆవేశం

మన ఈ తెలుగు సమావేశానికి హాజరవడం ఈ నెలలో నేను సాధించిన ఘనకార్యం (achievments of the month) ఏదైనా ఉంటే ఇదేనేమో! క్రితంనెల సమావేశానికి వైరస్ వల్ల వేళ్ళలేకపోయాను. ఇప్పటిదాకా కనిపించకుండా చదివిస్తున్నహేమాహేమీలయిన బ్లాగ్వరులందరినీ కలవడం చాలా ఆనందం కలగచేసింది. ముఖ్యంగా అందరికన్నా అతి 'పిన్న' బ్లాగ్భీష్ముడు మన 'దీప్తిధార'కుడు శ్రీ రావు గారిని కలవడం. సమావేశం చాలా సరసంగా, ప్రయోజనకరంగా నడచింది. సుమారు మూడు గంటల తర్వాత సభ్యులు ఒకరొకరే బయలుదేరుతోంటే అప్పుడేనా, ఇంకాసేపు కూర్చొంటే బాగుంటుందనిపించింది. కానీ ఎంత మంచి అనుభూతికైనా ముక్తాయింపు తప్పదుగా! చదువరిగారు, తన బ్లాగులంతకాక పోయినా, రుచిగానే ఉన్న మిఠాయిలు తినిపించారు. 'వీవెన్' గారు తినలేదని ఇందుమూలంగా ధ్రువీకరించడమైనది. ఇప్పుడు, సమావేశంలో నే చూసిన బ్లాగర్ల బ్లాగులు చదువుతోంటే వాళ్ళగొంతుకల్లో వింటున్న భావన కలుగుతోంది.

మా చిన్నప్పటినుండీ బీమా ఏజెంటంటే జనాలు భయపడడం తెలుసు. నేను కూడా ఒకసారి ఒక ఏజెంట్ బారి నుండి తప్పించుకోవడానికి తెగ ప్రయత్నంచేయడం మరచిపోలేను. ఇప్పుడు నా బారినుండి తప్పించుకోవడానికి జనాలు తెగ ప్రయత్నిస్తున్నారని నా అంచనా. కనిపిస్తే చాలు తెలుగు బ్లాగులగురించీ, అంతర్జాలంలో తెలుగు గురించీ,తెలుగులో బ్లాగులు వ్రాయడం లోని ఆనందంగురించీ ఏకరువు పెడ్తోంటే ఆమాత్రం ప్రయత్నించడం సహజమేనేమో?

లోగోగురించికూడా కొద్దిగా చర్చజరిగింది. బహుశ: ఈసంఘంవాళ్ళు లోగోల కోసం ఒక ప్రకటన అన్ని తెలుగు ఆన్లైన్ పత్రికల్లోనూ విడుదలచేస్తే కొన్ని ఎక్కువ ఎంట్రీలొస్తాయేమో. మనం సంఘం రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాం కాబట్టి ఈ దిశగా కూడా ఒక అడుగు వేస్తే బాగుంటుంది. లోగోని కూడా రిజిష్టర్ చేయాల్సి ఉంటుందా?

చివరాఖరుగా, రావుగారి బ్లాగు చదివాను. సమావేశంలో నా హాజరీ గురించి, నాబ్లాగు గురించి 'ధారా'ళంగా వ్రాసినందుకు ధన్యవాదాలు. చిన్న వాడికి పెద్ద పరిచయం చేయడం బ్లాగ్సోదరుల పెద్దమనసుకి నిదర్శనం.

Thursday, February 08, 2007

ధర్మసందేహం - హైదరాబాదు ఎవరిది?

ఈవేళ టీవీ చూస్తోంటే తెలంగాణా ఉద్యోగులనాయకుడెవరో మాట్లాడుతూ హైదరాబాదులోపనిచేస్తున్న నాన్-లోకల్ ఉద్యోగులను వెంటనే పంపించేసి తెలంగాణా వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేసాడు. నాకో ధర్మసందేహం వచ్చింది. నాకు హైదరాబాదులో ఉన్న ప్రభుత్వోద్యోగాలను వివిధ ప్రాంతాల వారికి ఏరకంగా పంచుతారో తెలియదు. ఏదైనా నిష్పత్తి ఉందా? అలాంటిదేమైనా ఉంటే నాయకుల డిమాండు 'అధికంగా ఉన్న నాన్-లోకల్స్' ను పంపేయండి అని కదా ఉండాలి. అలా కాని పక్షంలో చాలా అపార్థాలకి, అనర్ధాలకీ దాయితీయవా ఇలాంటి డిమాండులు? సదరు నాయకుడు 'హైదరాబాదు ను తెలంగాణా నుండి విడదీసే ప్రయత్నాలను సహించమని' కూడా అన్నాడు. దీన్ని బట్టి నాకు అర్ధమయిందేమిటంటే, ఆ నాయకుడు మొత్తం నాన్-లోకల్స్ని బయటికి పంపాలనే ఉద్దేశ్యంలోనే ఉన్నాడని. ఇక్కడ రెండు విషయాలలో తెలంగాణా నాయకుల ధోరణి నాకు అసమంజసం అనిపిస్తోంది. ౧. కష్టమో, నష్టమో అ న్నిప్రాంతాల వాళ్ళం ఇప్పటిదాకా కలిసే ఉన్నాము. కలిసే ముఖ్యపట్టణాన్ని అభివృద్ధి చేసాము. ఉమ్మడికుటుంబాల్లో లాగానే ఏ ప్రాంతాలవాళ్ళు ఎంత చేసారో చెప్పడం, ఎవరు ఎక్కువ చేసారో విశ్లేషించడం అనవసరం, అధర్మం. ఉమ్మడి కుటుంబం విడిపోయినప్పుడు ఆ సమయంలో ఉన్న ఉమ్మడి ఆస్తులని పంచుకోవడం రివాజు. కాని హైదరాబాదు ఉమ్మడి ఆస్తికాదన్నట్లుగా తెలంగాణా వాదులు మాట్లాడడం ఎక్కడి న్యాయమో తెలియదు. ౨. విడిపోదల్చుకొన్న వాళ్ళు కాస్త డిగ్నిటీ గా విడిపోతే చరిత్రలో మన వేర్పాటు కాస్త గౌరవంగా వ్రాయబడుతుంది. అలాకాకుండా అనవసర ఆరోపణలూ, అభియోగాలూ చేసి వేరే ప్రాంతపు తెలుగు వాళ్ళు మోసగాళ్ళు, వంచకులూ అంటూ ప్రజలమధ్య ద్వేషం రగల్చడం ఎంతవరకూ న్యాయం? తెలుగువాళ్ళు, తమలో తామే ఇలా కొట్లాడుకొంటూంటే మిగిలినా వారూ నేర్చుకోంటారు. బొంబాయి నాయకులు 'అమ్చీ ముంబై' అని లేవనెత్తి ఎంత అసహనం రగిల్చారో తెలియదా? బీహారు నుండి రైల్వే ఉద్యోగాలకోసం వచ్చిన అభ్యర్ధులని తన్ని ఊళ్ళోకి ప్రవేశించనీయలేదు. మన దేశం, మనదేశం అని చంకలు గుద్దుకోవడమే కానీ నిజంగా ఇన్ని ముక్కలు చేసుకోంటూంటే ఇంకా భారతదేశం అనే కాన్సెప్ట్ ఏమైనా మిగిలిందా? ఆంధ్రా నుంచి చదువుకో, ఉద్యోగానికో వెడితే ఢిల్లీ (వేరే ప్రాంతం వాళ్ళు) వాళ్ళు ఏడుస్తారు. శ్రీకాకుళం నుండి మన ఉమ్మడి రాజధానికొస్తేనే సహించలేకపోతున్నామే, ఇంక ఢిల్లీ వాళ్ళు సహిస్తారా? ఇల్లా ప్రాంతీయ తత్వంతో కుంచించుకు పోతూంటే, ప్రపంచీకరణ కి అర్ధమేమిటి? విదేశీయులొస్తారు, పెట్టుబడులు పెడ్తారు, మన ఆర్ధిక వ్యవస్థని చేజిక్కించుకోంటారు. మనం మాత్రం, కులమనో, ప్రాంతమనో, కొట్టుకొందాం. . మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు మనని కబళించిన నాటి పరిస్తితులని సంతోషంగా కల్పిద్దాం. ఎలాగూ మనకి బానిస మనస్తత్వం పోలేదు కదా. ఎక్కువ కష్టపడఖ్ఖర్లేదు. విదేశీయుడు బాగుపడినా పర్వాలేదు మన శత్రు కులం వాడో, ప్రాంతం వాడో బాగుపడలేదు, హమ్మయ్య అని సంబరపడిపోదాం.

తమసోమా జ్యోతిర్గమయ

Tuesday, February 06, 2007

కొరియా కబుర్లు: అతిథి దేవోభవ

అతిథి దేవోభవ అన్న్దది మన సంస్కృతి. ఈ రోజుల్లో దీన్ని మన దేశంలో ఎంత బాగా (ఘోరంగా) అమలుచేస్తున్నామో మనందరికీ తెలుసు. ఏకంగా అతిథిని దేవుడిని చేసే సంస్కృతిని అమలుచేసేస్తున్నాము. దేవుడు చాలా మంచివాడు. మనం చిన్న పండు పెట్టినా ఏమనడు. మా చిన్నప్పుడు గుళ్ళోకెళ్ళాలంటే దేవుడరటి పళ్ళు తెమ్మని పురమాయించేవాళ్ళు. అసలు దేవుడరటి పళ్ళు అంటే మనం తినలేని అతి చిన్న అరటి పళ్ళని అర్ధం. దేవుడిని ఇంచక్కా మోసం చేయవచ్చు. ఏమీ మాట్లాడలేడు. పాపం అతిథులు మాట్లాడగల్గినా ఏమీ అనలేరు.

అతిథి అంటే తిథి లేకుండా వచ్చేవాడు అని అర్ధం. అంటే వేళా పాళా లేకుండా వచ్చేవాడని అర్హం. మా చిన్నప్పుడు మా ఇంటికి చుట్టాలూ, పక్కాలూ వస్తోండేవారు. అందులో మా ఊరు తాలూకా ముఖ్యపట్టణం కావడంతో అతిథుల తాకిడి కాస్త ఎక్కువే ఉండేది. ఒకరిద్దరైతే మరీ అతిథుల్లాగే వచ్చేవారు. రాత్రి అందరి భోజనాలైపోయాక అతిథులొస్తే బొగ్గుకుంపట్లూ, కిరోసిన్ స్తౌవ్‍లతో కుస్తీ మళ్ళీమొదలయ్యేది. కాని ఇంట్లో ఆడవాళ్ళు ఈవిషయమై రాధ్ధాంతాలూ, సిధ్ధాంతాలూ చేసినట్లు మా ఎవ్వరి దృష్ఠికీ రాలేదు. అతిథులు రావడం, వాళ్ళకి సదుపాయాలు చూడడం, వాళ్ళ పడక ఏర్పాట్లలో భాగంగా మేం ఇరుక్కుని పడుకోవడం - ఇత్యాదులన్నీ సహజంగా అనిపించేవి. అందుకని ఇబ్బందన్న భావం ఎప్పుడూ కలగలేదు. పెద్దవాళ్ళు మాత్రం డబ్బుకి ఇబ్బంది పడేవారని మాకు కొద్ది కొద్దిగా అర్ధమయ్యేది. పైపెచ్చు సాంప్రదాయాలు పాటించాలని అప్పుచేసైనా సరే పండగలూ, పబ్బాలూ, పురుళ్ళూ, పుణ్యాలూ జరిపిస్తోండేవారు. మాకు అవగాహన వచ్చే వయస్సులో ఇవన్నీ ఎందుకన్న భావాలొస్తోండేవి. కాని బయటకి చెప్తే పెద్దవాళ్ళు కోప్పడేవారు. ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది, మనకున్నా లేకున్నా మన వాళ్ళకి కాస్తో కూస్తో మేలుచేయడం, వాళ్ళతో కలిసి పండగలూ, పబ్బాలూ జరుపుకోవడం, డబ్బు నిలవేయడం కన్నా, మన స్వంతంకోసమే ఖర్చు చేయడం కన్నా ఎక్కువ ఆనందం ఇవ్వగలవని. మనతో రక్త సంబంధం ఉన్నవాళ్ళకోసంకూడా మనం ఏమీ చేయలేకపోతే రక్తసంబంధం అన్న పదానికి విలువేమిటి? అర్జున్ సినిమాలో మహేష్‍బాబు వాళ్ళ నాన్న, అత్తయ్య వ్రాసిన ఉత్తరం చదువనుకూడా చదవలేదని తెలిసి తెగ బాధపడ్తాడు. ఆ సినిమా చూసాకా నా ఈ భావనల్లో లోపంలేదని అనిపించింది. కాని మా చిన్నప్పటికీ, ఇప్పటికీ మన ప్రాధాన్యతల్లో చాలా తేడా వచ్చింది. అప్పుడు డబ్బులుండేవి కాదు. అయినా కొంతమంది అప్పుచేసి మరీ ఆదుకొనేవారు. ఇప్పుడు మనం ఎవరికైనా సహాయంచేయాలంటే డబ్బులేమి కారణం అవట్లేదు. రామ్‍దేవ్‍ మహరాజు గారు చెప్పినట్లు ఈకాలంలో మనుష్యులకి పొట్టపెద్దదీ, గుండె చిన్నదీ అయిపొయ్యాయి.

సూక్ష్మంగా ఆలోచిస్తే, మన పాతకాలపు ఇళ్ళకుండే అరుగులూ, దీపపు గూళ్ళూ అతిథులు, బాటసారులకోసమే అని అర్ధమవుతుంది. అలాగే పాలకులు సత్రాలు కట్టించి అతిథులని ఆదరించేవారు. వేరే ఊళ్ళనుండి వచ్చిన వాళ్ళని అందరూ ఆదరించేవాళ్ళు. ఈ కాలంలో మన ఇంటికీ, ఊరుకీ, రాష్ట్రానికీ, దేశానికీ వచ్చిన వాళ్ళని ఏరకంగా ఆదరిస్తున్నామో ఒక్కసారి పరిశీలించుకొంటే మనం మన సాంప్రదాయాల్నిఎంత గౌరవిస్తున్నమో తెలిసి బాధ కల్గుతుంది.

ఈ విషయంలో కొరియా ప్రజలు, విదేశీయుల పట్ల వారు చూపే ఆదరాభిమానాలతో మమ్మల్ని ఆకట్టుకొన్నారు. మనమే కాకుండా అనేక దేశాలనుండి వచ్చిన విదేశీయులు కొరియాలో ఉంటున్నారు. ఒక అమెరికన్ నల్లజాతి మహిళ (మా సహోద్యోగురాలు) ఒక సందర్భంలో తనకి వేరే విదేశీయుల్తో కన్నా, కొరియన్ల తో ఉన్నప్పుడే ఎక్కువ భద్రతా భావం కల్గుతోందని చెప్పింది. మేము బయటికి వెళ్తే విదేశంలో ఉన్న భావంకానీ, భయం కానీ కల్గదు. ఎవ్వరూ వ్యతిరేక ప్రవర్తన చూపించలేదు. ఈ విషయంలో సోల్ లో ఉన్న వాళ్ళూ, చిన్న పల్లెల్లో ఉన్నవాళ్ళూ ఒకే రకంగా ప్రవర్తించారు. పైపెచ్చు, విదేశీయులనగానే ప్రత్యేకంగా గౌరవిస్తారు. మేము ఒక దివికెళ్ళాం. అక్కడ అన్నీ దూరాలే. భాష కూడా ఒక సమస్యే. అయినా మేము ఎవరినైనా సహాయం అడిగినదే తడవుగా, పాపం నిఘంటువులు తిరగేసి చాలా కష్టపడి మాకు దారి చెప్పడమే కాకుండా, షాపులవాళ్ళైతే ఒక చోట అయిస్ క్రీము, ఒకరైతే కమలా ఫలం మాపిల్లలకి ఇచ్చారు. ఇంకొకాయనైతే మమ్మల్ని మేం వెళ్ళాల్సిన చోట దింపేసి అక్కడ ఉన్న ఒక షాపమ్మాయితో మాపనవ్వగానే మాకోసం కాల్ టేక్సీ పిలిపించమని అప్పగింతలు పెట్టి మరీ వెళ్ళాడు. అక్కడి మ్యూజియంలూ, ఎక్జిబిషన్ల ప్రవేశ రుసుములో విదేశీయులకి 20-25 శాతం రాయితీ ఉంటుంది.

ఆన్నిటికన్నా ముఖ్యమైనది, అక్కడి టేక్సీ వాళ్ళ ప్రవర్తన. మామూలుగానే వినమ్రంగానే ఉంటారు. విదేశీయులంటే మరీనీ. మేము లగేజీతో వెళ్తే, లోపల పెట్టడం, బయటకి తీయడం వాళ్ళే. విమానాశ్రయం నడిపే లిమోసిన్ బస్సుల్లో కూడా వాళ్ళేర్పాటు చేసిన పోర్టరు లేకపోతే బస్సు డ్రైవర్ మా లగేజీ పెట్టడం, తీయడం చేసేవారు. ఎక్కడా మమ్మల్ని ఏవిషయంలోనూ ఇబ్బంది పెట్టలేదు. ఇక్కడి ఆటో, టక్సీ వాళ్ళ ప్రవర్తన దీంతో పోల్చగలమా? ప్రీపెయిడ్ ఆటో, టాక్సీలవాళ్ళు కూడా మోసాలూ, దుష్ప్రవర్తనతో విసుగెత్తిపోతున్నాము. ఢిల్లీలో అయితే, ప్రీపెయిడ్ టాక్సీ డ్రైవరు దిగాల్సిన చోట దింపేసి, 'సార్ మీసంతోష'మంటాడు. ప్రీపెయిడ్ చార్జీ రెట్టింపు చెల్లించాకా ఇంకా సంతోషమెక్కడుంటుంది!

ఈ మధ్యన పిల్లలతో సాలార్ జంగు మ్యూజియానికెళ్ళాం. అక్కడికి విదేశీయులూ, వేరే రాష్ఠ్రాలవాళ్ళూ చాలామంది వస్తున్నారు. కానీ మ్యూజియం సాయంత్రం 5 గంటలకి మూసేస్తారు. చార్మినార్ కెళ్తే, అది కూడా 5 గంటలకే మూసేస్తారు. రెండు, మూడు రోజులకొచ్చే వాళ్ళు ఈ రకంగా ఆఫీసు సమయాలు పాటిస్తే ఏం చూడగలరు? ఇది ఇలాఉంటే, మ్యూజియం టిక్కెట్ భారతీయులకి ౧౦ రూపాయలు. విదేశీయులకి 150 రూపాయలు! అంతే కాకుండా, ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఫోటోగ్రఫీ మీద ఆంక్షలు, కెమేరాకి ప్రత్యేక రుసుములూ ఒక్క మన దేశంలోనే కనిపిస్తాయనుకొంటా. బహుశ: మన నాసిరకం, పాతకాలపు పద్దతులూ, యజమాన్యం ప్రపంచానికి తెలియకూడదనేమో?

ఒకసారి ఢిల్లీలో ఒక అమెరికన్ ఫ్రెండుతో ఒక పుస్తకాల షాపుకెళ్ళాను. పుస్తకాల షాపువాళ్ళు కొంత శాతం రాయితీ ఇస్తోండేవారు. మా ఫ్రెండు కొన్ని పుస్తకాలు కొన్నాక బిల్ వేసే సమయంలో షాపు యజమానితో 'రాయితీ యిస్తున్నారు కదా' అని గుర్తుచేసాను. అసలే విదేశీయుడికి రాయితీ ఇవ్వలేకా, మానలేకా మథనపడుతోన్న ఆ యజమాని నామీద ఒంటికాలుమీద లేచాడు. విదేశాలనుండి వచ్చిన మనవారిదగ్గరకూడా డాక్టర్లూ, బార్బర్లూ కూడా ఎక్కువ చార్జీని వసూలు చేయడం నాకు తెలుసు.

అతిథి దేవో భవ అని మన ప్రభుత్వం వారు నినాదాలిచ్చినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదు. మనందరి ప్రవర్తనా మారితేనే ఏమైనా జరుగుతుంది. మనమందరమూ మన ప్రవర్తనలని నిరంతరం సరిదిద్దుకొంటూ, సాటి మనిషి సౌఖ్యానికి సాయపడగల్గి, సాదరంగా చూడగల్గే మన సాంప్రదాయాన్ని తిరిగి పాటించగల్గితేనే ఏమైనా మార్పు కల్గుతుంది.

Tuesday, January 30, 2007

బ్లాగులకో కితాబు

'తేనెగూడు', ఇన్డీబ్లాగీస్ సౌజన్యంతో తెలుగులో ఉత్తమ బ్లాగులకో అవార్డు ఇవ్వబూనడం అత్యంత ముదావహం. బ్లాగర్లు అవార్డులకోసం వ్రాయడంలేదన్న విషయం అందరికీ తెలిసినదే అయినా అవార్డు వస్తే కొండెక్కినట్లుంటుందన్నది సత్యం. ఈఅవార్డులు అనేక అంశాలలో ఇస్తున్నారు. బ్లాగర్లందరూ తమకినచ్చిన తెలుగు బ్లాగులని నామినేట్ చేస్తే తెలుగు వెల్లువ బయటి లోకానికి తెలుస్తుంది. నాకు వచ్చిన సందేహం: తెలుగు బ్లాగులని ఒక్క indic వర్గంలోనే నామినేట్ చేయాలా, లేక ఏ వర్గంలోనైనా చేయచ్చా? నేనైతే కొన్ని తెలుగు బ్లాగులని వేరే వర్గాల్లో కూడా పెట్టాను.

Friday, January 26, 2007

తెలుగు బ్లాగుకొక లోగో

లోగో అన్నది అది ప్రాతినిధ్యం వహించే సంస్థకో, ఉద్యమానికో 'మొహం' లాంటిది. face is the index of mind కదా. అందుకే లోగో చూడగానే ఆ సంస్థ ఏమిటో తెలిసేలా ఉంటే అది గొప్ప లోగో అని చెప్పొచ్చు. కొన్ని సంస్థల పేర్లు logo-friendly' గా ఉంటాయి. కొన్ని లోగోలు వాటిని తయారుచేసిన కళాకారుల సృజనాత్మక శక్తిని ప్రతిబింబిస్తాయి. నాకు బాగా నచ్చిన లోగో ఈ టీవీది. దాంట్లో తెలుగు ఈ ఉంటుంది, ఆంగ్ల E TV కూడా ఉంటుంది. ఈనాడు electronic version లోగోలో ఈ తో పాటు e కూడా ఉంటుంది.


రఘురామ్ ఆ మధ్య తెలుగు బ్లాగర్ సంఘానికి ఒక లోగో ఉంటే బాగుంటుందని సూచించారు. చాలా మంది ఆమోదించారు. ఈ ప్రయత్నానికి తొలి అడుగుగా ఇక్కడ కొన్ని లోగోలు ప్రతిపాదిస్తున్నాను. వీటిని MSPaint లో తయారుచేసాము. వేరే ప్రతిపాదనలు కూడా సేకరించి అన్నింటినీ ఓటింగు పెట్టి జనామోదమైన లోగోని అంగీకరిస్తే బాగుంటుందేమో. బ్లాగర్ సంఘం పెద్దలకి ఈమేరకి నా విన్నపం. ఇక్కడ ఇచ్చిన లోగోల్లో మూల సూత్రం: సాలెగూడు internet కీ, తెలుగు అ, ఆంగ్ల e కలిసొచ్చేలా లోపల అక్షరం internet లో తెలుగుకీ, electronic media కి చిహ్నంగాను ఉపయోగించడం. మూడు లోగోలు ఒకటే, రంగులు వేరే. ముందు ముందు ఇంకా ఏమైనా ఐడియాలొస్తే update చేస్తా.


Monday, January 22, 2007

బాబా, కేసీఆర్, తెలంగాణా

నిన్న రాత్రి వార్తల్లో కేసీఆర్ బాబాగారి వ్యాఖ్యలని ఖండిస్తూ బాబాకి రాజకీయాలెందుకని ప్రశ్నించడం విని కాస్తంత ఆశ్చర్యపోయాను. ఆయన ఏఉద్దేశ్యంతో ఆ వ్యాఖ్య చేసినా బాబాలాంటి సమాజానికి పనికొచ్చే పనులు చేసేవాళ్ళకి రాజకీయాల్లో స్థానం లేదని చెప్పకనే చెప్పారు. కాని ప్రజాస్వామ్య భారతదేశంలో పుట్టిన వాళ్ళెవరైనా, వాళ్ళు బాబాలైనా, లుచ్చాలైనా వారి అభిప్రాయం చెప్పే హక్కుందనుకొంటాను. బాబా చేసిన వ్యాఖ్య ఈనాడులో చూసాను. నాకేమి పెడార్ధాలు కనిపించలేదు. కేసీఆర్ కి ఇంత ఉలుకెందుకో? raise your voice if your argument is weak అనే వాక్యాన్ని చాలా వాదాలు నిరూపిస్తున్నాయి.


బాబా మీద ఎవరికైనా ఎలాంటి అభిప్రాయం ఉన్నా, ఆయన అనేకమంది నుండి సేకరించిన సంపద సమాజసేవకి ఉపయోగపడుతోందనడంలో సందేహంలేదు. అనేక జిల్లాల్లో (కొన్ని తెలంగాణా జిల్లాల్లో కూడా) ఆయన ప్రవేశపెట్టిన తాగునీటి పథకం ఆయనపట్ల ఉన్న గురి వల్ల నిర్వాహకులు అతి త్వరగా, నాణ్యంగా పూర్తిచేయడం చూస్తే 'కట్' ల కోసమే పనిచేసే యంత్రాంగం సిగ్గుపడాలి. ప్రభుత్వాలు తమ బాధ్యతలను నిర్వహించడం కోసం తమ వనరులు ఉపయోగించకుండా (తి.తి.దే. తొ సహా) ఒక వ్యక్తిని డబ్బులడుక్కోవడం సిగ్గు చేటు. ఈరకమైన చిత్తశుద్ధి రాహిత్యాన్ని రాజకీయాలనడం జనాలు చేసుకొన్న పాపం.

Sunday, January 14, 2007

సంక్రాంతి సంబరాలు


కొన్నితెలుగు బ్లాగులు సంక్రాంతి సందర్భంగా శోభాయమానంగా వెలిగిపోయాయి. వాటిని చూసి మహానందమయింది. తెలుగు వారికి తెలుగంటేనూ, తెలుగు పండగలంటేనూ అభిమానం పోలేదని తెలిసి చాలా సంతోషమయింది. దాంతో, ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయింది మనసు.

మా చిన్నప్పుడు పండగలంటే ఒక రకమైన మోజుండేది. పండగలంటే పిండివంటలు, కొత్తబట్టలు, మనం చుట్టాలవడమో, లేకపోతే మనకే చుట్టాలురావడమో జరిగేది. రోజువారి జీవితానికి భిన్నంగా ఉండేదే పండగన్న భావం కలిగేది. ఆభిన్నత్వాన్ని అనుభవించడనికి సెలవు సహకరించేది. సూక్ష్మంగా అలోచిస్తే మన పండగలన్నీ కూడా కొన్ని మైలురాళ్ళకీ, కొన్ని సంఘటనలకీ లంకె ఉన్నవే అనిపిస్తాయి. ఒక పండగ సూర్యుడి గమనానికి సంబంధించయితే, ఒక పండగ పంట నాటడానికీ, ఇంకోటి కోతలకీ సంబంధించినది. మన పాత తరానికి జీవితాన్ని అనుభవించడం బాగా తెలుసని మన పండగలు తెలియచెబుతాయి. అల్లాగే మన జీవవ్యాపారాలకి సంబంధించిన మైలురాళ్ళకి కూడా కొన్ని సంబరాలు లంకె పెట్టి జీవితాల్ని సారవంతం చేసుకొని అనుభవించారు. బారసాల, అన్న ప్రాసన, పెళ్ళి, పేరంటం, షష్ఠిపూర్తి - ఇలాంటివి ఒక ఉత్సవం లాగా చేసుకోంటూ తమ జీవితాలకి రసపూర్తి కల్గించుకొన్నారు. యాంత్రికతను తొలగించుకొన్నారు.

మా అదృష్టంకొద్దీ మా చిన్నప్పుడు పండగలని పండగల్లాగా అనుభవించాం. మా పిల్లల్ని చూస్తే వాళ్ళు చాలా కోల్పోతున్నారనిపిస్తుంది. వాళ్ళకి ఆ కోల్పోయిన ఫీలింగు కలగక పోవడం వాళ్ళ దురదృష్టం. మా అబ్బాయయితే మీది పాతకాలం అని నాతోటీ, మా అమ్మతోటీ అనేసాడు కూడా. కొత్తకాలం అంటే ప్రస్తుత కొలమానం ప్రకారం కొళాయి తిప్పగానే నీళ్ళురావాలి, స్విచ్చి నొక్కాగానే గాలీ, వెలుతురూ రావాలి, కాళ్ళు కదపకుండా దూరాలు వెళ్ళాలి. శరీరాల్ని కాస్తైనా కష్టపెట్టకుండా పనులన్నీ జరిగిపోవాలి. ప్రస్తుత సామాజిక వాతావరణం కూడా ఇలాంటి సుఖాలకే పెద్దపీట వేస్తోంది. ఇప్పుడు పండగంటే సెలవు మాత్రమే! అంటే పండగరోజు ఆలశ్యంగా నిద్రలేవాలి. అది రూలూ. అన్ని పనులూ ఆలశ్యం చేసుకోవాలి. ఆనక మొద్దు పెట్టి (idiot box) ముందు గంటలతరబడి కూర్చొని కాలం గడిపెయ్యాలి. ఒక ఇరుగూ పొరుగూ, ఒక అచ్చటా ముచ్చటా ఏమీ ఉండవు. ఆనక దెబ్బలాటలూ మామూలే. ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు కొత్త బట్టలు కొనేయడం, ఏ పిండివంటలు తినాలన్నా 'స్వగృహా' అన బడే పరగృహాలకి పోయి కొనుక్కొని తినేయడంతో పండగంటే ఏ ప్రత్యేకతా లేకుండా పోయింది.

మా చిన్నప్పుడు పండగంటే కొన్ని రోజుల ముందునుంచీ హడావడి మొదలు. అందులో సంక్రాంతి అంటే తెలుగు వాళ్ళకి పెద్ద పండగ. మాకు అర్ధసంవత్సర పరీక్షలయ్యాక సంక్రాంతి కలిసేలా సుమారు రెండు వారాలకి తగ్గకుండా సెలవలిచ్చేవారు. ఇప్పుడు ఆంధ్రదేశంలో చాలా మటుకు స్కూళ్ళకి క్రిస్మస్ సెలవలిస్తున్నారు. సంక్రాంతికి రెండు, మూడు రోజుల్తో సరిపెట్టేస్తున్నారు. చివరికి భారతీయ విద్యాభవన్ లాంటి అచ్చమైన దేశవాళీ పేరు పెట్టుకొన్నస్కూళ్ళది కూడా ఇదే పద్ధతి. ఇంటికి సున్నాలెయ్యడం, పాతసామానులు, చెత్తాచెదారం తీసి ఇల్లూ వాకిలీ శుభ్రం చేయడం, కడగడం, వీటితో ఒక వారం పైన పట్టేది. పెద్దవాళ్లకి ఒళ్ళు హూనమయ్యేది, కానీ మాకు చాలా సంబరంగా ఉండేది. మేం చేయగల పనులు మా చేత చేయిస్తో ఉండేవారు. తర్వాత, నిలవ ఉండి, నలుగురికీ పంచడానికి పనికి వచ్చే తీపీ, కారం పిండి వంటలు తయారు చేసేవారు. చిట్టిగార్లు లాంటివి చేస్తోంటే మేమందరం ఇత్తడి చెంబులు తీసుకొని కూర్చొనే వాళ్ళం, ఉండల్ని మొత్తడానికీ, ఆపైన వేపినవి వేపినట్లే రుచి చూసేయడానికి. అలా చేసిన చిట్టిగార్లలో మాశ్రమా, ఉత్సాహాలు మరింత రుచిని చేర్చేవి. ఆరోజుల్లో కాస్తంత భారీ పిండివంటయితే ఇరుగు పొరుగులు ఒకరికొకరు సహాయపడేవారు. అందుకని, చివరలో కొంత మేరకి ఇరుక్కీ, పొరుక్కీ పంచిపెట్టేవారు. ఆ పంచుకోవడంవల్ల కూడ ఒక రుచి వచ్చేది. ఇప్పుటి స్వగృహా వంటకాల్లో అసలైన రుచి లాభాలు మాత్రమే. ఎవరికైనా పెట్టినా, రూపాయలు వారి దోసిళ్ళలో పోస్తున్న అనుభూతి మాత్రమే కలుగుతోంది.

ఏపండగైనా సరే పొద్దున్నే4.30 ప్రాంతాల్లో లేపేసే వాళ్ళు. సంక్రాంతి అయితే పొద్దున్నే లేవగానే వేడినీళ్ళపొయ్యి దగ్గర చతికిలబడిపోయేవాళ్ళం. తలంటుకోసం రమ్మంటే 'పహలే ఆప్' అంటూ సహోదరులకి తెగ మర్యాద చేసేవాళ్ళం. మొత్తం మీద తప్పనిసరి కుంకుడుకాయల తలంటు కానిచ్చి మళ్ళీ పొయ్యి దగ్గర చేరేవాళ్ళం. మా అమ్మ అందరికీ తలంటి, తనుకూడా కానిచ్చేసి వంటపనికి దూకేసేది. మళ్ళీ 10, 11 గంటలకల్లా భోజనాలు తయారైపోయేవి. చేతుల్లో యంత్రాలేమైనా పెట్టుకొని పనిచేసేవారేమో అని పిస్తుంది ఇప్పుడు ఆలోచిస్తే. ఆతర్వాత పెద్దవాళ్ళ భోజనాలు. కాసేపు ఆటల తర్వాత మధ్యాహ్నం 3 ప్రాంతాల్లో మొహాలు కడుక్కొని కొత్తబట్టలిమ్మని వేధించేవాళ్ళం. ఎంత లేటు చేస్తే బట్టలకి అంత మేలని కాస్త లేటు చేసేవారు పెద్దవాళ్ళు. మేమూరుకొంటామా, పక్కవాళ్ళపిల్లలు వేసేసుకొన్నారని చెప్పి తొందరచేసేవాళ్ళం. మా తమ్ముడు కాస్తంత ఉత్సాహవంతుడు. అందుకని వాడిని నక్షత్రకుడ్ని చేసి ముందుకు తోస్తో ఉండేవాళ్ళం. కొత్త బట్టలు వేసుకొన్నప్పట్నించి అవి మాసిపోతాయని రంథి. మా అన్నయ్య, తమ్ముడు అయితే అంత పట్టించుకొనే వాళ్ళు కాదు. కొత్తబట్టలు కట్టుకొన్న ఉత్సాహంలో మరి కాస్త విజృంభించి అవి మాసి పోయేదాకా ఆడేవారు. అన్నిటికన్నా నాకు ఇప్పటికీ నచ్చిన విషయమేమిటంటే పండగ రోజు దెబ్బలాడుకోవద్దని చెప్పేవాళ్ళు. మేము కూడా చాలా సీరియస్ గా తీసుకొనే వాళ్ళం ఆ మాటని. ఆ రకంగా కూడా పండగకి ఒక ప్రత్యేకత ఉండేది.

సంక్రాంతి అంటే గుర్తొచ్చేవిషయం ఇంకోటుంది. అది ముగ్గుల పర్వం. ధనుర్మాసాన్ని స్వాగతించడంతో మొదలైన ముగ్గుల హడావిడి ముక్కనుము తో రథం ముగ్గుతో ముగుస్తుంది. రకరకాలైన ముగ్గులు సేకరించి రోజుకొక ముగ్గు ముంగిట వేయడం ఒక ముచ్చటైన సంస్కృతి. మా అక్క ముగ్గులు పెడుతోంటే మేమందరం సహాయం చేస్తోండేవాళ్ళం. పత్రికల్లో వచ్చే ముగ్గులు చూసి చుక్కలు లెక్కపెట్టడంలో సాయంచేయడం, ఎలా వేయాలోతర్జన భర్జనలు చేయడం మాపని. మానాన్నగారు లెక్కల మాస్తారు. ఆయన ముగ్గులని జామెట్రీ దృష్టితో చూసి సలహాలు చెప్తోంటే మా అక్క ఇరకాటం పడ్తో ఉండేది. అన్నీ అయ్యేసరికి వీధిలో వేరే వాళ్ళు ఆ ముగ్గు కాస్తా పెట్టేస్టే కాస్త నిరుత్సాహంగా అనిపించేది. ఈ ముగ్గులేయడంలో చుట్టు పక్కల ఆడపిల్లల్లో పోటీ ఉండేది. ఏముగ్గు పెట్టబోతున్నారో వేరేవాళ్ళకి తెలియకుండా చివరిదాకా జాగ్రత్త పడేవాళ్ళు. వేరే వాళ్ళ ముగ్గు వివరాలు అడగడానికి అభిమానం అడ్డొచ్చి నడి రాత్రి వెళ్ళిచుక్కలు లెక్క పెట్టి ముగ్గు నేర్చుకోవడానికి తెగ ప్రయత్నిస్తోండేవాళ్ళు. సాయంత్రమో, తెలవారగట్లో చలిలో చుక్కలు పెట్టి ముగ్గు కలుపుతోంటే మా అక్కకి మేము సాయం కూర్చొనేవాళ్ళం. చుక్కలు పెట్టడం, వాటిని కలపడం బాగా రాకపోతే చెరిపి మళ్ళీవేయడం, పక్క వాళ్ళముగ్గుతో పోల్చుకోవడం మామూలే. నచ్చకపోతే బాధ పడడం, మేమందరం ఓదార్చడం ఇవన్నీ మధురమైన స్మృతులు. పనిలోపనిగా నా క్కూడా కాగితం మీద ముగ్గులుపెట్టడం వచ్చేసింది.

మా ఈ ముగ్గుల సరదా అపార్ట్ మెంట్ ల నివాసంతో భంగపడింది. ఈ మధ్యన మా అమ్మాయి స్కూల్లో ముగ్గుల పోటీలో పేరిచ్చివస్తే మా ఇంట్లో ఉత్సాహం మళ్ళీ వచ్చింది. అందరం ముగ్గు కొని, రంగులు కొని తను ప్రాక్టీస్ చేస్తోంటే సంతోషపడిపోయాం. చివరికి తనకో ప్రైజొస్తే హమ్మయ్య ముగ్గుల సంస్కృతి అంతరించిపొలేదని హాయిగా ఊపిరి పీల్చుకున్నాం. ‍చివరగా ఈ బ్లాగు మొదట్లో ఇచ్చిన రథం ముగ్గు మా అమ్మాయి వేసినది. దీనికి టెక్నికల్ సలహాదార్లు: నేను, మా అబ్బాయీని.
Monday, January 01, 2007

నూతన సంవత్సర శుభాకాంక్షలు


అంతరజాలం (internet) లో తెలుగు ప్రభ జాజ్వల్యమానంగా వెలిగిపోతుండడం చాలా ముదావహం. ఈ తెలుగు వెలుగు ఇలాగే ఈ కొత్త సంవత్సరంలోనూ, ఆపైనా కొనసాగాలని కోరుకొంటున్నాను.
నేను ప్రస్తుతం మనదేశానికి శీతాకాలపు సెలవలకొచ్చాను. ఇక్కడ హైదరాబాదు లో ఉన్నప్పుడు ఒక మిత్రుడి ప్రోద్బలంతో మాఇంటికి దగ్గరే ఉన్న చాచా నెహౄ పార్క్ లో భారతీయ యోగ సంస్థాన్ వారి యోగా క్లాసులకీ వెళ్ళేవాడిని. సుమారు ఒక సంవత్సరంలో నాకూ, నన్ను చూసిన వాళ్ళకీ కూడా నాలో చెప్పుకోదగ్గ ఉత్సాహకరమైన మార్పు కనిపించింది. ఉచితంగా చెబుతున్నాకూడా జనం రావట్లేదు, డబ్బులు తీసుకొని నేర్పేవాళ్ళ దగ్గర బారులు తీర్చి మరీ నేర్చుకొంటున్నారని మా క్లాసులు నడిపే వాళ్ళు వాపోయేవారు. బహుశ: ఉచితంగా వచ్చిన వరాలు కూడా మనకి వెగటుగా ఉంటాయన్న మాట.
ఒక విషయం నాకు బాగా అనుభవమయింది. అదొక పెద్ద పారడాక్స్. రసెల్స్ పారడాక్స్ లాగా సత్యాస్ పారడాక్స్ అనొచ్చేమో. ఒక మనిషి ఉంటాడు. ఆయనకి వ్యతిరేకభావనలెక్కువ (negative thinking). కాని ఆయన, అలాగే ఆయనలాంటి వాళ్ళు, ఆవిషయం గ్రహించడానికి ఇష్ట పడరు. పైపెచ్చు తను తప్ప మిగిలిన వారందరూ ఏదో సమస్యతో సతమౌతున్నారని తెగ బాధ పడినా ఆశ్చర్యపోవఖ్ఖరలేదు. పైపెచ్చు, మంచిచెప్పిన వారిమీద ఒంటికాలి మీద లేచి కించపరచే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళకి సహాయంచేయడానికి మానసికవైద్యలూ, సలహాదారులూ, పుస్తకాలూ అందుబాటులో ఉన్నా కూడా వాళ్ళకి అటువైపు ధ్యాస ఉండదు. అవటానికి ఇవన్నీ ఉన్నవి ఇలాంటి వాళ్ళకోసమే. వేరొక రకం మనిషిని చూడండి. ఈయనలాంటి వాళ్ళు, సహజంగా సానుకూలదృక్పధం ఉన్నవాళ్ళే. వీళ్ళు మీకు భగవద్గీత ఉపన్యాసాలు జరిగేచోటో, ఏ రామక్రిష్ణామఠంలోనో, శంకరమఠంలోనో, యోగా క్లాసుల్లోనో, సామాజిక సేవా కార్యక్రమాల్లోనో కనిపిస్తారు (హిందువుల్లోనే కాదు, అన్ని మతాలవారిలోనూ వారివారి మతపరమైన నమ్మకాలని బట్టి మసీదుల్లోనో, చర్చిల్లోనో, ఇతర ధార్మికప్రదేశాల్లోనో కనిపిస్తారు). వాళ్ళింటికెళ్ళి చూడండి. మీకు self-help పుస్తకాలు, మానసికారోగ్యానికి దోహదం చేసే ఇతర సాహిత్య సామగ్రీ దండిగా కనిపిస్తాయి. వాటిని వీరు చాలా భక్తిగా, శ్రధ్ధగా చదివి నేర్చుకొన్న విషయాలని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తో ఉంటారు. అవటానికి వీళ్ళకి అంతగా ఇలాంటి ఉపకరణాల అవసరంలేదు. ఇలా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్న వాళ్ళు నేర్చుకోకుండానూ, ఇప్పటికే మంచి ప్రవర్తన ఉన్న వాళ్ళు ఇంకా మెరుగవడానికి కృషి చేస్తూనూ ఉన్న పరిస్థితి కన్న పెద్ద పారడాక్స్ ఇంకోటుండదు. కానీ ప్రపంచం ఎవరు ఎలా నడచుకొంటూ ఉన్నా ముందుకుపోతూనే ఉంటుంది. నదులు ప్రవహిస్తూనే ఉంటాయి, ఎవరు ఏరకంగా ఆనీటిని వాడుకొంటున్నా సరే. బాగుపడేవాళ్ళు బాగుపడుతూనే ఉంటారు, పాడయ్యే వాళ్ళు పాడవుతోనే ఉంటారు. మంచిమాటలు చెప్పే వాళ్ళు ఎవరు విన్నా వినక పోయినా తాము చెప్పాల్సిన మంచిమాటలు చెబుతోనే ఉంటారు. అది వారి స్వధర్మం.

నూతన సంవత్సరంలో మొదటి రోజు మా యోగా సెంటరుకొచ్చే ఒక సజ్జనుడు మా అందరికీ మన శరీర ధర్మం గురించి, ఆరోగ్యం గురించి నాల్గు మంచి మాటలు తెలుగులోనూ, ఆంగ్లంలోనూ వ్రాసి అందరికీ ఇచ్చాడు. ఆ మంచి ముక్కలని మీతో పంచుకొంటున్నాను. తెలుగులో ఉన్న వ్యాసాన్ని ఇక్కడ చదవండి.
నూతన సంవత్సర శుభాకాంక్షలతో - సత్యసాయి


*