Sunday, September 28, 2008

ఈఅనంతవిశ్వములో నేనెంతటివాడను

మనభూమి సౌరకుటుంబంలోని ఓ చిన్న గ్రహం. అంతరిక్షంలో అలాంటి సౌరకుటుంబాలు ఎన్నున్నాయో, ఈవిశ్వంలో అలాంటిఅంతరిక్షాలెన్నో? నాకేమో తెలియదు, మీకైనా తెలుసునా? అలాంటి విశ్వంలో మన ఉనికి ఎంత అల్పమో, స్వల్పమో ఎపుడైనా ఆలోచించారా? సుకవి శ్రీ వక్కలంక లక్ష్మీపతిశర్మగారి మస్తిష్కంలో మెరిసిన ఒక ఆలోచన ఫలితం ఇక్కడిచ్చిన ఈలలితగీతం.

నేవిన్నది – శ్రీ మల్లాది సూరిబాబు స్వరంలో
మీరువింటున్నది నా అపస్వరంలో, శృతిలయలకతీతంగా, ఉచ్ఛ్వాసనిశ్వాస సహితంగా,నాకు గుర్తున్న విధంగా

పల్లవి – ఈఅనంతవిశ్వములో నేనెంతటివాడను
అణువునైన అందునా పరమాణువైన అవుదునా

చ 1. పర్వతములముందు నేను పరమాణువునైనకాను
ఉదధిముందు నేనిలచిన ఒకబిందువునైన కాను

చ2. జగదీశుడు నాలో సదా వెలుగుతున్నాడట
సృష్ఠికర్త నేనేనట సృష్టియంత నేనేయట

చ3. నాలోనే ఉన్నవాడు నాకగబడడేమో కాని
ఈదాగుడుమూతలేమి ఈసృష్ఠివిచిత్రమేమి
(ఈటపా కి స్పూర్తి రానారె పాత(ట) టపాః- గడిచేనటే సఖీ ఈరాతిరీ. ఆయనకి నెనర్లు)

Tuesday, September 23, 2008

ముంబై ముచ్చట్లు: తాజా వార్త

ఏంటో ఆర్నెల్లయితే కానీ దేనికీ స్పందించలేక పోతున్నా :)) అందరికీ ఆలస్యంగా అందించే వార్త- నేను ప్రస్తుతం ముంబై మహానగరంలో ఉంటున్నా. హైదరాబాదు నుండి బదిలీ మీద మే నెలలో వచ్చా. కొంతమందికి అబ్దుల్ కలాం మన రాష్ట్రపతిగా ఎన్నికయ్యారన్నంత తాజావార్తయుండచ్చు. 1993 నుండి 2002 వరకూ ఇక్కడే, అందులోనూ ఐదేళ్ళపాటు ప్రస్తుతం ఉన్న క్వార్టర్సులోనే ఉండడం తో కొత్త ఊరొచ్చిన ఫీలింగేం లేదు కానీ తెలుగుదనం మిస్సయ్యే అవకాశం ఉంది. కానీ అదృష్టాల్లోకల్లా గొప్ప అదృష్టం ఎక్కడికెళ్ళినా మన భాష వాళ్ళు దొరకడం. నేనెక్కడికెళ్ళినా ఓతెలుగాయన/ఆవిడ దొరకడం గ్యారంటీ. చివరికి కొరియాలో కూడా ఓతెలుగు కుర్రాడు మాయూనివర్సిటీ లోనే, మా బిల్డింగులోనే ఉండేవాడు. నోరారా .. తెలుగు భాషించు జిహ్వ జిహ్వ అనుకుంటూ .. రెండున్నరేళ్ళు సంతోషంగా మాట్లాడేసుకున్నాం. అసలుకి ఆయన వేరే ఊళ్ళో ఉండేవాడు. నేనెళ్ళే ముందే నాకోసమే అన్నట్లు వాళ్ళ ప్రొఫెసరు తను వి.వి. మారుతూ ఇతన్ని కూడా తీసుకొచ్చేసాడు .. డిగ్రీ మాత్రం పాత వి.వి. నుండే ఇప్పించాడు. అన్నింటికన్నా ఆహ్లాదకరవిషయం నాకు హైదరాబాదు బదిలీ అయినప్పుడు (2002 లో)మాపిల్లలకి స్కూలులోతెలుగు ఇప్పించగలగడంతో వాళ్ళకి చదవడం, రాయడం వచ్చింది. శ్రావ్యయితే ఈమధ్య పొద్దులో కొరియన్ జానపదకధ అనువదించింది (ఆంగ్లంనుంచి). తనని ఆశీర్వదించిన వారందరికీ నా కృతజ్ఞతలు.

ఈమధ్య బ్లాగులు చదవుతున్నా కానీ ఎక్కువ స్పందించడం లేదు - చెప్పాగా స్పందన సమయం ఆర్నెల్లని. అదీకాక, ఈమధ్య అన్నీ సెన్సేషల్ టపాలే వస్తున్నాయి - ఏం వ్యాఖ్య రాసినా చాలా ఓపికుంటేకానీ మనలేని పరిస్థితి - కొండొకచో. టపాలు రాయచ్చుగా అంటారా? అంతరాత్మ ప్రబోధం కూడా అదే. దాని ఫలితమే ఈటపా. వీలైనప్పుడల్లా ముంబై ముచ్చట్లు పంచుకుందాం.
భవదీయుడు
సత్యసాయి