Tuesday, January 30, 2007

బ్లాగులకో కితాబు

'తేనెగూడు', ఇన్డీబ్లాగీస్ సౌజన్యంతో తెలుగులో ఉత్తమ బ్లాగులకో అవార్డు ఇవ్వబూనడం అత్యంత ముదావహం. బ్లాగర్లు అవార్డులకోసం వ్రాయడంలేదన్న విషయం అందరికీ తెలిసినదే అయినా అవార్డు వస్తే కొండెక్కినట్లుంటుందన్నది సత్యం. ఈఅవార్డులు అనేక అంశాలలో ఇస్తున్నారు. బ్లాగర్లందరూ తమకినచ్చిన తెలుగు బ్లాగులని నామినేట్ చేస్తే తెలుగు వెల్లువ బయటి లోకానికి తెలుస్తుంది. నాకు వచ్చిన సందేహం: తెలుగు బ్లాగులని ఒక్క indic వర్గంలోనే నామినేట్ చేయాలా, లేక ఏ వర్గంలోనైనా చేయచ్చా? నేనైతే కొన్ని తెలుగు బ్లాగులని వేరే వర్గాల్లో కూడా పెట్టాను.

Friday, January 26, 2007

తెలుగు బ్లాగుకొక లోగో

లోగో అన్నది అది ప్రాతినిధ్యం వహించే సంస్థకో, ఉద్యమానికో 'మొహం' లాంటిది. face is the index of mind కదా. అందుకే లోగో చూడగానే ఆ సంస్థ ఏమిటో తెలిసేలా ఉంటే అది గొప్ప లోగో అని చెప్పొచ్చు. కొన్ని సంస్థల పేర్లు logo-friendly' గా ఉంటాయి. కొన్ని లోగోలు వాటిని తయారుచేసిన కళాకారుల సృజనాత్మక శక్తిని ప్రతిబింబిస్తాయి. నాకు బాగా నచ్చిన లోగో ఈ టీవీది. దాంట్లో తెలుగు ఈ ఉంటుంది, ఆంగ్ల E TV కూడా ఉంటుంది. ఈనాడు electronic version లోగోలో ఈ తో పాటు e కూడా ఉంటుంది.






రఘురామ్ ఆ మధ్య తెలుగు బ్లాగర్ సంఘానికి ఒక లోగో ఉంటే బాగుంటుందని సూచించారు. చాలా మంది ఆమోదించారు. ఈ ప్రయత్నానికి తొలి అడుగుగా ఇక్కడ కొన్ని లోగోలు ప్రతిపాదిస్తున్నాను. వీటిని MSPaint లో తయారుచేసాము. వేరే ప్రతిపాదనలు కూడా సేకరించి అన్నింటినీ ఓటింగు పెట్టి జనామోదమైన లోగోని అంగీకరిస్తే బాగుంటుందేమో. బ్లాగర్ సంఘం పెద్దలకి ఈమేరకి నా విన్నపం. ఇక్కడ ఇచ్చిన లోగోల్లో మూల సూత్రం: సాలెగూడు internet కీ, తెలుగు అ, ఆంగ్ల e కలిసొచ్చేలా లోపల అక్షరం internet లో తెలుగుకీ, electronic media కి చిహ్నంగాను ఉపయోగించడం. మూడు లోగోలు ఒకటే, రంగులు వేరే. ముందు ముందు ఇంకా ఏమైనా ఐడియాలొస్తే update చేస్తా.














Monday, January 22, 2007

బాబా, కేసీఆర్, తెలంగాణా

నిన్న రాత్రి వార్తల్లో కేసీఆర్ బాబాగారి వ్యాఖ్యలని ఖండిస్తూ బాబాకి రాజకీయాలెందుకని ప్రశ్నించడం విని కాస్తంత ఆశ్చర్యపోయాను. ఆయన ఏఉద్దేశ్యంతో ఆ వ్యాఖ్య చేసినా బాబాలాంటి సమాజానికి పనికొచ్చే పనులు చేసేవాళ్ళకి రాజకీయాల్లో స్థానం లేదని చెప్పకనే చెప్పారు. కాని ప్రజాస్వామ్య భారతదేశంలో పుట్టిన వాళ్ళెవరైనా, వాళ్ళు బాబాలైనా, లుచ్చాలైనా వారి అభిప్రాయం చెప్పే హక్కుందనుకొంటాను. బాబా చేసిన వ్యాఖ్య ఈనాడులో చూసాను. నాకేమి పెడార్ధాలు కనిపించలేదు. కేసీఆర్ కి ఇంత ఉలుకెందుకో? raise your voice if your argument is weak అనే వాక్యాన్ని చాలా వాదాలు నిరూపిస్తున్నాయి.


బాబా మీద ఎవరికైనా ఎలాంటి అభిప్రాయం ఉన్నా, ఆయన అనేకమంది నుండి సేకరించిన సంపద సమాజసేవకి ఉపయోగపడుతోందనడంలో సందేహంలేదు. అనేక జిల్లాల్లో (కొన్ని తెలంగాణా జిల్లాల్లో కూడా) ఆయన ప్రవేశపెట్టిన తాగునీటి పథకం ఆయనపట్ల ఉన్న గురి వల్ల నిర్వాహకులు అతి త్వరగా, నాణ్యంగా పూర్తిచేయడం చూస్తే 'కట్' ల కోసమే పనిచేసే యంత్రాంగం సిగ్గుపడాలి. ప్రభుత్వాలు తమ బాధ్యతలను నిర్వహించడం కోసం తమ వనరులు ఉపయోగించకుండా (తి.తి.దే. తొ సహా) ఒక వ్యక్తిని డబ్బులడుక్కోవడం సిగ్గు చేటు. ఈరకమైన చిత్తశుద్ధి రాహిత్యాన్ని రాజకీయాలనడం జనాలు చేసుకొన్న పాపం.

Sunday, January 14, 2007

సంక్రాంతి సంబరాలు


కొన్నితెలుగు బ్లాగులు సంక్రాంతి సందర్భంగా శోభాయమానంగా వెలిగిపోయాయి. వాటిని చూసి మహానందమయింది. తెలుగు వారికి తెలుగంటేనూ, తెలుగు పండగలంటేనూ అభిమానం పోలేదని తెలిసి చాలా సంతోషమయింది. దాంతో, ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయింది మనసు.

మా చిన్నప్పుడు పండగలంటే ఒక రకమైన మోజుండేది. పండగలంటే పిండివంటలు, కొత్తబట్టలు, మనం చుట్టాలవడమో, లేకపోతే మనకే చుట్టాలురావడమో జరిగేది. రోజువారి జీవితానికి భిన్నంగా ఉండేదే పండగన్న భావం కలిగేది. ఆభిన్నత్వాన్ని అనుభవించడనికి సెలవు సహకరించేది. సూక్ష్మంగా అలోచిస్తే మన పండగలన్నీ కూడా కొన్ని మైలురాళ్ళకీ, కొన్ని సంఘటనలకీ లంకె ఉన్నవే అనిపిస్తాయి. ఒక పండగ సూర్యుడి గమనానికి సంబంధించయితే, ఒక పండగ పంట నాటడానికీ, ఇంకోటి కోతలకీ సంబంధించినది. మన పాత తరానికి జీవితాన్ని అనుభవించడం బాగా తెలుసని మన పండగలు తెలియచెబుతాయి. అల్లాగే మన జీవవ్యాపారాలకి సంబంధించిన మైలురాళ్ళకి కూడా కొన్ని సంబరాలు లంకె పెట్టి జీవితాల్ని సారవంతం చేసుకొని అనుభవించారు. బారసాల, అన్న ప్రాసన, పెళ్ళి, పేరంటం, షష్ఠిపూర్తి - ఇలాంటివి ఒక ఉత్సవం లాగా చేసుకోంటూ తమ జీవితాలకి రసపూర్తి కల్గించుకొన్నారు. యాంత్రికతను తొలగించుకొన్నారు.

మా అదృష్టంకొద్దీ మా చిన్నప్పుడు పండగలని పండగల్లాగా అనుభవించాం. మా పిల్లల్ని చూస్తే వాళ్ళు చాలా కోల్పోతున్నారనిపిస్తుంది. వాళ్ళకి ఆ కోల్పోయిన ఫీలింగు కలగక పోవడం వాళ్ళ దురదృష్టం. మా అబ్బాయయితే మీది పాతకాలం అని నాతోటీ, మా అమ్మతోటీ అనేసాడు కూడా. కొత్తకాలం అంటే ప్రస్తుత కొలమానం ప్రకారం కొళాయి తిప్పగానే నీళ్ళురావాలి, స్విచ్చి నొక్కాగానే గాలీ, వెలుతురూ రావాలి, కాళ్ళు కదపకుండా దూరాలు వెళ్ళాలి. శరీరాల్ని కాస్తైనా కష్టపెట్టకుండా పనులన్నీ జరిగిపోవాలి. ప్రస్తుత సామాజిక వాతావరణం కూడా ఇలాంటి సుఖాలకే పెద్దపీట వేస్తోంది. ఇప్పుడు పండగంటే సెలవు మాత్రమే! అంటే పండగరోజు ఆలశ్యంగా నిద్రలేవాలి. అది రూలూ. అన్ని పనులూ ఆలశ్యం చేసుకోవాలి. ఆనక మొద్దు పెట్టి (idiot box) ముందు గంటలతరబడి కూర్చొని కాలం గడిపెయ్యాలి. ఒక ఇరుగూ పొరుగూ, ఒక అచ్చటా ముచ్చటా ఏమీ ఉండవు. ఆనక దెబ్బలాటలూ మామూలే. ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు కొత్త బట్టలు కొనేయడం, ఏ పిండివంటలు తినాలన్నా 'స్వగృహా' అన బడే పరగృహాలకి పోయి కొనుక్కొని తినేయడంతో పండగంటే ఏ ప్రత్యేకతా లేకుండా పోయింది.

మా చిన్నప్పుడు పండగంటే కొన్ని రోజుల ముందునుంచీ హడావడి మొదలు. అందులో సంక్రాంతి అంటే తెలుగు వాళ్ళకి పెద్ద పండగ. మాకు అర్ధసంవత్సర పరీక్షలయ్యాక సంక్రాంతి కలిసేలా సుమారు రెండు వారాలకి తగ్గకుండా సెలవలిచ్చేవారు. ఇప్పుడు ఆంధ్రదేశంలో చాలా మటుకు స్కూళ్ళకి క్రిస్మస్ సెలవలిస్తున్నారు. సంక్రాంతికి రెండు, మూడు రోజుల్తో సరిపెట్టేస్తున్నారు. చివరికి భారతీయ విద్యాభవన్ లాంటి అచ్చమైన దేశవాళీ పేరు పెట్టుకొన్నస్కూళ్ళది కూడా ఇదే పద్ధతి. ఇంటికి సున్నాలెయ్యడం, పాతసామానులు, చెత్తాచెదారం తీసి ఇల్లూ వాకిలీ శుభ్రం చేయడం, కడగడం, వీటితో ఒక వారం పైన పట్టేది. పెద్దవాళ్లకి ఒళ్ళు హూనమయ్యేది, కానీ మాకు చాలా సంబరంగా ఉండేది. మేం చేయగల పనులు మా చేత చేయిస్తో ఉండేవారు. తర్వాత, నిలవ ఉండి, నలుగురికీ పంచడానికి పనికి వచ్చే తీపీ, కారం పిండి వంటలు తయారు చేసేవారు. చిట్టిగార్లు లాంటివి చేస్తోంటే మేమందరం ఇత్తడి చెంబులు తీసుకొని కూర్చొనే వాళ్ళం, ఉండల్ని మొత్తడానికీ, ఆపైన వేపినవి వేపినట్లే రుచి చూసేయడానికి. అలా చేసిన చిట్టిగార్లలో మాశ్రమా, ఉత్సాహాలు మరింత రుచిని చేర్చేవి. ఆరోజుల్లో కాస్తంత భారీ పిండివంటయితే ఇరుగు పొరుగులు ఒకరికొకరు సహాయపడేవారు. అందుకని, చివరలో కొంత మేరకి ఇరుక్కీ, పొరుక్కీ పంచిపెట్టేవారు. ఆ పంచుకోవడంవల్ల కూడ ఒక రుచి వచ్చేది. ఇప్పుటి స్వగృహా వంటకాల్లో అసలైన రుచి లాభాలు మాత్రమే. ఎవరికైనా పెట్టినా, రూపాయలు వారి దోసిళ్ళలో పోస్తున్న అనుభూతి మాత్రమే కలుగుతోంది.

ఏపండగైనా సరే పొద్దున్నే4.30 ప్రాంతాల్లో లేపేసే వాళ్ళు. సంక్రాంతి అయితే పొద్దున్నే లేవగానే వేడినీళ్ళపొయ్యి దగ్గర చతికిలబడిపోయేవాళ్ళం. తలంటుకోసం రమ్మంటే 'పహలే ఆప్' అంటూ సహోదరులకి తెగ మర్యాద చేసేవాళ్ళం. మొత్తం మీద తప్పనిసరి కుంకుడుకాయల తలంటు కానిచ్చి మళ్ళీ పొయ్యి దగ్గర చేరేవాళ్ళం. మా అమ్మ అందరికీ తలంటి, తనుకూడా కానిచ్చేసి వంటపనికి దూకేసేది. మళ్ళీ 10, 11 గంటలకల్లా భోజనాలు తయారైపోయేవి. చేతుల్లో యంత్రాలేమైనా పెట్టుకొని పనిచేసేవారేమో అని పిస్తుంది ఇప్పుడు ఆలోచిస్తే. ఆతర్వాత పెద్దవాళ్ళ భోజనాలు. కాసేపు ఆటల తర్వాత మధ్యాహ్నం 3 ప్రాంతాల్లో మొహాలు కడుక్కొని కొత్తబట్టలిమ్మని వేధించేవాళ్ళం. ఎంత లేటు చేస్తే బట్టలకి అంత మేలని కాస్త లేటు చేసేవారు పెద్దవాళ్ళు. మేమూరుకొంటామా, పక్కవాళ్ళపిల్లలు వేసేసుకొన్నారని చెప్పి తొందరచేసేవాళ్ళం. మా తమ్ముడు కాస్తంత ఉత్సాహవంతుడు. అందుకని వాడిని నక్షత్రకుడ్ని చేసి ముందుకు తోస్తో ఉండేవాళ్ళం. కొత్త బట్టలు వేసుకొన్నప్పట్నించి అవి మాసిపోతాయని రంథి. మా అన్నయ్య, తమ్ముడు అయితే అంత పట్టించుకొనే వాళ్ళు కాదు. కొత్తబట్టలు కట్టుకొన్న ఉత్సాహంలో మరి కాస్త విజృంభించి అవి మాసి పోయేదాకా ఆడేవారు. అన్నిటికన్నా నాకు ఇప్పటికీ నచ్చిన విషయమేమిటంటే పండగ రోజు దెబ్బలాడుకోవద్దని చెప్పేవాళ్ళు. మేము కూడా చాలా సీరియస్ గా తీసుకొనే వాళ్ళం ఆ మాటని. ఆ రకంగా కూడా పండగకి ఒక ప్రత్యేకత ఉండేది.

సంక్రాంతి అంటే గుర్తొచ్చేవిషయం ఇంకోటుంది. అది ముగ్గుల పర్వం. ధనుర్మాసాన్ని స్వాగతించడంతో మొదలైన ముగ్గుల హడావిడి ముక్కనుము తో రథం ముగ్గుతో ముగుస్తుంది. రకరకాలైన ముగ్గులు సేకరించి రోజుకొక ముగ్గు ముంగిట వేయడం ఒక ముచ్చటైన సంస్కృతి. మా అక్క ముగ్గులు పెడుతోంటే మేమందరం సహాయం చేస్తోండేవాళ్ళం. పత్రికల్లో వచ్చే ముగ్గులు చూసి చుక్కలు లెక్కపెట్టడంలో సాయంచేయడం, ఎలా వేయాలోతర్జన భర్జనలు చేయడం మాపని. మానాన్నగారు లెక్కల మాస్తారు. ఆయన ముగ్గులని జామెట్రీ దృష్టితో చూసి సలహాలు చెప్తోంటే మా అక్క ఇరకాటం పడ్తో ఉండేది. అన్నీ అయ్యేసరికి వీధిలో వేరే వాళ్ళు ఆ ముగ్గు కాస్తా పెట్టేస్టే కాస్త నిరుత్సాహంగా అనిపించేది. ఈ ముగ్గులేయడంలో చుట్టు పక్కల ఆడపిల్లల్లో పోటీ ఉండేది. ఏముగ్గు పెట్టబోతున్నారో వేరేవాళ్ళకి తెలియకుండా చివరిదాకా జాగ్రత్త పడేవాళ్ళు. వేరే వాళ్ళ ముగ్గు వివరాలు అడగడానికి అభిమానం అడ్డొచ్చి నడి రాత్రి వెళ్ళిచుక్కలు లెక్క పెట్టి ముగ్గు నేర్చుకోవడానికి తెగ ప్రయత్నిస్తోండేవాళ్ళు. సాయంత్రమో, తెలవారగట్లో చలిలో చుక్కలు పెట్టి ముగ్గు కలుపుతోంటే మా అక్కకి మేము సాయం కూర్చొనేవాళ్ళం. చుక్కలు పెట్టడం, వాటిని కలపడం బాగా రాకపోతే చెరిపి మళ్ళీవేయడం, పక్క వాళ్ళముగ్గుతో పోల్చుకోవడం మామూలే. నచ్చకపోతే బాధ పడడం, మేమందరం ఓదార్చడం ఇవన్నీ మధురమైన స్మృతులు. పనిలోపనిగా నా క్కూడా కాగితం మీద ముగ్గులుపెట్టడం వచ్చేసింది.

మా ఈ ముగ్గుల సరదా అపార్ట్ మెంట్ ల నివాసంతో భంగపడింది. ఈ మధ్యన మా అమ్మాయి స్కూల్లో ముగ్గుల పోటీలో పేరిచ్చివస్తే మా ఇంట్లో ఉత్సాహం మళ్ళీ వచ్చింది. అందరం ముగ్గు కొని, రంగులు కొని తను ప్రాక్టీస్ చేస్తోంటే సంతోషపడిపోయాం. చివరికి తనకో ప్రైజొస్తే హమ్మయ్య ముగ్గుల సంస్కృతి అంతరించిపొలేదని హాయిగా ఊపిరి పీల్చుకున్నాం. ‍



చివరగా ఈ బ్లాగు మొదట్లో ఇచ్చిన రథం ముగ్గు మా అమ్మాయి వేసినది. దీనికి టెక్నికల్ సలహాదార్లు: నేను, మా అబ్బాయీని.




Monday, January 01, 2007

నూతన సంవత్సర శుభాకాంక్షలు


అంతరజాలం (internet) లో తెలుగు ప్రభ జాజ్వల్యమానంగా వెలిగిపోతుండడం చాలా ముదావహం. ఈ తెలుగు వెలుగు ఇలాగే ఈ కొత్త సంవత్సరంలోనూ, ఆపైనా కొనసాగాలని కోరుకొంటున్నాను.
నేను ప్రస్తుతం మనదేశానికి శీతాకాలపు సెలవలకొచ్చాను. ఇక్కడ హైదరాబాదు లో ఉన్నప్పుడు ఒక మిత్రుడి ప్రోద్బలంతో మాఇంటికి దగ్గరే ఉన్న చాచా నెహౄ పార్క్ లో భారతీయ యోగ సంస్థాన్ వారి యోగా క్లాసులకీ వెళ్ళేవాడిని. సుమారు ఒక సంవత్సరంలో నాకూ, నన్ను చూసిన వాళ్ళకీ కూడా నాలో చెప్పుకోదగ్గ ఉత్సాహకరమైన మార్పు కనిపించింది. ఉచితంగా చెబుతున్నాకూడా జనం రావట్లేదు, డబ్బులు తీసుకొని నేర్పేవాళ్ళ దగ్గర బారులు తీర్చి మరీ నేర్చుకొంటున్నారని మా క్లాసులు నడిపే వాళ్ళు వాపోయేవారు. బహుశ: ఉచితంగా వచ్చిన వరాలు కూడా మనకి వెగటుగా ఉంటాయన్న మాట.
ఒక విషయం నాకు బాగా అనుభవమయింది. అదొక పెద్ద పారడాక్స్. రసెల్స్ పారడాక్స్ లాగా సత్యాస్ పారడాక్స్ అనొచ్చేమో. ఒక మనిషి ఉంటాడు. ఆయనకి వ్యతిరేకభావనలెక్కువ (negative thinking). కాని ఆయన, అలాగే ఆయనలాంటి వాళ్ళు, ఆవిషయం గ్రహించడానికి ఇష్ట పడరు. పైపెచ్చు తను తప్ప మిగిలిన వారందరూ ఏదో సమస్యతో సతమౌతున్నారని తెగ బాధ పడినా ఆశ్చర్యపోవఖ్ఖరలేదు. పైపెచ్చు, మంచిచెప్పిన వారిమీద ఒంటికాలి మీద లేచి కించపరచే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళకి సహాయంచేయడానికి మానసికవైద్యలూ, సలహాదారులూ, పుస్తకాలూ అందుబాటులో ఉన్నా కూడా వాళ్ళకి అటువైపు ధ్యాస ఉండదు. అవటానికి ఇవన్నీ ఉన్నవి ఇలాంటి వాళ్ళకోసమే. వేరొక రకం మనిషిని చూడండి. ఈయనలాంటి వాళ్ళు, సహజంగా సానుకూలదృక్పధం ఉన్నవాళ్ళే. వీళ్ళు మీకు భగవద్గీత ఉపన్యాసాలు జరిగేచోటో, ఏ రామక్రిష్ణామఠంలోనో, శంకరమఠంలోనో, యోగా క్లాసుల్లోనో, సామాజిక సేవా కార్యక్రమాల్లోనో కనిపిస్తారు (హిందువుల్లోనే కాదు, అన్ని మతాలవారిలోనూ వారివారి మతపరమైన నమ్మకాలని బట్టి మసీదుల్లోనో, చర్చిల్లోనో, ఇతర ధార్మికప్రదేశాల్లోనో కనిపిస్తారు). వాళ్ళింటికెళ్ళి చూడండి. మీకు self-help పుస్తకాలు, మానసికారోగ్యానికి దోహదం చేసే ఇతర సాహిత్య సామగ్రీ దండిగా కనిపిస్తాయి. వాటిని వీరు చాలా భక్తిగా, శ్రధ్ధగా చదివి నేర్చుకొన్న విషయాలని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తో ఉంటారు. అవటానికి వీళ్ళకి అంతగా ఇలాంటి ఉపకరణాల అవసరంలేదు. ఇలా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్న వాళ్ళు నేర్చుకోకుండానూ, ఇప్పటికే మంచి ప్రవర్తన ఉన్న వాళ్ళు ఇంకా మెరుగవడానికి కృషి చేస్తూనూ ఉన్న పరిస్థితి కన్న పెద్ద పారడాక్స్ ఇంకోటుండదు. కానీ ప్రపంచం ఎవరు ఎలా నడచుకొంటూ ఉన్నా ముందుకుపోతూనే ఉంటుంది. నదులు ప్రవహిస్తూనే ఉంటాయి, ఎవరు ఏరకంగా ఆనీటిని వాడుకొంటున్నా సరే. బాగుపడేవాళ్ళు బాగుపడుతూనే ఉంటారు, పాడయ్యే వాళ్ళు పాడవుతోనే ఉంటారు. మంచిమాటలు చెప్పే వాళ్ళు ఎవరు విన్నా వినక పోయినా తాము చెప్పాల్సిన మంచిమాటలు చెబుతోనే ఉంటారు. అది వారి స్వధర్మం.

నూతన సంవత్సరంలో మొదటి రోజు మా యోగా సెంటరుకొచ్చే ఒక సజ్జనుడు మా అందరికీ మన శరీర ధర్మం గురించి, ఆరోగ్యం గురించి నాల్గు మంచి మాటలు తెలుగులోనూ, ఆంగ్లంలోనూ వ్రాసి అందరికీ ఇచ్చాడు. ఆ మంచి ముక్కలని మీతో పంచుకొంటున్నాను. తెలుగులో ఉన్న వ్యాసాన్ని ఇక్కడ చదవండి.
నూతన సంవత్సర శుభాకాంక్షలతో - సత్యసాయి


*