Sunday, June 22, 2014

అన్నపూర్ణ - మాదు పిన్ని

ఆమధ్య మా బాబాయి కొడుకు ఫోను చేసి, మా అమ్మ మీద ఒక సావనీరు వేద్దామనుకుంటున్నాము, దానికి ఏదైనా రాయడంతో పాటు దొడ్డ (మా అమ్మ అన్న మాట) దగ్గరనుండి కూడా ఏవైనా అనుభవాలు సేకరించమన్నాడు.  కేవలం గొప్పవాళ్ళ చరిత్రలే రాయబడగలవీ, వాళ్ళ జీవితగాధలే స్ఫూర్తిదాయకాలూ అన్నచారిత్రకస్పృహ మైండంతా నిండిఉండడం వల్ల, తమ్ముడి ఐడియా వెంటనే చెవిదిగలేదు. ఆనక ఆ ఐడియా ఇంతై అంతై బుర్రంతా నిండి, వాటేనైడియా సర్జీ అనేలా చేసింది.  అవునూ, మనలా మామూలుగా బతుకుతూ మనపరిధిలో మనకుటుంబాన్ని పైకి తీసుకురావడానికి చేసిన కృషికి గుర్తింపు అవసరం లేదా?  మనపిల్లలని సరిగా పెంచడం, దానికోసం అవసరమైతే స్వసుఖాలని త్యాగం చేయగలడం, ఆకార్యంలో తన జీవితభాగస్వామికి చేదోడు, వాదోడుగా ఉండడం ఆదర్శప్రాయమూ, గుర్తింపదగిన  ఘనకార్యంకాదా?  అవునని అర్ధం. మనచుట్టూ మన మధ్యనే మనకుటుంబ సభ్యుల్లోనే ఉన్న హీరో, హీరోయిన్లని మనం గుర్తించ(లే)కపోవడం శోచనీయం.  మాపిన్ని కూడా మాకుటుంబంలో ఉన్న చాలామంది  హీరో, హీరోయిన్లలో ఒక నిఖార్సైన హీరోయిన్.

అసలుకి మా పిన్నిగురించి రాయడానికేమైనా ఉందా అని ఆశ్చర్య పోతోంటే, నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ మా పిన్ని చరిత్రంటే  మాబాబయ్య చరిత్రే అన్న నిజం తెలిసింది. నూటికి నూరు శాతం ఆరోజుల్లో పెళ్ళాల చరిత్రలింతేనేమో.   కానీ మాపిన్నినోట్లోంచి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ తనకి మా బాబయ్యజీవితానికి భిన్నంగా  వేరే జీవితం ఉన్నట్లుగా ఎప్పడూ ఎటువంటి ఫీలింగూ బయటపడలేదు.

ఆమధ్య ఎప్పుడో మాబాబయ్య గురించి నాబ్లాగులో ఒక టపా  వ్రాసా.  దానికి లింకు ఇక్కడ. అది మా బాబయ్యనుద్దేశించి వ్రాసినా, చివరికి మా పిన్ని గురించి రాసినట్లయింది.  మాపిన్ని చిన్నతనంగురించి అడిగితే మా అమ్మ ఏమిటో ఆరోజుల్లో ఒకళ్లగురించి గమనించేంత సమయంఉండేదికాదు, ఎప్పుడూ ఒకరిద్దరు పిల్లలని ఆడిస్తో ఉండడమే పనిగా ఉండేదని, ఆపిల్లలలో ఒకరు మా పిన్నని చెప్పింది.  నలుగురు అన్నలతర్వాత అపురూపంగా పుట్టిన ఆడపిల్ల మా పిన్ని. మాఅమ్మమ్మ మాత్రం ఇది పెద్దయ్యాక అమ్మన్నరాజా (అప్పట్లో ఆఊరి ఎమ్మెల్యేట) లా అవుతుందే అనేదిట.

ఊహ వచ్చిన తర్వాత మా పిన్నిని చూసిన మీదట తన చిన్నప్పుడు ఎంత అందంగా ఉండేదో చెప్పచ్చు.  ఉమ్మడి సంసారంలో ఉన్నప్పుడు మేమందరం పంచుకున్న అనుభవాలూ, అనుబంధాలలో మా పిన్నిపాత్ర కేవలం మా పిన్ని మాత్రమే పోషించగలదనడంలో అతిశయం లేదు. మా అందరి సుఖదుఃఖాలలో అంతగా ఇమిడిపోయింది.
ఆరోజుల్లో తణుకులో మా ఇంటి వెనకాల ఉన్న వేంకటేశ్వరస్వామివారి గుడిలోంచి భక్తిగీతాలొస్తూండేవి. అవి మేం చాలా శ్రధ్దగావింటూండేవాళ్ళం. అందులో ముఖ్యంగా రంగపుర విహారా అన్న ఎమ్మెస్ పాడిన దీక్షితారు వారి కీర్తనని మా పిన్ని కూడా పాడేస్తోండేది.  అప్పుడడిగితే చిన్నప్పుడు సంగీతం నేర్చుకున్నానని చెప్పింది. వెంటనే నాదృష్టి లో మా పిన్ని హీరోయినయిపోయింది. ఆతర్వాత ఎప్పుడు ఆపాట విన్నా మాపిన్నే గుర్తొచ్చేది.

మా పిన్ని మాబామ్మకోడళ్ళలో చివరిదీ, చిన్నదీ అవడంవల్ల ఆవిడ డ్యూటీలు వడ్డనల్లోనూ, వంటింటి బయటా ఉండేవి.  కానీ బాగా వంటచేస్తుందనీ తర్వాత రోజుల్లో తెలిసింది. ఎంతైనా అన్నపూర్ణ కదా.  అది నేను ముంబైనుండి ట్రాన్స్ఫరై హైదరాబాదు వెళ్లాక కొన్ని రోజులు ఒక్కడినే ఉన్న రోజుల్లో, ఒకసారి వాళ్ళింటికి చూడడానికి వెళ్తే తెలిసింది.  సాయంత్రం 7 కి వెనక్కి వెళ్తానని చెప్తే భోజనం చేసివెళ్ళమన్నారు వాళ్ళు.  లేదు, వెళ్ళాలి అని బయలుదేరినవాడినే, వంటింట్లో  మాపిన్నిచేస్తున్న పెసరపప్పు సాంబారు వాసనకి టెంప్టై పోయి, ఒక్కసారింకెవరైనా ఆపితే ఆగిపోవాలని కమిటైపోయా. మీకు వేరే చెప్పాలా. ఒక్కసారి ఇలాంటివాటికి కమిటైతే అవతలవాళ్ళు మళ్ళీచెప్పకపోయినా ఆగిపోవాలని. ఆ అవసరం లేకుండా వాళ్ళు మరొక్కసారి మొహమాటపెట్టడం, నేను వెంటనే మొహమాటపడిపోవడం వల్ల మాంఛి సాంబారు  దొరికింది.

మాపిన్ని టాపికొస్తే మాకందరికీ గుర్తొచ్చేగుణం ఒకటుంది. ఇంట్లో ఏదైనా కార్యక్రమం ఉంటే,  వెంటనే డ్యూటీలో జేరిపోయే అతికొద్ది మందిలో మాపిన్ని ఒకరు.  అది గుర్తింపు రాని పనైనా సరే.  మా అక్క పెళ్ళిలో వేరేవాళ్ళందరూ పెళ్ళింట్లో కనపడే పనిచేస్తూ బిజీగా ఉంటే, గుప్తంగా విడిదిలో ఉండి మొగపెళ్ళివారికి మర్యాదలు చేసిన ఘనత ఆమెదే.
తమకంటూ ఎటువంటి గుర్తింపు ఆశించకుండా, కుటుంబసభ్యుల సౌకర్యమే తమసౌకర్యంగా భావించే మాపిన్ని లాంటివారు మనమధ్యలో ఉండబట్టే మన ఇళ్ళల్లో శాంతి, సౌఖ్యాలు దండిగా ఉంటున్నాయని సెలవిస్తూ,
మీ సత్యసాయి కొవ్వలి