Saturday, November 24, 2007

సత్యశోధన - వార్షికోత్సవ టపా

సత్యశోధనకి ఏడాది నిండి రెండో ఏడొచ్చింది. తేదీ గుర్తు లేదు కానీ, నవంబరు 20 ప్రాంతంలో నా బ్లాగు మొదలు పెట్టా. బ్లాగ్సోదరులిచ్చిన ప్రోత్సాహంతో ఇప్పటికి 44 టపాలు అయ్యాయి. మీఅందరికీ ఈ సందర్భంగా నా నెనర్లు. నాబ్లాగులో నెలకి సరాసరి 3.67 టపాలు వచ్చాయి. అంటే నేను పెట్టుకున్న లక్ష్యం 4 కన్నావెనకపడ్డా. ఈమధ్యలో చాలా అంతరం రావడం దీనికి కారణం.

నా గ్రహబలాన్ని ప్రతీఏటా పంచాంగం రాగానే చూసుకోవడం నా అలవాటు. ఇది మా నాన్నగారు స్వర్గీయ రమేష్ చంద్రబాబు గారి నుండి వచ్చినది. ఎటొచ్చీ ఆయన కొంచెం గంభీరంగానే తీసుకొనేవారు. నేను ఆసందర్భాన ఆయనని తలుచుకోవడం ప్రధానాశయంగా చూస్తోంటాను. అదేంటో ఆయనకాలంలోకానీ, ఆతర్వాతకానీ రాజపూజ్యంకన్నా అవమానమే ఎక్కువ ఉంటూ వస్తోంది. ఒకసారి రా.పూ. 1, అ.మా.5 అయితే, ఇంకోసారి 5, 10. ఎప్పుడైనా పొరపాటున రా.పూ., అ.మా.కన్నా ఒకటెక్కువున్నా అలవాటు కొద్దీ ఆసంవత్సర ఫలితం కూడా మిగిలిన వత్సరాల ప్రతిధ్వనిలాగే ఉండేది. కానీ బ్లాగ్లోకంలో అడుగు పెట్టిన తర్వాత నా బ్లాగ్రహబలం మహర్దశనందుకొందని తెలిసింది. ఈ ఏడాదంతా అర్హత 6, అభినందనలు 66 లా గడిచింది. నామొదటి టపానుండి నన్ను వెన్ను దట్టి, కళ్ళు నెత్తికెక్కించిన వారు చాలామంది ఉన్నారు. ఒకటి, రెండు టపాలు వ్రాయగానే మంచిముత్యంలాంటి బ్లాగని ఒకటి,ప్రముఖబ్లాగరని మరొకటి విశేషణాలు తగిలించి బ్లాగ్సురాపానోన్మత్తుడిని చేసిన చదువరి, త్రివిక్రమాదులకి ప్రత్యేక నెనర్లు.

ఎంతమంది పిల్లలని కన్నా ప్రథమ సంతానం మీదే మక్కువెక్కువున్నట్లు, అధికోత్సాహపడి వేరే బ్లాగులు మొదలెట్టినా ఏమాత్రం సమయం చిక్కినా సత్యశోధన లోనే టపాలు వ్రాయబుద్ధి వేయడంతో ఆయా బ్లాగులలో టపాలు పెరగనేలేదు.


ఈయేడాదిలో నేను (నాబ్లాగు) కొంతమంది అభిమానులని సంపాదించుకున్నా. చాలా మందికి అభిమానినయ్యా. ఈయేడాది నా జీవితంలో ఇంత ఆలస్యంగా వచ్చిందే అని అనిపించేంత గొప్పఅనుభవాలనీ, అనుభూతులని మిగిల్చిన బ్లాగ్సంవత్సరమిది. ఇక ముందు వచ్చేవన్నీ ఇలాంటి సంవత్సరాలే అవ్వాలని బోలెడు అత్యాశ పడిపోతూ

భవదీయుడు
సత్యసాయి కొవ్వలి