Sunday, September 16, 2007

వినాయక చవితి జ్ఞాపకాలు(ఇది ఈనాడు సుధాకర్ గారి విచిత్రం)

పైనున్న రేఖాచిత్రం సుధాకర్ గారు SMS ద్వారా పంపారు. వారికి సభాముఖంగా కూడా ధన్యవాదాలు. అందరికీ వినాయక చవితి, రంజాను శుభాకాంక్షలు.

ఈటపా మీరు చదివే సమయానికి అందరూ వినాయకచవితి చేసేసుకునీ, ఉండ్రాళ్ళు గట్రా తినేసి ఉంటారు. మా ఇంటి చుట్టుపక్కల పెద్దపెద్ద వినాయక విగ్రహాలు పెట్టి ఉత్సాహంగా పండగ చేసారు. ఇదే సమయంలో పవిత్ర రంజాన్ మాసం ఆరంభమవడంవల్ల ఇంటిపక్కనున్న మసీదు దగ్గర కూడా చాలా హడావిడి గా ఉండి పండగవాతావరణం నెలకొంది. చవితి ముందురోజైతే బజారులో హలీం అమ్మే దుకాణాలు, చవితి సామగ్రి అమ్మేదుకాణాలతో చాలా రద్దీగా ఉండింది. ట్రాఫిక్ జామయిందని ప్రత్యేకంగా చెప్పడం వ్యర్ధోక్తి .

ఇంటి పొద్దున భారీ వినాయకుని విగ్రహం ట్రక్కునుంచి దించడానికి మా బస్తీజనాలు కలిసికట్టుగా, ఉల్లాసంగా పనిచేయడం చూసాకా మన పెద్దవాళ్ళు పండగలెందుకు ఏర్పాటు చేసి ఉంటారో అర్ధమై, వాళ్ళ దార్శనికతకి జోహారన్నా. రోజూవారీ ఉదరపోషణకోసం చేసే కసరత్తులతో విసిగి వేసారి పోయే జనాలలో పేరుకుపోయిన వత్తిడిని తొలగించి ఉత్సాహం నింపడానికి, కలిసికట్టుగా ఉండగలగడానికీ అడపాదడపా పెట్టిన (వచ్చే) పండగలు బలే ఉపయోగ పడతాయి. అలాంటి పండగల్లో వినాయక చవితికి తెలుగునాట ప్రత్యేకత ఉంది. ఎవరింట్లోవాళ్ళు చేసుకోవడమేకాక, సామూహికంగా కూడా జరుపుకునే పండగ. తొమ్మిది రోజులు గణపతిని కొలువుంచి అనంతచతుర్ధినాడు నిమజ్జనం చేస్తారు. మహారాష్ట్రలో కూడా ఈపండగ చాలా ఘనంగా జేస్తారు. రకరకాల నేపధ్యాలలో గణపతిని కొలువుంచి పోటాపోటీగా పందిర్లు అలంకరించి, ప్రజలకి కనువిందు చేస్తారు. ఉదా. కార్గిల్ యుద్ధంరోజుల్లో కొండలెగబ్రాకుతున్న మన సైనికుల ప్రతిమలు, మధ్య మధ్య కాల్పుల ధ్వనులతో గణపతి పందిరిని చాలాచోట్ల పెట్టారు. ప్రతి వత్సరం రకరకాల సన్నివేశాల నేపధ్యాలతో అలంకరించడం, వాటిలో ఉత్తమమైన వాటికి బహుమతులివ్వడం ఆచారంగా వస్తోంది. అక్కడ మేమున్న పదేళ్ళూ వినాయక చవితి సంబరాలు బాగా ఆస్వాదించాం. మన రాష్ట్రంలో లేని లోటు తెలియలేదు. అక్కడ మాకాలనీలో జరిగిన ఉత్సవాల్లో మా పిల్లలుకూడా ఫేన్సీ డ్రెస్స్ వేసారు. మాఅమ్మాయి పార్వతి వేషం, మాఅబ్బాయి వినాయకుడి వేషం వేసారు.అప్పుడు తీసిన ఛాయాచిత్రం.


నిన్న పాతఫోటోలు, కాయితాలు సర్దుతోంటే ఈఫోటో బయటపడ్డంతో ఆరోజులు ఒక్కసారి గుర్తుకొచ్చాయి. దానికి మాస్కు, త్రిశూలం వగైరాలన్నీ మేమే తయారుచేసాం. వాళ్ళని తయారు చేయడం ఒక ఎత్తైతే, వాళ్ళు సభలోకి వెళ్ళి నలుగురిముందూ నిల్చోవడం మరో ఎత్తు. అంతకు ముందు కృష్ణుడి వేషం వేస్తే మాఅబ్బాయైతే వేదికపైకి పోనేలేదు.
వినాయక చవితి చిన్నపిల్లల పండగ. అసలు ఏపండగైనా అంతేననుకోండి. దీపావళికి బాణాసంచా కాల్చాలి, అంటే డబ్బులుకాల్చాలి. దసరా కి నాల్గిళ్ళు తిరిగితేకానీ పప్పు బెల్లాలు రావు- ఇప్పుడైతే 'దసరా' అంటే ఓరెండు రోజుల సెలవు మాత్రమే. దానిలోని 'సరదా' ఎప్పుడో ఆవిరైపోయింది. కాని వినాయక చవితి అస్సలు ఖర్చులేకుండా ఘనంగా జరుపుకోవచ్చు. మనం పెట్టే పెట్టుబడి పూలు,పత్రి . ఇవైనా కేవలం పిచ్చిగా పెరిగే ఉమ్మెత్త, జిల్లేడు లాంటి మొక్కల ఆకులూ, పూవులూ మాత్రమే. దీనిలోని సూక్ష్మం ఏమిటంటే , పత్రి ,పూవుల కోసం తిరగడం ద్వారా పిల్లలు తమ పరిసరాల్లో పెరిగే మొక్కల గురించి తెలుసుకోగలరు. అంతేకాక, ఆయన పూజకి ఉపయోగించే పూలకీ, ఆకులకీ ఔషధ గుణాలున్నాయి. అంటే, పిల్లలకి వైద్యానికి పనికొచ్చే ప్రకృతి వనరుల పట్ల అవగాహన పెరుగుతుంది. అదీ, సామూహిక ప్రయత్నం ద్వారా - స్నేహితులు కలిసి చేస్తారు కాబట్టి. పత్రి ,పూలకోసం కలిసి వెళ్ళి పోటీగా సేకరించే వాళ్ళం. నైవేద్యానికి మామూలు ఉండ్రాళ్ళు చాలు, చక్కెర పంగలీ, నేతి మిఠాయిలక్కర్లేదు. గడ్డి కోసుకుని బతికేవాళ్లూ, గడ్డి తిని కులికే వాళ్ళూ కూడా దిగులు పడకుండా తనని పూజించు కోనిచ్చే సిసలైన సోషలిష్టు దేవుడీ వినాయకుడు. బంగారు విగ్రహం పెట్టి పూజించే వాళ్లనీ, మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన వాళ్ళనీ ఏకరీతిని బ్రోచే ఏకదంతుడీయన.
పోటీగా పెద్ద, పెద్ద విగ్రహాలు పెట్టి తమ భక్తిని జైంటు సైజులో ప్రకటించుకునే బడానాయకుల భక్తి ని నిస్సహాయంగా చూస్తూండిపోయిన వినాయకుడీయనే. జనాలు కాస్త కనికరిస్తే తొలగగలగీ, ప్రతీ ఏటా తనని నీటిలో ముంచడానికి వస్తున్న విఘ్నాలని చూస్తూ ఉండిపోయిన విఘ్నహరుడూ ఈయనే. ప్రమాదకర రంగులూ, హంగులతో, ప్లాస్టరాఫ్ పారిస్ తో చేసిన బొమ్మలు పెట్టి పూజించే వాళ్ళని ఆయన శిక్షించగలిగితే ఎంతబాగుండునో? చెప్పొచ్చేదేమిటంటే, ఆధునిక పద్ధతిలో , BPO/VR మాధ్యమంద్వారా, వాణిజ్య ధోరణితో పూజలు చేయడం ద్వారా పండగల పరమార్ధం గాల్లో కలిసిపోవడంతో పాటు, జన, జల కాలుష్యాలు పెరిగిపోతున్నాయి.


నేనేకనక నిజమైన పతివ్రతనైతే...ఇలాఅవు గాక, అలా అవు గాక అని పాతకాలం సినిమా పతివ్రతలాగా ... "నేనే కనక అసలైన తెలుగు బ్లాగర్నైతే, ప్రమాదకర రసాయనవర్ణాలుపయోగించి చేసిన ప్రతిమలుపయోగించేవాళ్ళ బుద్ధిమారిపోయి, మట్టి విగ్రహాలుపయోగింతురు గాక" అని జ(శ)పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.