Wednesday, February 20, 2008

ఈమధ్య నాకు బాగా తెలుగు చేసింది

ఇదేంటి తెలుగు చేయడమేంటి అనుకుంటున్నారా? ఈ మధ్య జలుబు చేసినట్లే తెలుగు చేసింది. జలుబు లక్షణాలు మనందరికీ తెలుసు. ముక్కులోంచి నీరుకారడం, తుమ్ములు... ఇలాంటివి. కానీ తెలుగు చేస్తే వ్యాధి లక్షణాలు మనని కలిసిన వాళ్ళలో కనిపిస్తాయి. వ్యాధి లక్షణాల తీవ్రత ఆయా వ్యక్తులు మనతో ఎంతసేపు మాట్లాడారు, ఎంత మొహమాటస్తులు అనే వాటికి అనులోమానుపాతంలో ఉంటుంది. అలాగే వారికీ మనకీ ఉన్న సంబంధబాంధవ్యాలని బట్టి కూడా ఉంటుంది. ఉదాహరణకి మనం వాళ్ళకి అప్పున్నా లేక వాళ్ళు మనకి అప్పున్నా వాళ్ళు మన మాటని అంత నిష్కర్షగా తోసిపాడేయలేరు. అయినా నాపిచ్చిగానీ ఈమధ్య ఎవరూ ఎవరిదగ్గరా అప్పులు ఇచ్చిపుచ్చుకోవట్లేదు. ఏవన్నాఅవసరపడితే బ్యాంకుల్లోనో, అప్పుచీటీ (క్రెడిట్ కార్డు) ఉపయోగించో డబ్బులు తీసుకోవడం పరిపాటైపోయింది. ఈ పద్ధతిలో అయితే అప్పు ఎగ్గొట్టే సౌకర్యంకూడా ఉంది కదా.

కానీ వ్యాధి దశ, కారకాన్ని బట్టి మనలో కూడా వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి లక్షణాలలో కొన్నిఏమిటంటే - 1) ఎవరైనా పెల్లి, మల్లీ, బర్త, బార్య ఇలా వత్తుల్లేకుండా మాట్లాడుతుంటే కడుపులో కెలికినట్లుండడం, ఎక్కడో కాలినట్లు మండడం, 2) కూడలిలో తప్పిపోయి ముఖ్యమైన తేదీలని, పనులని మర్చిపోవడం, 3) ఏం చేసినా, రాసినా తెలుగులో చేయాలనిపించడం, 4) పిల్లలని తెలుగులో చదువు, రాయి అని సతాయించి వాళ్లు అలాచేయకపోతే ఎసిడిటీ తెచ్చుకోవడం, 5) బ్లాగులో టపా రాసేయగానే హిట్లు లెక్కెట్టుకోవడం, ఉండొచ్చు. ఇతర రకాలైన లక్షణాలు కూడా కనిపించే అవకాశం లేకపోలేదు.

ఇంతకీ నాకు తెలుగు చేయడం విషయానికొస్తే, ఆఫీస్ ఎవరైనా నా సీటుకొస్తే మటాష్. ఏదో అడుగుతారు, సంభాషణ ఎటునుంచి ఎటో పోయి చివరికి తెలుగు దగ్గరకి వస్తుంది. వెంటనే ఆవు వ్యాసం మూసలో నా ధోరణిలోకి వచ్చేసి తెలుగుభాష, ఇంటర్నెట్ లో తెలుగు, గూగుల్లో తెలుగు, కంప్యూటర్ నిపుణులు, ఔత్సాహికులు ఇంటర్నెట్ లో తెలుగుని ఎంతగా వ్యాప్తి చేస్తున్నారు, కూడలి, కంప్యూటర్ లో తెలుగు రాయడం వంటి విషయాల విషయాలపై సైద్ధాంతిక చర్చ, ఆవెంటనే ఓ డెమో చకచక జరిగపోతాయి. మొత్తానికి ఓ ఇన్సూరెన్స్ ఏజెంటు లాగా అయిపోయా. ఈమధ్య ఇంటర్నెట్టులో తెలుగు వెలుగులు అని వ్యాసంవచ్చిన ఈనాడు ఆదివారం పుస్తకం నాబ్యాగులో ముఖ్యభాగం అయిపోయింది అని వేరే చెప్పఖ్ఖర్లేదనుకుంటా. ఆమధ్య నాదగ్గరకి ఒక కుర్రాడొచ్చాడు. సంగీతం నేర్చకున్నాడట, సంస్కృతంలో రిసెర్చ్ చేస్తున్నాడట. పాపం తను వేరే పని మీదొస్తే, అది అవ్వదని ఒక్కముక్కలో తేల్చేసి ఓ అరగంట తెలుగుగురించీ, బ్లాగులగురించీ అతనుబ్లాగు చేయాల్సిన అవసరం గురించీ నొక్కి వక్కాణించేసా. పైగా మీరేదో పని మీదొస్తే మీ టైం తినేస్తున్నానా అని సన్నాయినొక్కులు కూడా నొక్కా. మా అన్నయ్య కూతురు తన చిన్నప్పుడు (3 ఏళ్ళ లోపు వయస్సులో) ఎడతెరిపిలేకుండా బాగా కబుర్లు చెప్పేది. ఒకసారి అలాంటి ఘట్టంలో బాబయ్యా, నేనిలా మాట్లాడుతుంటే నీకు నోరునొప్పెడుతోందా (తల నెప్పెడుతోందా అని భావం) అని అడిగింది. నేను పైన చెప్పినట్లుగా సన్నాయినొక్కులు నొక్కుతున్నప్పుడు ఆఅమ్మాయి డైలాగే గుర్తొచ్చి నవ్వొస్తుంది.

నాకు తెలుగు పట్టిన లక్షణాలు మీలో పొడచూపక ముందే ఓ రెండు ముక్కలు చెప్పిముగిస్తా. రెండు ముక్కలంటే మా చిన్నప్పటి జూనియర్ కాలేజీ ప్రిన్సిపాలు గుర్తొస్తాడు. ఆయన ఉపన్యాస ప్రియుడు. అన్ని సభల్లోనూ ఆయన మాట్లాడవలసినదే. పాపం ఆయన ఎప్పుడూ రెండుముక్కలు చెప్పి ముగిస్తా అని మొదలెట్టి మధ్యమధ్యలో ఆమాటకి పునరంకితమవుతూ అవుతూ ఓగంట పైగా మాట్లాడి మాబుర్రకాయల్ని వేయి ముక్కలు చేసేవాడు. నేనలా చెయనని నా హామీ.

మొదటిముక్క. ఈమధ్య వెనుకబడిన జిల్లాలకి అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకోమని పంచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ కొన్ని నిధులిచ్చింది. సాయం చేయమని కొన్ని జిల్లాలబాధ్యత మాకప్పగించింది. అలాంటి జిల్లాల్లో కరీంనగరొకటి. ఈమధ్య జరిగిన సమావేశంలో నేనొక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (తెలుగులో ఏమంటారో) తెలుగులో తయారు చేసా. ఎవరైనా సరదా పడితే ఈక్రింది లంకె ద్వారా చూడొచ్చు.
సహస్రాబ్ది లక్ష్యాల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా ప్రణాళిక
బలే సంతృప్తిగా అనిపించింది. చివర ధేంక్స్ స్లైడులో నెనర్లు అని రాసా. అంటే ఏంటని అడిగిన మా సారుకి దానర్ధంచెప్పి బోలెడానందపడిపోయా.

రెండో ముక్క. మాఅమ్మాయి చిన్నప్పుడు తనని పడుకోబెట్టడానికి తెలుగు పద్యాలూ, పాటలూ రాత్రి పూట రోజూ పాడుతోంటే తనకి అలవాటైపోయాయి. ఆవయసులో వచ్చే బాబా బ్లేక్షిప్పులూ, జింగిల్ బెల్లులూ నేర్పించలా (నాకు రావు కదా- మాదంతా ఉప్పుకప్పురం, వంకరటింకర ఓ చదువులాయే). చివరాఖరుకి నాన్నా అని తప్పించి డాడీ అని కూడా పిలిపించుకోలేకపోయా. హైదరాబాదు మాఅత్తగారింట్లో పనిపిల్ల కొడుకు వాడి అమ్మా నాన్నల్ని మమ్మీ డాడీ అని పిలుస్తోంటే కాస్త చిన్నతనం ఫీలవ్వాల్సిందేమో, అదికూడా చేతకాలే. ఆనక హైదరాబాదు వచ్చాకా మాపిల్లలు తెలుగు రాయను చదువనూ నేర్చుకున్నారు. పైన చెప్పిన ఏసందర్భాల్లోనూ కలగని ఆనందం మా పిల్లలు మాగంటి.ఆర్గ్ వారి పిలుపు మేరకి, నా అభ్యర్ధన మన్నించి తెలుగులో చెరియొక వ్యాసం రాసి ఆయనకి పంపించడం, దాన్ని వారి వెబ్ పుటలో చూసుకోవడం ద్వారా కలిగింది. ఇకముందు కూడా వాళ్ళు తాము నేర్చుకున్న తెలుగును మర్చి పోకుండా, తృణీకరించకుండా ఉండాలని ఆశిస్తున్నా.
కొసరు మాట- తెలుగు వ్యాధికి మందు వాలైనంత మందికి దాన్ని అంటగట్టడమేనేమో!!! :)))

Sunday, February 10, 2008

ఏ నరునకు విత్తముగల దానరుడు....

ఈ టపా ఎప్పుడో మొదలు పెట్టా. ఈలోపే వేరే బ్లాగర్ అదే విషయం మీద రాయడం వల్ల పెట్టెలో పెట్టా. ఈవేళ ఓ టీవీ ప్రకటన వినగానే మీఅందరితో నా ఆనందం (??) పంచుకోవాలనిపించి రాసినదీ టపా. ఏంటీ టీవీ సంభాషణల్లా నాన్పుడేమిటీ అంటారా? ఈవార్త టీవీకి సంబంధించిందే.

ఆల్రౌండరు సుమన్ ఓసీరియల్లో ఒక విలక్షణమైన అతిధి పాత్రలో నటించబోతున్నారట.

ఆయన ఇప్పటికే ఒక టెలీసీరియల్లో కృష్ణుడిగా నటించి సంచలనం సృష్టించాడని కూడా సదరు ప్రకటనల్లో హోరెత్తించేసారు. మీరు ఈప్రకటన ఇప్పటిదాకా వినక పోతే నిరాశపడకండి. ఈటీవీలో కార్యక్రమాలని ఈప్రకటనకి షార్ట్ బ్రేకులుగా వేస్తున్నారు. మిస్సయ్యే ఛాన్సు లేదు.

ఈయన గురించి ఆంధ్రదేశంలో తెలియని వారుండరు. ఈయనకి లేని కళ లేదు. ఆయన సీరియళ్ళలో ఈయన పేరు పైన అన్నీ ఉండేవి- రచన, బొమ్మలు, పాటలు, మాటలు, దర్శకత్వం, సంగీత దర్శకత్వం ....వగైరాలు. ఇప్పుడు నటన కూడా కలుస్తుంది. ఆనక ప్రేక్షకుడు అని కూడా కలిసి ఆయన ప్రతిభ ఆయనే చూసుకుని మురిసిపోయే రోజొస్తుందని దీవిద్దాం.

సుమన్ ఒక సంచలనం (sic). హీ ఈజే ఫినామినాన్. కాకపోతే ఆయనమీద ఇంతమంది బ్లాగర్లు టపాలు రాసేంత స్పూర్తి పొందగలరా? ఈమధ్య వచ్చిన చావా కవితలో మీ బ్లాగునకు మీరే సు మన్! ఆయన పేరు ప్రతిధ్వనించింది.

అభిరామ్ .. అంతా సుమన్ మయం…

సోది - ఓ జోకు ఈటీవీ-సుమన్ నందు ఓ ప్రకటన

నాలోనేను - విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ, నట సామ్రాట్, నట రత్న(మెగా స్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్, రెబెల్ స్టార్, రైజింగ్ స్టార్, ఆ స్టార్, ఈ స్టార్..!) సుమన్

చదువరి - నా గోడు

ఇవి కొన్ని మచ్చు తునకలు.

మీకో అనుమానం రావచ్చు- పేరొందిన వారందరూ కాస్తో కూస్తో చిన్న వయసునుండీ ప్రతిభ చూపించుకున్న వాళ్లే. అకస్మాత్తుగా బహుముఖ ప్రజ్ఞావంతులయిపోవడం అరుదు. కానీ దీనికి సమాధానం భర్తృహరి తన అర్ధ పద్ధతి లో ఎప్పుడో సెలవిచ్చాడు.

యస్యాస్తి విత్తం స నరః కులీన స పణ్డితస్య శృతవాన్ గుణఙ్ఞః స

ఏవ వక్తా స చ దర్శనీయః సర్వేగుణాః కాఞ్చనమాశ్రయన్తి

దీనిని తెలుగులో ఏనుగు లక్ష్మణకవి ఇలా చెప్పాడు.

ఏ నరునకు విత్తముగల
దానరుడు కులీనుడధికుడార్యుడతండే
ధీనిధి ధన్యుడు నేర్పరి
నానాగుణగణము కాంచనంబున నిలుచున్

తాత్పర్యం:
ఎవరికి ధనముగలదో వాడే గొప్పకులమువాడు, గొప్పవాడు, బుద్ధిశాలి, కృతార్థుడు, నిపుణుడు కాన అన్ని గుణములును బంగారము (డబ్బు అనచ్చు) నందే నిలచియున్నవి.

ఏంటీ కాళిదాసు సడెన్గా మహాకవయిపోలేదా అంటారా?

అలా అయితే ఓకే.