Monday, December 25, 2006

దొంగా? దొరా?

దొరికితే దొంగ, దొరకకపోతే దొర అని సాధారణంగా అంటో ఉంటారు. ఈమధ్య కాలంలో మన పెద్దలు చెప్పిన ఇలాంటి నానుడులన్నీ తారుమారైపోతున్నాయి. ఇప్పుడు దొరికినా దొరల్లాగే ఎలాగో ఒకలాగా చలామణీ అయిపోతున్నారు. కొంతమంది దొంగలు, ఎవరైనా వాళ్ళని పట్టించితే, జనాల జాలి ఏదోరకంగా పొంది, ప్రచార మాధ్యమాలని తెలివిగా వాడుకొని, పట్టించిన వాళ్ళే చెడ్డవాళ్ళన్న అభిప్రాయం ప్రజలలో కలిగించి పబ్బం గడుపుకొంటున్నారు. పైగా తెగ అమాయకత్వం నటించి, 'అయ్యో. దీన్ని దొంగతనం అంటారా? నాకు తెలియదే! తెలిస్తే ఇలా చేస్తానా. నేనింత మంది లాయర్లనీ, నిపుణులనీ నా లావాదేవీలలో ఉపయోగించుకొంటున్నా. ఒక్కళ్ళూ చెప్పలేదే!' అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు ప్రజల నాడి. కులమో, మతమో, అవతల వాళ్ళ పట్ల్ల విముఖతో, ఏదో ఒక బలహీనత ప్రజల్ని సరియైన పంథాలో ఆలోచించకుండా చేస్తుందని.
ఉదాహరణ ఇవ్వగలరా? జవాబు ............................... (పూరించండి)

ఇంకో రకం దొంగలున్నారు. వాళ్ళు వాళ్ళ దొంగతనాలని కప్పి పుచ్చేందుకు, వేరే వాళ్ళ దొంగతనాల్ని బయట పెట్టడానికి ఏదో మంత్రాంగం చేస్తోఉంటారు. కొండొకచో, వాళ్ళు చేసిన ఏదో చిల్లర దొంగతనాన్ని ఒప్పేసుకొని, వేరే దొంగలు కూడా బయట పడాలనీ గొడవ చేస్తో ఉంటారు. దీనికి కూడా ఉదాహరణలు కోకొల్లలు. జవాబు................

మూడోరకం దొంగలు. వీళ్ళు ప్రస్తుతం చిల్లర దొంగలు. భవిష్యత్తులో గజదొంగతనం చేయడానికి తయారయ్యేవాళ్ళు. పాపం, ఇప్పటిదాకా సరైన అవకాశాలు రాక, పతివ్రతల్లాగా మిగిలిపోయారు. వీళ్ళు జనాలని మిగిలిన వాళ్ళని (తస్మదీయుల్ని) బూచుల్లాగా చూపించి, తమ ప్రాబల్యం పెంచుకోవడానికి ఎలాంటి అబద్ధమైనా అడేయగలరు. ఇలాంటి ఒక దళిత నాయకుడు, ఒక బహిరంగ సభలో మాట్లాడుతున్నాడు. ఇంతలో బయట ఎక్కడో దీపావళి టపాకాయలు పేలాయి. వెంటనే, ఆ నాయకుడు, 'చూసారా! ఈ కాంగ్రేసు వాళ్ళు. దళితుల నోరు నొక్కడనికి బాంబులు పెట్టారు' అని అన్నాడు. పాపం, సభకి వచ్చినవాళ్ళు ప్రాణభీతితో కకావికలం అవడంవల్ల, కొంతమంది తొక్కిసలాటలో చనిపోయారు. ఎవరి ప్ర్రాణమైనాసరే చాలా విలువైనది. ఇలాంటి వాళ్ళ చర్యలని ఎవరూ ఖండించలేదు, ఖండించరు. ఒక మనిషిగా పుట్టినందుకు, ఇలాంటి వాళ్ళని, మన స్వంత వాళ్లయినా సరే, ఖండించండి. మీచుట్టూ ఉన్న ప్రజలు ఇలాంటి వాళ్ళని విని మోసపోకుండా చైతన్య వంతుల్ని చేయండి. లేకపోతే ఎవరి కోసమైతే తాము పాటుపడుతున్నామని చెబుతున్నారో, ఆ జాతికే ముప్పు తేగల ధీమంతులు ఇలాటి నాయకులు. కొంతమంది తెరాస నాయకులు, దళిత వాదులు, స్త్రీవాదులు కూడా బాధిత ప్రజల్ని చైతన్య వంతులుగా చేసి వారి హక్కులని సాధించుకొనే దిశలో కాక, వారికి బాధ్యతరాహిత్యాన్ని, ఉద్రేకాన్ని నేర్పి, తమ నాయకత్వం కోసమే పాటుపడుతున్నారు. సరైన ఆలోచన, స్వయంప్రతిపత్తి, సాధికరత దిశగా వీళ్ళని నడపటంలేదు. జవాబు...................


ఈ పాటికి అర్ధమయ్యే ఉంటుంది, ఈ బ్లాగు, మన రాష్త్ర రాజకీయుల్ని, రామోజీ రావుని ఉద్దేశించి వ్రాసినది అని. ఇప్పుడు ఖాళీలని సులభంగా పూర్తిచేయచ్చు. ఎందుకంటే ఉదాహరణలు కోకొల్లలు.

ము.మం., రా.రా. ల వివాదం గురించి పత్రికల వాళ్ళు, రాజకీయులూ తెగ వ్రాస్తున్నారు. మన బ్లాగర్లు కూడా కొంతమంది బ్లాగులు వ్రాసారు. మరికొంత అనేకమంది చదివారు. అందులో కొంతమంది చర్చించారు. మొత్తం మీద ఈమధ్యకాలంలో రసవత్తరమైన నాటకీయ పరిణామం ఈ వివాదం. ఇందులో ప్రజలు (పట్టించుకొన్నవాళ్ళు) రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గం ఈనాడును, రామోజీ రావును సమర్ధిస్తే, ఇంకొక వర్గం ముఖ్యమంత్రి వర్గాన్ని సమర్ధించింది. పాపం, కాంగ్రేసు వాళ్ళు మిగిలిన పార్టిలవారికీ, కొన్ని పత్రికల వారికీ శత్రువర్గంలో ఉన్నారు. కాబట్టి, వాళ్ల చర్యల్లోని మంచివి కూడా మసగేసిపోయాయి. అసలుకి, మన రాజకీయుల్లో కాంగ్రేసు రక్తం లేనివాళ్ళు ఎవరైనాఉన్నారా? 'జనని కాంగిరేసు సకల పార్టీలకును' అన్న ఆర్యోక్తి మనం మరచిపోకూడదు. డి.ఎన్.ఏ. పరీక్షలు చేసుకోండి, కావాలంటే. కాబట్టి, ఏపార్టీ వాళ్ళు చెప్పినా వినండి, ఆలోచించండి వాళ్ళ మాటలు, చేష్టల వెనుక రహస్య ఉద్దేశ్యం ఏమిటో. వేరేవాళ్ళకి తెలపండి. అది చాలా పుణ్య కార్యం.

రా.రా.- ము.మం. వివాదం లో మూడు పక్షాలున్నాయి. అందరూ రెండు పక్షాల్లో సర్దుకొన్నారు. మూడవ పక్షం ఖాళీగ ఉంది. అదే సత్య(నిజం) పక్షం. ఎవరిది తప్పుఅని అలోచించేకన్నా, ఏమిటి తప్పు అని అలోచించడం మంచిది కదా. మార్గదర్శి విషయం తీసుకోండి. అవతలి పక్షం కాంగ్రేసుకదా అని రారా ని సమర్ధించకండి. ఒక నిమిషం అలోచించండి. చార్మినార్ బ్యాంక్, కృషి బ్యాంకులు మార్గదర్శి చేసిన లాంటి లావాదేవీలవల్లే ఎంతమంది జీవితాలని తారుమారు చేసాయో. పైగా, ఇన్ని వ్యాపార లావాదేవీలు సమర్ధవంతంగా నిర్వహిస్తున్న ఈనాడు గ్రూపుకి ఇంత చిన్న లా పాయింటు తెలియకపోవడం నేరం కాదూ? ఎన్ని చిట్‍ఫండు కంపేనీలు దివాలా తీసి ప్రజల్ని ఇక్కట్ల పాలు చేయలేదు? మన దేశంలో బ్యాంకింగు కాని ఇతర ఆర్ధికరంగ చట్టాలు కాని పొదుపు దారుల ను కాపాడడమే ముఖ్యోద్దేశముగా రూపొందించబడ్డాయి. ఇది ఇంటర్మీడియేట్ చదివినవాళ్ళక్కూడా తెలుసు. ఘనత వహించిన ఈనాడు గ్రూపుకు తెలియదా? సంస్థలు తమ లావాదేవీలు అబాధ్యతగా నిర్వహించకుండా చట్టం కొన్ని నిబంధనలు విధించింది. చమత్కరం చూడండి. రిజర్వ్ బ్యాంకు రంగం లోకి వచ్చి, మార్గదర్శి చేసినది తప్పు అని చెబితే, కొంత మంది విజ్ఞులు ఇప్పటిదాకా ఏంచేస్తోందీ రిజర్వు‍బ్యాంకంటూ నిప్పులు చెరగుతున్నారు. అయ్యా, విజ్ఞులారా. 'దొంగతనం చేసినవాడిది తప్పుకాదు, వాడిని పట్టుకోని వాడిదే' అని ముచ్చటగా వాదిస్తున్నారు. మన చదువులు, తెలివితేటలు మన ఆత్మవంచనకా? 'లావాదేవీలు చట్టపరంగా చేయవయ్యా, లేక పోతే ప్రజలు కష్టపడతారు. నీవంటి దిగ్గజం రూల్సు తెలియవే అంటే ఎలా? మన రాష్ట్రం లోని వ్యాపారవేత్తలకి ఆదర్శంగా నిలవాలి కాని' అని దూరదృష్టితో చిన్న సలహా చెబితే సొగసుగా ఉండదూ? మన విజ్ఞానానికి వన్నె రాదూ?

నా దృష్టిలో రారా తప్పు రూల్సు పాటించడం, పాటించకపోవడం కాదు. ఈనాటి ఈ సమస్య, ఇప్పటిది కాదు. చాలా దశాబ్దాలనుండి ఈనాడు, ప్రభుత్వ పార్టీ (ఆరొజుల్లో కాంగ్రేసే) మధ్య సమస్యలు తెలిసినవే. పత్రిక లో ప్రభుత్వ వ్యతిరేకత చూపడం వల్ల ప్రభుత్వ ప్రకటనలు ఈనాడు కి ఇవ్వకపోవడం మామూలయ్యింది. తర్వాత రామారావు కాలంలో ఈనాడు ప్రభుత్వ బాకా పత్రిక అయిపోయింది. విలువలకోసం ప్రభుత్వవ్యతిరేకత చూపుతోంది అనుకొన్న చాలామందిమి ఏవిలువలకోసం అన్న మీమాంసలో పడిపోయాం. అతి బాకా వల్ల ఒక దశలో ఈనాడు సర్కులేషను చాలా పడిపోయింది. దాంతో, కొంత ధోరణి మార్చుకొని ప్రభుత్వాన్ని విమర్శించడం కూడా కొద్దిగా చేసేది, వ్యాపార దృష్టితో మాత్రమే సుమా!

ఒక వార్తా పత్రిక అనేది, మిగిలిన వ్యాపారాల్లాంటిదేనా? మనకి నచ్చిన వాళ్ళని మంచిగానూ, కిట్టని వాళ్లని చెత్తగానూ చూపించి 'కింగ్‍మేకర్' గా వ్యవహరించడం సబబా? వార్తా పత్రిక ప్రజలకి అభిప్రాయాలను ఏర్పారచుకోవడానికి సహాయపడే వార్తలందించాలా, లేక పత్రికాధిపతి ఇష్టాఇష్టాలే ప్రజలమీదికి తిమ్మిని బమ్మి చేసైనా సరే రుద్దాలా?

నా దృష్ట్లిలో పత్రికలు, అధికార యంత్రాంగం ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరిస్తేనే వాళ్ళ ఉనికికి సార్ధకత, వాళ్ళమీద ప్రజలు పెట్టుకొన్న నమ్మకానికి నీరాజనం. అది వాళ్ళ కనీస బాధ్యత. అది విస్మరిస్తే, వారికి శత్రువులు చాలామంది తయారవుతారు. ప్రజల శాపాలు తగులుతాయి.

ఈనాడు చేస్తున్న మంచిపని నిష్పక్షపాతంగా కొనసాగించాలి. ఎన్నో స్కాములు, అన్యాయాలు వెలికితీసి ప్రజల్ని కాపాడుతోంది. ఈనాడు తెలుగు ప్రజలకి చేసిన అత్యత్తమ సేవ చెప్పమంటే, పత్రిక మొదలుపెట్టిన తొలి రోజుల్లోనే, చాలా ధైర్యంతో సెక్సుసైన్సు మీద సమరం గారిచే ప్రత్యేకంగా వ్యాసాలు వ్రాయించి ప్రజలని విద్యావంతుల్ని చేయడం అని చెబుతాను. కాని ఈనాడు తన గ్రూపు ప్రయోజనాలు మాత్రమే కాకుండా తనని నమ్ముకొన్న తెలుగు ప్రజల ప్రయోజనాలు కూడా దృష్టిలో పెట్టుకొని నడిపితే, జనాల చేతుల్లోనే కాకుండా హృదయాలలో కూడా ఉంటుంది. లేక పోతే నిజం చెప్పినా కూడా, పక్షపాత పత్రికలే అలాగే వ్రాస్తారు అని అనుమానిస్తారు. 'ది హిందూ' ఎప్పుడైనా పక్షపాతం గా వ్రాయడం చూసారా? దానిలో వార్తలు, వార్తలు గానూ, అభిప్రాయాలు, అభిప్రాయాలు గానూ వ్రాస్తారు. పత్రికాధిపతులు పాఠకుల నెత్తిమీద కూర్చొని బ్రైన్వాష్ చేయరు. అందుకే ఆ పత్రిక పేరు చెబితే ఒక రకమైన గౌరవం కలుగుతుంది.

ఇక రెండో పక్షం. ఎన్నికలయ్యాకా ముఖ్యమంత్రి పదవికోసం కాంగీయులు పోటీ పడినప్పుడు, ప్రజలందరూ కూడా న్యాయంగా రా.రె. అవ్వాలని భావించారు. అంత ఆశలు కల్పించారూ, డిగ్నిటీ ప్రదర్శించారూ ఆయన. గిల్లికజ్జాలు, కీచులాటలూ కాకుండా, మన రాష్ట్రం ముందుకుపోవడానికి వేరే ఏదైనా చేయాలని ఎప్పటికైనా ఆయనకి తోచాలని ప్రార్ధిస్తున్నాను. ప్రజలు చూస్తున్నారు, మనం అనుకొన్నంత తెలివితక్కువ వాళ్ళు కారని రాజకీయులందరూ తొందరగా తెలుసుకొనే రోజు తొందరగా వస్తుందని ఆశ. పార్టీలకి కాక వ్యక్తులకి ఓటు వేస్తే బహుశ: మనకి విముక్తేమో?

సర్వేజనా: సుఖినోభవన్తు

Sunday, December 17, 2006

ముగ్గొలకపోసారు

దేవతలు కూడా పొరపాట్లు చేస్తోంటారు. అప్పుడెప్పుడో దేవతలు ఆకాశంలో ఒక కుండలో అమృతం తీసుకెళ్తోంటే కొన్ని చుక్కలు భూమిపై ఒలికాయట. వాటినుంచి అమరజా అనే నది పుట్టిందని గురుచరిత్రలో ఉంది. కాని ఒక విషయం. ఆర్యవ్యవహారమున 'దుష్టంబ' గ్రాహ్యంబన్నట్లుగా, దేవతలు పొరపాటు చేసినా అందమే, ఆనందమే. మా ఊళ్ళో నిన్న జరిగిన ఇలాంటి పొరపాటు గురించే ఈ రోజు బ్లాగు.

సంక్రాంతి రోజులు కదాని ఇంద్రుడు దేవతలని ముగ్గు తెమ్మన్నాడట. తెచ్చేవాళ్ళు తెస్తున్నారు. ముగ్గుపెట్టేవాళ్ళు పెడుతున్నారు. మనలాగా ఒక ఇల్లూ, ఒక వాకిలీ కాదు కదా. విశ్వమంతా పెట్టాలి కదా! ముగ్గు పెట్టే వాళ్ళు ఎన్నో యుగాలుగా, ఎంత నడుం నెప్పెట్టేలా పెడ్తున్నా, ఇంకా చుక్కలు పెట్టడమే పూర్తికాలేదు. ఇంకా ఎప్పుడు కలుపుతారో ఆ చుక్కల్ని. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? కొత్త చుక్కలు పెడుతోంటే, పాత చుక్కల్ని మనూళ్ళో జులాయిగాళ్ళ లాంటి రసహీన నల్ల కన్నాలు చెరిపేస్తున్నాయిట. అయితే, ముగ్గు తెచ్చే దేవతల మీద ఇద్దరు 'సూపర్వైజర్ల' ని పెట్టాడు ఇంద్రుడు. పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు. అయితే, సూర్యుడు ఓకే. కాని ఆయన దక్షిణమండలానికి ఆఫీసు పని మీద టూరుకెళ్ళాడు. చంద్రుడేమో కాపలాలో కాస్త నాసి. ఆయన చూపు ఒక పక్షం తగ్గుతూ, ఒక పక్షం పెరుగుతో ఉంటుంది. నెలలో ఒకరోజు పూర్తి గుడ్డి, ఒక రోజు మాత్రం ఆకాశమంతా కళ్ళే. ఈదృష్టిలోపానికి సాయం, తారతో ఆయన వ్యవహారం 'తారాశశాంకీయం' పుణ్యమా అని మనందరికీ తెలిసిందే కదా. దానితో పాపం ఆయనకి కాపలాకి తీరికేది? కాపలా ఇలా ఉంటే దేవతలు పని ఎంత నిఖార్సుగా ఉంటుందో చెప్పలేమా? మన ఆఫీసుల్లో బాస్ లేకపోతే ఆటవిడుపే కదా! నిన్న రాత్రి వాళ్ళు ముగ్గు తీసుకెళ్తూ ఒలకపోసేసారు. మాకెలా తెలిసిందా, అది మాఊరు మీదే కదా పడింది. ఎన్ని ముగ్గులు పెట్టినా తరగనంత ముగ్గు. కాని దేవతలే కాని మనం పెట్టలేము ఆముగ్గుతో. మనం ముట్టుకొంటే నీరైపోతుందా ముగ్గు. ఇల్లూ,వాడా, చెట్టూ, చేమా, అన్నీ ఏకమయిపోయాయి. మళ్ళీ సూర్యుడొచ్చి గదమాయిస్తే కాని వాళ్ళు ఎత్తరు. కాని ఎత్తకపొతేనే మంచిది. కాసేపు ఆ దృశ్యాన్ని చూసి ఆనందించ వచ్చు. ఇదంతా గ్యాసనుకొంటున్నారా? ఊహించాను. అందుకే ఫోటోలు తీసాను. చూడండి, నా మాట అబద్ధమైతే.
Friday, December 15, 2006

తెలుగు జాకెట్టు గుడ్డ పథకం

పూతరేక్స్ లో వారుణి వాహిని కి కీ.శే. రామారావుకి సంబంధ ఏమిటని అడిగారు. మంచి సమాధానాలొచ్చాయి. అవి చదివిన తర్వాత ఇది రాయాలనిపించింది.

ఆపథకం పేరులో ముందు తెలుగు అని ఉంది. 'తెలుగు వారుణి వాహినీ పథకం'. రామారావు గారికి సంస్కృతసమాసాలూ, అచ్చతెలుగు పేర్లు చాలా ఇష్టమనుకొంటా. పౌరాణికసినిమాల అనుభవం మరి. అలాగే హంద్రీనీవా ఎత్తిపోతల (లిఫ్ట్ ఇరిగేషన్) పథకానికి 'హంద్రీనీవా సజల జల స్రవంతి' అని అనుకొంటా పేరు పెట్టాడు. గ్రామాల్లో ఆడవారికి టాయిలెట్ల కోసమని ఒక పథకం పెట్టాడు. దాని పేరు కూడా స్వచ్చమైన తెలుగే. 'తెలుగు మహిళా మరుగు పథకం' అనో 'తెలుగు మహిళా బహిర్భూమి పథకం' అనో ఉండాలి. ఆరోజుల్లో ఢిల్లీలో ఉండేవాడిని. స్లీవె‍లెస్ల బాధ భరించలేక, అదే రామారావయితే ఏం పథకం పెట్టేవాడు అని అలోచించా. బహుశ: 'తెలుగుబిడ్డ- జానెడు జాకెట్టు గుడ్డ' పథకం పెట్టేవాడేమో! క్షమించాలి. జాకెట్టు ఆంగ్ల పదమని ఇప్పుడే ప్రసాద్‍గారు చెప్పారు. పథకం పేరు మర్చేస్తున్నా- 'తెలుగుబిడ్డ- జానెడు రవికె గుడ్డ.' ఇంకా తెలుగులో చెప్పాలంటే, 'తెలుగుబిడ్డ- జానెడు కంచుకం గుడ్డ పథకం.' జాకెట్టును కంచుకం అని కూడా అంటారని విన్నాను. నిజంగా పెట్టేవాడేమో? కాని ఈలోపునే లక్ష్మీపార్వతితో బిజీ అయిపోవడం వల్ల ఆడబిడ్డలకి టైమ్ కేటయించలేక పోయాడు, పాపం.

Saturday, December 09, 2006

కొరియా కబుర్లు: పురోగతీ - వివాహనాశాయ

కొరియాలో పెళ్ళిళ్ళలో ఊరేగింపులుంటాయా అని నాగరాజాగారు అడిగారు. అయ్యా! అసలు పెళ్ళిళ్ళే అవడంలేదు ఇక్కడ. ఇంక ఊరేగింపుల మాటేమిటి చెప్పమంటారు. ఇక్కడి సాంప్రదాయపు పెళ్ళి చాలా అచార వ్యవహారాలతో కూడి ఉంటుంది. పెళ్లి పందిర్లూ (మంటపాలు), పెళ్ళి బాసలూ ఉంటాయి. ఎవరికైనా ఆసక్తి ఉంటే ఈ క్రింది లంకె చూడండి. http://www.geocities.com/korea_traditional_wedding/
ఈ మధ్యన జరిగే పెళ్ళిళ్ళు మాత్రం పశ్చిమ దేశాల పద్ధతిలో జరుగుతున్నాయి. పెళ్ళి కోసం కల్యాణ వేదికలు (హాళ్ళు) మన వేపులాగానే అద్దెకి దొరుకుతాయి. అబ్బాయీ, అమ్మాయీ ఉంగరాలు మార్చుకొంటారు. ఈ మధ్యన క్రీస్టియను ప్రభావం ఎక్కువవడం వల్ల ఆ పద్ధతులు కూడా తరచు చూడచ్చు.
ఇక్కడి యుక్తవయస్కుల్లో, ముఖ్యంగా అమ్మాయిల్లో, పెళ్ళిపట్ల ఆసక్తి తగ్గిపోయింది. ఈ మధ్యన జరిపిన సర్వేలో ప్రతి పదిమంది ఆడవాళ్లలో ఏడుగురు పెళ్లివల్ల తమ కెరీర్ పాడయిపోతుందన్న కారణంగా పెళ్ళివద్దనేసారు. అదీకాక, పెళ్ళిఅనేది ఒక బాదరబందీ తో కూడిన నిబద్ధత (కమిట్‍మెంట్) అని తేల్చిపారేసారు. ఇక్కడ పెళ్ళిళ్ళు చాలా ఆలశ్యంగా జరుగుతున్నాయి. దానికి కారణం మగపిల్లలు ఉద్యోగం తెచ్చుకొని, ఒక ఇల్లూవాకిలి ఏర్పరచుకొనేసరికి సగం జీవితం అయ్యిపోతోంది. ఇక్కడి ఆడపిల్లలు చాలా నిక్కచ్చైన వాళ్ళు. రెండేళ్లు ప్రేమించుకొన్నాక కూడా అబ్బాయి ప్రవర్తన నచ్చకపోయినా, ఉద్యోగం తెచ్చుకోలేకపోయినా, ఇంకా ఇతరకారణాలేమైనా వచ్చినా, తలాఖ్. పల్లెటూర్లలో సంగతి కాసెపు అలా ఉంచితే, సౌల్ (Seoul) ‍లో మాత్రం జంటలు చాలా కన్పిస్తాయి. కాని ఎప్పటికో పెళ్ళిళ్ళవుతాయి, అయితేగియితే. పెళ్ళిళ్ళే ఇంత కష్టంగా అవుతోంటే, పెటాకుల సంఖ్య పెరిగిపోతోంటే వీళ్ళసమస్య ఎంత జఠిలమైపోయిందో ఊహించండి. ఈమధ్య కాలంలో ఇక్కడా తల్లో, తండ్రో మాత్రమే ఉన్న కుటుంబాల సంఖ్యఎక్కువైపోవడం ఇక్కడి వారిని కలవరపరుస్తోంది.


పెళ్లిళ్లంటేనే మొహమ్మొత్తిన వీళ్ళకి పిల్లలంటే మోజుంటుందా? ఉండదుకదా? అందుకే ఇక్కడ శిశుజననాలు చాలా తక్కువ. ఎంత తక్కువంటే జనాభాని తక్కువచేసేటంత. అబ్బ. మనదేశంలోఎప్పటికైనా ఇల్లాంటి పరిస్థితి వస్తుందా? అయితే ఇక్కడ కొన్ని గ్రామాల్లో కొన్ని దశాబ్దాలుగా శిశుజనన్నాలేవుట. అవును మరి ఉన్న వాళ్ళందరూ గ్రామాలు విడిచిపొతే జనాభా ఎలాపెరుగుతుంది? ఇప్పుడు గ్రామాల్లో ఉన్న వాళ్లు చాలా మంది వయసు మీద పడిన వాళ్ళే. అందువల్ల, ఏవూరులోనైనా పిల్లలు పుడ్తే పక్క గ్రామాల వాళ్ళు పిక్నిక్ లాగా వెళ్ళి వాళ్లని చూసి, వాళ్ళ ఏడుపు విని వస్తార్ట. వీళ్లని మనదేశానికి టూరుకి తీసుకెళ్తే భలే ఆదాయమేమో. అడుగడుక్కీ టూరిష్టు ఎట్రాక్షనే, చెత్తకుండీలతో సహితంగా.


ఇక్కడి ప్రభుత్వం జనాభా ఎలా పెంచాలా అని బుర్రలు బద్దలు కొట్టుకొంటోంది. రకారకాల రాయితీలు, పధకాలు ప్రవేశ పెడుతోంది. వీళ్ళకి ఐడియాలు సరిగ్గా రావట్లేదు. లేకపోతే జనాభా పెంచాలంటే అదిచేతవచ్చిన మనలాంటి వాళ్లని సలహాలు అడగాలి. నన్నడిగితే, లాలు దంపతుల్లాంటి ఆది దంపతులని వాళ్ళ గేదెలతో సహా దిగుమతి చేసు కొంటే జనాలే జనాలు. లేకపోతే, BPO (birth process outsourcing) ఎలాగూ ఉంది. మన దేశంలో అద్దెకి గర్భసంచులు విరివిగా దొరుకుతున్నాయని మీరు వినే ఉంటారు.


ఇది ఇలా వుంటే, గ్రామాల్లో కొంతమంది వ్యవసాయం చేసుకొంటున్నారు కదా. వాళ్ళల్లో చాలామందికి 40 ఏళ్లొచ్చినా పెళ్లిళ్ళవట్లేదు. గ్రామాల్లో సరిపడ అమ్మాయిలు దొరకట్లేదు. సరిపడా అంటే సంఖ్యలో. గ్రామాల్లోని అమ్మాయిలు పట్నాలకి పోయి చదువుకొని ఇక్కడ పేడ పిసుక్కోవడం ఇష్టంలేక పల్లెటూరి అబ్బాయిలని చేసుకోవడం లేదు. ఇక పట్నం అమ్మాయిల గురించి చెప్పాలా? దీనికి పరిష్కారం ఒకటి కనిపెట్టారు, ఇక్కడి గ్రామీణులు. అదేంటంటే, బయటిదేశాలవాళ్ళని పెళ్ళిచేసుకోవడం. ఇది మన అరబ్బు షేకుల లాగా విలాసానికి కాదు. అవసరానికి. వీళ్ళకి డబ్బులున్నాయి. ఆస్తులున్నాయి. దాంతో మన హైదరాబాదులో లాగానే బ్రోకర్లు తయారయ్యారు. వీళ్ళ ఆహారపు అలవాట్లకీ, రూపురేఖలకీ దగ్గరగా ఉండే వియత్నాం, ఫిలిప్పైన్స్ లాంటి దేశాలనుండి ఆడపిల్లల్ని తెచ్చుకొంటున్నారు.
అక్కడిదాకా బాగానే ఉంది. కాని అసలు చిక్కేమిటంటే కొరియన్లలో పెద్దా, చిన్నా భేదాలూ (వయస్సులో), పట్టింపులూ చాలా ఎక్కువ. మనదేశంలో ఇవన్నీ పోయాయి. ఇక్కడ ఇంకా బతికే ఉన్నాయి. అత్తల అజమాయిషీకూడా ఎక్కువే. బయటినుండి వచ్చినవాళ్ళకి వీళ్ళ సంస్కృతి అంతా గందరగోళంగా ఉంటుంది. అదీకాక అలా వచ్చిన అమ్మాయిలు సాధారణంగా లేని కుటుంబాలనుండే కావడంతో ఇంకొంత అయోమయం సహజం.
ఇలాంటి పెళ్ళిళ్ళు ఈ మధ్య బాగానే జరుగుతున్నాయి. ఈ విషయంపై ఒక పత్రిక వారు ఒక సర్వే జరిపి వ్యాసం రాసారు. దాని కోసమని అనువాదకులని కూడా తీసుకొని వెళ్ళారు. అమ్మాయిలతో మాట్లాడాలి కదా! అలాంటి ఒక జంటని కలిసి ముచ్చటించారు. అమ్మాయి వియత్నాము నుంచి. అబ్బాయి నడిగితే, 'నాకు పొలం, పుట్రా చూసుకోగలిగిన పిల్ల కావాలని అడిగితే బ్రోకరు ఈపిల్లని చూపించాడ'ని చెప్పాడు. ఆ అమ్మాయి మాత్రం, 'ఇక్కడికొచ్చి ఈ పొలం పనులు చేయాల్సి ఉంటుందని తెలిస్తే ఈ పెళ్ళికొప్పుకొనేదాన్ని కాద'ని చెప్పింది, తన భాషలో. ఇదేమిట్రా మొగుడూ పెళ్ళాల మధ్య ఈ వైరుధ్యం అని ఆశ్చర్యపోతున్నారా? అసలు కీలకం ఎక్కడుందంటే, బ్రోకర్ దగ్గర. కొరియా నుంచి అబ్బాయిల్ని వియత్నాం తీసుకెళ్ళి పిల్లల్ని చూపించారు. నచ్చిన వాళ్ళని ఎన్నుకొన్నాక, వాళ్ళమధ్య ఇంటర్వ్యూ ఏర్పాటు చేసారు. అబ్బాయి తనకి పొలంపనులకి సాయపడగల్గిన పిల్లకావాలని చెప్పాడు. అనువాదకుడు ఆ అమ్మాయికి, 'అబ్బాయి ఉద్యోగస్థుడు, ఇష్టమేనా' అని అడిగాడట. ఆ అమ్మయి ఎగిరి గెంతేసి ఒప్పుకొంది. ఆ అమ్మాయి వియత్నాం లో ఎవరింట్లోనో పనిమనిషిగా పనిచేస్తోందిట. మొదట్లో పెళ్ళిచేసుకొని వేరే దేశం వెళ్ళడం ఇష్టం లేకపోయినా, తల్లిదండ్రుల ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా ఒప్పుకొందిట.
ఎలాగైతేనేం పెళ్ళి అయిపోయింది. వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలంటారు కదా? ఎవరు ఆడాలో చెప్పలేదు కదా? అంటే ఎవరైనా ఆడొచ్చు. ఇక్కడ బ్రోకరు అనువాదకుడి ద్వారా చిన్న అబద్ధం ఆడాడంతే. కాబట్టి తప్పులేదు. అందులోనూ ఒక బ్రహ్మచారిని 'బ్రహ్మ చెర' నుండి తప్పించడం కోసం ఆడాడు కాబట్టి, ఓకే. ఈధర్మసూక్ష్మం ఎక్కడో మన పురాణాల్లో ఉండే ఉంటుంది. ఎందులో ఉందో గిరిశాన్నడిగితే చెబుతాడు. సదరు పత్రికా విలేఖరి ఆ అమ్మాయిని 'ఎలా ఉంది నీ వైవాహిక జీవితం' అని అడిగాడు. దానికి ఆ అమ్మాయి పెళ్లైన కొత్తల్లో మొగుడూ, అత్తా వల్ల కొద్దిగా ఇబ్బంది పడినా, తను గర్భవతయ్యింతర్వాత వాళ్ళు చాలా ప్రేమగా, ఆదరంగా చూసుకొంటున్నారని చెప్పింది.
చివరిగా ఆ ఆమ్మాయి ఆ అనువాదకుడికి ఒక చిన్న విన్నపం చేసుకోంది. అది చదివాకా, నాకు అసలు మజా వచ్చింది. ఆమె ఆ అనువాదకుడిని, తన భర్త తనని పుట్టింటికి ఎప్పుడు పంపిస్తాడో అడగమంది. దానికి ఆ భర్త 'పిల్లాడు పుట్టాక' అని చెప్పాడు. దీంట్లో మజా ఏముందంటారా? ఆ పత్రిక వాళ్ళ ధర్మమా అని పెళ్ళైన రెండేళ్ళకి తన భర్తతో మొదటిసారి (అర్ధవంతంగా) ముచ్చటించింది మరి.
ఆహా! ప్రేమే కాదు, పెళ్ళి కూడా మూగది, గుడ్డిది, చెవిటిది, భాష అవసరం లేనిది అన్న మాట.

Friday, December 01, 2006

కొరియా కబుర్లు: 'ఫ్పల్లి ఫ్పల్లి'

క్రిందటి వారం 'కొరియా కబుర్లు' చదివి ఇస్మాయిల్ గారు పెట్టుబడి దారీ విధానం ఉన్నా భూసంస్కరణలెలా అమలుచేయగలిగారని అడిగారు. పెట్టుబడిదారీ విధానం ఆర్ధిక వ్యవస్థకి సంబంధించినది. వీరి రాజకీయవ్యవస్థ నిరంకుశ పాలనలో నడిచింది. వీళ్ళకి ప్రజాస్వామ్యం 1987 లో ఉద్యమఫలితంగా వచ్చింది. ఆపాటికే వీళ్ళు అభివృద్ధి సాధించేసారు. అందుకని భూసంస్కరణలు సులువుగా అమలుచేయగలిగారు. ఒక్క కొరియా భూసంస్కరణలు మాత్రమే బలసహాయంతో సాధించినా కూడా ప్రపంచంలోనే విజయవంతమైనవిగా నిలిచాయి. ఇది వీరి ప్రత్యేకత. అంతేకాదు. అమెరికా లాంటి దేశాల్లో పారిశ్రామికాభివృద్ధి ఫలితంగా వ్యవసాయరంగంలో భూకమతాల పరిమాణం పెరిగింది. అక్కడకూడా భారీ యంత్రాలూ, పెట్టుబడీ తయారయ్యి వ్యవసాయరంగం తీరుతెన్నులనే మార్చిపాడేసాయి. కాని కొరియాలో అప్పుడూ, ఇప్పుడూ కూడా చిన్న కమతాలే. చిన్నకారు రైతులే. ఇల్లా చెప్పుకుంటూ పోతే కొరియా చాలా విషయాల్లో ప్రపంచ అంచనాలనే తారుమారు చేసింది. మిగిలిన తూర్పు ఆసియా దేశాలు కూడా కొంతవరకూ ఇంతే. నాకనిపిస్తుందీ, ఈ మంగోలాయిడ్ తెగలోనే మహత్తుందేమోనని. కాని మన ఈశాన్యభారత రాష్ట్రాలని చూడండి. ఎన్ని డబ్బులు అటుప్రవహించినా పానకాలస్వామికి పానకంపోసినట్లే. ఎక్కడికి పోతాయో తెలియదు. కాని అందరికీ తెలుసు. బహిరంగరహస్యం. బహుశ: ఇది క్షేత్ర బీజ సంవాద పరిధిలోకి వస్తుందేమో?
వీళ్ళ విజయాలవెనుక మహత్తులేమీ లేవు. ఒక్క ఆశయసాధన పట్ల అచంచల దీక్ష తప్పించి. వీళ్ళపాలకులు మంచి అవసరమైన సమయంలో దేశంకోసమే నిర్ణయాలు తీసుకొన్నారు. అలాగే వీళ్ళ అధికారవర్గం కూడా దేశక్షేమమేదృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకొన్నారు. పద్ధెనిమిది సంవత్సరాలు పాలించిన ప్రెసిడెన్ట్ పార్క్ జంగ్ హీ గ్రామీణప్రాంతాలపై కూడా సమదృష్టి పెట్టి సమతులాభివృద్ధికి కృషిచేసాడు. ఇక్కడా పాకిస్థానులో లాగే ప్రభుత్వాల్ని కూల్చారు, ఉద్యమాలు నడిచాయి, సైనిక నియంతలు పాలించారు, ఎదుర్పలికిన జనాల్ని ఏడిపించారు. కాని దేశప్రగతిని మాత్రం కుంటుపడనీయలేదు. మనకి ప్రజాస్వామ్య మోతాదు ఎక్కువైంది, పాకిస్థానుకి నియంతల మోతాదెక్కువైంది. ఇక్కడ అవే మందుగా పనిచేసాయి. ఈ ప్రజలని మెచ్చుకోవాలి కదా? వీళ్ళ ప్రగతికి నా దృష్టిలోకొన్ని ముఖ్య కారణాలున్నాయి.
౧. వీళ్లలో కుల, మత పిచ్చుల్లేవు. ఏ పనులైనా, ఎవరినా చేస్తారు. ఆడా,మగా తేడాలేకుండా. ఆడవాళ్ళే ఎక్కువ వ్యాపారవ్యవహారాలలో కన్పిస్తారు. 'యత్రనార్యంతు పూజ్యతే' అని ఘనంగా కబుర్లు చెప్పేమనం, అది బడితపూజకి మాత్రమే పరిమితం చేసినట్లున్నాము. చాలా రంగాలలో స్త్రీలు వచ్చినా, వాళ్ళపట్ల గౌరవభావన తక్కువ కనిపిస్తుంది. ఇటువేపు, ఆడవాళ్ళు మగవాళ్ళ టాయిలెట్లు కూడా శుభ్రపరచడనికి ధైర్యంగా వెళ్ళడం నన్ను ఆశ్చర్య పరిచింది. మనవైపు ఆడవాళ్ళు ఉద్యోగానికెడితే చాలామటుకు చులకనే. అల్లాగే, అందరూ అన్నిపనులూ చేయడం, చేస్తున్న పని పట్ల గౌరవం మనకీ జన్మలో వీలుపడదనుకొంటా.
౨. వీళ్లు కన్ఫూసియన్ విలువల్ని పాటిస్తారు. ఇవేమీ మనకి తెలియనివి కాదు. మన దేశంలో కూడా పాటించేవాళ్ళం. దాంతో పెద్దలంటే గౌరవం, నిజాయితీ, ఆదేశాల్ని పాటించడం, మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం లాంటివి వీళ్లు ఇప్పుడుకూడా పాటిస్తారు.
౩. వీళ్లకి తమ ఫిట్‍నెస్‍ పై శ్రద్ధఎక్కువ. అదీకాక, ఇక్కడ అబ్బాయిలు తప్పనిసరిగా సైన్యంలో సుమారు రెండు సంవత్సరాలు పనిచేయాలి, చివరికి దేశాధ్యక్షుడి కొడుకైనా సరే. దాంతో వీళ్లకి శారీరక దారుఢ్యం కల్గుతోంది. మనదేశంలోలాగా 30 ఏళ్ళకే ముసలివాళ్ళయిపోవటంలేదు.
౪. ఏపనైనా త్వరగా పూర్తిచేయడం, సమయపాలన వీరి సొత్తు. ఇక్కడ కట్టడాలని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కట్టించే కంపెనీ వాళ్ళు రెండేళ్ళు పట్టుతుందని అంచనా వేసిన భవనం ఆర్నెల్లు ముందుగా పూర్తిచేసి, పెద్ద బోర్డు పెట్టుకొంటారు ఈవిషయం చెబుతూ, గర్వంగా. వీళ్ళల్లో క్రిందటి తరంవారు జర్మనీకి నర్సులుగా, వియత్నాం యుద్ధానికి సైనికులుగా, దుబాయ్‍కి కట్టుబడి పనివారుగా వెళ్లారు. దుబాయ్ లో తమకి ఆదివారంకూడా పనిచేసేందుకు వీలుకల్పించమని ఉద్యమించి చరిత్ర సృష్టించారు.
వీళ్ళ భాషలో 'ఫ్పల్లి ఫ్పల్లి' అంటే 'త్వరగా, త్వరగా' అని. వీళ్ళు ఎప్పుడూ హడావిడిగా పరిగెడుతొనే ఉంటారు. అందుకే వీరిని 'ఫ్పల్లి ఫ్పల్లి' సమాజం అంటోంటారు. అందుకేగా, 30 ఏళ్లలో గంజికి కూడా గతిలేని స్థితి నుంచి, హాయిగా పాలుతాగే పరిస్థితికొచ్చారు.