Saturday, February 21, 2009

సంగీతవైభవం

జనవరి లో ఇంటికి (హైదరాబాదు) వెళ్ళినపుడు మాఆనందనగర్ కాలనీలో త్యాగరాజస్వామివారి ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. ఒకరోజు ఉదయం జరిగిన ఉపన్యాసం, బహుమతి ప్రదానం కార్యక్రమాలకి హాజరయ్యా. అంతకు కొన్నిరోజులముందు జరిగిన పంచరత్నకీర్తనల కార్యక్రమం రోజున త్యాగయ్య సినిమా ముహూర్తకార్యక్రమం జరిగిందట. ఇది త్యాగరాజస్వామి మీద తెలుగులో వస్తున్న 3వ సినిమా. మాకాలనీలోనే ప్రతిసంవత్సరం జరిగే ఆరాధనోత్సవాలలో త్యాగయ్య వేషంలో ఊంఛ వృత్తి చేసే శ్రీ ఈశ్వరప్రసాదు ఇందులో ప్రధానపాత్రధారిట. అంతాబాగుంది కానీ ఆఉత్సవం రోజున సినిమావారి కార్యక్రమంతో ప్ంచరత్నకీర్తనలు ఆలస్యంగా ముగించాల్సిన సమయానికి కొద్దిగా ముందుగా మెదలెట్టాల్సి రావడం బాధాకరం అని హాజరైనవాళ్ళు చెప్పారు. సాంప్రదాయాన్ని, సమయాన్ని గౌరవించలేకపోవడం మన దౌర్భాగ్యం.

అది అలా ఉంచితే, ఈ ఆరాధనోత్సవాలు కాలనీ కమ్యూనిటీ హాలులో విజ్ఞానసమితి అనే సంస్థ ఆధ్వర్యంలో దశాబ్దాలుగా జరుగుతున్నాయి. జంటనగరాల్లో జరిగే ఆరాధనోత్సవాలలో వీరు చేసే ఉత్సవాలకి మంచి గుర్తింపు ఉంది. సందర్భంలో కర్ణాటక సంగీతం పోటీలు జరుగుతాయి. ఈపోటీలలో అబ్బాయిలకి బహుమతులు రావడం ముదావహమని టీఆరెస్ బహుమతులిచ్చే సందర్భంలో చెప్పారు. అందరూ టీఆరెస్ అని పిలిచే ఈయన పూర్తి పేరు T.R.Subrahmanyam. (ఈలంకెని అనుసరించి ఆయన గురించి పెద్దగా చదవచ్చు). క్లుప్తంగా - ఈయన ముసిరి సుబ్రమణ్య అయ్యర్ గారి శిష్యుడు, ఢిల్లీ విశ్వవిద్యాలయం లో మ్యూజిక్ ప్రొఫెసర్ గా చేసి రిటైరయ్యారు. పల్లవి పాడడం, సోదాహరణ ప్రసంగాలివ్వడాల్లో సుప్రసిధ్దులు. ఈయన తండ్రిగారు విజయవాడలో పనిచేసినపుడు తెలుగు నేర్చుకునే అవకాశం వచ్చిందిట. మన రాష్ట్రంలో ఉన్న 12 ఏళ్ళూ స్వర్ణకాలంగా భావిస్తానని చెప్పారు. తమిళులు శాస్త్రీయ సంగీతం తో పాటు తెలుగు కూడా నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. మనం కనీసం తెలుగు నేర్వడానికి కూడా ఇష్టపడకపోవడం బాధాకరం. కాస్తాకూస్తో ఉడతాభక్తిగా పాటుపడేవాళ్ళమీద బురద జల్లడానికైతే చాలామంది రెడీ. ప్రస్తుతం జరుగుతున్న భాషావారోత్సవాలలో రానాలందరూ అది చేస్తాం, ఇది చేస్తామని తెగ ప్రగల్భాలు పలుకుతున్నారు. ఎవరోవస్తారని ఎదురుచూడకుండా మనకి తోచింది చేయడం వల్లే తెలుగుబ్లాగులు, అంతర్జాలంలో తెలుగు వెలుగూ ఈస్థాయికి వచ్చాయి.

ఆరోజున టీఆరెస్ ఇచ్చిన సోదాహరణ ఉపన్యాసం (Lecdem)లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఆఉపన్యాసంలో ముఖ్యంగా 3 విషయాలు ప్రస్తావించారు. అవి నా మాటల్లో ..

1. తెలుగు అందమైన భాష. త్యాగరాజాదులు తెలుగులోనే రాయడం వల్ల శాస్త్రీయ సంగీతానికి తెలుగు అధికార భాషలా అమరింది. (http://samkeertana.blogspot.com/2009/02/blog-post_22.html) త్యాగరాజు గారి తమిళ్ శిష్యులు కూడా తెలుగులోనే రాసారట. త్యాగరాజుగారు తెలుగాయన, శిష్యులు తమిళులు, ఆయన ఉన్నది తమిళ్ నాడు, దేశానికి రాజు శర్భోజీ మహరాష్ట్రుడు. టీఆరెస్ గారు సుమారు 15 ని ల పాటు తెలుగు గొప్పగురించి రకరకాలుగా చెప్పారు. టీఆరెస్ కొన్నాళ్ళు సంగీతజ్ఞుడు శ్రీ సాంబమూర్తి గారిదగ్గర పనిచేసారట. ఆకాలంలో తంజావూరు మ్యూజియంలో త్యాగరాజు గారి కీర్తనల వ్రాతప్రతులని పరిశీలించే అవకాశం వచ్చిందట. అంతకు ముందే టీఆరెస్ ఆప్రతులని చూసినా కూడా తెలుగురాకపోవడం వల్ల కేవలం చూడగలిగారట. కానీ ఈసారి చదవగలిగారట. వాటిలో ఒక కీర్తన కి మనం ప్రస్తుతం పాడే రాగంకాకుండా వేరే రాగం రాసి ఉందట. ఈవిషయం గురించి, అలాగే మనం వినే కీర్తనల్లో పాఠ్యాంతరాలుండడం గురించి సాంబమూర్తి గారినడిగారట. త్యాగరాజుగారు తన ధోరణిలో, భక్త్యావేశాలతో పాడుకుంటూంటే శిష్యులు విని రాసుకుని భద్రపరిచేవారట. అలారాసిన వాటి రాగాలని శిష్యులు తమతమ అవగాహనని బట్టి రాసి పెట్టేవారు కాబట్టి, అందులో కొన్ని పొరపాట్లు దొర్లి ఉండచ్చు. ఆరోజుల్లో గురువుని అడిగి తెలుసుకునే ప్రయత్నం దుస్సాహసమట. అదీగాక చాలా రాగాల పేర్లు, శ్రుతులు కాలక్రమేణా మార్పులూ, చేర్పులూ చెందడం మనకి తెలిసినదే.

2. త్యాగరాజస్వామి వారు తాము సమాధిచెందిన 60 సంవత్సరాల తర్వాతే తమ రచనలు వెలుగులోకొస్తాయని చెప్పారట. ఆవిధంగానే ఆయన ఆరాధనోత్సవాలు ఆయన సమాధిచెందిన 60 సంవత్సరాలకే మొదలయ్యాయి. మొదట్లో ఎవరికి తోచిన కీర్తనలని వారు పాడి వెళ్ళిపోయారట. తర్వాతి రోజుల్లో అందరూ కలిసి పాడుదామనుకునే సరికి ఒకే మాదిరి పాడుకోగలిగిన పాటల కోసం వెతగ్గా స్వరసహితంగా స్వామివారు రాసిన ఓఐదు కీర్తనలని ఎన్నుకున్నారట. అవే పంచరత్న కీర్తనలు. ఆరోజుల్లో ఐదు కీర్తనలనీ పాడగల వాళ్ళు ఎవరూ లేరట. మహారాజపురం విశ్వనాధ అయ్యరు గారికి నాలుగొచ్చట. అందుకే ఆయన తిరువయ్యారు వెళితే అక్కడందరూ నాలుగు పాటలొచ్చినాయన వస్తున్నారని గొప్పగా చెప్పుకునే వారట. ఇప్పుడు అమెరికాలో పంచరత్నా క్లాసులు పెట్టి మరీ తర్ఫీదిస్తున్నారుట.

పంచరత్నాల్లో కనకనరుచిరా వరాళి రాగంలో ఉంది (మా అమ్మాయి పేరు ఈరాగాన్ననుసరించే పెట్టాం). వరాళి రాగం నేర్పితే గురుశిష్యులమధ్య గొడవలొస్తాయని ఒక నమ్మకం. అందుకే చాలాతక్కువమందికి ఐదు కీర్తనలూ వస్తాయి. ఈవిషయం మీద సంగీతం డాట్ కం లో చర్చ జరిగింది. దీనికి టీఆరెస్ వివరణ వేరుగా ఉంది. ఆయన ప్రకారం సంగీతం నేర్పే చిన్నమాస్టారెవరో తనకి రాదని చెప్పలేక ఈసెంటిమెంటు సృష్ఠించి తప్పించుకుని ఉంటాడు.

3. శాస్త్రీయ (కర్ణాటక) సంగీతం పాశ్చాత్య పెనుతుఫానుకి రెపరెపలాడటం లేదు. పైగా పాశ్చాత్య సాంకేతిక సదుపాయాలవల్ల సంగీతప్రియులకీ, విద్యార్ధులకీ చాలా లాభం కలిగింది. టెలీటీచింగు పద్ధతిలో చాలామంది విదేశాల్లో ఉంటూ కూడా చక్కగా శాస్త్రీయ సంగీతం నేర్చుకుని కచేరీలిస్తున్నారట. టీఆరెస్ గారి దగ్గరకూడా ఒకరిద్దరు ఈపద్ధతిలో కొన్ని పాటలు నేర్చుకున్నారట.

గమనించాల్సిన విషయం సంగీతాన్నిపట్టుదలగా నేర్చుకునే వాళ్ళలో తమిళులే ఎక్కువుండడం. శంకరాభరణం సినిమా తర్వాత చాలామందికి శాస్త్రీయ సంగీతం మీద మక్కువ కలిగింది. కానీ టీవీ ఛానెళ్ళ వల్ల పిల్లలకీ, పెద్దలకీ కూడా జిడ్డు సీరియళ్ళూ, సినిమా పాటల, డాన్సుల పోటీలూ తప్ప ఒక్క సంస్కృతీ, సాంప్రదాయాలకి సంబంధించిన ఒక్క చిన్న కార్యక్రమం కూడా ఉంచక పోవడం శోచనీయం.