Wednesday, April 04, 2007

మత్తు వదలనూ - నిద్దుర మత్తు వదలనూ..ఎందుకొదలాలిబే?

మీలో చాలామంది 'మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా' అన్న పాటని వినీ, చూసీ ఉంటారు. పాండవులు లక్క ఇంట్లో ఉన్నప్పుడు, కాపలాగా, అప్రమత్తంగా ఉండాల్సిన భీముడు మత్తుగా నిద్ర పోతోంటే కృష్ణుడు ముసలి వాని రూపంలో వచ్చి కర్తవ్యం బోధిస్తాడు. భీముడు - అంత లావుండీ కూడా- ఒక ముసలివాడు చెప్పిన మాట విని బంగారం లాంటి నిద్ర పాడుచేసుకొన్నాడు. అయినా అన్నదమ్ములందరూ హాయిగా ముసుగెట్టి బజ్జుంటే నాకేంటీ ఈ కాపలా అని కాని, నీకేంటీ దురద అని గాని నిలదీయలేకపోయాడు. మరి శేషశాయని పేరొందిన వాడు వేరేవాళ్లని పడుకోవద్దంటే రోషం రావద్దూ? మరి ఒక వేళ నిలదీసినా న్యూస్ కవర్ చేసిన రిపోర్టర్ (వ్యాస్, వేద)మనకి అలా అచ్చెయ్యలేదేమో? అదే ఈ నాటి రిపోర్టర్లైతే, అప్పట్లో మన ప్రధానైన శ్రీమాన్ దేవగౌడ గారి కునుకుపాట్లను సచిత్రంగా అచ్చేసేసారు. ఆయన తెగ ఉడుక్కున్నాడు కూడా. ఇంకో ప్రధాని కీ.శే.పి.వి. గారు ఎప్పుడూ పడుకొన్నట్లే ఉండేవారు, కాని నిత్య జాగృతులని తర్వాత తేలింది. ఒక విషయం నాకర్ధమైందేమిటంటే, ముఖ్య, ప్రధాన మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు వాళ్లు పొద్దున్నే 'బ్రహ్మ' లేదా 'జెహోవా(?)' ముహోర్తంలో లేచేస్తామని, దేశం లేదా రాష్ట్రాన్ని దొబ్బడం (సారీ తప్పుగా అనుకోకండి, దొబ్బడం అంటే తొయ్యడం, ముందుకి తోయడం) గురించి తెగ ఆలోచిస్తామని తప్పనిసరిగా రాయించుకొంటారు. కాని, కీ.శే.అంజయ్య లాంటి అమాయకులు (నిజంగా)ఈ విషయం తెలుసుకోక తాము లేటుగా లేస్తామన్న సంగతి కూడా దాచుకోకుండా పోయిన దశాబ్దాల తర్వాత కూడా చంద్రబాబు లాంటి 'కృష్ణుల' చేత చెప్పించుకొంటారు. అయినా ఒక రకంగా చూస్తే అంజయ్య గారు చాలా అదృష్టవంతులు. ఆయన మీద వాలే ఈగల్ని తోలడానికి తెలంగాణా అ(ఉ)గ్ర నాయకత్వం సిద్ధంగా ఉంది (నాయకుడుంటే మిగిలిన వాళ్ళున్నట్లేకదా?). పి.జె.ఆర్. స్పందించాడు కానీ, అంత గొప్పగాలేదు. ఆయనేమన్నడు- తెలంగాణా ప్రజల్ని ....... అనడంభాభవ్యంకాదు, నిన్ను పైకి తీసుకొచ్చిన అంజయ్యనే విమర్సిస్తావా, ... ఇల్లాంటిఏమిటేమిటో చెప్పాడు. కేసీఆర్ అన్న మాత్రం బలే రిటార్టిచ్చాడు. 'మాయిష్టం పడుకొమ్టే పడుకొంటాం. అసలు లేవనే లేవం. ఏంటంటా? ఆయినా నీలా పొద్దుగాక ముందే లేచి గోతులు తవ్వం' అని మళ్ళీ ఎవరూ నోరెత్తకుండా చేశాడు. నాకైతే కేసీఆర్ పిచ్చపిచ్చగా నచ్చేసాడు. ఇప్పుడు హాయిగా మనం ఎంత సేపు పడుకొన్నాఅడిగేవాడు లేడు. అయినా తెలంగాణా ప్రజలు పడుకోబట్టే కదా నాయకులు ఇంతకాలం హ్యాపీగా పండుగ చేసుకొన్నారు. వాళ్లు నిద్ర మత్తులో ఉంటేనే కదా ఎవరేం చెప్పినా చెల్లేది. ఇపుడు వాళ్లు లేస్తే ఎన్ని సమస్యలు?

4 comments:

  1. భలే చక్కగా రాసారు. పెట్టాల్సిన చోట తొడపాశం పెట్టారు. వాతలు పెట్టాల్సిన చోట కొరివితో వాతలూ పెట్టారు. పత్రికల్లో వచ్చే కాలాలకు ఏమాత్రం తీసిపోదిది! చప్పట్లు!!!

    ReplyDelete
  2. లక్క ఇల్లు నాటికి ద్రౌపది ఇంకా రాలేదు సీన్లోకి. ఆ తరవాత ఏకచక్రపురంలో మారువేషాల్లో ఉండగా ద్రౌపదీ స్వయంవరం.
    టపాలో వ్యంగ్యం భేషు. నిన్న మొన్ననే ఎవరో ఒక సినిమా మేలుకొలుపు పాట వేశారు - అందులో వాడంటాడు - నిద్దర లేపారంటే చంపుతా అని.:-)

    ReplyDelete
  3. హహహ...
    ఎన్నో మత్తుల్లో ఇదో గమ్మత్తు. నాకు మాత్రం ఎంతో ఇష్టం.

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.