Showing posts with label ఆలోచనలు. Show all posts
Showing posts with label ఆలోచనలు. Show all posts

Saturday, October 03, 2009

సత్యశోధన అవసరమా?

(ఈటపా ఎప్పుడో రాసినది .. అయినా సత్యశోధనకి సమయం మించిపోవడం ఉండదుకదా అని పోస్ఠ్ చేస్తున్నా.)

ఈమధ్యలోఎదుటి మనిషిచేత నిజం చెప్పించాలని ఓ టీవీ కార్యక్రమం కంకణం కట్టుకొంది.  స్టార్ ప్లస్ లో వస్తున్న సచ్ కా సామనా చూసే ఉంటారు.  మా పిల్లలు చెప్తే ఒక ఎపిసోడ్ చూసా.  తర్వాత మరొకటి. ఇందులో 21 ప్రశ్నలకి నిజం చెప్పగలిగితే కోటి రూపాయలు వస్తాయి.

మొదట చూసిన ఎపిసోడ్ లో ఒకావిడని (స్మిత అనుకుంటా) రాజీవ్ ఖండేల్వాలా (పృచ్ఛకుడు) ప్రశ్నలడుగుతూ పోయాడు.  ఆవిడ ఒక స్థాయికి వచ్చేసరికి, ఇబ్బందికరమైన ప్రశ్నలడగడం మొదలెట్టాడు. ఇది ఆయన స్ట్రాటజీ. ఒకస్థాయినుండి ఇంకో దానికి వెళ్ళేముందు షోనుండి వెళ్ళిపోవడానికి అవకాశం ఇస్తారు.  ఇంకా ముందుకెళ్తుందనుకున్నఆవిడని అడిగిన ప్రశ్న.. మీపతికి ఎప్పటికీ తెలియదని మీకు నమ్మకంగా తెలిస్తే మీరు వేరేమగవాడితో పడుకుంటారా? ఆడమగ సంబంధాలలో ఎన్ని రకాల శృతులూ, అపశృతులూ ఉంటాయో అవగాహన ఉన్నా, ఈప్రశ్న అడగడం ఎబ్బెట్టుగా అనిపించింది. దీనికి ఆవిడ నో అన్నా, పోలీగ్రాఫ్ ఒప్పుకోలేదు. అప్పటి ఆవిడ పరిస్థితి ఎంత దుర్భరమో ఊహించండి. అందులోనూ ఆవిడమొగుడు అక్కడే ఉన్నాడు.  

నే చూసిన రెండో ఎపిసోడ్లో పాల్గొన్నాయన చాలా  ఓపెన్గా ఉన్నాడు. తీరా ముందుకు వెళ్తున్న సమయంలో, మీరు విదేశం వెళ్ళినప్పుడు అక్కడ వేశ్య…  అని ప్రశ్న మొదలెట్టగానే వాళ్ళావిడ బజ్జర్ నొక్కి ఆప్రశ్నపట్ల తన వ్యతిరేకత తెలియచెప్పింది (షోలో కూడా వచ్చిన వారికి తమ అభ్యంతరం షోలో ఒక్కసారి చెప్పే అవకాశం ఇస్తారు).   వెంటనే పృచ్ఛకుడు ప్రశ్నమార్చి మీరెప్పుడైనా మీభార్యని మోసం (పరాయసంబంధాలు పెట్టుకోవడం ద్వారా) చేసారా అని  ప్రశ్నించాడు.  దీనికి ఆయన పెళ్ళాం ఎదురుగా  ఏంచెప్పాలో తికమక పడి లేదన్నాడు. పోలీగ్రాఫ్ పరీక్షప్పుడు ఎస్సని ఇప్పుడు నో అనేసరికి ఆమానవుడు షోనుండి వెనుదిరగాల్సొచ్చింది.  తర్వాత అక్కడికక్కడే తన భార్యముందు చాలా ఇబ్బంది పడ్డాడు.

అసలు ఈపోలీగ్రాఫ్ ఏంటయ్యా అంటే మనం సమాధానాలు చెప్పినప్పుడు మన శరీరంలో జరిగే మార్పులని, రక్తపీడనాన్ని బట్టి మనం చెప్తున్నది నిజమా, అబద్ధమా అన్నది నిర్ధారిస్తుంది. అది ఎంత ఖచ్చితంగా నిర్ధారించగలదూ అన్న విషయం పక్కనపెడితే, అసలు ఇంత కష్టపడీ, పెట్టీ  నిజం చెప్పించడం, షోకోసమైనా సరే, అవసరమా? 

అవసరమైనప్పుడు అంటే ప్రాణమానవిత్తభంగములందు అబద్ధమాడచ్చునన్నది ఆర్యవాక్యం. ఇవన్నీ భంగమైనా సరే నిజం చెప్పించడం మాత్రమే మన టీఆర్పీ రేటింగ్‌కి అవసరం అన్నది వ్యాపార సూత్రం అనుకుంటా.

ఎంత అబద్ధాల కోరైనా ఆవిషయం ఒప్పుకోడు. తనంత సత్యసంధుడు ఎవరూ లేరనే అనుకుంటాడు.  సత్యం శివం సుందరం అన్న భావనలో ఇది ఒక కోణం అని ఒకాయన సెలవిచ్చాడు. అలాగే ఎవరినైనా నిజం చెప్పు… నిజం చెప్పని రాపాడిస్తే వచ్చే ఇబ్బంది అంతా ఇంతా కాదు.  ఇంకా ఘోరం ఏంటంటే నిజంగా నిజం చెప్తున్న వ్యక్తిని నిజం చెప్పు అని నిలదీస్తూ పోవడం. అప్పుడావ్యక్తికి కలిగే మానసిక వేదన అంతా ఇంతా కాదు.   ఇలాంటి సందర్భం మొగుడూ పెళ్ళాల మధ్య వస్తే ఇంక చెప్పక్కరలేదు.

సాధ్యమైనంత వరకూ నిజాయితీగా, సత్యవాదిగా ఉండడం ఆదర్శప్రాయంగానూ, అత్యుత్తమ జీవన విధానంగానూ ఒప్పినా చాలాసందర్భాల్లో, అబద్ధం చెప్తున్నారని తెలిసినా కూడా ఎదుటివారికి ఎంతో కొంత వెసులుబాటు వదలడం విజ్ఞత.

Monday, September 28, 2009

విజయదశమి శుభాకాంక్షలు

 

అందరికీ నా విజయదశమి శుభాకాంక్షలు.  మీరు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవాలని కోరుకుంటున్నా. ఈరోజు శిరిడీ సాయిబాబా గారు సమాధి చెందిన రోజు. ఆసందర్భంగా మాఇంటనున్న బాబాకి అభిషేకం చేసి నూతనవస్త్రం సమర్పించాం.  ఆయన చిత్రం ఇదిగో ఇక్కడ. 

 wmcellphotos 023

ఆయన బోధించిన కొన్ని సూక్తులు ఇక్కడ వ్రాస్తున్నా (ఎక్కిరాల భరద్వాజ గారి శ్రీసాయి లీలామృతము నుండి).  అవి కొంతవరకైనా పాటించగలిగితే మనమూ, పక్కవాళ్ళు కూడా ఆనందంగా, సుఖంగా ఉండచ్చు.

  • నాపై పూర్తి విశ్వాసముంచు, నీకోరికనెరవేరుతుంది.
  • నాపైనీ దృష్టినిలుపు, నేనూ నీపై దృష్టినిలుపుతాను. నిన్నుచివరికంటా గమ్యం చేరుస్తాను. నన్నునమ్మినవారినెప్పుడూ పతనం కానివ్వను.
  • నాసమాధినుండి కూడా నేను నాకర్తవ్యంనిర్వర్తిస్తాను. నానామం పలుకుతుంది. నామట్టి సమాధానం చెబుతుంది.
  • నీవు చూసేదంతాకలిసి నేను. సాయి శిరిడీ లోనే ఉన్నారనుకునేవారు నన్నుఅసలు చూడనట్లే.
  • రోపొకనాటికి చావబోయేవారు కూడా ఇతరులను చంపడానికి పన్నాగాలు చేస్తుంటారు. వారు నాకంతో బాధకలిగిస్తారు.
  • ఎవరికెవరు శత్రువులు? అంతా ఒక్కటే.
  • నాభక్తుని ఇంట్లో అన్నవస్త్రాల లేమి ఉండదు.
  • ఇచ్చిన మాట తప్పక నెరవేర్చు.
  • పోటీలు, కీచలాటలు మానితే దేవుడు కాపాడుతాడు.
  • నీవేమి చేసినా క్షుణ్ణంగా చేయి. లేదా చేస్తానని ఒప్పుకోకు.
  • ఎవరిసేవని ఉచితంగా తీసుకోవద్దు. ఉదారంగా ప్రతిఫలమివ్వు.
  • నిన్నెవరైనా ఏమైనా అడిగితే సాధ్యమైనంతవరకూ యివ్వు. లేకపోతే యిప్పించు. ఇచ్చేందుకు ఏమీ లేకపోతే మర్యాదగా చెప్పు. చులకన చేయడం, కోపగించుకోవడం తగదు.
  • నీదగ్గరున్నా ఇవ్వాలనిపించకపోతే లేదని అబద్ధం చెప్పకు.  ఇవ్వలేనని మర్యాదగా చెప్పు.
  • ఎవడు ధైర్యంగా నిందని దూషణని స్వీకరిస్తాడో వాడు నాకెంతో ఇష్ఠుడు.
  • నిన్నెవరైనా బాధించినా పోట్లాడవద్దు. సహించలేకపోతే ఒకటిరెండు మాటలలో ఓర్పుగా సమాధానం చెప్పు. లేకుంటే నా నామం స్మరించి అక్కడి నుండి వెళ్ళిపో.
  • నీవెవరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది.
  • ఎవ్వరిగురించీ తప్పుగా మాట్లాడకు. నీగురించి ఎవరైనా మాట్లాడినా చలించకు.
  • ఇతరులు చేసే పనులకు ఫలితం వారే అనుభవిస్తారు. నీవు చేసినపనులకి ఫలితమే నీకుంటుంది.
  • అసూయ వద్దు. అవతల వారికి మేలు జరిగితే మనకే జరిగినట్లు భావిద్దాం. లేదా మనం కూడా ఆమేలు పొందే యత్నం చేద్దాం. ఎవరి కర్మననుసరించి వారు ఫలితాన్ని పొందుతారు.
  • దైవమిచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలువదు.
  • దుఃఖం లేకపోవడమే ముక్తి.
  • మనను భగవంతుడెలా సృష్ఠించాడో అలాగే తృప్తిగా ఉండాలి.

శిరిడీని దర్శించే వారి సంఖ్య నిమిషనిమిషానికీ ఎక్కువైపోవడం చూస్తూనే ఉన్నాం. ఆయనని ఆశ్రయించి ఆయన సహాయం అనుభవించిన వారెందరో.  ప్రస్తుతం మనచుట్టూఉన్న సమస్యలు, అనిశ్చిత పరిస్థితులలో  మానసిక స్థైర్యం పొందడంకోసం ఏదో దైవాన్ని ఆశ్రయించడం, చాలామంది శిరిడీ సాయినాశ్రయించడం  మనకి కనిపిస్తోంది. నమ్మిన వారిని పతనం కానివ్వనని చెప్పిన మాటని తూచా తప్పక పాటించే కామధేనువు బాబా.  కానీ చాలామందిమి బాబా భక్తులమవుతున్నామే కానీ మోసాలు, కుళ్ళు వదలలేక పోతున్నాం. మనని బట్టి బాబాకే చెడ్డపేరు వచ్చేంత చెత్తగా ప్రవర్తిస్తున్నాం.  ఇవే కాస్త తగ్గించు కోడానికి ప్రయత్నించడమే నిజమైన సాయిదీక్ష.   

పై బోధలను మననం చేసుకుంటూ పాటించడానికి ప్రయత్నం చేయడమే మనం ఆయనకివ్వగల గురుదక్షిణ.

సమర్ధ సద్గురు శ్రీ సాయి నాధాయ నమః

నేనీమధ్య కొన్న విండేసు మొబైలు కోసం తయారు చేసుకున్న థీం నా చిరుకానుక ఇక్కడి నుండి దింపుకోవచ్చు.

Saturday, June 16, 2007

తనువిచ్చు తండ్రికిదె తొలి వందనం

లలిత గారి 'ఓనమాల' స్పూర్తిగా ఈ టపా. ఆవిడలాగా కవిత్వం చెప్పడంలో ఒరిజినాలిటీ లేదుకాబట్టి, శృతిలయలు సినిమాలో చివరి పాటకి ముందు పాడే ఒక చిన్న పద్యంతో నా జీవితానికి శృతి,లయలను సమకూర్చిన నా తల్లిదండ్రులకు నా వందనం తెల్పుకొంటున్నా.

వింటూ చదవాలంటే ఇక్కడ నొక్కండి.

తనదు వరసత్వమును
వారసత్వముగనిడి
తనువిచ్చు తండ్రికిదె తొలి వందనం

మమతానురాగాల కల్పతరువై
మంచిచెడు నేర్పించు మొదటి గురువై
ముక్కోటి వేల్పులను ఒక్క రూపున జూపు
మాతృపద పద్మములకిదె వందనం


సినిమాలో ఈపాట వచ్చే ఘట్టం చాలా రసవత్తరమైనది. విడిపోయిన చాలాకాలానికి రాజశేఖర్, సుమలతలు కలుసుకొన్న సందర్భం. ఈ సీను చూసిన ప్రతీ సారీ ఒక రకమైన ఉద్వేకం కలుగుతుంది. ఈసినిమా హీరో నాకు చాలా నచ్చింది. హీరోగా సుమలతని కాక ఇంకెవరిని పెట్టినా అంతబాగోదేమో అనిపించేంత బాగ నప్పింది. అసలు ఈ సినిమానే ఎన్నిసార్లు చూసానో తెలియదు. డౌన్లోడు చేసుకొని తెగచూసా. ఎన్నిసార్లు చూసినా నాకు చాలా మంచి అనుభూతిని కలుగచేస్తూనే ఉంది- శ్రీనివాసు ఓవరేక్షను ఎంత చిరాకు తెప్పించినా కూడా. అందులో ఒకచోట ఆమహానుభావులను వెలుగులోకి తీసుకొద్దామన్న వంకాయల ప్రతిపాదనని సత్యనారాయణ తిరస్కరిస్తూ సత్యనారాయణ వాళ్లని మనం వెలుగులోకి తిసుకురావడమేమిటని ఘాటుగా ప్రశ్నించడం నాకు చాలానచ్చింది. మనచుట్టూ వంకాయల లాంటి అజ్ఞానులు, పాంచాలమ్మ లాంటి కళా వ్యాపారులు చాలామందే కనిపిస్తారు.

సినిమా చివరలో....

త్రివర్గ ఫలదాసర్వే దాన యజ్ఞ జపాదయా
ఏకం సంగీతవిజ్ఞానం చతుర్వర్గ ఫలప్రదమ్


ఇదే శృతిలయల సారాంశం

అని వస్తుంది. దయచేసి ఎవరైనా (బాసు గారు వింటున్నారా)దీని అర్ధం వ్రాయండి.

Wednesday, May 30, 2007

పుచ్చి ఇచ్చుకోండి!

ఈ టైటిల్ ఎలా ఉంది? బాగా కుదరలేదు అని అనిపిస్తోందా? అదే నేను చెప్పబోయేది. 'ఇచ్చిపుచ్చుకోండి' అంటే ఉన్న సొగసు 'పుచ్చి ఇచ్చుకోండి' అనడంలో లేదు. అవ్వడానికి రెండూ ఒకే నిర్మాణం కలిగి ఉన్నాయి. పదమే కాక దాని అర్ధంలో కూడా, పుచ్చుకోవడం కన్నా ముందు ఇవ్వడమే సొగసైన, సబబైన పని అని అవగతం అవుతుంది. ఉదాహరణకు, అప్పే తీసుకోండి. మనం ఎవరికీ అప్పు ఇవ్వకుండా వెళ్ళి వసూలు చేయగలమా? కొండొకచో ఇచ్చిన అప్పు చచ్చినా వసూలుచేయలేకపోవడం జరుగుతుంది. మర్యాదైనా, ప్రేమైనా, మరేదైనా సరే, ఇదే సూత్రం. తిట్లూ, విమర్శలూ, లెంపకాయల్లాంటివైతే ఈసూత్రాన్ని అతిగా పాటిస్తాయి. ఇవి ఇచ్చిచూడండి, చక్రవడ్డితో సహా వెనక్కొస్తాయి. మనం ఇవ్వకపోయినా మనకి దొరుకుతున్నాయి ఈరోజుల్లో. అలాంటిది, ఇస్తే తప్పించుకోగలమా?

'తాతకి పోసిన బోలె తరతరాలా' అన్న సామెత కూడా ఈభావననే సూచిస్తుంది. మనం మన తాతకి చేసిన మర్యాద, మన మనవడు మనకి చేస్తాడని సామెతకి అర్ధం. ఇది inter-generation plane లో పనిచేసే give and take సూత్రం. గమనించండి, ఇంగ్లీషువాడు కూడా ముందు గివ్వమనే అన్నాడు. టేకండ్ గివ్వనలేదు.

ఇవ్వడం పొందడంకన్నా ఆనందమిస్తుందన్న విషయాన్ని మీద యండమూరి హోం పేజీలో సంకల్పం అనే కథ చాలా హృద్యంగా చెప్తుంది. ఈకథలో ఒక పాప (అమూల్య) వాళ్ళ స్కూలులో టీచరు 'తీసుకోవడం కన్నా ఇవ్వడంలో ఆనందం ఉంది' అని చెప్పిన విషయం మనసుకు పట్టించుకుని డబ్బులు దాచి అవసరమున్న వేరే వాళ్ళకి ఏదైనా కొనిస్తోంటుంది. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు టీచరు చెప్పింది పూర్తిగా అర్ధచేసుకుంటుంది. ఇంతలో అమూల్య అన్నయ్యకి మెదడులో కంతి వస్తుంది. నిస్సహాయ పరిస్థితుల్లో వా ళ్ళ నాన్న, 'ఆ లోక జన రక్షకుడి సంకల్పమే వీడ్ని రక్షించగలద'ని అంటాడు. అదివిని తను దాచుకున్న చిల్లర డబ్బులు తీసుకుని 12 రూపాయలకి సంకల్పం కొందామని రకరకాల షాపులు తిరిగి చివరికి ఒకచోట ప్రముఖన్యూరోసర్జన్ దృష్టిలో పడుతుంది. ఆయన అమూల్య అన్నయ్యకి వైద్యం చేసి, ఆమె 12 రూపాయలివ్వబోతే వద్దని, ఇవ్వడంలోని ఆనందాన్ని గ్రహించానని చెప్తాడు. (ఇది మూలకథకి నికృష్ఠ, నీరస సంగ్రహకథనమని గ్రహించగలరు).

మన పూర్వీకులకి ఇవ్వడంలోని ఆనందం తెలుసు అనుకొంటా. దానాలు, ధర్మాలు అని అందుకే పెట్టినట్లున్నారు. మామూలుగా అయితే చెయ్యరని పాపం, పుణ్యం, స్వర్గం, నరకం అని 'రంభా- సలసల కాగే నూనె' పథకాన్ని(ఇంగ్లీషు వాడి కేరెట్టూ-కర్రా పద్ధతి) ప్రవేశపెట్టారు. పైగా తీసుకునే వాడి చెయ్యెప్పుడూ కిందే ఉంటుంది (ఒక్ఖ ముక్కుపొడుం విషయంలో తప్ప) అని తీసుకోవడంలో మర్యాద తక్కువని సూచించారు.

మాచిన్నప్పుడు రోజూ పొద్దున్నా, సాయంత్రం భోజనాల వేళ దాటాకా ఇళ్ళకి బిచ్చగాళ్ళు వస్తోండేవారు. తినగా మిగిలిన పదార్ధాలు తిసుకెళ్తోండెవారు. పనిమనిషులకి కూడా మిగిలిన అన్నం కూరలు ఇస్తోండే వారు. ఫ్రిడ్జులొచ్చాకా జనాలు మురగబెట్టుకుని తింటున్నారే తప్ప, ఎవరికీ పెట్టలేకపోతున్నారు. పెట్టడానికి చేతులు రావట్లేదు. అటు బిచ్చగాళ్ళు, పనిమనుషులు కూడా అన్నాలు తీసుకెళ్ళడానికి సుముఖత చూపడంలేదు. అందుకు ఒక కారణం ఎప్పుడో ఒక బిచ్చగాడో, పనిమనిషో చెప్పారట, ఫ్రిడ్జుల్లో ఒకటి రెండు రోజులు పెట్టి తర్వాత ఇస్తోంటే తొందరగా పాడయిపోతున్నాయి, తినలేకపోతున్నాం అని. అదీ కాక పాతకాలంలో తిండితప్ప వేరే అవసరాలు తక్కువ. ఇప్పుడు, వేరే అవసరాలు ఊరిస్తున్నాయి. ఇప్పుడు చిల్లర కోసం ఎక్కువ అడుక్కొంటున్నారు. అన్నట్లు అడుక్కోవడం అంటే గుర్తొచ్చింది, ఆమధ్య ఒకావిడ అడుక్కోగా వచ్చిన డబ్బులతో అదేదో ఊళ్ళో గుడిలో కావల్సిన సౌకర్యాలు కల్పించిందట. అసలు మనమే వెళ్ళి ఆవిడ దగ్గర కొంత దానగుణం అడుక్కోవాలి.

ఇవ్వగలగడం, ఇవ్వడం అంత సులభం కాదు. ఎపుడైనా, ఇవ్వాలనిపించింతర్వాత కొంత సేపు ఆగి ఛూసారా? మీరు మొదట రూ.1000 ఇవ్వదలుచుకుంటే, ఇచ్చే సమయానికి, అసలు ఇస్తామో లేదో కూడా డౌటే. అందుకే ఇంద్రుడు మారువేషంలో వచ్చి కర్ణుడిని దానమడిగితే, ఆయన, కూడదని తెలిసినా, ఎడంచేత్తోటే ఇచ్చేసాడట - మళ్ళీ కుడి చేతిలోకి మార్చుకొనే లోపల మనసు మారిపోతుందేమోనని.

ఇచ్చి పుచ్చుకోవడం విషయంలో, చిన్నప్పుడు చదువుకున్న తిక్కన భారతం పద్యం ఒకటి నాకెప్పుడూ గుర్తుకొస్తుంది.

ఒరులేయవియొనరించిన
నరవర! అప్రియము తన మనంబునకగు, తా
నొరులకవి సేయకునికియె
పరాయణము పరమధర్మపథములకెల్లన్


(ద్వానా శాస్త్రి గారు, ఆయన సంకలనం చేసిన, 'మంచి పద్యాలు' (విశాలాంధ్ర 1998 ప్రచురణ) పుస్తకంలో వ్రాసిన వ్యాఖ్యానం: ఇతరులు మనని అవమానిస్తే మనకి కోపం వస్తుంది. కానీ మనం ఇతరుల్ని అవమానిస్తాం. ఇతరులు మనకి అన్యాయం చేస్తే నిందిస్తాం. కానీ మనం మాత్రం ఇతరులకి అన్యాయం చేస్తాం. ఈ పద్ధతి కూడదని తిక్కన మహాభారతంలో చెప్పిన పద్యం ఇది)

ఈ పద్యంలో చెప్పిన నియమాన్ని సాధ్యమైనంత వరకూ పాటించడం వల్ల మన దైనందిన జీవితం సాఫీగా గడిచిపోతుందని నా అనుభవం. కొన్ని సందర్భాల్లో ఈ సూత్రం పనిచెయ్యదు సరి కదా మనం ఉల్టా చేయ్యడానికి సిద్ధపడిపోతాం. ఉదాహరణకి, మేం డిగ్రీలో జేరిన కొత్తలో మా సహాధ్యాయి మంచి చురుకుగా ఉంటూ అందరినీ ఒరేయ్, అరేయ్ అనేసి మాట్లాడుతూండే వాడు, అప్పుడే పరిచయమైన వాళ్ళని కూడా, మేం ఏవండీ అని సంబోధిస్తూన్నప్పటికీ. అప్పుడు మేం టేకండు గివ్వు పద్ధతి అవలంబించాలని అర్ధమైంది. అలాగే మెతగ్గా ఉంటూంటే, చాలామంది నెత్తికెక్కుతోండేవాళ్ళు. అప్పుడు బురద పామైనా బుస్సుమంటూంటేనే దానికి గౌరవం అని విని కొద్దిగా నోరుచేసుకోవడం నేర్చుకున్నాం. అదీ ఆత్మరక్షణకే, దాడికి కాదు.

ఇచ్చిపుచ్చుకోవడం, ఇంకా తిక్కన గారు చెప్పిన పరమధర్మాలనూ కొద్దిగా విశ్లేషిస్తే, మనం ఎదుటివారినించి ఆశించేది మనం పాటించాలన్న నియమం కనిపిస్తుంది. కానీ నిజజీవితంలో ఈ నియమానికి తిలోదకాలు ఇచ్చేవాళ్ళని తరచూ చూస్తాం (మనం కూడా అడపా దడపా చేసే ఉంటాం). వాళ్ళు తామనితామే ప్రత్యేకమైన వాళ్ళుగా భావించుకోవడం వల్ల ఇది జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఎవరైనా క్యూని పాటించకుండా తమని దాటుకెళ్టే తెగ బాధ పడిపోతారు. కానీ వాళ్ళే చెల్లుబడైన చోట ఎంతమందినైనా దాటుకుంటూ వెళ్ళిపోగలరు.

కొన్ని ప్రత్యేక సందర్భాలలో తప్ప, ఇతరత్రా ఇచ్చిపుచ్చుకొనే (తిరిగి పుచ్చుకోలేని సందర్భంలో కూడా ఇవ్వడం) పద్ధతి సరైనదని, ఈ ప్రపంచం మొత్తం గివె అండ్ టేకె (నటురె, పుటురె గుర్తొచ్చిందా?)పద్ధతిమీద నడుస్తుందని, అందరూ ఆ పద్ధతి పాటిస్తే చాలా సమస్యలు రానే రావని నానమ్మకం.

మనం మారడానికి సమయం కావాలి కాని, ఈవ్యాసం శీర్షిక మార్చడానికి అవసరం లేదుగా. కాబట్టి, ఇక పై ఈవ్యాసం పేరు- 'ఇచ్చి పుచ్చుకోండి'.