Saturday, November 20, 2010

నా బ్లాగు యాత్ర

  • క్రితం ఏడు నా బ్లాగు పుట్టిన రోజు సందర్భంగా రాసిన టపాలు ఏదో సందర్భంలో చూసా.   అవి-
  • తెలుగు బ్లాగుల దినోత్సవం - సింహావలోకనం - మిగిలిన కొద్ది భాగం
  • తెలుగు బ్లాగుల దినోత్సవం - సింహావలోకనం
  • వాటిని పరిలోకిస్తోంటే గుర్తొచ్చింది, నా బ్లాగు పుట్టినది ఈ నెలలోనే అని. ఇన్నాళ్ళూ నన్ను అభిమానించి, నా రాతకోతలని ఆదరించిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. క్రమం తప్పకుండా రాయలేక పోతున్నందుకు బాధపడుతున్నా కానీ కుదురుగా కూర్చుని రాయడానికి కుదరట్లేదు. కానీ అందరి బ్లాగులూ చదువుతూనే ఉన్నా.  
  • అందరికీ వందనాలు.
  • సత్యసాయి

Saturday, October 02, 2010

లలిత సంగీతం.

అందాల ఆమని….

2007 ఏప్రిల్ లో వర్డ్ప్ ప్రెస్ బ్లాగులో పెట్టిన టపా.  
ఈఏడాది చలికాలం అనూహ్యమైన హచ్చుతగ్గులు చూపడంతో అయోమయంలో పడిన ప్రకృతి, ఉన్ని బట్టలొదిలేసి ఇప్పుడిప్పుడే రంగుబట్టలేసుకొంటోంది.
వసంతాగమనం
వసంత ఋతువు లేచిగుర్లకి, రంగురంగుల పూవులకే కాకుండా కొత్త కవితలకి కూడా ప్రసిధ్ధి.  కవితాగానం లేకుండా ఉగాదిని ఊహించగలమా?  స్పూర్తిదాయకమైన ఇటువంటి అందాల ఆమనిని కవి ఏవిధంగా పొగుడుతున్నాడో గమనించండి.   కవి పేరు గుర్తులేదు (ఎవరైనా అందించగలరా?).  సంగీతం కూర్చినది మల్లాది సూరిబాబు అని గుర్తు.  

    అందాల ఆమని

(అంచనా వరుస  కావాలంటే పైన నొక్కండి)
అందాల ఆమని … ఆనంద దాయిని
అరుదెంచినావటే అప్సర కామిని                   …. అందాల…
 1. గండుకోయిల నీదు గళమందు పాడినదె
నిండుపండువ నీదు గుండెలో దాగినదె         …. అందాల…
2. పువ్వులే నవ్వులుగా పులకించిపోదువా
నవ్వులే వెన్నెలగా నన్ను మురపింతువా      …. అందాల…
3. యుగయుగాలుగ కవులనూరించు రసధుని
మధురార్ద్ర హృదయినీ మాధవుని భామిని      …. అందాల…

Sunday, September 12, 2010

వినాయకుని వలే..

ఒకాయనకి   చిన్నచిన్న కళ్ళు. 

ఇంకొకాయనకి పేద్ద పొట్ట.

ఇంకొకాయనకి ఒళ్ళంతా చెవులే.  

ఇంకొకరికి పొడుగు మూతి.

ఈ అవలక్షణాలన్నీ ఒక్కరికే ఉంటే…..  ఊహించండి. ఎలా ఉంటాడు.

ఇంకెలా ఉంటాడు. చాలా అందంగా ఉంటాడు.. మన వినాయకుడిలా.  ఇలా…

DSC01799

ఏపార్టుకి ఆపార్టే చూస్తే ఏమాత్రం ఎవ్వరూ యిష్టపడని శరీరభాగాలున్న ఈయన సౌందర్యం ఎనలేనిది. అలాగే,  ఈయనని చిత్రపరంగా చిత్రవిచిత్రాలుగా చూపించచ్చు.     

లాటిన్, అరబిక్ లాంటి ఫాంట్లతో  ఇలా ఉంటాడు.

ȴة͠ Ͽ

ముంబైలో ఆటోరిక్షాలమీటరు మధ్యనున్న ఎత్తైన ముక్కులాంటిదానికి పెయింటు వేసి వినాయకుడిరూపుకి తీసుకువస్తారు. జాలంలో చిత్రాలు చూడండి ఎన్ని రకాలుగా, ముద్దుగా ఉంటాయో.  ఆయన ఇలా ఆకులా కూడా ఇమడగలడు.. మాఇంట్లో యిమిడినట్లు.

leafy ganesh

వినాయకుడి వంటి దైవం లేడు. ఎక్కువ ఆడంబరాల్లేకుండా చేసుకోగల వ్రతం వినాయక వ్రతం. మీరందరూ ఆయన్ని పూజించే ఉంటారని ఆశిద్దాం.. ముఖ్యంగా గత సంవత్సరం నీలాపనిందలకు గురైన బ్లాగర్లు.

మీకూ, మీ కుటుంబాలకి వినాయకుని ఆశీర్వచనాలు లభించుగాక.

Sunday, August 08, 2010

ముంబై ముచ్చట్లు: వానా వానా ... వెంగళప్పా

వానా వానా వల్లప్పా.. అని మనం చిన్నప్పుడు వానొస్తే చాలు  అనందంగా గెంతులేసేవాళ్ళం.  ముఖ్యంగా కాస్త గట్టిగా కురిస్తే స్కూలుకి సెలవుండేది కాబట్టి మహా ఆనందం గా ఉండేది.  పెద్దయ్యాక వానకి, సెలవుకి సంబంధం తెగిపోయి ఎంత వానకురిసినా చిన్నప్పటి ఆనందం లేదుకానీ, తాగడానికి నీళ్ళు దొరుకుతాయన్న ఒకే ఒక కారణం సంతోషం కలిగిస్తోంది.

వానపాటలు, వాన మీదే ఆధారపడిన సినిమాలూ, తడి బట్టల హీరోయిన్లు… ఇవ్నన్నీ వర్షం మీద రోమాంటిక్ భావం కలిగిస్తే, వాన రాజకీయాలు రోతభావాలు కలిగిస్తాయి.

ముంబైలో మేమున్న 12 సంవత్సరాలలో ముందటేడు తాగడానికి కూడా నీళ్లు కరువైయ్యాయి. ఏలినవారు ఎలాగో అలా కోతలతో గండం గట్టెక్కించారు. ముంబై వర్షాలు ఇంతకు ముందుదాకా చాలా ఆనందంగా ఉండేవి.  గత కొన్ని సంవత్సరాలుగా సముద్రపు ఆటుపోటులు, భారీ వర్షాలు  కలిసి వస్తాయేమోనని భయపడుతూనే ఉన్నారు ముంబైవాసులు.. ముఖ్యంగా 26/7 వరదల తర్వాత.  ఆసందర్భంలో ముంబైవాసులు అనేక ఇక్కట్లకి గురయ్యారని మనం చాలా విన్నాం, చదివాం.  ఆతర్వాత ప్రభుత్వం మీద ప్రతిసంవత్సరం తగు ఏర్పాట్లు తీసుకోమని వత్తిడి వస్తోనే ఉంది. ప్రతి సంవత్సరం ఏలినవారు వుయార్ ఫుల్లీ ప్రిపేర్డ్ అని చెప్తోనే ఉన్నారు, ప్రజల ఇక్కట్లు మామూలే.  రోడ్లు … అంటే ఏమిటో మర్చి పోయాం మేము.  రైలు పట్టాలు పర్వాలేదు అనుకుంటే  కాస్త వర్షానికి కొన్ని చోట్ల పట్టాలు మునిగి పోయి మొన్నో రోజు 60 కిమీలు 5 గంటలలో చేర్చి, కొండోకచో అస్సలు చేర్చ లేక అవీ ఉపయోగకరం కాదని తెల్సింది.  

మనది పుణ్యభూమి అవడం వల్ల వరదలు రాలేదు. యజ్ఞాలు చేసి ప్రజలని రక్షించవచ్చని ఏలిన వారికి తట్టలేదు కాని లేకపోతే అవి కూడా చేయించేసి మరి కొన్ని డబ్బులు చేసుకోరా?   అన్నట్లు మా మేయరు గారు అన్నిటికీ పైవాడిదే భారం అని ఆత్మజ్ఞానం తెచ్చుకున్నదై 1200 మందితో తిరుపతి ప్రయాణమయ్యారు. అది తెలియని  ప్రతిపక్షాలవాళ్ళూ, గిట్టనివాళ్ళూ  తెగ ఆడిపోసుకుంటున్నారు. ధర్మభూమిలో ఇంత అధర్మపుటాలోచనలా. 

వానాకాలపు ఇక్కట్లు తప్పింటడానికి ఖర్చంటారా, పెడుతోనే ఉన్నారు. జనాలకే సుఖం లేదు.  వానలవల్ల ఆనందపడిన వాళ్లు  వానా వానా వల్లప్పా అని పాడుకున్నట్లే, వాటి ధర్మమా అని బాగు పడినవాళ్లు వానావానా వెంగళప్పలూ (పౌరులనుద్దేశించి అని వేరే చెప్పనఖ్ఖర్లేదుగా) అని పాడుకుంటున్నారు.

బహుకాల బ్లాగడం

ఈమధ్య బ్లాగులు చదువుతున్నా కానీ వ్రాయడం లేదు. కారణం పెద్దగా ఏం లేదు. బద్ధకం. అదీకాక అందరూ అన్నిటిమీదా తెగ బ్లాగేస్తూంటే ఏం రాయాలో తట్టట్లేదు. కుక్కపిల్లా, అగ్గి పుల్లా అని ఎన్నిసార్లు పునశ్చరణ చేసినా వ్రాతకి స్పూర్తి కలగట్లేదు. ఈలోపు మా స్నేహితుడికి మిత్రత్వదినం సందర్భంగా ఫోన్ చేస్తే ఎందుకు రాయడం లేదని అడిగాడు. తను రెండు మూడుసార్లు సత్యశోధనకి వెడితే కొత్త టపాలు లేవని, ఇలా గేపిస్తే ఇంక నా బ్లాగు ముఖం ఎవరూ చూడరని చెప్పాడు.  బ్లాగు రాస్తే స్నేహం కట్ అనే పరిస్తితుల్లో, రాయక పోతే బాధపడిన వాడే నిజమైన స్నేహితుడని సెంటిమెంటలయి పోయి మళ్ళీ రాద్దామని నిర్ణయించేసుకున్నా. అలా అని రోజూ రాసేయను అని హామీఇస్తున్నా.

భవదీయుడు

సత్యసాయి

Sunday, May 09, 2010


శ్రావ్య కర్ణాటక సంగీత కచ్చేరి హైదరాబాదు చిక్కడపల్లి లో ఉన్న త్యాగరాజ గాన సభలో ఈనెల 13 వ తారీకున సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది. దయచేసి వీలుచేసుకుని అందరూ వచ్చి ఆశీర్వదించండి.

Tuesday, March 16, 2010

వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు

ఈసంవత్సరం మీ అందరికీ శుభప్రదం కావాలని మనసారా సాయినాధుని ప్రార్ధిస్తున్నాను.

క్రితం సంవత్సరం వైయెస్ దుర్మరణం, తెలుగువాళ్ళమధ్య అకారణ అంతఃకలహాలు, అశాంతి, వరదలు, క్షామం, మండిన ధరలు,  ఒకటేమిటి మొత్తం సంవత్సరమంతా ఇలాగే గడిచింది. అన్నిటికన్నా ముఖ్యంగా బాధకలిగించినవిషయం తెలుగువాళ్ళ మధ్య సృష్టించబడ్డ విభేదాలు, వాటికి విద్యాధికులు కూడా లొంగిపోయిన వైనం. నాసహోద్యోగులు కొందరి వాదనలు వింటే ఎంతనేర్చినా కూడా విద్యావంతులు కూడా  భావావేశాలకి బానిసలని అర్ధమయింది.  నా దృష్టిలో విడిపోవడం సమస్యకాదు కానీ తెలుగువాళ్ళు ఒకళ్ళమీద ఒకళ్ళు బురదజల్లుకోవడం, ఓఇంట్లో గొడవపడుతుంటే  పక్కిళ్ళవాళ్ళు వినోదం పొందినట్లు మిగిలినరాష్ట్రాలవాళ్ళు, చిదంబర,మొయిలీయాదులు వినోదించడం, అన్నిటికన్నా ప్రజలమనసులు విరిచేయడం విషాదకరం.

ఈసంవత్సరం దీనికి భిన్నంగా, తన పేరు సార్ధకం చేసుకోకుండా అందరికీ ఆనందాల్ని పంచాలని మరోసారి కోరుకుంటూ

భవదీయుడు

సత్యసాయి కొవ్వలి

Tuesday, January 26, 2010

కొరియా కబుర్లు: నాలుగు నాళ్ళ అతిధి - లీ మ్యుంగ్ బక్

మన దేశానికి రిపబ్లిక్ డే అతిధిగా కొరియా రాష్ట్ర పతి లీ మ్యుంగ్ బక్ వచ్చిన సంగతి అందరికీ తెలిసినదే. ఆవిషయం వినగానే ఒక్కసారిగా నా కొరియా రోజులు నెమరుకు రావడం జరిగింది. నేనక్కడ ఉన్నప్పుడు శ్రీ లీ సియోల్ మేయర్ గా ఉండేవాడు. ఆయన పేరు చెప్పగానే నాకు గుర్తొచ్చేది జ్యోంగ్యిచియోన్ (Cheonggyecheon) కాలవ.  ఇది సియోల్ సిటీ హాల్ దగ్గరనుండి 10 కిమీ పైన ప్రవహిస్తుంది. దాని ఒడ్డున నడుచుకుంటూ పోవడం ఒక అనుభవం.  దీంట్లో గొప్పేముంది అంటారా.  ఈకాలవ పాతకాలం లో ఉండేది.  తర్వాత రోజుల్లో అభివృధ్ది పథంలో కాలవని మూసేసి, ఫ్లైఓవర్లు కట్టేయడం వల్ల అక్కడ ఓ కాలవ ఉండేదన్న విషయమే జనాలు మరచి పోయారు.  లీ మేయరుగా పోటీచేసినప్పుడు చేసిన వాగ్దానాలలో ఈకాలవ పునరుద్ధరణ ఒకటి.

ఎక్కడ చూసినా నీతిమాలిన రా.నా.లే ఉన్న లోకంలో పదవిలోకొచ్చి తన వాగ్దానాలని నెరవేర్చిన ఘనత శ్రీ లీ దే అయుండచ్చు. ఈకాలవ సియోల్ నగరానికి కొత్త శోభని తీసుకురావడంతో పాటు, ఒక సాంస్కృతిక కూడలిగానూ, పర్యావరణ పునరుద్ధరణ కృషికి సంకేతంగానూ శోభిల్లుతోంది.  నాస్నేహితుడితో పాటు నేను సుమారు 3 కిమీ నడిచా. అప్పుడు తీసిన కొన్ని జ్ఞాపికలు ఇక్కడ ఇస్తున్నా. 

Sunday, January 24, 2010

అసలైన హీరో .. మీరే అవచ్చు

మా స్నేహితుడు తనపై వచ్చిన ఒక ఫిల్మ్ కి లంకె పంపించాడు.

ఆసైట్లో మీ ఫొటో అప్లోడ్ చేస్తే మిమ్మల్ని హీరోగా పరిచయం చేసి ఆకాశానికి ఎత్తుతారు. 

ఆలంకె పట్టుకుని బాబాని హీరోగా పెట్టి తీసిన లఘుచిత్రం ఇక్కడ చూడండి. కొన్ని తెరపట్లు ,,,,,

image

image

Friday, January 08, 2010

శ్రావ్య పాటలు

శ్రావ్య వరాళి త్యాగరాయగానసభలో 6 డిసెంబరు 2009 న పాడిన పాటలు ఈస్నిప్పులో ఇక్కడ వినప్రార్ధన.
సత్యసాయి