Tuesday, December 16, 2008

తెలుగు బ్లాగుల దినోత్సవం - సింహావలోకనం - మిగిలిన కొద్ది భాగం

తెలుగు బ్లాగుల దినోత్సవం - సింహావలోకనం తర్వాతి భాగం .....


కథక్కడితో అయిపోతే బానే ఉండేది. కానీ కుర్రాడు తనుబోలెడు డబ్బులు పోసి చదివిన చదువు ఇలా నిరుపయోగం అవడం సహించలేకపోయాడు. మళ్ళీ మూతున్న డబ్బాలు వాడితే ఖర్చు పెరిగి లాభాలు తగ్గుతాయని, మనుషులు లాభాలకోసం మాత్రమే బతకాలని నరనరాల్లోనూ జీర్ణించుకున్న బీస్కూలు బాయ్ గా కర్తవ్యం ఆలోచించి ఓకన్సల్టెంటుని నియోగించాడు. సదరు కన్సల్టెంటు ‘బాబూ, ఓమేధావి పీతని తోసుకొచ్చి మీ కన్సైన్మెంటులో పాడేయ్’ అని రామబాణంలాంటి ఓసలహా ఇచ్చాడు. మన బీస్కూలు బాయ్ ‘సారూ, డబ్బాకి ఎన్ని పీతలు కావాలి’ అని డబ్బాలు ఇంటూ పీత ఖరీదు ఇంటూ నెంబరాఫ్ పీతలు ఈజీక్వల్టూ కనిపెడదామని కంప్యూటరు తెరిచాడు. దానికి కన్సల్టెంటు ‘నాయనా, మేధావులు గంగిగోవు పాలలాగ మొత్తం కన్సైన్మెంటుకి ఒక్కరు సరి పోతారు’ అని జ్ఞానబోధచేసాడు.

***********

అసలు బ్లాగులు అంటే ఏమిటని చాలా సార్లు చర్చలు జరిగాయి. ఆమధ్య వ్యాఖ్యల గురించి, బ్లాగుల పారడీలగురించి కూడా చర్చలు జరిగాయి. అనామక వ్యాఖ్యలగురించి కూడా రభసలు జరిగాయి. చాలా సందర్భాల్లో బ్లాగు కులంలో ముసలం పుట్టిందని కొంతమంది అనుకున్నారు కూడా.

బ్లాగుకి ఉండాల్సిన లక్షణాల గురించి ఆమధ్య ‘శోధన’ సుధాకర్ సిధ్ధాంతీకరించి కొన్ని ఉత్తమబ్లాగులని (తన దృష్ఠిలో) పరిచయం చేసాడు. కొన్ని బ్లాగులు ఆయన దృష్ఠిలో ఎందుకు ఉత్తమమైనవికావని బ్లాగ్ముఖంగాను, ఒక హైబ్లాసా సమావేశంలోనూ కొంతమంది బ్లాగరులు చర్చించారు. ఆయన చాలా ఓపికగా సమాధానాలు చెప్పారుకానీ ఆయన కాన్సెప్టు అంతగా బ్లాగరులకి ఒంటబట్టినట్లు లేదు. ఆయన దృష్టిలో సేకరణలు, అరువు అభిప్రాయాలు రాసే బ్లాగు వెబ్ జైన్ లాంటిదని ఆయన అభిప్రాయం. ప్రస్తుతం బ్లాగ్లోకం ఈసైధ్ధాంతిక చట్రాలు దాటి పోయింది. ఏది బ్లాగు ఏదికాదన్న చర్చ అప్రస్తుతమైపోయింది. ఎవరైనా తేడాపాడా వ్యాఖ్య (బ్లాగరు దృష్టిలో అని చెప్పనక్కరలేదుగా) రాస్తే బెదిరించే స్థాయికి వచ్చింది. అనామక వ్యాఖ్యలయితే సరే సరి. నాబ్లాగు నాయిష్టం అని పెడసరంగా చెప్పడం, నువ్వెంతంటే నువ్వెంతనే స్థాయికి దిగజారింది. ఆస్థితినుండి బయటపడి తెలుగు బ్లాగ్లోకం మళ్ళీ మంచి గాడిలో పడడం చాలా ఆనందకరం. పరస్పర దూషణలు సద్దుమణిగాయి. ముంబై ఉగ్రవాదసంఘటన, వరంగల్ ఏసిడ్ – ఎన్కౌంటర్లు, తెబ్లా దినోత్సవ వేడుకల నేపధ్యంలో ఇబ్బడి ముబ్బడిగా టపాలు రాసి తమ సామాజిక స్పృహని ప్రదర్శించిన తెలుగుబ్లాగర్లందరికీ అభినందనలు.

తెలుగుబ్లాగరులనగానే గుర్తొచ్చేది పొద్దు అంతర్జాల పత్రిక. దీని సారధులు ఇంద్రజాలం చేసిన లెవెల్లో దీన్ని పైకి తెచ్చి ఓగొప్ప స్థాయిలో నిలబెట్టారు. ఆన్లైన్ గడిని సృష్ఠించిన ఘనులు. దీనితో నాకు అది పుట్టినప్పటినుండీ అనుబంధం కలగడం నా అదృష్టం. నారాతలు వేసుకుని వాళ్ళు నాకో గుర్తింపు కలిగించారు. ముఖ్యంగా తెలుగులో గడి కట్టే అవకాశం కల్పించారు. (ఇది చదివితే త్రివిక్రంకి నేను బాకీ పడిన వ్యాసం గుర్తొస్తుందో ఏమిటో). వాళ్ళకి నా కృతజ్ఞతలు.
సుమారు 1993 నుండి తెలుగు లో కంఫ్యూటరులో టైప్ చేయడానికి ప్రయత్నిస్తూ, ఐలీప్ లైట్ తో పేజీ పేజీ టైపు చేసిన రోజుల నుండి (లైట్ వెర్షన్లో ఒక్క పేజీయే భద్రపరచగలం, ముద్రించగలం), హాయిగా ఎక్కడ పడితే అక్కడ ఎంత కావాలంటే అంత రాసుకోవడానికి ఇన్ స్క్రిప్టు యూనికోడ్ ఫాంటులని ఆవిష్కరించి ఫాంటసీని ప్రాక్టికల్ స్థాయికి తెచ్చిన వారందరికీ కృతజ్ఞతలు.
చివర్లో చెప్తున్నప్పటికీ, సదా స్మరణీయులైన వారు నా పాఠకులు. నా టపాలు ఓపికగా చదివి ప్రోత్సహించినందుకు వారందరికీ కృతజ్ఞతలు. టపాల్లో ఎప్పటికప్పుడు వాళ్ళందరికీ నా నెనరులు చెప్పాలికదా అని తెలియచెప్పడం కన్నా ఇలా నా బ్లాగు పుట్టిన రోజు సందర్భంగా కృతజ్ఞత చెప్పుకోవడం, నా ఆనందాన్ని పంచుకోవడం మేలనిపించింది. అలాగే మంచిమంచి విషయాలని అచ్చ తెలుగులో రోజువారీ తెలియచెప్పి ఆలోచింపచేస్తున్న సాటి బ్లాగరులందరికీ నా నెనర్లు. వీరందరి భుజాలమీదా నా బ్లాగ్యాత్ర సుఖంగా జరిగి పోతోంది.
ఆమెన్.

భవదీయుడు
సత్యసాయి కొవ్వలి

3 comments:

  1. బ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలు..

    >>ఐలీప్ లైట్ తో పేజీ పేజీ టైపు చేసిన రోజుల నుండి (లైట్ వెర్షన్లో ఒక్క పేజీయే భద్రపరచగలం, ముద్రించగలం), హాయిగా ఎక్కడ పడితే అక్కడ ఎంత కావాలంటే అంత రాసుకోవడానికి ఇన్ స్క్రిప్టు యూనికోడ్ ఫాంటులని ఆవిష్కరించి ఫాంటసీని ప్రాక్టికల్ స్థాయికి తెచ్చిన వారందరికీ కృతజ్ఞతలు

    నిజమే... అలా జరగడానికి తోడ్పడ్డ ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు..

    ReplyDelete
  2. మీ బ్లాగ్యాత్ర నిరాఘంటంగా కొనసాగించండి. మీ నుంచి మరిన్ని మంచి టపాలు ఆశిస్తూ -సెలవు.

    ReplyDelete
  3. బ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలు..

    సత్యసాయిగారు, ఇది అస్సలు బాలేదండి. మీరు చాలా చాలా తక్కువగా రాస్తున్నారు. కాస్త స్పీడు పెంచండి..

    ReplyDelete

దయచేసి మీ అభిప్రాయాలు, దీవెనలూ తెలపండి.