Showing posts with label రకరకాల మనుషులు. Show all posts
Showing posts with label రకరకాల మనుషులు. Show all posts

Saturday, October 03, 2009

సత్యశోధన అవసరమా?

(ఈటపా ఎప్పుడో రాసినది .. అయినా సత్యశోధనకి సమయం మించిపోవడం ఉండదుకదా అని పోస్ఠ్ చేస్తున్నా.)

ఈమధ్యలోఎదుటి మనిషిచేత నిజం చెప్పించాలని ఓ టీవీ కార్యక్రమం కంకణం కట్టుకొంది.  స్టార్ ప్లస్ లో వస్తున్న సచ్ కా సామనా చూసే ఉంటారు.  మా పిల్లలు చెప్తే ఒక ఎపిసోడ్ చూసా.  తర్వాత మరొకటి. ఇందులో 21 ప్రశ్నలకి నిజం చెప్పగలిగితే కోటి రూపాయలు వస్తాయి.

మొదట చూసిన ఎపిసోడ్ లో ఒకావిడని (స్మిత అనుకుంటా) రాజీవ్ ఖండేల్వాలా (పృచ్ఛకుడు) ప్రశ్నలడుగుతూ పోయాడు.  ఆవిడ ఒక స్థాయికి వచ్చేసరికి, ఇబ్బందికరమైన ప్రశ్నలడగడం మొదలెట్టాడు. ఇది ఆయన స్ట్రాటజీ. ఒకస్థాయినుండి ఇంకో దానికి వెళ్ళేముందు షోనుండి వెళ్ళిపోవడానికి అవకాశం ఇస్తారు.  ఇంకా ముందుకెళ్తుందనుకున్నఆవిడని అడిగిన ప్రశ్న.. మీపతికి ఎప్పటికీ తెలియదని మీకు నమ్మకంగా తెలిస్తే మీరు వేరేమగవాడితో పడుకుంటారా? ఆడమగ సంబంధాలలో ఎన్ని రకాల శృతులూ, అపశృతులూ ఉంటాయో అవగాహన ఉన్నా, ఈప్రశ్న అడగడం ఎబ్బెట్టుగా అనిపించింది. దీనికి ఆవిడ నో అన్నా, పోలీగ్రాఫ్ ఒప్పుకోలేదు. అప్పటి ఆవిడ పరిస్థితి ఎంత దుర్భరమో ఊహించండి. అందులోనూ ఆవిడమొగుడు అక్కడే ఉన్నాడు.  

నే చూసిన రెండో ఎపిసోడ్లో పాల్గొన్నాయన చాలా  ఓపెన్గా ఉన్నాడు. తీరా ముందుకు వెళ్తున్న సమయంలో, మీరు విదేశం వెళ్ళినప్పుడు అక్కడ వేశ్య…  అని ప్రశ్న మొదలెట్టగానే వాళ్ళావిడ బజ్జర్ నొక్కి ఆప్రశ్నపట్ల తన వ్యతిరేకత తెలియచెప్పింది (షోలో కూడా వచ్చిన వారికి తమ అభ్యంతరం షోలో ఒక్కసారి చెప్పే అవకాశం ఇస్తారు).   వెంటనే పృచ్ఛకుడు ప్రశ్నమార్చి మీరెప్పుడైనా మీభార్యని మోసం (పరాయసంబంధాలు పెట్టుకోవడం ద్వారా) చేసారా అని  ప్రశ్నించాడు.  దీనికి ఆయన పెళ్ళాం ఎదురుగా  ఏంచెప్పాలో తికమక పడి లేదన్నాడు. పోలీగ్రాఫ్ పరీక్షప్పుడు ఎస్సని ఇప్పుడు నో అనేసరికి ఆమానవుడు షోనుండి వెనుదిరగాల్సొచ్చింది.  తర్వాత అక్కడికక్కడే తన భార్యముందు చాలా ఇబ్బంది పడ్డాడు.

అసలు ఈపోలీగ్రాఫ్ ఏంటయ్యా అంటే మనం సమాధానాలు చెప్పినప్పుడు మన శరీరంలో జరిగే మార్పులని, రక్తపీడనాన్ని బట్టి మనం చెప్తున్నది నిజమా, అబద్ధమా అన్నది నిర్ధారిస్తుంది. అది ఎంత ఖచ్చితంగా నిర్ధారించగలదూ అన్న విషయం పక్కనపెడితే, అసలు ఇంత కష్టపడీ, పెట్టీ  నిజం చెప్పించడం, షోకోసమైనా సరే, అవసరమా? 

అవసరమైనప్పుడు అంటే ప్రాణమానవిత్తభంగములందు అబద్ధమాడచ్చునన్నది ఆర్యవాక్యం. ఇవన్నీ భంగమైనా సరే నిజం చెప్పించడం మాత్రమే మన టీఆర్పీ రేటింగ్‌కి అవసరం అన్నది వ్యాపార సూత్రం అనుకుంటా.

ఎంత అబద్ధాల కోరైనా ఆవిషయం ఒప్పుకోడు. తనంత సత్యసంధుడు ఎవరూ లేరనే అనుకుంటాడు.  సత్యం శివం సుందరం అన్న భావనలో ఇది ఒక కోణం అని ఒకాయన సెలవిచ్చాడు. అలాగే ఎవరినైనా నిజం చెప్పు… నిజం చెప్పని రాపాడిస్తే వచ్చే ఇబ్బంది అంతా ఇంతా కాదు.  ఇంకా ఘోరం ఏంటంటే నిజంగా నిజం చెప్తున్న వ్యక్తిని నిజం చెప్పు అని నిలదీస్తూ పోవడం. అప్పుడావ్యక్తికి కలిగే మానసిక వేదన అంతా ఇంతా కాదు.   ఇలాంటి సందర్భం మొగుడూ పెళ్ళాల మధ్య వస్తే ఇంక చెప్పక్కరలేదు.

సాధ్యమైనంత వరకూ నిజాయితీగా, సత్యవాదిగా ఉండడం ఆదర్శప్రాయంగానూ, అత్యుత్తమ జీవన విధానంగానూ ఒప్పినా చాలాసందర్భాల్లో, అబద్ధం చెప్తున్నారని తెలిసినా కూడా ఎదుటివారికి ఎంతో కొంత వెసులుబాటు వదలడం విజ్ఞత.

Wednesday, May 02, 2007

బామ్మసూక్ష్మం - 55 మాటల్లో కథ

కొత్తపాళీగారి కొత్తసూచన, ప్రవీణ్ ప్రధమవిన్యాసం, రానారె 'వీర'కృత్యాల స్ఫూర్తిగా నా కథాకృత్యం (థా ని సంధిగా విడదీయద్దు). గమనిక - మీకు ఎక్కువ శ్రమ లేకుండా ఈ పక్కన బ్రాకెట్లో వ్యాఖ్యమూస పెట్టా. కాపీ చేసి వ్యాఖ్యలో అతికించేయండి.:-) (బాగుంది)

బామ్మసూక్ష్మం - 55 మాటల్లో(అక్షరాలా) కథ


స్వామీ, నామనవడికి ఉద్యోగం వస్తే నడిచికొండెక్కి గుండు కొట్టించుకొంటాడు.
***
స్వామీ, నామేనకోడలి తోటికోడలు రోగం తగ్గితే పదితులాల గొలుసు హుండీలో వేస్తుంది.
***
స్వామీ, -------------- స్వామీ ------------
***
ఒరేయ్. కళ్ళుపోతాయిరా. అయినా నీకోసమే కదా మొక్కెట్టా.
***
ఏదో నాతాపత్రయంకొద్దీ మొక్కెట్టా. మీయిష్టం. దేఁవుడితో వ్యవహారం.

" " "

" " "

" " "

***
ఏమిటో ఈముసలావిడ ???????....?????
***
ఒరేయ్, నీకడుపుచల్లగా తిరుపతి తీసుకొచ్చావు, పైకెళ్ళే బస్సెప్పుడో చూడు.
నీకొంట్లో బాలేనప్పుడు నడిచి కొండెక్కుతావని మొక్కానే. దేఁవుడితో వ్యవహారం.
పిచ్చివాడా. 80ఏళ్ళదానిమీద కోప్పడేవాడు దేఁవుడా? టాక్సీపిలు. నన్నెంత సుఖపెడ్తే నీకంత పుణ్యం.
!!!!! ????? !!!!!! ?????? !!!!!!! ?????